top of page

ఇచ్ఛాపురం.. ఇష్టం మారుతోందా?

Writer: NVS PRASADNVS PRASAD
  • `టీడీపీకి ఏకపక్ష విజయమని తొలుత సంకేతాలు

  • `పిరియా విజయ బరిలోకి దిగడంతో మారిన సీను

  • `వ్యక్తిగత ఇమేజ్‌, ఇంటింటి ప్రచారంతో లెక్కలు తారుమారు

  • `కలిసివస్తున్న వైకాపా గ్రూపుల కలయిక

  • `ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతోనే అని అంచనాలు

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాకముందు నుంచే తెలుగుదేశం కచ్చితంగా గెలిచితీరుతుందని లెక్కలేసుకున్న నియోజకవర్గాల్లో ఇచ్ఛాపురం మొదటిది. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలోనే జిల్లా నుంచి అచ్చెన్నాయుడు, కూన రవితో పాటు ఇచ్ఛాపురం అభ్యర్థిగా బెందాళం అశోక్‌ పేరు ఉంది. వరుసగా రెండుసార్లు గెలిచిన అశోక్‌ హ్యాట్రిక్‌ సాధించే అవకాశముందని చంద్రబాబు చేయించిన పలు సర్వేలు తేటతెల్లం చేశాయి. దీనికి కారణం.. అశోక్‌కు వ్యక్తిగతంగా ఓటుబ్యాంకు ఉండటం, సొంత సామాజికవర్గం ఆయనతోనే ఉండటంతో పాటు జనసేన, బీజేపీ జత కట్టడం వల్ల ఈసారి ఆయన గెలుపు ఖాయమని టీడీపీ భావించడంలో తప్పులేదు. అయితే అధికార వైకాపా వ్యూహాత్మకంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయకు టికెటిచ్చి టీడీపీకి చెమటలు పట్టిస్తోంది. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌తో వైకాపా క్యాడర్‌ కలిసిరాదు కాబట్టి విజయ ఏమాత్రం పోటీ ఇవ్వలేరని తొలుత భావించినా ఆమె అనూహ్యంగా బలం పెంచుకుని పోటీని నువ్వా నేనా అనే స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు అంతో ఇంతో ఆమే ఒకడుగు ముందున్నారన్న తటస్థులు కూడా ఆ నియోజకవర్గంలో లేకపోలేదు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

గత ఎన్నికల్లో ఇచ్ఛాపురంలో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్‌ వైకాపా అభ్యర్థి పిరియా సాయిరాజ్‌పై 7,145 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2014లో వైకాపా అభ్యర్థి నర్తు రామారావుపై జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తుతో పోటీ చేసి 25,278 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు మళ్లీ ఆ మూడు పార్టీలు పొత్తు కుదుర్చుకోవడంతో అశోక్‌ మెజార్టీ మళ్లీ 25వేలు దాటాలి.. లేదంటే 2019 మాదిరిగా లెక్కేసుకున్నా అప్పుడు ఒంటరిగా పోటీ చేసిన జనసేన అభ్యర్థికి వచ్చిన 11వేల పైచిలుకు ఓట్లు ఈసారి బెందాళం అశోక్‌కు కలిసినా 18వేలు పైనే మెజార్టీ రావాలి. ఈ పరిస్థితుల్లో పిరియా విజయ ముందంజలో ఉన్నారని ఎలా చెబుతారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది కాబట్టి అశోక్‌ గెలుపును ఆపడం ఎవరివల్లా కాదన్న వాదన ఉన్నచోట ఆలోచన రేకెత్తించడానికే గణాంకాలతో సహా ఈ కథనాన్ని అందిస్తున్నాం. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఆరు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. రెడ్డిక, యాదవ, మత్స్యకార, కాళింగ, బెంతు ఒరియాలు, శ్రీశయన ఓట్లు ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి. ఏ కులానికి పూర్తిస్థాయిలో మెజార్టీ లేకపోవడం, అన్ని కులాలు బీసీ వర్గానికే చెందడంతో మొదటి నుంచి టీడీపీ హవా కొనసాగుతోంది. టీడీపీ ఆధిపత్యానికి చెక్‌ చెప్పేందుకు అప్పట్లో కాంగ్రెస్‌, ఇప్పుడు వైకాపా యాదవ, కాళింగ సామాజికవర్గాలకు అవకాశాలు ఇచ్చినా మిగతా కులాల మద్దతుతో తన కంచుకోటను టీడీపీ కాపాడుకుంటూ వస్తోంది. ఈసారి ఎలాగైనా ఆ కోటను బద్దలుకొట్టాలనే ఉద్దేశంతో తొలిసారిగా మహిళను వైకాపా బరిలోకి దింపింది.

