వీఎల్‌టీ కట్టించి హక్కులు పొందాలని ప్రయత్నం
స్థలమే లేకుండా పన్ను చెల్లింపునకు దరఖాస్తు
మధ్యవర్తిత్వం నడుపుతున్న దుర్గాప్రసాద్
చైర్మన్‌తో సంతకాలు.. కమిషనర్ ముందు ఫైల్

(సత్యంన్యూస్, పలాస)
సర్వే నంబర్ ఒక చోట, రిజిస్ట్రేషన్ చేసిన స్థలం వేరే చోట. ఈ రెండూ ఒక్కటే ఎలా అవుతాయన్న వాదన పలాస వ్యాపారుల్లో జోరుగా సాగుతుంది. పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీ నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే స్థలంలో పక్కా రేకుల షెడ్డు నిర్మించి బట్టల దుకాణం (సూరత్ ధమాకా సేల్) సర్వే నెంబర్ 219/3లోని 565.5 చదరపు అడుగుల స్థల వివాదం కొలిక్కి తీసుకొచ్చేందుకు టీడీపీ స్థానిక నాయకులు మధ్యవర్తిత్వం నడుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి టీడీపీ నాయకులు దుర్గాప్రసాద్‌ను రంగంలోకి బోర బుజ్జి దించినట్టు తెలిసింది. వివాద స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రొక్కం సాయి, బోర బుజ్జిల మధ్య మధ్యవర్తిత్వం నడుపుతున్నారు. దీనిపై ఇదివరకే ‘సత్యం’ పత్రికలో వరుస కథనాలు రావడంతో వివాదానికి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. ఈ గ్యాప్‌లోనే దాన్ని సక్రమం చేసుకోవడానికి మున్సిపాలిటీ అధికారులను ఆశ్రయించారు. దీనివెనుక టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్ ఉన్నట్టు మున్సిపాలిటీలో చర్చ సాగుతుంది. దుర్గాప్రసాద్ ప్రమేయంతోనే వివాదాస్పద స్థలానికి బోర బుజ్జి పేరుతో వీఎల్‌టీ కట్టడానికి అనుమతించాలని దరఖాస్తు చేయించినట్టు తెలిసింది. సదరు వీఎల్‌టీ ఫైల్‌పై మున్సిపాలిటీ చైర్మన్ బల్ల గిరిబాబు సంతకం చేసి కమిషనర్ టేబుల్‌పైకి పంపించినట్టు తెలిసింది. చైర్మన్ గిరిబాబుతో దుర్గాప్రసాద్, బోర బుజ్జి మాట్లాడిన తర్వాతనే ఫైల్‌పై సంతకం చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని గిరిబాబు తన సన్నిహితులు సంతకం చేయాలని ఒత్తిడి వచ్చిందని ప్రస్తావించినట్టు సమాచారం. వివాదాస్పద స్థలం విషయంలో వీఎల్‌టీ కట్టించడం సబబుకాదని తెలిసినప్పటికీ సంతకం చేయాల్సి వచ్చినట్టు గిరిబాబు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ ఫైల్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సిన కమిషనర్ ఇంకా స్పందించలేదని తెలిసింది. అయితే కమిషనర్‌పైనా టీడీపీ నాయకులు దుర్గాప్రసాద్ ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. రొక్కం సాయి, బోర బుజ్జి మధ్య మధ్యవర్తిత్వం నడిపి వివాదాస్పద స్థలాన్ని బోర బుజ్జికే కట్టబెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టు పలాసలో చర్చ సాగుతుంది. అయితే స్థలం వారసులు ఎవరికి వారే తామంటే తామేనని ముందుకు రావడంతో వీటన్నింటికీ సమాధానం చెప్పడానికి మున్సిపాలిటీకి వీఎల్‌టీ టాక్స్ కట్టి పురపాలక సంఘం నుంచి స్థలంపై సాంకేతికంగా హక్కు పొందాలని చూస్తున్నారు. మున్సిపాలిటీకి వీఎల్‌టీ కోసం సమర్పించిన డాక్యుమెంట్ బోర బుజ్జి కొనుగోలు చేసిన సర్వే నెంబర్ 225/1 లోనిది. ఇక్కడ అసలు స్థలమే లేదు. సర్వే నెంబర్ 225/1లో బోర బుజ్జి కొనుగోలు చేసిన డాక్యుమెంట్‌తో రొక్కం సాయి పేరుతో డాక్యుమెంట్ సృష్టించబడిన సర్వే నెంబర్ 219/3లో ఉన్న స్థలం కోసం వీఎల్‌టీ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడ ఖాళీ స్థలం లేదు. ఈ స్థలంలో ఇప్పటికే ఒక పక్కా రేకుల షెడ్ ఉంది. అందులో బట్టల వ్యాపారం నడుస్తుంది. దీనికి విద్యుత్ సౌకర్యం, మున్సిపాలిటీకి టాక్స్ కడుతున్నారు. సర్వే నెంబర్ 219/3లో ఖాళీ స్థలం లేనప్పడు దీనికి వీఎల్‌టీ ఎలా చెల్లిస్తారన్న చర్చ పట్టణంలో సాగుతుంది.
