top of page

ఇజ్రాయెల్ ‘అణు’ రహస్యం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Mar 23
  • 2 min read


యుద్ధం ప్రారంభమై మూడు వారాలకుపైగా గడిచినా తొణకని, బెణగని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం మాత్రం హుటాహుటిన డిమోనా అనే ప్రాంతానికి పరుగులు తీశారు. ఇరాన్ ఆ ప్రాంతంపై క్షిపణి దాడి చేసినా అక్కడ పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన దాఖలాల్లేవు. అయినా ప్రధాని స్థాయి నేత ఎందకు అక్కడికి పరుగులు తీశారు. దీనికి కారణం.. డిమోనా అనేది దశాబ్దాలుగా ఇజ్రాయెల్ కాపాడుకుంటూ వస్తున్న ఒక రహస్యం. ఆ రహస్యం ఏమిటన్నది ఇజ్రాయెల్ పెద్దన్న అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నింటికీ తెలిసినా అది ఫలానా అని నిర్థారించే స్పష్టమైన రుజువులు లేకపోవడంతో అది బహిరంగ రహస్యంగానే కొనసాగుతున్నది. ఆ రహస్యానికి ఇప్పుడు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడటం వల్లే నెతన్యాహు హుటాహుటిన డిమోనా ప్రాంతానికి వెళ్లి స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. ప్రధానినే తన వద్దకు రప్పించుకున్న డిమోనాలో ఉన్నదేంటో తెలుసా? ప్రపంచాన్ని భయపెడుతున్న అణుకేంద్రం. ప్రపంచమంతా అణుకుంపటిపై ఉందని భయపడుతూ ఆణుపరీక్షలు, ప్రయోగాలపై ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణుశక్తి సంఘం(ఐఏఈఏ) ఆధ్వర్యంలో ఒప్పందాలు చేసుకుని, తనిఖీ బందాలు కూడా ఏర్పాటు చేసుకున్నా కూడా ఇజ్రాయెల్ తన అణుబలం గురించి ఇంతవరకు నోరు విప్పకుండా సుదీర్ఘ మౌనం పాటిస్తోంది. ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని ప్రపంచమంతా అనుకుంటున్నది. కానీ ఆ దేశం మాత్రం ఈ వాదనలను ఎన్నడూ అంగీకరించలేదు.. అలాగని అణ్వాయుధాలు లేవని ఖండించనూలేదు. ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మళ్లీ చర్చగా మారింది. ఇరాన్‌కు చెందిన నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ అణుకేంద్రం ఉన్న డిమోన్‌పై దాడి చేసింది. ఈ దాడుల్లో ఆణు కేంద్రాలకు ఎటువంటి నష్టం వాటిల్లకపోయినా.. ఈ పరిణామాలు మాత్రం ప్రపంచాన్ని వణికించాయనే చెప్పాలి. ఇజ్రాయెల్ గుట్టు విప్పకపోయినా అంతర్జాతీయ రక్షణ సంస్థల అంచనా ప్రకారం.. ఇజ్రాయెల్ వద్ద సుమారు 80 అణు వార్‌హెడ్లు ఉన్నాయి. వీటిని విమానాలు లేదా క్షిపణుల ద్వారా ప్రయోగించే సత్తా ఆ దేశానికి ఉంది. కానీ మిగిలిన అగ్రరాజ్యాల మాదిరిగా ఇజ్రాయెల్ ఎప్పుడూ తన అణ్వాయుధ శక్తిని ప్రదర్శించకుండా గుంభనంగా వ్యవహరించడమే ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే.. ఎప్పుడు ఇజ్రాయెల్ వీటిని వాడుతుందో ఎవరికీ తెలియదు. తాజాగా ఇరాన్ డిమోనా నగరంపై దాడి చేసింది. తన అణు కేంద్రాలపై దాడులు జరిగితే తాము కూడా ఇజ్రాయెల్ అణు కేంద్రాలను వదలబోమని ఇరాన్ ఈ దాడి ద్వారా హెచ్చరించింది. 