
ప్రశ్నకూ, విమర్శకూ భయపడే పాలకపక్షం ఎంత బలవంతమైనదైతే మాత్రం ఏం ప్రయోజనం? ప్రశ్నలకు జవాబు చెప్పలేనప్పుడు ఏం సుఖం? ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల తీరు గమనిస్తే బోధపడే సారాంశమిదే. పార్లమెంటు మన శాసనవ్యవస్థకే తలమానికమైన చట్టసభ. దేశానికే దిశానిర్దేశం చేసే అత్యున్నత ప్రజాప్రాతినిధ్య వేదిక. అలాంటి చోట ఏ చర్చకూ అవకాశం లేకుండా పోయాక ఇక మన ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది? నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు ఇలా మొదలు.. అలా వాయిదా అన్న ధోరణిలో జరుగుతున్న తీరు చూస్తే ఎవరికైనా కలిగే అభిప్రాయం ఇదే. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెబీని అడ్డం పెట్టుకుని ఆయా రాష్ట్రాలతో ఎక్కువ ఖరీదుకు విద్యుత్ ఒప్పందాలు చేసుకుని రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిన అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలన్న విపక్షాల డిమాండ్‌ను కేంద్రం ఎందుకు పట్టించుకోదు. ప్రతి పక్ష నేతలపై ఈడీలను, సీబీఐలను ఉసిగొలిపే ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలకు రూ. 2029 కోట్ల ముడుపులు ముట్ట జెప్పినట్టు అదానీ కంపెనీ రాసుకున్న పత్రాల్లో తేలినా చర్యలకు ఎందుకు ఉపక్రమించడం లేదు? మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యులైన ఆ రాష్ట్ర సీఎంపై చర్యలు తీసుకో వడం, మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన చట్ట ఉల్లంఘనలు, దేశానికి అవసరమైన మౌలికాంశాలపైన పార్ల మెంట్‌లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుపడితే ఎన్డీయే ప్రభుత్వం తప్పించుకు తిరుగుతోంది. అవి నీతిలో, బంధుప్రీతిలో అస్మదీయులకు ప్రజాసంపద దోచిపెట్టడంలో గత పాలకుల కంటే రెండాకులు ఎక్కువే చదివారు నేటి పాలకులు. వీరి హయాంలో అవినీతిని వ్యవస్థీకృతం చేయడంలో మరింత పెంచి పోషించింది తప్ప.. దానిని అరికట్టడానికి తీసుకున్న చర్యలు శూన్యం. కార్పొరేట్లకు దోచిపెట్టడానికి వల్ల మాలిన ప్రేమ ఒలకబోసే ఈ నేతలే అవినీతి గురించి గురివింద మాదిరి నైతిక విలువలను వల్లిస్తు న్నారు. విదేశాల్లో దాచిన నల్లడబ్బును వందరోజుల్లో వెనక్కు తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15లక్షలు చొప్పున జమచేస్తానన్న ఎన్నికల వాగ్దానాన్ని మూడు వేల రోజులు గడిచినా రాకపోవడంతో చివరకు ఎన్నికల తమాషాగా దాన్ని తేల్చివేశారు. మరి ప్రధాని పేదల కోసమే పడే ఆరాటం, పోరాటం ఏమైపో యాయి? అని అడిగితే నేరం. పనామా పత్రాలు, బహమస్ లీకులు వెల్లడిరచిన భారత నల్లకుబేరులపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. అంతెందుకు, అవినీతిని అంతం చేస్తానంటున్న మోడీ, దేశంలో పెచ్చరిల్లిన అవినీతికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజాందోళన తదుపరి లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్ ఆమోదించి ఏళ్లు గడిచినా ఇంతవరకు ఎందుకు నియమించలేదు! నిజంగా నేరస్థులో కాదో తెలియ కుండానే దేశవ్యాప్తంగా లక్షలాది విచారణ ఖైదీలు కారాగారాల్లో మగ్గిపోతున్నారు. అవినీతిని ఆరోప్రాణం గా భావించే పెద్దమనుషులేమో నాయకులై.. చట్టానికి చుట్టాలై రాజకీయ చక్రం తిప్పుతున్నారు. క్విడ్ ప్రో కో పద్ధతిలో పంచుకుంటూ, తమ చేతులకు మట్టి అంటకుండా, మూడో కంటికి తెలియకుండా డబ్బును భారీయెత్తున దేశం దాటించే అదానీ, విజయ్ మాల్యా, నీరవ్‌మోడీ లాంటి బడాబాబులెందరు? విదేశాల్లో తలదాచుకుంటున్న ఇలాంటి వారిపై చర్యలంటే పాలకులకు వణుకెందుకు? అవినీతి జగత్తుకు మకుటంలేని మహారాజులైనప్పటికీ వారందరూ కాషాయ తీర్థం పుచ్చుకోగానే అగ్నిపునీతులైపోతున్నారు. అవినీతి తిమింగిలాల జాబితాలో ఇప్పుడున్న పేర్లు మొదటివి కావు.. ఆఖరివి అంతకంటే కాబోవు! అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అక్కరకు రావాల్సిన జాతి వనరులను రాజకీయాలే దిగమింగుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల ప్రారంభమైన రెండోరోజే రాజ్యాంగ దినోత్సవం.. దానిలో రాజ్యాంగస్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పిన ప్రధాని, ఇదే రాజ్యాంగపు విలువలను ఇదే సమావేశాల్లో అటకెక్కించారు. పార్ల మెంట్ వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనపై నోరువిప్పని ప్రధాని.. అవినీతిని రూపుమాపుతా మంటూ జబ్బలు చరవడం హాస్యాస్పదం కాక మరేమిటి? ‘‘తమ విధానాల ద్వారా 2లక్షల కోట్లు అవి నీతిపరుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడగలిగాం’’ అని చెప్పే ప్రధాని.. బడానేతలు బ్యాంకులకు ఎగ్గొట్టిన లక్షల కోట్లు సంగతి దాచారా? మరిచారా? చర్చకూ ప్రశ్నకూ అవకాశమివ్వని ఈ సమయ హననం అంతకంతకూ వేగం పుంజుకుంటోందనడానికి ఈ సమావేశాలు ఓ మచ్చుతునక. ప్రతిపక్షాల గొంతు నొక్కే నిరంకుశ పోకడలకు ఇదో పరాకాష్ట. ఈ స్థితిని ప్రతిఘటించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవడం అందరి కర్తవ్యం.
Comments