నస్రల్లా కథేంటి..?

హస్సన్ నస్రల్లా.. బతికున్నాడా, చనిపోయాడా..? ఒసామా బిన్ లాడెన్ చనిపోయినప్పుడు కొన్నాళ్లు జరినట్టుగానే ఈ చర్చ ఇప్పటితో ఆగకపోవచ్చు! కానీ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడుల్లో నస్రల్లా చనిపోయాడన్నది.. ఇప్పుడు ఇజ్రాయెల్ మీడియా చెబుతున్న కథ! సరే, నస్రల్లా బతికే ఉన్నాడా.. చనిపోయాడా అన్నది మెల్లిగా తెలిసినా తక్కిన ప్రపంచానికి పోయేదేంలేదు. కానీ, అసలు నస్రల్లా ఎవరు మొస్సాద్ వంటి బలమైన పరిశోధనాత్మక ఏజెన్సీలను కల్గి ఉన్న ఇజ్రాయెల్‌ను గడగడలాడిరచిన అతగాడి కథేంటి?
ఇజ్రాయెల్‌ను గడగడలాడిరచిన ప్రాణాంతక శత్రువు పేరు నస్రల్లా! ఓ కూరగాయల వ్యాపారి కొడుకు.. లెబనాన్ కేంద్రంగా ఏర్పాటై శాసిస్తున్న హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా!!
సరిగ్గా తన 16వ ఏటనే.. లెబనాన్ ఆధారిత సంస్థైన హెజ్బొల్లా అప్పటి నాయకుడు అల్ ముసావీ దృష్టిని ఆకర్షించాడు. అలా ముసావీతో బలమైన బంధమేర్పడిరది. ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో ముసావీ మరణించిన తదనంతరం 1992లో హెజ్బొల్లాకు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు నస్రల్లా.
కేవలం 32 ఏళ్ల వయస్సులోనే హెజ్బొల్లా బాధ్యతలు స్వీకరించాక.. అసలు ముసావీ కలలుగన్న దానికంటే కూడా హెజ్బొల్లాను మరింత శక్తివంతంగా మార్చాడు. అంత బలంగా హెజ్బొల్లా తయారవుతుందని కనీసం ఇజ్రాయెల్ సైనిక ఏజెన్సీస్ కూడా ఊహించలేదు. అలా లెబనాన్ ప్రభుత్వంలో హిజ్బొల్లా భాగస్వామ్యమై మిడిల్ ఈస్ట్ లో ఓ పవర్ ఫుల్ పొల్టికల్ ఆర్గనైజేషన్ గా స్థిరపడటంలో నస్రల్లాదే కీలకపాత్ర.
అయితే, 2006లో ఇజ్రాయెల్‌తో యుద్ధం తర్వాత.. నస్రల్లా అజ్ఞాతవాసయ్యాడు. ఫోటోల్లో, టీవీ స్క్రీన్స్ పైన మినహా.. బయటెక్కడా కనిపించకుండా రహస్య స్థావరాన్నేర్పాటు చేసుకున్న నస్రల్లా.. ఒక శక్తివంతమైన వక్త. ఆరేటర్‌గా తన హెజ్బొల్లా సంస్థ బలపడేలా నస్రల్లా చేసిన ప్రసంగాలు వింటే అర్థమవుతుంది ఆయనెంత టాప్ కమ్యూనికేటరో! ఈమధ్య లెబనాన్ లో జరిగిన పేజర్ పేలుళ్లపై కూడా నసరల్లా చేసిన తాజా ప్రసంగంలోనూ..ఇదంతా ఇజ్రాయెల్ చేసిన యుద్ధప్రకటనగానే భావించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
ఇరాన్‌కు చెందిన షియా నేతల ఆధ్వర్యంలో నడిచే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లీడర్స్‌తో మాత్రమే ఈమధ్య నస్రల్లా ఫోటోల్లో తరచూ కనిపించారు.