1950 దశకం చివరిలోనే అణు రియాక్టర్ ఏర్పాటు చేస్తున్న ఇజ్రాయెల్ 1967, 1973 యుద్ధాల సమయాల్లో తన ఉనికికి ప్రమాదం ఏర్పడిందని భావించి అణ్వాయుధాలను వాడాలని యోచించినట్లు కొన్ని కథనాలు ఉన్నాయి. కానీ అదష్టవశాత్తు ఇప్పటివరకు అటువంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. ఇజ్రాయెల్ రక్షణ వ్యూహాల్లో ‘శాంసన్ ఆప్షన’ అనే మాట తరచూ వినిపిస్తుంటుంది. ఈ శాంసన్ ఆప్షన్ ఏమిటంటే.. ఒకవేళ యుద్ధంలో ఓడిపోయి.. ఇజ్రాయెల్ పూర్తిగా అంతమైపోయే ముప్పు ఎదురైతే.. శత్రువులను కూడా వదలకుండా తమతోపాటు అంతమైపోయేలా అణ్వాయుధాలను ప్రయోగించడం దీని వెనుక ఉన్న గూఢార్థం. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై తప్ప ఆ తర్వాత ఎప్పుడూ అణ్వాయుధాల ప్రయోగం జరగలేదు. కానీ శత్రు, ప్రత్యర్థి దేశాలను భయపెట్టడానికి అణుబూచిని చూపించడం పరిపాటి. కానీ ఇజ్రాయెల్ ఆలోచన మాత్రం చాలా భయంకరం. ‘మేము లేకపోతే ప్రపంచమే ఉండకూడదు’ అనేదే దాని కుటిలనీతి అని అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు ఆరోపణ. గాజాపై ఇజ్రాయెల్ 2023 నుంచి నిరంతరాయంగా జరుపుతున్న దాడులను చూస్తే ఆ దేశం ఎంత విధ్వంసానికైనా వెనుకాడదని అర్థమవుతుంది. పలువురు రక్షణ నిపుణుల అంచనాల ప్రకారం.. గాజాపై ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల శక్తి హిరోషిమాపై నాడు అమెరికా వేసిన అణుబాంబు కంటే కొన్ని రెట్లు ఎక్కువ. సాధారణ ఆయుధాలతోనే ఇంతటి విధ్వంసం సృష్టించిన దేశం.. యుద్ధంలో తాను ఓడిపోయే పరిస్థితి వస్తే అణ్వాయుధాలను వాడదని గ్యారెంటీ ఏమిటనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ప్రపంచంలోని చాలా దేశాలు అంతర్జాతీయ అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కానీ ఇజ్రాయెల్ ఏ ఒప్పందంపైనా సంతకాలు చేయలేదు. అటువంటి ఒప్పందాలకు కట్టుబడటమూ లేదు. ఫలితంగా ఇజ్రాయెల్‌లోని అణు కేంద్రాలను తనిఖీ చేసే అధికారం ఏ అంతర్జాతీయ సంస్థకూ లేదు. దీనివల్ల అణ్వాయుధాల విషయంలో తాను ప్రపంచానికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదన్నట్లుగా ఈ చిన్నదేశంలో తల విసరుతోంది. దీనికితోడు ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఉన్న నెతన్యాహు ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇరాన్, లెబనాన్, గాజా, యమెన్.. ఇలా అన్ని వైపుల నుంచి యుద్ధం చుట్టుముడుతున్న వేళ ఇజ్రాయెల్ గనుక తన ఉనికి ప్రమాదంలో ఉందని భావిస్తే అది అణు యుద్ధానికి దారితీసే ముప్పు తప్పకుండా ఉంటుంది. అదే జరిగితే పశ్చిమాసియాకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికే ముప్పు. ఇవన్నీ అగ్రరాజ్యం అమెరికాకు తెలియనివి కావు. అయినా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ కొమ్ముకాస్తున్నారు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ తన మాట పెడచెవిన పెడుతుందన్న కోపంగా కక్ష పెంచుకుని దాడులకు తెగబడుతున్న అమెరికా.. ఇజ్రాయెల్ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నది. అంతర్జాతీయ ఒప్పందాలనే ఖాతరు చేయని, తన అణుశక్తి గుట్టు విప్పని ఇజ్రాయెల్‌కు ఆర్థికంగా, సైనికంగా వెనుదన్నుగా నిలుస్తూ ఇరాన్‌పైకి ఉసిగొల్పుతూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నది. మొత్తం ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెడుతున్నది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page