top of page

ఆ రక్తచరిత్రే రైసీ ఉసురు తీసిందా!

Writer: DV RAMANADV RAMANA
  • `మరణించిన ఇరాన్‌ అధ్యక్షుడి గతమంతా రక్తదాహమే

  • `ప్యానల్‌ ఆఫ్‌ డెత్‌లో సభ్యుడిగా వేలమందికి మరణశిక్షలు

  • `ఎన్నికల్లోనూ రిగ్గింగ్‌తోనే అధ్యక్షుడిగా నెగ్గారన్న ఆరోపణలు

  • `ఛాందసవాదంతో పౌరస్వేచ్ఛను హరించారని ఆగ్రహావేశాలు

  • `అందుకే ఆయన మరణం తర్వాత ఇరానియన్ల సంబరాలు


దేశాధ్యక్షుడు మరణిస్తే ఆ దేశం యావత్తు విషాదంలో మునిగిపోతుంది. అధికారికంగా ప్రభుత్వం కొన్ని రోజులు సంతాప దినాలు పాటిస్తుంది. మిత్రదేశాలు కూడా గౌరవ సూచకంగా తమ దేశాల్లోనూ సంతాప దినాలు ప్రకటిస్తాయి. అందులో భాగంగా భారత్‌ కూడా ఇరాన్‌ అధ్యక్షుడి మృతికి మంగళవారం ఒకరోజు జాతీయ సంతాపదినం ప్రకటించింది. కానీ చిత్రంగా తమ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోయిందని తెలిసిన తర్వాత, ఆయన మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించిన తర్వాత కూడా ఇరాన్‌తోపాటు ఇతర దేశాల్లోని అనేకమంది ఇరానియన్లు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా జరిగింది? ఇబ్రహీం రైసీ ఏం చేశారు? ఆయనపై చాలామందిలో ఎందుకు ఆగ్రహం ఉంది? ఆయన గత చరిత్రే దీనికి కారణమని, ఈ ప్రశ్నలకు సమాధానమని ఇరాన్‌లో చాలా మంది చెబుతున్నారు. నిజమే రైసీ గత చరిత్ర పుటలన్నీ రక్తంతో తడిసినవే. మతం ముసుగులో కొన్ని వేలమందిని దారుణంగా చంపించిన చరిత్ర రైసీది.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

హెలికాప్టర్‌ కుప్పకూలిన దుర్ఘటనలో అశువులు బాసిన ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ గత చరిత్ర ఏమంత గొప్పది కాదు. మతాన్ని మెట్లుగా చేసుకుని మతబోధకుడి స్థాయి నుంచి దేశాధ్యక్ష పదవిని అందుకున్న కరడుగట్టిన సంప్రదాయవాది రైసీ. అంతకుముందు ఉన్న ఇరాన్‌ అధినేత ఖొమైనీతోపాటు ప్రస్తుతం ఆ దేశ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ కమేనీకి సన్నిహితుడైన రైసీ వారిద్దరి అండతో అంచెలంచెలుగా ఎదిగారు. మత బోధకుడిగా జీవితం ప్రారంభించి ఎన్నో పదవులు అందుకున్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా కూడా పని చేసిన ఆయన శిక్షలు వేసే కమిటీలో కీలకపాత్ర పోషించారు. అలా ఒక్కో మెట్టు ఎక్కువతూ 2017లో జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్ష పదవికి సుప్రీం లీడర్‌ ఖొమేనీ అండగా ప్రధాన పోటీదారుగా నిలిచారు. కానీ ఆ ఎన్నికల్లో ఇరాన్‌ ప్రజలు సంస్కరణలవాదిగా పేరొందిన హసన్‌ రౌహానీకి ఓట్లు వేసి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా సుప్రీం లీడర్‌ ఖొమేనీ ఆశీస్సులతో ఇబ్రహాం రైసీ పలు కీలక ప్రభుత్వ పదవుల్లో కొనసాగుతూ అతివాద వర్గం నుంచి పూర్తి మద్దతు కూడగట్టుకున్నారు. ఆ బలంతోనే 2021 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి, రిగ్గింగ్‌కు పాల్పడి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ఆరోపణలు ఉన్నాయి. భవిష్యత్తులో సుప్రీం లీడర్‌ కొమేనీ వారసుడిగా ఆ పదవి చేపడతారన్న వాదన కూడా ఇరాన్‌లో బలంగా ఉంది. కానీ అనుకోని విధంగా హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

రైసీపై ఆగ్రహమెందుకు?

ఇస్లామిక్‌ దేశమైన ఇరాన్‌లో సహజంగానే చిన్న చిన్న నేరాలకు కూడా శిక్షలు దారుణంగానే ఉంటాయి. ఇక రాజకీయ ఖైదీలకు విధించే శిక్షల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచింది. 63 ఏళ్ల రైసీ మరణాన్ని చాలామంది ఆనందంతో ఆస్వాదించడానికి కూడా కారణం అదే. అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, న్యాయశాఖ అధిపతిగా వ్యవహరించిన కాలంలో రాజకీయ ఖైదీల విషయంలోనూ, దేశంలో తిరుగుబాటును అణిచివేయడంలోనూ అత్యంత క్రూరంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అవే ఇబ్రహీం రైసీపై ప్రజల్లో ఆగ్రహం పేరుకుపోవడానికి కారణమయ్యాయి. నాలుగు దశాబ్దాల క్రితం ఇరాన్‌లో కాస్తో కూస్తో ఉన్న పౌర స్వేచ్ఛ 1988 నుంచి పూర్తిగా హరించుకుపోయింది. మత ఛాందసవాదుల ఉక్కుపిడికిళ్లలో చిక్కుకుంది. సంప్రదాయవాద అధ్యక్షుల్లో ఒకరిగా రైసీ అపఖ్యాతి పాలయ్యారు. ఇస్లామిక్‌ చట్టాల అమలు పేరుతో నిర్బంధం విధించారు. అనంతర కాలంలో పెరిగిపోయిన బ్యూరోక్రాటిక్‌ అవినీతి, నిధుల దుర్వినియోగం, ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం. కఠినమైన సెన్సార్‌షిప్‌ వంటి అంశాలు రైసీపై ఆ దేశ ప్రజలు ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఇవే కారణాలతో పౌర స్వేచ్ఛ కోసం ఇరాన్‌లో పలువురు మహిళలు లేవనెత్తిన ఉద్యమాన్ని సైతం కాల్పులు, సర్కారీ హత్యాకాండలతో అణగదొక్కేశారు.