తనను చంపేశామంటూ, తనపై దాడి జరిగిందంటూ ఇజ్రాయెల్ పుట్టించేవన్నీ పుకార్లేనని.. ఆ పుకార్లతో తనను రహస్య బంకర్స్ నుంచి బయటకు తీసుకొచ్చే ఓ కుట్రగా 2014లోనే అల్ అక్బర్ అనే వార్తాపత్రికతో మాట్లాడినప్పుడు చెప్పుకొచ్చాడు. బంకర్లలో దాక్కున్న వారి హెచ్చరికలను తాము పట్టించుకోమని గతంలో నేతాన్యాహు ప్రకటించాడు. తాను కేవలం బంకర్లకే పరిమితమయ్యేవాడిని కాదని, స్వేచ్ఛగా తిరుగగలనని.. ఎంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినా తననేమీ చేయలేరని కౌంటర్ ఇచ్చాడు నస్రల్లా. తన మిషన్ లో భాగంగా తన మిత్రులతో కలిసే విషయంలో తనను ఇజ్రాయెల్ కాదు కదా ఇంకెవ్వరూ కూడా ఆపలేరన్న విశ్వాసాన్ని ఆ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నస్రల్లా!
హెజ్బొల్లాను మెయిన్ ఫోకస్ చేసిన ఇజ్రాయెల్ ఇప్పటికే దానికున్న సాంకేతిక, సైనిక సామర్థ్యంతో పెద్దఎత్తున చాలామందిని లేపేసింది. దాంతో ఇప్పుడు హెజ్బొల్లా నాయకత్వానికే అది గందరగోళంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో హెజ్బొల్లా తన మూలాలను కాపాడుకోవాలంటే.. తమ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలంటే మాత్రం నస్రల్లా వంటి లీడర్ షిప్ మాత్రమే ఆ సంస్థకు నైతిక బలం.
అదిగో, ఇలాంటి పరిస్థితుల్లోనే చావు నీడ కూడా తనపై పడకుండా ఉండేలా నస్రల్లా రహస్య బంకర్ లో ఎక్కడో ఓ బయటపడని పురాతన విగ్రహంలా దాక్కున్నాడు.
అయితే, నిన్న రాత్రి బీరూట్ లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేసిన దాడిలో.. నాల్గు భవనాలు నేలమట్టమయ్యాయి. మట్టిగా మారిపోయిన ప్రధాన కార్యాలయంలోని బంకర్ లోనే నస్రల్లా ఉండి ఉండొచ్చునన్న వార్తలు ఇప్పుడు మిన్నంటుతున్నాయి. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ మీడియాతో పాటు.. మరికొంత ఇజ్రాయెల్ అనుకూల మీడియా, అమెరికన్ మీడియా కూడా
ప్రచారానికి పెట్టిందిప్పుడు. కానీ, నస్రల్లా సజీవంగా ఉన్నాడా%ౌ% చనిపోయాడా అన్నది మాత్రం ఇంకా ధృవీకరణ కావల్సి ఉంది.
నస్రల్లా.. ఓ కూరగాయల వ్యాపారికి జన్మించిన వ్యక్తే కాదు.. కొడుకును త్యాగం చేసిన తండ్రి కూడా!
నస్రల్లాను కేవలం హెజ్బొల్లా చీఫ్‌గా మాత్రమే చూడటం కాదు. 1997లో ఇజ్రాయెల్ సైనికులతో పోరాటంలో.. తన పెద్ద కొడుకు అబూ హదీని కేవలం 18 ఏళ్ల ప్రాయంలో కోల్పోయినట్టు ది న్యూయార్క్ పోస్ట్ వెల్లడిరచింది. 1960లో జన్మించిన నస్రల్లా.. క్రిస్టియన్ ఆర్మెనియన్స్, డ్రూస్, పాలస్తీయన్లతో కలిసి బీరూట్ పేద గుడిసెల్లో గడిపాడు. ఓ కూరగాయల వ్యాపారికి తొమ్మిది మంది సంతానంలో నసరల్లా ఒకడు. ఫాతిమా హాసిన్ ను వివాహం చేసుకున్న నస్రల్లాకు నల్గురు పిల్లులు.
1978 సమయంలో సద్దాం హుస్సేన్ ప్రభుత్వం షియా కార్యకర్తలపై విరుచుకుపడుతున్నప్పుడు.. ఇరాక్ లోని నజాఫ్ సెమినరీలో మూడేళ్లపాటు మత శాస్త్రాలను అభ్యసించాడు నస్రల్లా. అదిగో ఆ సమయంలోనే తన గురువైన అబ్బాస్ అల్ ముసావీనితో నస్రల్లాకు పరిచయమేర్పడిరదనేది మిడిల్ ఈస్ట్ న్యూస్ ఏజెన్సీ కథనం.