మహిళా ఓటర్లే నిర్ణయాత్మకం

మహిళా ఓటర్లే ఇక్కడ గెలుపు ఓటములను నిర్దేశిస్తుండటంతో వైకాపా వ్యూహాత్మకంగా మహిళను బరిలోకి దించింది. 2019లో 1,24,984 మంది మహిళా ఓటర్లలో 95,311 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుత ఎన్నికలనాటికి ఓటర్ల సంఖ్య 2,67,108కి పెరిగింది. వీరిలో 1,30,130 మంది పురుషులు, 1,36,961 మంది మహిళలు ఉన్నారు. ఐదేళ్లలో 20,880 మంది ఓటర్లు పెరిగితే వీరిలో మహిళా ఓటర్లు పురుషుల కంటే 6,831 మంది అధికంగా ఉన్నారు. ఇది పిరియా విజయకు కలిసొచ్చే అంశం. ఆమె జెడ్పీ చైర్‌పర్సన్‌ అయినప్పటినుంచి నియోజకవర్గం మీదే దృష్టి పెట్టారు. సాధారణంగా జెడ్పీ చైర్మన్‌గా పని చేసిన వారంతా జిల్లా కేంద్రంలో ఉన్న అధికారిక బంగ్లాలోనే ఉండేవారు. కానీ పిరియా విజయ మాత్రం నియోజకవర్గాన్ని వీడి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సాయిరాజ్‌, విజయల్లో ఒకరికి వైకాపా టికెట్‌ ఇస్తుందన్న భరోసా మొదటి నుంచి ఉండటమే దానికి కారణం. అందుకే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వీరు మొదట్నుంచి పట్టు పెంచుకుంటూవచ్చారు. కానీ సాయిరాజ్‌ను వ్యతిరేకించే వైకాపా నాయకులు మాత్రం మొన్నటి వరకు ఒక గొడుగు కిందకు రాలేదు.

వైకాపా ఇంటింటి ప్రచారం

ప్రచారంలోనూ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. వైకాపా అభ్యర్ధి ప్రధానంగా ఇంటింటి ప్రచారంపై దృష్టి పెడితే, టీడీపీ అభ్యర్ధి గ్రామాల్లో ర్యాలీలు చేసి పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. మంగళవారం సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్ఛాపురంలో ప్రచార సభ నిర్వహించనున్నారు. దీంతో వైకాపాకు సానుకూలత పెరుగుతుందన్న అభిప్రాయం ఉంది. నియోజకవర్గంలో రెండువేలు అంతకంటే ఎక్కువ ఓట్లు ఉన్న బారువా, కపాసుకుద్ది, ఈదుపురం, కవిటి, కంచిలి, సోంపేట, కొర్లాం, మండపల్లి, లొద్దపుట్టుగ తదితర 44 పంచాయతీలు ఉన్నాయి. నియోజకవర్గంలో 265 పోలింగ్‌ కేంద్రాలు ఉంటే.. వాటిలో 2014 ఎన్నికల్లో 66 బూతుల్లోనే వైకాపాకు మెజార్టీ వచ్చింది. 2019 ఎన్నికల్లో 299 పోలింగ్‌ కేంద్రాల్లో 113 బూతుల్లో మాత్రమే వైకాపా మెజార్టీ సాధించింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం టీడీపీ నామమాత్రపు పోటీ, సంక్షేమ పథకాల ప్రభావం కారణంగా నియోజకవర్గంలోని 98 పంచాయతీలకు గాను 84 చోట్ల వైకాపా బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోనూ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. అందువల్ల ఈసారి 150 బూతుల్లో మెజార్టీ సాధించడమే లక్ష్యంగా వైకాపా పావులు కదుపుతోంది. 2019లో వైకాపాకు కంచిలిలో సుమారు 1800 మెజార్టీ రాగా టీడీపీ కవిటిలో 4వేలు, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో 1500, ఇచ్ఛాపురం మండలంలో 1200, సోంపేటలో 2వేల మెజార్టీ సాధించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 46 శాతంతో 79,992 ఓట్లు దక్కించుకోగా, వైకాపాకు 42 శాతం.. అంటే 72,847 ఓట్లు పడ్డాయి. జనసేన అభ్యర్ధి దాసరి రాజుకు 6 శాతంతో 11,123 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 1,826, కాంగ్రెస్‌కు 2,138 ఓట్లు పడ్డాయి. నోటాకు 2 శాతం ఓట్లు అంటే 3,880 మంది వేశారు. ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తుండడంతో 2019 ఎన్నికల లెక్క ప్రకారం చూసుకుంటే 53 శాతం ఓట్లతో టీడీపీ అభ్యర్థి సుమారు 20వేల ఆధిక్యతతో ముందున్నట్టు భావించాలి. దీన్ని బీట్‌ చేయలాంటే వైకాపా అభ్యర్థి పిరియా విజయ ఎంతలా కసరత్తు చేయాలో ముందే గ్రహించారు. అందుకు తగినట్లే ప్రచారంలో టీడీపీ అభ్యర్థికంటే ఒకడుగు ముందున్నారు. గతం కంటే సుమారు 11వేల ఓట్లు వైకాపా అదనంగా సాధించాల్సి ఉంటుంది. ఐదేళ్లలో కొత్తగా నమోదైన 20,880 ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపిస్తే వారే విజయం సాధిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత అంచనా ప్రచారం కవిటిలో టీడీపీ, కంచిలి మండలంలో వైకాపా స్పష్టమైన మెజార్టీ సాధించనున్నాయి. సోంపేటలో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇచ్ఛాపురం రూరల్‌లో కొందరు ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో వైకాపా బలంగా ఉన్నట్టు పైకి కనిపిస్తున్నా స్థానిక వైకాపా నాయకుల తీరువల్ల కొన్ని ఓట్లకు గండిపడనుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు రెడ్డిలు పూర్తి స్థాయిలో వైకాపా వైపు మొగ్గు చూపిస్తే వైకాపా విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే టీడీపీ అభ్యర్ధి విజయంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రభావం కూడా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

