కనిగిరిలో పింఛను పంచిన కలిశెట్టి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అవకాశాలు రావడం వేరు.. అదే అవకాశాలను సృష్టించుకోవడం వేరు. మొదటిదానికి అదృష్టం కావాలేమో గానీ, రెండోదానికి మాత్రం సంకల్ప బలం ఉంటేచాలు. దానికి ఆవగింజంత అదృష్టం తోడైతే అది విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అవుతారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో కోడిగుంపర గ్రామంలోనిది. ఎన్టీఆర్ భరోసా పింఛనును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పంచుతున్న స్టిల్ ఇది. విజయనగరం ఎంపీ ఏమిటి? ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ మారుమూల గ్రామంలో పింఛను పంచడమేమిటి? ఆయనేమైనా ఆ జిల్లాకు ఇన్‌ఛార్జా? పార్టీ ఇన్‌ఛార్జా? అన్న ప్రశ్న తలెత్తితే ఆ తప్పు మాదికాదు. ఎందుకంటే.. అప్పలనాయుడు శైలే అంత. తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడ కనిపిస్తే, అక్కడ జెండాకర్రలా పాతుకుపోవడం ఆయనకు అలవాటు. 2006లో రంజాన్ సందర్భంగా కదిరిలో ఉన్న మిత్రుడు సుభాన్ ఇంటికి వెళ్లిన కలిశెట్టి అప్పలనాయుడుకు బస్సు దిగిన వెంటనే ఆ జంక్షన్‌లో చంద్రబాబు మీద కక్షసాధింపునకు వ్యతిరేకంగా టీడీపీ ధర్నా నిర్వహిస్తుండటం కనిపించింది. అంతే.. రణస్థలం నుంచి వెళ్లిన అప్పలనాయుడు వెంటనే ఈ దీక్షా శిబిరంలో కూర్చుండిపోయారు. ఇదే విషయం అప్పట్లో మీది తెనాలి.. మాది తెనాలి పేరుతో కదిరిలో అప్పలనాయుడు చేసిన నిరసన కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు తాజాగా కనిగిరి నియోజకవర్గం పామూరులో పింఛన్లు పంచుతూ ఆయన కనిపించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పింఛన్ పంపిణీకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉన్నందున మార్చి 1న రాజకీయ నాయకుల చేతుల మీదుగా పంచడానికి వీలుపడలేదు. ఈ అవకాశాన్ని కనిగిరిలో అందిపుచ్చుకున్నారు అప్పలనాయుడు.
Commentaires