అక్రమాన్ని సక్రమం చేయడానికి..
వాస్తవంగా సదరు స్థలానికి సరైన వారసులు ఎవరన్నది చర్చనీయాంశంగా మారిన సమయంలో ఆ స్థలంలో అద్దెకు ఉంటున్న వ్యక్తి నెయ్యల రామరావు తన కుమారుడు పేరుతో రిజిస్ట్రేషన్ సెటిల్మెంట్ చేయించి డాక్యుమెంట్ సృష్టించుకున్నాడు. రామారావు కుమారుడు రాజు దాన్ని రొక్కం సాయి అనే వ్యక్తికి రూ.3కోట్లకు విక్రయించి అందులో రూ.1.50 కోట్లు తీసుకొని దీన్ని సెటిల్మెంట్ చేసిన వ్యక్తులు మిగతా మొత్తం సర్దుకున్నారు. రొక్కం సాయి కేవలం బినామీగా మాత్రమే ఉన్నట్టు ప్రచారం ఉంది. స్థానికంగా కొందరు వ్యాపారులు రొక్కం సాయిని ముందు పెట్టి నెయ్యల రాజు నుంచి వివాద స్థలాన్ని కొనుగోలు చేయించారని తెలిసింది. ఖర్గపూర్‌లో రైల్వేలో ఉద్యోగం చేస్తున్న మందస మండలం వరదరాజపురానికి చెందిన యు.మన్మధరావును తెరపైకి తీసుకువచ్చి సదరు వివాదాస్పద స్థలానికి వారసుడిగా చూపించి బోర బుజ్జి ఆ స్థలాన్ని రూ.80 లక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో వివాదం ముదిరి పాకాన పడిరది. వివాదాస్పద స్థలం కేటీ రోడ్డులో పశ్చమ దిశలో శ్రీనివాస లాడ్జీ లైన్‌లో సర్వే నెంబర్ 219/3లో 565.5 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ సర్వే నెంబర్‌తోనే రొక్కం సాయికి నెయ్యల రాజు రిజిస్ట్రేషన్ చేశాడు. బోర బుజ్జి కొనుగోలు చేసిన డాక్యుమెంట్‌లో శ్రీనివాస లాడ్జీ ఎదురుగా కేటీ రోడ్డుకు తూర్పువైపు సర్వే నెంబర్ 225/1లో చూపిస్తుంది. అయితే సరిహద్దులు మాత్రం 219/3లో ఉన్న స్థలానికి సంబంధించినవే చూపిస్తుంది. దీంతో ఈ రెండూ ఒక్కటేనంటూ బోర బుజ్జిని కొందరు వ్యాపారులు సమర్ధిస్తున్నారు. దీంతో టీడీపీ నాయకులు రంగంలోకి దిగి అక్రమ రిజిస్ట్రేషన్లను సక్రమం చేసుకోవడానికి, పురపాలక సంఘం నుంచి కొనుగోలుదారులకు హక్కులు కట్టబెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారని పలాసలో జోరుగా ప్రచారం సాగుతుంది.
Comments