బెంతు ఒరియాలు కీలకం

ప్రస్తుత ఎన్నికల్లో జగన్‌ చరిష్మా, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రభావితం చేస్తాయని వైకాపా బలంగా నమ్ముతోంది. ఎన్నికల సమీపిస్తున్నకొద్దీ టీడీపీ సూపర్‌ యాక్టివ్‌ అవుతోంది. వైకాపాకు ధీటుగా ఎన్నికల ప్రచారం చేస్తోంది. కాళింగ ఓటర్లంతా టీడీపీ వైపు మొగ్గు చూపిస్తుంటే, యాదవుల ఓట్లలో కొంత చీలక వస్తుందన్న ప్రచారం ఉంది. రామచంద్రయాదవ్‌ పార్టీ నుంచి యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి పోటీలో ఉండడంతో వైకాపాకు రావల్సిన ఓట్లు కొన్ని చీలుతాయని అంటున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీచేస్తున్న రెడ్డిక సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి పోలయ్యే ఓట్లు వైకాపాకు దక్కాల్సినవేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పాటు బెంతు ఒరియాల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చడానికి జగన్‌ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేసింది. అంతకు ముందు అనేక దఫాలుగా బెంతు ఒరియా పెద్దలను సాయిరాజ్‌ ప్రభుత్వ పెద్దల వద్దకు తీసుకువెళ్లారు. కమిషన్‌ పర్యటన తర్వాత సీఎంవో అధికారులను కలిశారు. ఎస్టీ జాబితాలో చేర్చాలని బెంతు ఒరియాలు కవిటి మండల కేంద్రంలో ఇప్పటికీ నిరాహార దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. సుమారు 17వేల మంది ఓటర్లు కలిగి ఉన్న ఈ సామాజిక వర్గీయులు మంగళవారం ఇచ్ఛాపురం పర్యటనకు వస్తున్న సీఎం జగన్‌ ఇచ్చే హామీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ రెడ్డిక ఓట్లు చీలకుండా సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, యాదవ ఓటర్లు పక్కచూపులు చూడకుండా ఎమ్మెల్సీ నర్తు రామారావు లాంటి నేతలు చూస్తున్నారు. కలగూర గంపలా ఉండే ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సామాజికవర్గాలు, మేజర్‌ కమ్యూనిటీలు వైకాపా వైపు చూస్తున్నాయి. అన్నింటికీ మించి పిరియా విజయ అభ్యర్థిత్వం పట్ల నియోజకవర్గంలో ఎక్కడా వ్యతిరేకత లేదు. ఆమెకు వ్యతిరేకంగా పోలైన ఓటు ఉంటే అది కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతే తప్ప ఆమె వరకు ఎక్కడా ఓటరు నుంచి నిరాసక్తత వ్యక్తం కావడంలేదు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page