హెజ్బొల్లా ఏర్పాటెలా జరిగింది..?
యాసర్ అరాఫత్ వంటివారు కీలకపాత్ర పోషించిన పాలస్తీయన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ను నామరూపాలలేకుండా చేసేందుకు 1980 సమయంలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. అలా పీల్వోను తరిమికొట్టి ఉంది. దానికి కక్షసాధింపు చర్యగా కొందరు కలిసి లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా 1982లో ఏర్పాటు చేసిందే హెజ్బొల్లా!
హెజ్బొల్లా పగ్గాలను 1992లో చేపట్టేకంటే ముందే.. నస్రల్లా, లెబనీస్ రెసిస్టెన్స్ రెజిమెంట్స్ నాయకులకిచ్చే ర్యాంకుల్లో టాప్ పొజిషన్ లో నిల్చాడు. అలా అపార అనుభవం సంపాదించాడు.
హెజ్బొల్లాను శక్తివంతంగా మార్చే క్రమంలో.. నస్రల్లా ఇమేజ్ ఏవిధంగా ఉపయోగపడిరది..?
అప్పటివరకూ షియా ఇస్లాం మూలాలకు మాత్రమే పరిమితమైన హెజ్బొల్లాను మొట్టమొదట శత్రువుకు శత్రువు మిత్రుడనే కోవలో.. అందరినీ దగ్గరకు తీయడం మొదలెట్టి హెజ్బొల్లా సంస్థలో ఓ కొత్త రాజకీయానికి తెరతీశాడు నస్రల్లా.
నస్రల్లా సంప్రదాయ మత మౌఢ్యుడు కాదు. ఆయనేనాడు ముస్లిం మహిళలు బురఖాలు ధరించాలన్న నియమాలను ప్రోత్సహించలేదు.
అయితే, నస్రల్లా జీవన పోరాటమంతా జెరూసలేం విముక్తి కోసమే సాగుతోంది. ఇజ్రాయెల్ వ్యవహారశైలిని కేవలం జూయిష్ దేశంగా మార్చే జియోనిస్ట్ అస్తిత్వంగా పేర్కొన్న అతను.. ముస్లింలు, యూదులు, క్రైస్తవులు సమానత్వంతో జీవించగల్గే పాలస్తీనా ఏర్పాటు కావాలన్న సంకల్పంతో ఇజ్రాయెల్ ను ఢీకొడుతున్నట్టుగా కూడా న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికలు పేర్కొన్నాయి.
చురుకైన రాజకీయ, సైనిక నాయకుడిగా హెజ్బొల్లాను లెబనాన్ సరిహద్దులు దాటి విస్తరించగల్గాడు నస్రల్లా. ప్రతీ పౌరుడూ ఓ సైనికుడిగా తయారయ్యే విధంగా తన ప్రసంగాలతో హెజ్బొల్లాను ఓ మిల్షియా తరహా ఆర్గనైజేషన్ గా తీర్చిదిద్దాడు.
2011లో సిరియా అధ్యక్షుడు బషల్ ఆల్ అస్సాద్ పాలనపై తిరుగుబాటును అణిచివేయడంలోనూ.. సన్రల్లా నేతృత్వంలోని హెజ్బొల్లా సాయం చేసింది. నాయకత్వ బాధ్యతల విషయంలో హెజ్బొల్లాలో అంతర్గతంగా తనకెదురైన సవాళ్లను కూడా ఇరాన్ సాయంతో ఛేదించాడు నస్రల్లా. 1997లో అలా నస్రల్లాకు వ్యతిరేకంగా మాజీ హెజ్బొల్లా నాయకుడైన షేక్ సుభీ తుఫైలీ తిరుగుబాటు చేస్తే.. షేక్ సుభీతో పాటు.. ఆయన అనుచరులను నిరాయుధులను చేసి.. హెజ్బొల్లాలో తనకు ఎదురులేదనిపించాడు.
ఇజ్రాయెల్‌తో యుద్ధాల తర్వాత హీరోగా మారిన నసరల్లా!
