`పాత ఆర్‌ఎం రాజుతో అంటకాగిన ఫలితం
`ఆరోపణలు రావడంతో రూ.65 లక్షలు కట్టిన బ్రాంచ్ మేనేజర్
`దాంతోనే కుంభకోణాన్ని మాఫీ చేసే ఎత్తుగడలు
`కానీ బీసీడీఎం విచారణలో బయటపడుతున్న మోసాలు
`పాత్రధారులపై వేటు పడే ప్రమాదం

స్థానిక బజారు బ్రాంచి ఎస్‌బీఐలో నకిలీ రుణాల కుంభకోణంలో బ్యాంకు బ్రాంచి మేనేజర్ శ్రీకర్‌తో పాటు మరో నలుగురు ఉద్యోగుల భవిష్యత్తుకు ఎసరొచ్చినట్లే కనిపిస్తోంది. ఈ బ్రాంచిలో వ్యక్తిగత రుణాల పేరుతో బ్యాంకు సొమ్మును కొందరు సిబ్బంది తమ సొంత ఖాతాలకు బదలాయించుకున్న కుంభకోణాన్ని ‘సత్యం’ వెలుగులోకి తీసుకురావడంతో ఉలిక్కిపడిన అప్పటి బ్యాంకు రీజనల్ మేనేజర్ టీఆర్‌ఎం రాజు షరా మామూలుగా ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేసేందుకు బ్రాంచి మేనేజర్ శ్రీకర్‌తో రూ.65 లక్షలకు పైగా సొమ్ము కట్టించేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నించారు. కానీ స్వయంగా టీఆర్‌ఎం రాజుపైనే అనేక ఆరోపణలు రావడంతో ఆయన్ను పక్కన పెట్టి విచారణ జరుపుతున్న బ్యాంకు ఉన్నతాధికారులు బజారు బ్రాంచిలో మేనేజర్ శ్రీకర్ కట్టిన రూ.65 లక్షలు పైగా సొమ్ము కట్టేసినంత మాత్రాన కేసు ముగిసిపోలేదని, స్కామ్ అంతటితో ఆగలేదని తెలుసుకున్నారు. దీంతో బ్యాంకులో ఉండే బిజినెస్ కంట్రోలింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ విభాగం(బీసీడీఎం) రంగంలోకి దిగి లోతుపాతుల్లో వెళుతుంటే కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
(సత్యంన్యూస్, నరసన్నపేట)
స్టేట్‌బ్యాంక్ నరసన్నపేట బజారు బ్రాంచిలో గత కొద్ది రోజులుగా అకౌంట్లను తనిఖీ చేస్తున్న బీసీడీఎం అధికారులు విస్తుగొలిపే అంశాలను కనుగొన్నట్లు తెలిసింది. బ్రాంచ్ మేనేజర్ శ్రీకర్ రూ. 65 లక్షలు చెల్లించగా.. ఆ మేరకే రుణాలు చేతులు మారాయని అప్పటి ఆర్‌ఎం రాజు బ్యాంకు ఉన్నతాధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ బీసీడీఎం కమిటీ రంగంలోకి దిగి జరిపిన శోధనల్లో 33 బినామీ ఖాతాల పేరుతో కోట్లాది రూపాయలు దారిమళ్లించారని తేలినట్లు భోగట్టా. ఈ విషయం అప్పుడు ఆర్‌ఎంగా పని చేస్తున్న రాజుకు తెలుసని, కావాలనే దీన్ని తొక్కిపెట్టి స్కామ్‌లో మరింతమందిని సూత్రధారులుగా చేర్చారని తెలుస్తోంది. వ్యక్తిగత రుణాలు, ఎడ్యుకేషన్ లోన్స్, ఎంఎస్‌ఎంఈ రుణాల పేరుతో లబ్ధిదారులు లేకుండానే భారీగా సొమ్ము బ్యాంకు చెస్ట్‌ను దాటి వెళ్లిపోయింది. ఇందులో కొన్ని బినామీ పేర్లు కాగా, మరికొన్ని రుణాలు జీరో అకౌంట్ నుంచి విత్‌డ్రా అయ్యాయని బీసీడీఎం గుర్తించినట్లు తెలిసింది. అసలు ఈ జీరో అకౌంట్ అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. ప్రతి బ్యాంకులోనూ రుణాలు మంజూరు చేయడానికి మేనేజర్ పేరుతో కొన్ని కోట్ల నిధులను బ్యాంకులు సస్పెన్స్ అకౌంట్‌లో ఉంచుతాయి. రుణాల కోసం వచ్చినవారు తిరిగి చెల్లించగలమనే ష్యూరిటీలు సమర్పించిన తర్వాత మేనేజర్ తన అకౌంట్‌లో ఉన్న డబ్బులను ఖాతాదారుల అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అయితే ఇక్కడ ఎటువంటి లబ్ధిదారుని పేరు లేకుండానే జీరో అకౌంట్‌కు డబ్బులు వేసేశారు.
కోట్లలోనే రుణాల స్కామ్
వాస్తవానికి ఇటువంటి లొసుగులను ప్రతి మూడు నెలలకో, ఆరు నెలలకో, కనీసం సంవత్సరానికో జరిగే ఆడిట్‌లో గుర్తించి బీఎంను సంజాయిషీ అడగాలి. లబ్ధిదారుల పేరు లేకుండానే మేనేజర్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా పోయాయని ప్రశ్నించాలి. కానీ అప్పటి రీజనల్ మేనేజర్ అండదండలు ఉండటంతో ఆయన చూపించిన రికార్డులను గుడ్డిగా నమ్మిన ఆడిట్ అధికారులు వాటిని ఓకే చేసి వెళ్లిపోయారు. బజారుబ్రాంచిలో ఏవో బినామీ లోన్లు ఇచ్చారట అని ఎస్‌బీఐకి ఫిర్యాదు వెళ్లినప్పుడు ఆమదాలవలస చీఫ్ మేనేజర్ మూర్తి విచారణ జరిపారు. ఆ బ్రాంచి రికార్డులను తవ్వుతున్నకొద్దీ స్కామ్ సైజు పెరుగుతుండటంతో ఆయన గుండె వేగం కూడా పెరిగి ఇంత పెద్ద స్కామ్‌లో ఓచర్లు, అకౌంట్లు చూడటం తన స్థాయిలో జరిగే పని కాదని తేల్చేయడంతో బీసీడీఎం రంగంలోకి దిగింది. ఇది కూడా విజిలెన్స్ విభాగం లాంటిదే. బ్రాంచ్ మేనేజర్ శ్రీకర్ సొమ్ము కట్టేయడంతో ఆయన బాధ్యత తీరిపోయిందని, మాయమైన సొమ్ము మళ్లీ చేరడం వల్ల బ్యాంకుకు కలిగిన నష్టమేమీ లేదని ఆర్‌ఎం తన విచారణలో పేర్కొన్నా, ఈ స్కామ్ మరింత పెద్దదని బీసీడీఎం తేల్చింది. ఇందులో బ్రాంచి మేనేజర్ శ్రీకర్, రీజనల్ మేనేజర్‌గా పని చేసిన రాజు, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసరావుతో పాటు ఆర్‌ఎం ఆఫీసులో ఉండే చీఫ్ మేనేజర్ (క్రెడిట్స్) పాత్రపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇందులో ఎవరి లెక్క ఎంతనేది బయటకు వస్తుందో రాదో తెలీదు గానీ బ్యాంకు మేనేజర్ శ్రీకర్ మాత్రం ఇంటికి వెళ్లిపోవడం తప్పదని తెలుస్తోంది.
Bình luận