ఆ సచివాలయానికి వేళాపాళా లేదు!
- DV RAMANA
- Mar 24
- 1 min read
సమయానికి తెరుచుకోని కార్యాలయం
అందుబాటులో ఉండని సిబ్బంది
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
(సత్యంన్యూస్, పొందూరు)

ప్రభుత్వ కార్యాలయమంటే నిర్దేశిత సమయాల్లో తెరిచి ఉంచి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందులోనూ ప్రజల ముంగిటికే ప్రభుత్వం పేరుతో గ్రామ, వార్డు స్థాయిల్లో ఏర్పాటుచేసిన సచివాలయాలు ప్రభుత్వ కార్యాకలాపాలు, సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాల్సి ఉంది. కానీ కొన్ని సచివాలయాలు ఈ లక్ష్యాలకు దూరంగా ఉంటే విమర్శల పాలవుతున్నాయి. పొందూరు మండలం తాడివలసలోని గ్రామ సచివాలయం ఇటువంటి విమర్శలనే ఎదుర్కొంటోంది. సిబ్బంది సమయపాలన పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చాలా సందర్భాల్లో సమయానికి కార్యాలయ తలుపులు కూడా తెరవడంలేదు. సోమవారం ఉదయం 10.37 గంటల వరకు కార్యాలయానికి తాళాలు వేసి ఉండటమే (ఫొటోలో గమనించవచ్చు) దీనికి నిదర్శనం. ఈ సచివాలయంలో పదిమంది సిబ్బంది ఉంటే ఒక్కరూ కూడా సమయానికి విధులకు హాజరుకావాలన్న ధ్యాస లేదని, తరచూ ఇలాగే జరుగుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే.. సర్వేలు, ఇతరత్రా పనులపై క్షేత్రస్థాయికి వెళ్లామని సమాధానాలు చెబుతున్నారు. అయితే కార్యాలయంలో ఒక్కరైనా లేకుండా వెళ్లిపోవడం సమంజసం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పనుల కోసం సచివాలయానికి వచ్చే ప్రజలు కార్యాలయం మూసి ఉండటం లేదా సంబంధిత సిబ్బంది లేకపోవడం వల్ల పనులు జరగక ఉసూరుమంటూ వెనుదిరిగి వెళ్లాల్సి వస్తోంది. సచివాలయ సిబ్బంది తీరుపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాద చేసినా పట్టించుకోవడం లేదని దీని పరిధిలోని ప్రజలు విమర్శిస్తున్నారు.
Comments