ఆ జలసంధి కూడా మూతపడితే.. ఇక అంతే!
- DV RAMANA

- Mar 27
- 3 min read

చర్చల ప్రతిపాదనలకు షరతులు అడ్డుగోడలుగా మారడంతో పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికాపై దేశీయంగా, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడిని గమనించిన ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మరింత పట్టుబిగిస్తున్నది. ఇప్పటికే ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు ముఖద్వారంలాంటి హర్మూజ్ జలసంధిని తన గుప్పిట్లో పెట్టుకున్న ఇరాన్ తమ దేశ ఆయువుపట్లపై అమెరికా`ఇజ్రాయెల్ దాడులు చేయడానికి తెగబడితే మరో పర్షియన్ గల్ప్ ప్రాంతంలోని మరో కీలక జలసంధిని మూసివేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తోంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిని తన ఆధీనంలోకి తీసుకున్న ఇరాన్ కేవలం ఐదు దేశాలకు మాత్రమే రాకపోకలు కొనసాగించేందుకు అవకాశం ఇచ్చింది. అది కూడా తమ దేశ అధికారులతో సమన్వయం చేసుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తూ హర్మూజ్‌లో ప్రవేశానికి అనుమతి ఉన్న ఇండియా సహా ఐదు దేశాల జాబితాతోపాటు అనుమతి లేని దేశాల లిస్టు విడుదల చేసిన ఇరాన్ యుద్ధం తీవ్రమైతే మరో కీలక జలమార్గమైన ‘బాబ్ అల్ మండేబ’ జలసంధిని కూడా మూసివేస్తామని హెచ్చరిస్తోంది. యుద్ధం ముగిసే పరిస్థితి లేకపోవడం, అమెరికా`ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో హర్మూజ్‌పై తన పట్టును ఇరాన్ మరింత బిగిస్తున్నది. ఈ జలసంధిలోకి భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాక్ దేశాలకే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి మిగిలిన దేశాలకు ఎర్రజెండా చూపించడం విశేషం. ఈ ఐదు దేశాలకు మాత్రమే మినహాయింపు ఇవ్వడానికి కారణాలపై అంతర్జాతీయంగా ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఇరాన్‌కు చైనా అతిపెద్ద ఆర్థిక దన్నుగా నిలుస్తోంది. ఆంక్షలున్నప్పటికీ ఇరాన్ ఉత్పత్తి చేసే చమురులో 90 శాతం చైనాయే కొనుగోలు చేస్తున్నది. బదులుగా ఇరాన్ తన మార్కెట్లను చైనా వస్తువులతో నింపేయడంతోపాటు రక్షణ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నది. ఇక రష్యా అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇరాన్‌కు సాంకేతిక, ఆయుధ సహకారం అందిస్తున్నది. ఈ రెండు దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా ఇరాన్‌కు అండగా నిలుస్తున్నాయి. ఇక ఇరాన్‌కు అత్యవసర మందులు, ఇతర నిత్యావసరాలు అందించడంలో భారత్ కీలకపాత్ర పోషిస్తున్నది. అందువల్ల యుద్ధ సమయంలో అంతర్గత కొరత తలెత్తకుండా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించడం ఇరాన్‌కు చాలా అవసరం. మరోవైపు అమెరికా, ఇరాన్‌ల మధ్య తెరవెనుక చర్చలు జరిగేలా చూడటంతో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నది. దానికితోడు పొరుగు దేశం కావడం వల్ల దౌత్యపరమైన ఇతర అవసరాలు కూడా ఉంటాయి. మరోపక్క ఉన్న ఇరాక్‌తో ఇరాన్‌కు సాంస్కతిక, సామాజిక సంబంధాలు బలంగా ఉన్నాయి. రెండు దేశాల్లో ప్రాబల్యవర్గంగా షియా ముస్లింలే ఉండటంతో మతపరమైన అనుబంధం ఉంది. పైగా ఇరాక్ ప్రభుత్వంలోని