top of page

ఇక్కట్లు దాటి ఇన్‌ఛార్జి వరకు..!

Writer: NVS PRASADNVS PRASAD
  • ఆమదాలవలస వైకాపా ఇన్‌ఛార్జిగా చింతాడ

  • జనవరిలో జగన్‌ జిల్లా పర్యటన

  • సీతారామ్‌ పార్లమెంటుకేనని ముందే చెప్పిన ‘సత్యం’

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఈలోగా జిల్లాలో ఒక పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైకాపా అభ్యర్థులను రాబోయే ఎన్నికలకు బొట్టుపెట్టి సిద్ధంగా ఉంచాలన్న సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆమదాలవలస నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జిగా చింతాడ రవికుమార్‌ను నియమిస్తూ సోమవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేయడం ఇందుకు నిదర్శనం. అక్కడికి మూడు రోజుల క్రితం ఆమదాలవలసకు గతసారి ప్రాతినిధ్యం వహించిన తమ్మినేని సీతారామ్‌ను విజయవాడ పిలిపించుకొని ఎంపీగా బరిలో నిలవాలని మరోసారి స్పష్టం చేసిన జగన్మోహన్‌రెడ్డి ఆ మాటకే కట్టుబడిపోయారు. ఆమదాలవలస నియోజకవర్గం నుంచి సీతారామ్‌ చెప్పినవారికి టిక్కెటిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తానని, అలాగని కొడుకు, కోడలు, కూతురు అంటే కుదరదని చెప్పినప్పటికీ తన కుమారుడు చిరంజీవి నాగ్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించిన సీతారామ్‌ నియోజకవర్గంలో మరో వైకాపా నాయకుడి పేరును సూచించలేకపోయారు. దీంతో తాజాగా చింతాడ రవిని నియమిస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది. 2024 ఎన్నికలకు జగన్మోహన్‌రెడ్డి నియమించుకున్న అనేక సర్వే సంస్థలు సీతారామ్‌ ఓడిపోతారన్న అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ ఈ నియోజకవర్గంలో జరిగిన ముక్కోణపు కుంపటిలో ఏ ఒక్కరికి టిక్కెటిచ్చినా మిగిలినవారు కచ్చితంగా ఓడిస్తారని భావించిన జగన్మోహన్‌రెడ్డి ఆమదాలవలస నియోజకవర్గంలో అమలైన సంక్షేమ పథకాల శాతం బట్టి మరోసారి సీతారామ్‌ వైపే మొగ్గుచూపారు. గత ఎన్నికల్లో చింతాడ రవికుమార్‌, సువ్వారి గాంధీలు కూడా వైకాపా టిక్కెట్‌ ఆశించారు. అయితే సీతారామ్‌కు టిక్కెట్‌ దక్కడంతో గాంధీ పార్టీని వీడి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. చింతాడ రవికుమార్‌ మాత్రం పార్టీ ఆదేశాలు మీరకుండా వైకాపా కోసం పని చేశారు. 2019, 2024ల్లో చింతాడ రవి టిక్కెట్‌ను ఆశించారు. కానీ ఆయనకు అది దక్కలేదు. వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి విప్‌ కూన రవికుమార్‌తో చింతాడ రవికుమార్‌ యుద్ధం చేశారు. అప్పట్లో వైకాపా తరఫున కూన రవికుమార్‌ మీద అంత స్థాయిలో విరుచుకుపడిన నేత మరొకరు లేరు. సువ్వారి గాంధీకి, కూన రవికుమార్‌కు మధ్య రాజకీయ వైరం ఉన్నా అవన్నీ న్యాయపరంగా కోర్టుల్లో తేల్చుకున్నారు. ఇక సీతారామ్‌ టీడీపీని విమర్శించాలంటే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా ప్రెస్‌మీట్లకే పరిమితమయ్యారు. కానీ చింతాడ రవి మాత్రం టీడీపీ హయాంలో ఆమదాలవలసలో జరిగిన అనేక అవకతవకల్లో, అక్రమాల్లో కూన రవి పాత్ర ఉందంటూ నేరుగా టీవీ`9 స్టూడియోలోనే కూర్చున్నారు. ఆ తర్వాత కూన రవి కూడా ఇదే టీవీ ఛానెల్‌లో తనపై వచ్చిన ఆరోపణలపై డిబేట్‌కు వచ్చారు.. అది వేరే విషయం. సీన్‌ కట్‌ చేస్తే 2019లో వైకాపా అధికారంలోకి వచ్చింది. సీతారామ్‌ శాసనసభ స్పీకర్‌ పదవిని అధిష్టించారు. సరిగ్గా అప్పట్నుంచే చింతాడ రవికుమార్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయింది. సాధారణంగా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకుడి మాట చెల్లుబాటు కావడం, నాలుగు కాంట్రాక్టులు చేసుకోవడం ఎక్కడైనా ఆనవాయితీ. ప్రస్తుతం ఏ పార్టీ అయినా అదే ఫాలో అవుతుంది. కానీ 2014`19లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటి కాలం కంటే 2019`24 మధ్య సొంత పార్టీలోనే చింతాడ రవికుమార్‌ గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నారు. సీతారామ్‌ స్పీకర్‌గా ఉండటం వల్ల పార్టీ కార్యక్రమాలు చేయడం కుదరదు కాబట్టి వేరేవారితో వీటిని చేయించాలి. అలా కాకుండా వాటిని గాలికొదిలేయడం వల్ల చింతాడ రవికుమార్‌ స్వయంగా అక్కడో ఆఫీసు తెరిచి పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు చేసుకొచ్చారు. అయితే ప్రతీసారి ఆయనకు పార్టీయే వెనక్కు తగ్గిపోమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికలకు దగ్గర్లో భారీ ఎత్తున బైక్‌ర్యాలీకి ప్లాన్‌ చేస్తే, చివరి నిమిషంలో చింతాడ రవి దాన్ని విరమించుకోవాలని పార్టీ సూచించిన అంశాలు కూడా అప్పట్లో మీడియాలో కథనాలుగా వచ్చాయి. సీతారామ్‌ మొదటి నుంచి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతున్నారు. తాను ఎంపీగా పోటీ చేస్తున్నందున ఆమదాలవలస నియోజకవర్గాన్ని తన కుమారుడికి ఇవ్వాలన్న ఆయన వాదనలో ఒక తండ్రి ఆవేదన అర్థమవుతుంది కానీ, పార్టీ ఆలోచన కనిపించడంలేదు. చింతాడ రవి లాంటి నేతలు నియోజకవర్గంలో ఎదిగితే తన కుమారుడి భవిష్యత్తుకు ముప్పు వస్తుందనే కారణంతోనే గడిచిన ఐదేళ్లు తొక్కిపెట్టారు. రాజకీయాల్లో ఇది సాధారణమే కావచ్చు. కానీ పార్టీ కోణంలో గెలుపు గుర్రం, విధేయత, ఓటర్‌ యాక్సెప్టెన్సీ వంటి అనేక అంశాలు ఉంటాయి. అలా చూసుకుంటే తమ్మినేని చిరంజీవి నాగ్‌ కంటే చింతాడ రవి బలమైన అభ్యర్థి అని పార్టీ భావించినట్లే కనిపిస్తుంది. జెమిలీ ఎన్నికలు రాకపోతే 2029 వరకు టీడీపీ అధికారంలో ఉంటుంది. అప్పటికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కూన రవికుమార్‌ను ఢీకొట్టడం అంత సులువు కాదు. వాస్తవానికి ఆమదాలవలస నియోజకవర్గంలో తెలుగుదేశమేతర పార్టీకి సీతారామ్‌కు మించిన అభ్యర్థి దొరకరు. కానీ 15 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నారన్న సానుభూతితో 2019లో సీతారామ్‌ రాజకీయ చరిత్రలో లేనంత మెజార్టీతో గెలిపిస్తే ఆ ఐదేళ్లు ఆయన కేవలం కొందరివాడిగానే మిగిలిపోయారు. అందుకే గడిచిన ఎన్నికల్లో కూన రవికుమార్‌ ఆమదాలవలస నియోజకవర్గ మెజార్టీనే తిరగరాశారు. కూన రవిని చింతాడ రవి తట్టుకోగలరా, లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కాకపోతే పార్టీని, అధినాయకత్వాన్ని నమ్ముకుంటే రాజకీయాలు వ్యాపారంగా కాకుండా వ్యసనంగా మారితే ఎప్పటికైనా గుర్తింపు వస్తుందనడానికి చింతాడ రవికుమారే ఒక ఉదాహరణ. సీతారామ్‌, కూన రవి మాదిరిగా సొంత వర్గమంటూ లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి అందరిలో మమేకమైపోయిన చింతాడ రవి ఓటుబ్యాంకు ఇతిమిద్దంగా ఫలానా కులం, ఫలానా గ్రామం, ఫలానా మండలం అని చెప్పలేం. ఎందుకంటే.. ‘చింతాడ’కు ఇటువైపు చింతాడ నుంచి అటువైపు బూర్జ వరకు చాలామంది సైన్యం ఉన్నారు. దానికి తోడు పార్టీ వేవ్‌ కలిసొస్తే ఏదైనా జరగొచ్చు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page