top of page

ఆ సస్పెన్షన్లు చెల్లవు

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Mar 25
  • 3 min read
  • ప్రచార కక్కుర్తితో ముందూవెనుకా చూడని డీఈవో

  • ఉత్తర్వుల్లో పేర్కొన్న సెక్షన్లు వర్తించవు

  • కోర్టుకు వెళ్తే కేసు కొట్టేయడం ఖాయమంటున్న న్యాయవాదులు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

తప్పులు చేయనే కూడదు. ఒకవేళ ఖర్మ కాలి చేయాల్సి వస్తే తప్పునకు దొరక్కుండా పక్కాగా ఉండాలి. పాపాం సూపర్‌ డీఈవో సార్‌.. తిరుమల చైతన్యగారికి అది సాధ్యం కాలేదో.. ఆయన సూపర్‌ బుర్రకు అది తట్టలేదో గానీ.. మాల్‌ప్రాక్టీసింగ్‌ ఆరోపణలతో పలువురు టీచర్లు, ప్రధానోపాధ్యాయులకు అత్యుత్సాహంతో సస్పెన్షన్‌ ఆర్డర్స్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఆయనగారు ఇచ్చిన సస్సెన్షన్‌ ఆర్డర్లు తప్పుల తడకలుగా ఉన్నాయని, సస్పెన్షన్లకు పేర్కొన్న సర్వీస్‌ రూల్స్‌, సెక్షన్లు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు వర్తించవని, సస్పెన్షన్‌ ఉత్తర్వులు చెల్లవు. ఇంతకు ఏం జరిగిందంటే..

ఇటీవల ఎచ్చెర్ల మండలంలోని కుప్పిలి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, అక్కడి మోడల్‌ పాఠశాల పరీక్ష కేంద్రాలను ఇతర అధికారులతో కలిసి తనిఖీకి వెళ్లిన తిరుమల చైతన్య ఒక ఐదుగురు విద్యార్థులు కాపీలు కొడుతున్నట్లు పట్టుకున్నారు. ఇందులో 14 మంది టీచర్లను సస్పెండ్‌ చేసి, వారిలో ఆరుగురు టీచర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టారు. ఉపాధ్యాయులు అందుకున్న సస్పెన్షన్‌ ఆర్డర్లు పరిశీలిస్తే.. సస్పెన్షన్‌కు పేర్కొన్న రూల్స్‌, సెక్షన్లు సదరు టీచర్లకు వర్తించవని అర్థమవుతుంది.

వర్తించని రూల్స్‌తో సస్పెన్షన్లు

సస్పెన్షన్‌ ఆర్డర్లు అందుకున్న వారిలో నలుగురు స్కూల్‌ అసిస్టెంట్లు, ముగ్గురు ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. స్కూల్‌ అసిస్టెంట్లకు స్వయంగా డీఈవో తిరుమల చైతన్య సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేయగా, హోదాను బట్టి ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ బి.విజయభాస్కర్‌ పేరుతో ఇప్పించారు. పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లుగా వ్యవహరించిన స్కూల్‌ అసిస్టెంట్లు ఏ.శ్రీరాములునాయుడు, బి.రామ్మోహనరావు (కేశరాయునిపాలెం జెడ్పీహెచ్‌ఎస్‌), ఎస్‌.శ్రీనివాసరావు (బడివానిపేట జెడ్పీహెచ్‌ఎస్‌), పైడి ఫల్గుణరావు (మురపాక, జెడ్పీహెచ్‌ఎస్‌)లకు ఏపీసీఎస్‌(సీసీఏ)`1991 చట్టంలోని రూల్‌8(2)(ఎ) కింద వారందరినీ విధుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే ఆర్జేడీ పేరుతో ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన సస్పెన్షన్ల ఆర్డర్లలో ఏపీసీఎస్‌(సీసీఏ)`1991 చట్టంలోని రూల్‌ 8లోని 1, 2 సబ్‌ రూల్స్‌ కింద సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సర్వీస్‌ రూల్స్‌ ఏం చెప్తున్నాయ్‌..?

