ప్రాంతాలు, మతాలు వేరైనా వారిని కలిపింది స్నేహం
మూడు దశాబ్దాలగా పెనవేసుకున్న అనిర్వచనీయ బంధం
ఇప్పటికీ ఒకేమాట.. ఒకే బాట.. ఒకే సేవ
మిత్రత్వానికి ప్రతిరూపాలుగా ఎంపి కలిశెట్టి, సుభానీ, శ్యాంప్రసాద్
స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
చూపులతో పుట్టి.. మాటలతో మొదలయ్యేది కాదు స్నేహం..
మనసులో పుట్టి.. మట్టిలో కలిసేంతవరకు తోడుండేదే అసలైన స్నేహం.

ఎందరో కవులు.. ఇంకెందరో స్నేహితులు.. స్నేహబంధాన్ని, అందులోని మాధుర్యాన్ని ఎన్నో రకాలుగా నిర్వహించి ఉండవచ్చు. అయితే స్నేహం ఏ నిర్వచనానికి అందనంత గొప్పది. ఏ బంధానికీ సాటిరానంత ఉన్నతమైనది. అన్నదమ్ములు, అక్కచెలెళ్లు, తండ్రీకొడుకులు, భార్యాభర్తలు.. ఇలా ఎన్నో బంధాలు మన సమాజంలో ఉన్నా అవేవీ స్నేహబంధాన్ని మించినవి కావు. చిన్నపాటి స్పర్థలు, విభేదాలతోనే కుటుంబ బంధాలు విచ్ఛిన్నమైపోతుంటాయి. కానీ నిజమైన స్నేహాతులను ఇవేవీ విడదీయలేవు. అందుకే స్నేహబంధం అనిర్వచనీయమైనదంటారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతమైనది. ఊళ్లు, జిల్లా, దేశాలు.. చివరికి ఖండాంతరాలకు విశ్వవ్యాప్తంగా పరిఢవిల్లుతోంది. అందుకే స్నేహం ఎల్లలు ఎరుగనిదంటారు. ఇదే కోవలో కులమతాలకు అతీతంగా, రాష్ట్రంలోని భిన్నప్రాంతాలకు చెందిన ఆ ముగ్గురు ముప్పై ఏళ్లుగా స్నేహమాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. కష్టాలు సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ స్నేహత్రయం మధ్య అల్లుకున్న అనుబంధమే ఈ కథనం.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము.. చదవులమ్మ చెట్టు నీడలో.. అంటూ స్నేహబంధం గురించి వర్ణించాడో సినీకవి. ఆ పాటలో పేర్కొన్నట్లు వారు ఎక్కడో పుట్టి.. ఇంకెక్కడో పెరిగినా.. చదువులమ్మ చెట్టు(స్కూల్) నీడలో కలవలేదు. వేర్వేరు కారణాలతో ఒకే ప్రాంతానికి వచ్చిన వీరు యాదృచ్ఛికంగా కలుసుకున్నారు. క్రమంగా మాటలు కలిశాయి. భావాలు ఏకమయ్యాయి. ఇంకేముంది స్నేహబంధం అనే బీజం నాటుకుంది. అదే కాలక్రమంలో చివుళ్లు తొడిగి ముప్పయ్యేళ్ల వటవృక్షంగా ఎదగింది. ఆ ముగ్గురిలో ఒకరు ప్రస్తుత విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కాగా.. ఆయన మిత్రద్వయం పేర్లు శ్యాంప్రసాద్, సుభాన్. హిందూ కుటుంబానికి చెందిన అప్పలనాయుడు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వీఎన్‌పురం కాగా క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన శ్యాంప్రసాద్ కుటుంబానిది క్రిష్ణా జిల్లా పెడన. అలాగే మరో మిత్రుడు ముస్లిం కుటుంబానికి చెందిన సుభానీది రాయలసీమలోని అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని గార్లపెంట గ్రామం. కులాలు, మతాలు వేరైనా.. ఒక ఊరికే కాదు.. ఒక ప్రాంతానికే చెందినవారు కాకపోయినా వీరి ముగ్గురిని కలిపింది రణస్థలం. సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం 1994లో చిగురించిన స్నేహం ఇప్పటికీ గాఢంగా కొనసాగుతోంది.
ఎలా కలుసుకున్నారు?
