ఇక బ్రాయిలర్ పిల్లలు
- DV RAMANA
- Nov 4, 2024
- 2 min read

బ్రాయిలర్ కోళ్లను ఫారాల్లో పెంచినట్టు పుట్టబోయే బిడ్డలను కూడా అత్యాధునిక ఫారాల్లాంటి పెట్టెల్లో ఉంచి పెంచే రోజులు వచ్చేశాయట. తమకు పుట్టబోయే సారీ.. తమకు కావాల్సిన బిడ్డకు ఎలాంటి రంగు, రూపం, ముక్కు కావాలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పొందొచ్చట. ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్, బయోటెక్నాలజిస్టు హాషీం అల్-ఘైలీ సింథటిక్ వూంబ్‌కు సంబంధించిన వీడియోను తయారుచేశారు. దీని ప్రకారం పిండాన్ని బర్తింగ్ పాడ్‌లో పెంచుతారు. అందుకోసం ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. దాదాపు 75 ల్యాబ్‌లలో 400 చొప్పున పెట్టెలు ఉంటాయి. ఏటా 30 వేల మంది పిల్లలను పుట్టించడమే లక్ష్యంగా ఈ ల్యాబ్‌లు పనిచేస్తాయి. ఈ పెట్టెలకు ఏఐ ఆధారిత సెన్సర్లు ఉంటాయి. వాటి సాయంతో పెట్టెలోని శిశువు గుండెకొట్టుకొనే వేగం, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు. ఇందులో అమర్చిన కెమెరా సాయంతో గర్భంలోని జన్యుపరమైన సమస్యలు తెలుసుకొని నియంత్రించవచ్చు. ఎప్పటికప్పుడు గర్భం పెరుగుదలను చూడొచ్చు. తల్లిదండ్రులు బిడ్డ పెరుగుదలను చూసేలా యాప్ ద్వారా అనుసంధానిస్తారు. బిడ్డను బయటకు తీయాలంటే ఆ బర్తింగ్ పాడ్‌పై ఉండే బటన్ నొక్కి చేతిలోకి తీసుకోవటమే. ఈ వీడియోను ‘ఎక్టోలైఫ్ ఆర్టిఫిషియల్ వూంబ్ ఫెసిలిటీ’ కోసం హాషీం రూపొందించారు. వ్యవసాయంలో కొత్త విత్తనాలను ఎలా పుట్టించారో.. అధిక దిగుబడి హైబ్రిడ్ రకాలకు ఎలా పురుడు పోశారో.. అలాగే మేలిమి రకం పిల్లలను కూడా ప్రయోగశాలల్లో అధిక దిగుబడి పంటగా పండిస్తారట. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఏ రంగు, ఏ రూపం, ఎలా కావాలనుకుంటే అలా ప్రోగ్రామింగ్ రాసి పెట్టి.. ప్రయోగశాలల్లో పిల్లలను పుట్టించే అత్యాధునిక కృత్రిమ గర్భాలు ఇవి. అమ్మ కడుపులే అక్కర్లేదు. దానికీ ఆర్టిఫిషియల్ ఆల్టర్నేట్స్ వచ్చేస్తున్నాయ్. వేగంగా కస్టమైజ్డ్ పిల్లల కోసం ఆర్డర్లు తీసుకుని, హోడ్ డెలివరీ ఇచ్చే ‘డబ్బా పిల్లల వ్యాపారం’ డెవలప్ అవుతోంది. ‘స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచె?’ అని ప్రశ్నించాడు ధర్మపురి నరసింహస్వామి గుడి మెట్ల మీద కూర్చుని కవి శేషప్ప. ‘తళుకు జెక్కుల ముద్దు బెట్ట కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ! దశరధుడు శ్రీరామ రారాయని బిలువ మును తపమేమి చేసెనో తెలియ!’ అని అంతటి అవతార పురుషుడైన రాముడి తళుకు చెక్కుల బుగ్గల మీద అల్లారుముద్దుగా ముద్దు పెట్టడానికి కౌసల్య, రారా రామా! అని కొడుకును పిలవడానికి దశరథుడు పూర్వజన్మల్లో ఎంత తపస్సు చేశారో! అని పరిశోధించాడు నాదబ్రహ్మ త్యాగయ్య. ‘అమ్మను మించి దైవమున్నదా.. ఆత్మను మించి అర్థమున్నదా.. జగమే పలికే శాశ్వత సత్యమిదే.. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే.. అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!’ అని రాముడైనా, కృష్ణుడైనా అవతరించాలనుకుంటే ఒక అమ్మకు కొడుకుగా పుట్టాల్సిందే. ఆ అమ్మ కడుపులో నవమాసాలు ఉండాల్సిందే. ఆ తల్లిపాలు తాగి పెరగాల్సిం దేనని తీర్మానించారు సినారె. శంకరాభరణంలో వంకరోపాధ్యాయుడు చెప్పినట్లు ఇదంతా ‘పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు అనుకున్న మాటలు. ఇప్పుడు? బస్సులు, రైళ్లు, విమానాలు, రాకెట్లు, జెట్లు, అన్నీ వచ్చేశాయా? స్పీడు.. లోకమంతా స్పీడే. మన దైనందిన జీవితంలో ఎలాగైతే స్పీడు వచ్చిందో.. అలాగే గర్భధారణలో కుడా రావాలి. వచ్చింది!’. తల్లి గర్భం మొదలు ఇప్పుడంతా కృత్రిమం. సాంకర్యం. టీకాలు. వ్యాక్సిన్లు. చుక్కలు. అతి శీతల గాజు గదుల్లో ప్రాణమున్న బొమ్మల పెంపకం అక్షరాలా ప్రయోగశాలలో వ్యవసాయమవుతోంది. తల్లి గర్భంలో పుట్టినా చివరకు మట్టిలో మట్టిగానో, బూడిదగానో పోవాల్సింది మాత్రం ప్రకృతి గర్భంలోకే. ‘తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు’ అన్న కవి శేషప్ప పద్యాన్ని తిరగరాసుకోవాల్సిన రోజులొచ్చాయి. ప్రయోగశాల గర్భము నుండి.. డీప్ ఫ్రీజర్ గర్భము నుండి.. తల్లిదండ్రి లేని గర్భము నుండి.. గాజు సీసా గర్భము నుండి.. అని పాత సీస పద్యాలను కొత్త కృత్రిమ గర్భ గాజు సీసాల్లోకి తర్జుమాగా ఒంపుకుని పాడుకోవాల్సిన రోజులొచ్చాయి! ఈ మాతృగర్భ జనన జ్ఞానం పునరపి జనన-మరణ చక్రభ్రమణ వేదాంత జ్ఞానమంతా గతం. ఇప్పుడు ఆధునిక శాస్త్రజ్ఞానం తల్లి గర్భమే లేకుండా పిల్లలను కంటోంది. శాస్త్ర జ్ఞానం కడుపు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే పండుతుంది. జ్ఞానం ఎలా పుట్టాలనుకుంటే అలాగే పుడుతుంది. పుడుతూ.. పుడుతూ ఆగుతుంది. ఆగుతూ.. ఆగుతూ పుడుతుంది. పుట్టకముందే పిండం మాట్లాడుతుంది. పెరగకముందే పిండం పరుగులు పెడుతుంది.
Comments