అనేక వర్గాలు ఇరాన్‌కు మిత్రపక్షాలుగా ఉన్నాయి. వీటికి తోడు ఇరాక్ తన విద్యుత్, నేచురల్ గ్యాస్ అవసరాల కోసం ఇప్పటికీ ఇరాన్‌పైనే ఆధారపడుతుండటం వల్ల ఇరుదేశాల పరస్పర ఆర్థిక ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఈ కారణాలతోనే ఈ ఐదు దేశాలకు హర్మూజ్ జలసంధిలో సేఫ్ పాసేజ్‌కు అవకాశం కల్పించిన ఇరాన్ మిగతా దేశాలకు ఎర్రలైటు చూపిస్తున్నది. కాగా ఇప్పటికే హర్మూజ్ మూసివేతతో ఇప్పటికే నానాపాట్లు పడుతున్న దేశాలకు మరో షాక్ ఇచ్చేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నది. హర్మూజ్ మూతపడటంతో సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ వంటి దేశాల చమురు ఉత్పత్తుల ఎగుమతులకు మిగిలిన ఏకైక మార్గం ఎర్ర సముద్రం శివారులో యెమెన్ సమీపంలో ఉన్న ‘బాబ్ అల్-మండేబ’ జలసంధి. అరబిక్ భాషలో ‘కన్నీటి ద్వారం’ అని దీని అర్థం. ఆ జలసంధిలో ప్రయాణం అత్యంత ప్రమాదకరమైనది కావడంతో ఆ పేరు వచ్చింది. యెమెన్‌లో మెజారిటీ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న హౌతీ రెబల్స్ ఇరాన్‌కు మద్దతుగా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అమెరికా గనుక దాడులు తీవ్రం చేసి తమను లొంగదీసుకునేందుకు యత్నిస్తే మరో జలసంధిని కూడా కోల్పోవాల్సి వస్తుందని ఇరాన్ వర్గాలు హెచ్చరించాయి. అంటే దానర్థం తమ మద్దతుదారులైన హౌతీల ద్వారా బాబ్ అల్ మండేబ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడమేనని రక్షణరంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు జలమార్గాలు మూతపడితే ప్రపంచంలో చమురు సంక్షోభం మరింత పెరుగుతుంది. ఎర్ర సముద్రానికి ఉత్తరం వైపు సూయజ్ కాలువ, దక్షిణాన బాబ్ అల్ మండేబ్ జలసంధి ఉన్నాయి. సౌదీ అరేబియా తన చమురు ఉత్పత్తులకు పైప్‌లైన్ ద్వారా యన్బు ఓడరేవుకు చేర్చి, అక్కడ నుంచి మండేబ్ జలసంధి ద్వారా ఆసియా దేశాలకు, సూయజ్ కాలువ ద్వారా యూరప్ దేశాలకు రవాణా చేస్తుంది. ఒకవేళ హౌతీలు మండేబ్ వద్ద దాడులు ప్రారంభిస్తే చమురు, గ్యాస్ నౌకలన్నీ ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వేల మైళ్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ భారం విపరీతంగా పడుతుంది. ‘ఎవరూ తమ నౌకలను, సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టాలని అనుకోరు. కానీ ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే ఎక్కువ లాభాలు వస్తాయి’ అని గ్రీస్‌కు చెందిన మెరైన్ రిస్క్ సర్వీసెస్ సీఈవో డిమిట్రిస్ మానియాటిస్ విశ్లేషించారు. చివరికి ఆ భారాన్ని మోయాల్సింది మాత్రం సామాన్య వినియోగదారులే. బాబ్ అల్-మండేబ్ ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్, హిందూ మహాసముద్రంతో కలిపే కీలక జలమార్గం. ఇది యెమెన్, ఆఫ్రికా దేశాలైన జిబౌటి, ఎరిట్రియాల మధ్య ఉంది. భారతదేశం తన చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ జలసంధులు మూతపడితే చమురు సరఫరా తగ్గి దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 120 డాలర్లకు చేరుకుంది. యుద్ధం ముగిసినా మళ్లీ పాత స్థితికి రావడానికి చాలా కాలం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.






Comments