నదీ గర్భాన్ని ఉమ్మడిగా తవ్వేస్తున్నారు
బేరం ఎంతకు కుదిరిందో గాని పార్టీకి లొల్లి తప్పింది
2010 గ్రీన్ ట్రిబ్యునల్ చట్టానికి తూట్లు
భైరిలోనూ బిల్లులు లేకుండా తరలింపు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో ఒడిశాతో బోర్డుర్ పంచుకుంటున్న ఒక నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని మొన్నటి వరకు గగ్గోలు పెట్టిన పార్టీ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఇసుక తవ్వకాలపై సర్దుకుపోతున్నారు. దీంతో పార్టీకి తలనొప్పి వదిలినా నదీ గర్భాలు మాత్రం రోధిస్తున్నాయి. వంశధార నదిలో ఇసుక కోసం చేపట్టిన తవ్వకాలు ఏకంగా మట్టి పొరల వరకు వెళ్లిపోయాయి. ఇందుకు ప్రధానమైన కారణం అక్కడ ప్రజాప్రతినిధి, పార్టీ నాయకుడు సొంత వాహనాలను ఏర్పాటు చేసుకొని మరీ ఇసుకను తరలించుకుపోవడమే. విశాఖపట్నానికి చెందిన శ్రీనివాస్ పేరుతో ఒక సంస్థను తెర మీదకు తెచ్చి ఇసుక ర్యాంపుల్లో యథేచ్చగా తవ్వేస్తున్నారు. గతంలో నివగాం రీచ్‌పై ఈ ఇరువురు నాయకులు పెత్తనం కోసం రోడ్డెక్కారు. ఆ తర్వాత ఓ అవగాహనకు రావడంతో పోటాపోటీగా ఇసుకను తవ్వుకుపోతున్నారు. ప్రజాప్రతినిధి తన సొంత అవసరాల కోసమంటూ కొన్ని టిప్పర్లను ప్రతీరోజు రీచ్ వద్దకు పంపించి, వాటిని బయట మార్కెట్‌లో అమ్ముకుంటున్నారన్న విమర్శలున్నాయి. నియోజకవర్గంలో ఉపాధి నిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్డు పనుల కోసం ఈ ఇసుకను తరలించి సొమ్ములు చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇందుకోసం నదిలో ఏకంగా ఓ ప్రొక్లయినర్‌ను పర్మినెంట్‌గా ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే రీచ్ వద్ద మైనింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా ఎక్కడా అడ్డుకోవడం లేదంటే కారణం ఇందులో పెద్దలు ఉండటమేనని వేరేగా చెప్పనక్కర్లేదు. అలాగే రెవెన్యూ అధికారులు కూడా అక్రమ తవ్వకాలపై నోరెత్తడం లేదు. ఇసుక రీచ్‌లతో ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు సత్సంబంధాలు ఏర్పాటుచేసుకొని సర్దుకుపోతున్నారు.
కొత్తూరు మండలం ఆకులతంపర వద్ద అక్రమంగా ఇసుకను తవ్వుతున్నారని గొడవ చేసిన పార్టీ నాయకుడు ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారంటే అందుకు కారణం ఆయన రీచ్‌లు వేరేగా ఉన్నాయని చెబుతున్నారు. గతంలో కేవలం ప్రజాప్రతినిధి తవ్వుకుపోతున్నారని మీడియాను, మైనింగ్ శాఖను రోడ్డెక్కించి నాలుగు రోజుల పాటు రీచ్ నడవకుండా ఆపిన నాయకుడు ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారంటే ఇసుక వ్యాపారం ఆగిందని కాదు.. ఎక్కడో బేరం కుదిరిందని. గతంలో కూడా ఆకులతంపర వద్ద డీషిల్ట్రేషన్ పనుల కోసం వద్ద స్కై ఇన్‌ఫ్రా సంస్థతో వాటాలు కుదరకే రోడ్డెక్కారని, ఆ తర్వాత పార్టీ నాయకుడు, ప్రజాప్రతినిధి కలిసి కూర్చుని మాట్లాడుకొని వాటాలు తేలిన తర్వాత మళ్లీ ఇదే ర్యాంపు వద్ద ఇసుక దోపిడీ ప్రారంభమైంది.