రూల్‌ 8(1)(2) ప్రకారం టీచర్లను గానీ, ప్రధానోపాధ్యాయులపై గానీ సస్పెన్షన్‌ వంటి చర్యలు తీసుకోవాలంటే అదే రూల్‌ 8(2)లోని సబ్‌ రూల్స్‌ ప్రకారం చూస్తే ఏదైనా క్రిమినల్‌ ఆరోపణలతో అరెస్టు అయ్యి కనీసం 48 గంటలపాటు రిమాండ్‌లో ఉన్నా లేదా శిక్ష పడిన వారిపైనే సస్పెన్షన్‌ లేదా సర్వీస్‌ నుంచి తొలగించడం వంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో చూపించిన సర్వీస్‌ రూల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. కానీ సస్పెండైన టీచర్లెవరూ 48 గంటల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో లేరన్న విషయం అందరికీ తెలుసు. తన సొంత ప్రచారం కోసం విపరీత చర్యలకు పాల్పడుతున్న డీఈవో ముందూవెనకగా చూడకుండా వర్తించని ఉత్తర్వులు జారీ చేస్తే.. రూల్‌ పొజిషన్‌ చూడకుండా ఆర్జేడీ ఎలా ఉత్తర్వులు ఇచ్చారని ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తమ సస్పెన్షన్‌ ఉత్తర్వులను న్యాయస్థానంలో సవాల్‌ చేయడానికి బాధిత టీచర్లు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

1964 ఏపీసీఎస్‌ కాండక్ట్‌ రూల్స్‌ పాటించకపోతే సీసీఏ రూల్స్‌ వర్తిస్తాయి. అంటే.. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా నడవకపోతే ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్టన్నమాట. అసలు కాండక్ట్‌ రూల్స్‌ పాటించారో, లేదో నిర్ధారించకుండానే సీసీఏను వాడటం డీఈవో చేసిన మొదటి తప్పు. ఫలానా సెంటరులో మీరు మాల్‌ప్రాక్టీస్‌కు ప్రోత్సహించారనో, లేదూ అంటే చూసిరాతలకు అనుమతించారనో ముందుగా సంబంధిత ఇన్విజిలేటర్లకు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లకు, చీఫ్‌ సూపరింటెండెంట్లకు ఏపీసీఎస్‌ కాండక్ట్‌ రూల్‌ ప్రకారం నోటీసులివ్వాలి. ఆ తర్వాతే సీసీఏ నిబంధనలు ఉల్లంఘించారంటూ 1991 సీసీఏ నిబంధనల ప్రకారం సస్పెండ్‌ చేయొచ్చు. డీఈవో వెళ్లినప్పుడు కుప్పిలి జిల్లాపరిషత్‌ పాఠశాలలో ఇన్విజిలేషన్‌ విధుల్లో లేని ఉపాధ్యాయుడు అక్కడ ఆన్సర్‌ సీట్లు కలిగివున్నారని చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి రూల్‌ 22లో 9 క్లాస్‌ ప్రకారం పెనాల్టీ సెక్షన్‌లో ఉన్న నిబంధనలను డీఈవో అనుసరించాలి. సంబంధిత పరీక్షా కేంద్రంలో బయటి వ్యక్తి ఉన్నారని, అక్కడ పంచనామా నిర్వహించి, ఆ తర్వాత దాన్ని రికార్డ్‌ చేసి సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ ఇప్పుడు 14 మంది ఉపాధ్యాయ సిబ్బందికి ఇచ్చిన సస్పెన్షన్‌ ఆర్డర్‌లో పేర్కొన్న క్లాజ్‌ ఏమాత్రం వర్తించదు. క్రిమినల్‌ చర్యలకు పాల్పడి 48 గంటలు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నా, లేదూ ఏసీబీ ట్రాప్‌ అయితే మాత్రమే ఈ క్లాజ్‌ను వర్తింపజేయాలి. మిగిలిన దేనికైనా ఏపీసీఎస్‌ 1964 మేరకు నోటీసులివ్వాలి. అయితే ఇవన్నీ జరిగితే పబ్లిసిటీ పీక్స్‌కు రాదని భావించిన తిరుమల చైతన్య రేసుగుర్రం సినిమాలో కిల్‌బిల్‌ పాండే మాదిరిగా వరుసగా సస్పెన్షన్‌ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇప్పుడు దీన్ని హైకోర్టుకు ఎవరైనా స్క్వాష్‌కు వెళితే కచ్చితంగా డీఈవో హైకోర్టు మెట్లు ఎక్కాల్సివుంటుంది.

