top of page

ఆ తరహా ఈ-కోలీ.. ప్రమాదకారి!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Feb 28
  • 3 min read
  • మలవిసర్జితాలు కలిస్తే ఈ`కోలీ బ్యాక్టీరియా ఉత్పత్తి

  • అది ఉన్న నీరు, ఆహారం సేవిస్తే డయేరియా సంక్రమణం

  • పరిస్థితి తీవ్రంగా ఉంటే అవుట్ బ్రేక్‌గా పరిగణన

  • దీనికి సామూహిక నివారణ చర్యలే శరణ్యం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

నగరంలోని పాతబస్టాండ్ ఆవలి ప్రాంతాల్లో నలుగురిని కబళించి, వందలాదిమందిని ఆస్పత్రులపాల్జేసిన డయేరియా (అతిసార వ్యాధి) ప్రబలడానికి తాగునీటిలో ఈ`కోలీ బ్యాక్టిరియా కలిసిపోవడమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యాధి వ్యాప్తి చెందిన తర్వాత ఆయా ప్రాంతాý నుంచి సేకరించిన తాగునీటి నమూనా(శ్యాంపిల్)లకు జరిపిన పరీక్షల్లో ఈ`కోలీ ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ ప్రకటించారు. దాంతో ఈ`కోలీ అంటే ఏమిటి? అది అంత ప్రమాదకరమా? అన్న చర్చ మొదలైంది. ఈ-కోలీ లేదా ఎషెరీచియా కోలీ అనేది మనుషులు, జంతువుల పేగుల్లో సహజంగా ఉండే ఒక రకమైన బాక్టీరియా. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో చాలావరకు హానికారకం కాకపోయినా.. కొన్ని రకాలు మాత్రం తీవ్రమైన అనారోగ్యానికి హేతవు అవుతాయి. మన జీర్ణ వ్యవస్థలో ఒక గ్రామ్-నెగటివ్, రాడ్ ఆకారంలో ఉండే ఈ బాక్టీరియా విటమిన్ కె`2 వంటి పోషకాల ఉత్పత్తికి సహాయపడుతుంది. కానీ కలుషిత ఆహారం లేదా నీటి ద్వారా ప్రమాదకరమైన రకాలు శరీరంలో చేరితే మాత్రం తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. కలుషితమైన ఆహారం, సరిగ్గా ఉడికించని మాంసం, శుభ్రం చేయని పచ్చి కూరగాయలు, మురుగునీరు కలిసిన బావులు, చెరువుల తాగడం వల్ల వాటిలోని ప్రమాదకర ఈ`కోలీ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ప్రమాదం కూడా ఉంది. సాధారణంగా బాక్టీరియా శరీరంలోకి చేరిన మూడు నుంచి నాలుగు రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన కడుపు నొప్పి, తిమ్మిర్లు, విరేచనాలు , కొన్నిసార్లు రక్తంతో కూడిన విరేచనాలు అవుతాయి. వాంతులు, వికారం, తక్కువస్థాయిలో జ్వరం, అలసట తదితర లక్షణాలు కూడా కనిపిస్తాయి. సాధారణంగా మల పరీక్ష (స్టూల్ టెస్ట్) ద్వారా ఈ బాక్టీరియా ఉనికిని గుర్తిస్తారు.

చికిత్స, నియంత్రణ

ఈ`కోలీ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ చాలావరకు దానంతట అదే తగ్గుతుంది. అయితే రోగి డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఓఆరఎస్ వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇది పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్‌ను దూరం పెట్టవచ్చు. ఆహారం వండే ముందు, తినే ముందు, టాయిలెట్‌కు వెళ్లిన తర్వాత సోపుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లు, కూరగాయలను వాడే ముందు నీటిలో బాగా కడగాలి. మాంసాహారాన్ని బాగా ఉడికించాలి. పాశ్చరైజ్ చేయని, పచ్చి పాలు తాగకూడదు.

ఇవన్నీ కాలుష్య మార్గాలే

సాధారణంగా మల విసర్జన వ్యర్థాలు నీటివనరుల్లో కలవడం వల్ల ఈ`కోలీ వ్యాప్తి చెందుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మార్గాల్లో ఇది జరుగుతుంది. వాటిలో కొన్ని ముఖ్యమైన మార్గాలు..

  • పట్టణాలు, నగరాల్లో మురుగునీటి పైపులైన్లు పగిలిపోయినప్పుడు లేదా లీక్ అయినప్పుడు ఆ వ్యర్థాలు తాగునీటి పైపుల్లోకి ప్రవేశిస్తాయి. అలాగే శుద్ధి చేయని మురుగు నీటిని నేరుగా నదులు లేదా చెరువుల్లోకి వదలడం వల్ల వాటిలోని నీరు ఈ-కోలీతో కలుషితమవుతుంది.