కొత్తూరు మండలంలో ఇసుక ర్యాంపుల్లో సహజ వనరులు దోపిడి యథేచ్చగా సాగుతున్నా మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. రేయింబవళ్లు అన్న తేడా లేకుండా ఇసుకను నది గర్భంలోనే ప్రొక్లెయినర్లతో లారీల్లోకి లోడ్ చేసి తరలించుకుపోతున్నారు. భారీ వాహనాలు నదీగర్భంలోకి వెళ్లేందుకు వీలుగా నదుల్లో బాటలు వేశారు. బాటలు వేసిన స్థానిక టీడీపీ నాయకులు లోడిరగ్ కోసం వచ్చే వాహనాల నుంచి రూ.200 వసూలు చేస్తున్నారు. వీటిలో కొంత మొత్తం స్థానిక ప్రజాప్రతినిధి వాటాగా తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మైనింగ్ శాఖ అధికారుల దగ్గరుండి నదీ గర్భంలోకి ప్రొక్లయినర్లతో ఇసుకను తవ్వి లారీల్లోకి లోడ్ చేయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. 2010 గ్రీన్ ట్రిబ్యునల్ చట్టానికి తూట్లు పొడిచి పరిమితికి మించి ఇసుకను తవ్వి తరలించుకుపోతున్నారు.
ఇదే రీతిన శ్రీకాకుళం మండలం పరిధి భైరిలో ఇసుక తవ్వకాలకు అనుమతి తీసుకొని అక్రమంగా తరలించుకుపోతున్నారు. భైరిలో ఇసుక తవ్వకాలకు పీఎస్‌ఎన్ రెడ్డి అండ్ కో, శ్రీ వెంకటేశ్వర కన్‌స్ట్రక్షన్ అండ్ మైనింగ్ కార్పోరేషన్ ప్రభుత్వం అనుమతిచ్చింది. వీరికి స్థానిక టీడీపీ నాయకులు అండదండలు అందిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. ఇసుక రీచ్‌కు అనుమతిచ్చే ముందు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో స్థానికుల నుంచి సంతకాలు సేకరించారు. రీచ్ నిర్వహించడానికి గతంలో అడ్డుచెప్పిన టీడీపీలో ఒక వర్గం సంతకాలు సేకరించిన సమయంలో గమ్మున ఉండిపోయింది. సంతకాలు సేకరించే సమయంలో గ్రామంలో ట్రాక్టర్లకు ఇసుక లోడ్ చేసుకొనే అవకాశం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. దీనికి సరేనంటూ అధికారులు హమీ ఇచ్చారు. గ్రామంలో కూలీలకు ఇసుక రీచ్ వద్ద ఇసుకను లోడ్ చేసే అవకాశం కల్పించాలని కోరారు. దీనికి అధికారులు అంగీకరించారు. రీచ్ ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా గ్రామంలో ట్రాక్టర్లకు లోడ్ చేసుకోవడానికి అనుమతించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో కూలీలకు రీచ్‌లో ఇసుకను వాహనాలకు లోడ్ చేసే అవకాశం ఇవ్వడం లేదని చెబుతున్నారు. నదీ గర్భంలో భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి లారీల్లో అనధికారికంగా ఇసుకను విశాఖకు తరలించుకుపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. స్థానిక టీడీపీ నాయకులు కనుసన్నల్లో సాగుతున్న ఈ దందా వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోయినట్టు స్థానికులు చెబుతున్నారు. రీచ్‌లో విశాఖకు ఇసుకను తరలించే 14 టైర్ల లారీలకు రూ.7,700 వసూలుచేసి రసీదు ఇవ్వకుండా పంపిస్తున్నారని లారీ యజమానులు చెబుతున్నారు. లారీలు సామర్ధ్యాన్ని బట్టీ డబ్బులు వసూలుచేసి జేబులు నింపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీల్లో ఓవర్ లోడ్ చేడానికి ఒక ధరను నిర్ణయించి తీసుకుంటున్నారు. లారీల్లో పరిమితికి మించి ఇసుకను లోడ్ చేసుకొని వెళుతున్నా రవాణా, పోలీసుశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని రీచ్‌ల్లో ఇదే దందా నడుస్తున్నా రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల మైనింగ్ అధికారులు చేతులు కట్టుకొని కూర్చున్నారు.
Comments