ఇదిలా ఉండగా, తిరుమల చైతన్య వ్యవహారం మీద ఉపాధ్యాయుల్లో ఆగ్రహం రోజురోజుకు ఎక్కువవుతోంది. తాజాగా డీఈవో డిబార్‌ చేసిన ఒక విద్యార్థితో ఉపాధ్యాయ సంఘ నేతలు సోమవారం సాయంత్రం స్థానిక ఎన్జీవో హోంలో మాట్లాడిరచారు. ఎవరి వద్దనైనా స్లిప్పులుంటే ముందే ఇచ్చేయాలని, లేదంటే డిబార్‌ చేస్తామని చెప్పడంతో తనకు ముందు కనిపించిన ఒక కాగితాన్ని సంబంధిత అధికారికి ఇచ్చానని, ఆ స్లిప్పును తానే తెచ్చానంటూ తనను డిబార్‌ చేశారని ఆ విద్యార్థి వీడియో స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. తెలిసో, తెలీకో కుప్పిలి జెడ్పీ హైస్కూల్‌లో స్లిప్పులు తయారుచేసే కర్మాగారం ఉందంటూ డీఈవో ఫ్లోలో ఒక మాటన్నారు. కుప్పిలి జెడ్పీ హైస్కూల్‌లో కంప్యూటర్లు గాని, ప్రింటర్లు గాని, ప్రింటెడ్‌ ప్రశ్నాపత్రాలు గాని, చివరకు పదోతరగతి గైడ్లు, జిరాక్స్‌ జవాబు పత్రాలు గాని, స్టడీ మెటీరియల్‌ గాని అక్కడ దొరకనప్పుడు స్లిప్పులు తయారుచేసే కర్మాగారం ఎందుకైందని ఉపాధ్యాయ సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. కీర్తికండూతి కోసం మీడియా ముందు ఎన్నో మాట్లాడిన డీఈవో ఇప్పుడు ఆధారాల సేకరణ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ట్రిపుల్‌ ఐటీలో సీట్ల కోసం రూ.30వేలు నుంచి రూ.40వేలు వసూలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సివచ్చింది. అందుకే బుడగట్లపాలెం, కొయ్యాం ప్రధానోపాధ్యాయులను తన కార్యాలయానికి పిలిచి ఒక్కో పాఠశాల నుంచి రూ.10వేలు చొప్పున కుప్పిలి స్కూల్‌ గుమస్తాకు ఇచ్చినట్లుగా స్టేట్‌మెంట్‌ ఇమ్మని బలవంతం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందుకే సస్పెన్షన్‌ రద్దు చేసేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. మంగళవారం సాయంత్రం నిరసన ర్యాలీ, బుధవారం సాయంత్రం డీఈవో కార్యాలయం వద్ద ధర్నా, 27 సాయంత్రం కలెక్టరేట్‌ వద్ద ధర్నా, 29 సాయంత్రం డీఈవో కార్యాలయం ముట్టడి, ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి స్పాట్‌ వాల్యూయేషన్‌ ప్రక్రియను బహిష్కరిస్తామని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. ఉపాధ్యాయుల సస్పెన్షన్లు రద్దు చేయడంతో పాటు డిబారైన విద్యార్థులకు న్యాయం చేయాలని, ఇంతవరకు తిరుమల చైతన్య పాల్పడిన అక్రమాలపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page