  • వర్షాలు పడినప్పుడు పొలాలు, పశువుల పాకలు, బహిరంగ మల విసర్జన ప్రాంతాల నుంచి నీరు కొట్టుకుపోయి వర్షపునీటితోపాటు బావులు, చెరువులు, రిజర్వాయర్లలో చేరుతుంది. ఆవులు, గొర్రెలు జంతువుల మలవిసర్జన వ్యర్థాల్లో ఈ-కోలీ అధికంగా ఉంటుంది, ఇది వరద నీటి ద్వారా నీటి వనరుల్లో కలిసిపోతుంది.

  • ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో సెప్టిక్‌ట్యాంకుý నిర్మాణాల్లో లోపాలు ఉన్నా, పాడైపోయినా వాటిలోని వ్యర్థాలు భూమిలోకి ఇంకి సమీపంలో ని బావులు, బోర్ల నీటిని కలుషితం చేస్తాయి.

  • నదులు, కాలువల్లో పశువులను కడగడం లేదా జంతువులు ఆ నీటిలోనే మల విసర్జన చేయడం వల్ల బాక్టీరియా నేరుగా నీటిలో చేరుతుంది. వన్యప్రాణుల విసర్జితాల ద్వారా కూడా అడవుల్లోని నీటి ప్రవాహాలు కలుషితం కావచ్చు.

తెలుసుకోవడం ఎలా?

ఈ-కోలీ అనేది ఒక ఇండికేటర్ ఆర్గానిజం. అంటే.. నీటిలో ఈ-కోలీ ఉందంటే ఆ నీటిలో మల సంబంధిత కాలుష్యం ఉందని అర్థం. ల్యాబ్‌లో నీటి నమూనాలను పరీక్షించినప్పుడు 100 ఎంఎల్ నీటిలో ఎన్ని ఈ-కోలీ కాలనీలు ఉన్నాయో లెక్కిస్తారు. తాగునీటిలో ఈ-కోలీ కాలనీలు సున్నా (0) ఉండాలన్నది ప్రామాణికం. నీటిని 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కనీసం ఒక నిమిషం పాటు మరిగిస్తే ఈ-కోలీ పూర్తిగా నశిస్తుంది. ఇది అత్యంత సురక్షితమైన పద్ధతి. నీటి ట్యాంకుల్లో తగిన మోతాదులో క్లోరిన్ కలపడం ద్వారా బాక్టీరియాను చంపవచ్చు. ఆర్‌వో (రివర్స్ ఓస్మాసిస్) లేదా యూవీ (ఆల్ట్రావయలెట్) పద్ధతి గల వాటర్ ప్యూరిఫయర్లు వాడటం ద్వారా ఈ`కోలీ బారి నుంచి రక్షణ పొందవచ్చు.

నోటి ద్వారానే వ్యాప్తి

చాలామంది డయేరియా గాలి వల్ల వ్యాపిస్తుందని అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఇది మల సంబంధిత వ్యర్థాలు నోటి ద్వారా శరీరంలోకి వెళ్లడం వల్ల మాత్రమే వ్యాపిస్తుంది. ఒక ప్రాంతంలో ఏకకాలంలో ఎక్కువమందికి డయేరియా (విరేచనాలు) వస్తే, దాన్ని వైద్య పరిభాషలో అవుట్ బ్రేక్ లేదా వ్యాధి ప్రబలడం అని అంటారు. ఇది సాధారణ సమస్య కాదు. ఒక ఉమ్మడి వనరు కలుషితమైందని చెప్పడానికి ఇదొక సంకేతం. ఇటువంటి సందర్భాల్లో వ్యాధి ప్రబలడానికి కారణాల అన్వేషణలో భాగంగా అందరికీ ఒకే రకమైన ఆహారం లేదా నీటి వనరు పంపిణీ అయ్యిందేమో చూడాలి. ఆ ప్రాంతంలోని వారు ఏ నీటి వనరు నుంచి తాగునీరు వినియోగిస్తున్నారన్నది పరిశీలించాలి. ఏదైనా ఫంక్షన్ లేదా స్థానిక హోటల్‌లో అందరూ కలిసి భోజనం చేశారేమో ఆరా తీయాలి. తాగునీటి పైపులు, మురుగునీటి (డ్రైనేజ్) పైపులు ఎక్కడైనా కలిసిపోయాయేమో పరిశీలించాలి. అందరిలోనూ ఒకే రకమైన లక్షణాలు ఉన్నాయా, వేర్వేరుగా ఉన్నాయేమో గమనించాలి. వాంతులు, జ్వరం ఉంటే వైరల్ ఇన్ఫెక్షన్ లేదా తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కారణం కావచ్చు. వీటన్నింటినీ పరిశీలించి, నిర్థారించుకుని.. తదనుగుణంగా నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page