డెత్‌ కమిటీ టెర్రర్‌

రైసీ దుర్మరణం తర్వాత గతంలో విశృంఖలంగా వ్యవహరించిన డెత్‌ కమిటీ నిర్వాకాలు కూడా మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఇరాన్‌లో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసేవారిని, ప్రశ్నించేవారిని రాజకీయ ఖైదీల పేరుతో మరణశిక్ష విధించి చంపేస్తుంటారు. దీనికోసం 1988 ప్రాంతంలో ప్యానల్‌ ఆఫ్‌ డెత్‌ పేరుతో ఏకంగా ఒక కమిటీ ఉండేది. ఇరాక్‌-ఇరాన్‌ యుద్ధం సందర్భంగా చిక్కిన ఖైదీలకు సామూహికంగా , బహిరంగంగా ఉరి తీయడం వంటి అకృత్యాలకు పాల్పడిన ఈ డెత్‌ కమిటీలో ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కీలక సభ్యుడిగా వ్యవహరించి, కొన్నివేల మందికి మరణశిక్షలు విధించడంలో భాగస్వామి అయ్యారు. డెత్‌ కమిటీలో ఇబ్రహీం రైసీతో పాటు మోర్తజా ఎష్రాఘి(ప్రాసిక్యూటర్‌ ఆఫ్‌ టెహ్రాన్‌), హుసేన్‌ అలీ నయేరీ(న్యాయమూర్తి), ముస్తఫాపూర్‌ మొహమ్మది(ఎవిన్‌లో ఎంఓఐ ప్రతినిధి) సభ్యులుగా ఉండేవారు. ఈ నలుగురు సభ్యుల కమిటీ నేతృత్వంలో నామమాత్రపు ప్రాసిక్యూషన్‌లపోతే వేల మంది రాజకీయ ఖైదీలకు మరణ శిక్షలు అమలు చేశారు. 1988 జూలై 19న ప్రారంభమైన ఈ దారుణ మారణకాండ ఏకధాటిగా ఐదు నెలల పాటు కొనసాగింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ సామూహిక ఉరిశిక్షలు అమలు చేశారు. ఒక్కొక్కరిగా ఉరివేస్తే మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుందని.. ఆరుగురి చొప్పున భారీ క్రేన్లకు వేలాడదీసి చంపేశారు. ఇరాన్‌ పీపుల్స్‌ ముజాహిదీన్‌ పార్టీ, ఫెడయన్‌, తుదే పార్టీ ఆఫ్‌ ఇరాన్‌(కమ్యూనిస్ట్‌)తో పాటు ఇతర వామపక్షవర్గాల మద్దతుదారులను భారీ సంఖ్యలో ఉరితీశారు. కచ్చితంగా ఎంత మందిని ఉరితీశారనే సమాచారం ఇప్పటికీ లేదు. అయితే సుమారు 30 వేల మంది రాయకీయ ఖైదీలను ఉరితీసి ఉంటారని పలు నివేదికలు పేర్కొన్నాయి.

బాణసంచా కాల్చి, స్వీట్లు పంచి..

ఇంతగా గూడుకట్టుకుపోయిన ఆగ్రహం అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారన్న వార్త ఇరానియన్లలో గుండెల్లోంచి ఆనందం రూపంలో బయటకు తన్నుకొచ్చింది. దేశ విదేశాల్లో ఉంటున్న ఇరాన్‌వాసులు మరణాన్ని సంబరాలతో సెలబ్రేట్‌ చేసుకున్నారు. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోయిందన్న సమాచారం తెలిసిన వెంటనే అనేకమంది ఇరానియన్లు ఆనందంతో వీధుల్లోకి వచ్చారు. ఆయన మరణించారని ధ్రువీకరంచగానే బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి స్వీట్లు పంచిపెట్టారు. పలువురు ఆ దృశ్యాలను సోషల్‌ మీడియాలోనూ షేర్‌ చేశారు. మహిళా హక్కుల కార్యకర్త మాసిప్‌ా అలినేజాద్‌ ‘ఎక్స్‌’లో ఒక ట్వీట్‌ చేస్తూ రైస్‌ ప్రమాదానికి గురైన రోజును ప్రపంచ హెలికాప్టర్‌ డేగా ప్రకటించారని కోరారు. ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో బయటపడితే చరిత్రలో ఆందోళన కలిగించే ఏకైక క్రాష్‌ ఇదే అవుతుందని పేర్కొన్నారు. లండన్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ముందు కొందరు ఇరానీయులు గుమిగూడి ఆనంద తాండవం చేశారు. మరికొందరు ఈ ప్రమాదంపై వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page