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న పెడనకు చెందిన కెప్టన్ రావు వృత్తిరీత్యా రణస్థలానికి వచ్చారు. అదే సమయంలో ఇంటర్‌మీడియట్ చదువుతున్న కలిశెట్టి అప్పలనాయుడు అతని వద్దే చదువుకున్నారు. ఆ క్రమంలో కెప్టన్ రావు కుమారుడైన శ్యాంప్రసాద్‌తో పరిచయం అయ్యింది. ఇద్దరూ సుమారు ఒకే వయసువారు కావడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. కాగా ఇంచుమించు అదే కాలంలో రాయలసీమ వాసి అయిన సుభాన్‌కు సెరికల్చర్ డిపార్ట్‌మెంటులో ఉద్యోగం రావడం, రణస్థలంలో పోస్టింగ్ ఇవ్వడంతో ఇక్కడికి వచ్చారు. అప్పట్లో ఈనాడు రిపోర్టర్‌గా పనిచేస్తున్న అప్పలనాయుడు వార్తాసేకరణలో భాగంగా సెరికల్చర్ కార్యాలయానికి వెళ్తుండేవారు. ఆ సమయంలోనే సుభానీతో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారింది. వారితో శ్యాంప్రసాద్ కూడా జతకలవడంతో ఆ ముగ్గురి మధ్య గాఢమైన స్నేహబంధం అల్లుకుంది. కాలక్రమంలో ఆ బంధం మరింత బలపడిరది. ముగ్గురూ ఎక్కడ, ఏ పరిస్థితుల్లో ఉన్నా తరచూ మాట్లాడుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం కొనసాగిస్తున్నారు.
ఒకరి కష్టం ముగ్గురిదిగా..
భిన్న మతాలు, భిన్న ప్రాంతాలకు చెందిన ఈ స్నేహబృందం చాటుకునే ఆత్మీయత, అభిమానం, గౌరవాల్లో ఏమాత్రం తేడా ఉండదు. అభిప్రాయాలు, అలోచనలు పంచుకుంటూ, పరస్పరం గౌరవం ప్రదర్శిస్తూ బంధాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నారు. తమలో ఏ ఒక్కరికి కష్టం, నష్టం కలిగినా.. అది తమ ముగ్గురికీ కలిగినట్లు భావిస్తారు. బాధపడిపోతారు. దాన్నుంచి బయటపడేందుకు కలిసికట్టుగా ప్రయత్నిస్తారు. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే.. ఒకప్పటి కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు కొన్నేళ్ల క్రితం అర్ధరాత్రి విశాఖ నుంచి శ్రీకాకుళం వస్తున్నప్పుడు ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో మృతి చెందారు. ఆ కారులో ఎర్రన్నాయుడితోపాటు అప్పలనాయుడు కూడా ఉన్నాడని తెలుసుకున్న మిత్రుడు సుభానీ ఆ ప్రమాద వార్తను తట్టుకోలేక టెన్షన్‌కు గురికావడంతో గుండెపోటు వచ్చింది. ఫలితంగా ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. వారి స్నేహబంధం ఎంత గట్టిదో ఈ సంఘటనతోనే స్పష్టమవుతుంది. రణస్థలంలోనే ముస్లిం సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసిన సుభాన్ మసీదు నిర్మాణం కూడా చేపట్టారు. దానికి తన ప్రియమిత్రుడు అప్పలనాయుడుతోనే శంకుస్థాపన చేయించడం విశేషం.
కలిసే సహాయ కార్యక్రమాలు
మూడు మతాలకు చెందిన పండుగలు, ఇతర కార్యక్రమాల్లోనూ మిత్రత్రయం కలిసే పాల్గోనేవారు, జరుపుకొంటారు. క్రిస్మస్ డే, గుడ్ ఫ్రైడే తదితర పర్వదినాల్లో చర్చిల్లో జరిగే ప్రార్థనల్లో ముగ్గురూ కచ్చితంగా కలిసి పాల్గొంటుంటారు. అలాగే హిందూ, ముస్లిం పండుగలనూ అదేవిధంగా జరుపుకొంటారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి గత ఏడాది ఈ ముగ్గురూ విరాళం పంపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడిగా పలు వైద్య శిబిరాలు నిర్వహించడంతోపాటు ఇతర సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. తద్వారా స్నేహితులు కలిస్తే ఒక వ్యవస్థనే రూపొందించి సమాజానికి మేలు చేయవచ్చని నిరూపిస్తున్నారు. సృష్టిలో అతి మధురమైనది.. మరచిపోలేనిది.. మంచి చేయగలిగేది ఒక్క స్నేహమేనని చాటి చెబుతున్నారు.
Comentários