ఇజ్రాయెల్‌తో యుద్ధాలే అరబ్ ప్రపంచంలో నస్రల్లా పేరును సుస్థిరం చేశాయి. ప్రాశ్చాత్య దేశాలు కూడా చర్చించుకునేలా చేశాయి. దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ 30 ఏళ్ల ఆధిపత్యానికి గండి కొట్టి.. ఆ ఆక్రమణ నుంచి హెజ్బొల్లాను విముక్తం చేయడంలోనూ నస్రల్లాదే కీలకపాత్ర! 2006లో 34 రోజుల యుద్ధమనంతరం తాము సాధించింది దైవ విజయమంటూ ప్రకటించి మధ్య ప్రాచ్యంలో ప్రాచుర్యం పొందిన హీరో నస్రల్లా! ఆ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ కు అతి సమీపంలో ఉండే బింట్ జెబిల్ అనే ఓ పట్టణానికి చేరుకున్న నస్రల్లా.. అక్కడ తన కెరీర్ లోనే గుర్తుండిపోయే ఓ శక్తివంతమైన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు.
అదేంటంటే.. ’’ అణ్వాయుధాలున్నప్పటికీ.. ఓ సాలెగూడులాగా ఇజ్రాయెల్ పరిస్థితి బలహీనంగా ఉందంటూ పాలస్తీనాలోని అణగారిన వర్గాల్లో ఇజ్రాయెల్ ఇక ముందు కూడా తమనేమీ చేయలేదన్న భరోసా కల్పించే యత్నం చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పటికే ఇజ్రాయెల్ దాడులను నిత్యం ఎదుర్కొంటూ వేల మందిని కోల్పోతున్న దృశ్యాలను చూస్తూ పెరుగుతున్న అరబ్బుల్లో%ౌ% అపారమైన గౌరవాన్ని సంపాదించుకున్నాడు నస్రల్లా. మరోవైపు, అదే సమయంలో సౌదీ అరేబియా వంటి సున్నీల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నచోట హెజ్బొల్లా, దాని అలయెన్స్ గా ఉన్న ఇరాన్ శత్రుత్వాన్నీ కూడా మూటగట్టుకున్నాయి.
నస్రల్లా కచ్చితంగా మరణించాడంటూ జెరూసలేం పోస్ట్ ఓ విశ్లేషణ!
దశాబ్దాల కాలంగా నస్రల్లా ఓ ఫాంటమ్ లా పనిచేస్తూనే ఉన్నాడు. తిరగబడే సున్నీశక్తులకు యమకింకరుడయ్యాడు. ఇజ్రాయెల్ కు చుక్కలు చూపించి రక్తాన్ని ఏరులై పారించాడు. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ లోకి హమాస్ చొరబాటనంతరం.. హెజ్బొల్లా హమాస్ కు సపోర్ట్ గా
8 వేల రాకెట్లను ప్రయోగించింది. దాంతో ఉత్తర ఇజ్రాయెల్ భాగం నుంచి బలవంతంగా ఇజ్రాయెల్ తమ పౌరులను తరలించాల్సిన పరిస్థితేర్పడిరది.
అయితే, మొన్న ఆగస్టులో వరుస పేజర్, వాకీటాక్స్ పేలుళ్లతో ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లా కమ్యూనికేషన్ నెట్ వర్క్ కే దెబ్బ కొట్టింది. వేలాది మంది యోధులు ఇప్పుడు నిర్వీర్యమైపోయారు. ఒక వారం రోజుల్లో నల్గురు సీనియర్ హెజ్బొల్లా నాయకులను లేపేసిన ఇజ్రాయెల్.. ఇక ఏకంగా
బీరూట్ లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయాలపైనే దాడులకు తెరతీసింది. ఆ ప్రధాన కార్యాలయాల్లోని బంకర్స్ లోనే ఎక్కడో ఓచోట నస్రల్లా ఉండిఉంటాడని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. అయితే, నస్రల్లా మరణం నీడ పడని చోటే ఇంకా సురక్షితంగా ఉన్నాడా.. లేక, ఇజ్రాయెల్ చెబుతున్నట్టుగా చనిపోయాడా అన్నది ఇప్పటికైతే మీస్టరీనే! ప్రస్తుతానికైతే సుదీర్ఘ పోరాటంలో నస్రల్లా నేతృత్వంలోని హెజ్బొల్లా అసిత్వానికే ఎదురైన అతి పెద్ద సవాల్ ఇది. అంతకుమించి పొంచి ఉన్న పెను ప్రమాదం!
- రమణ కొంటికర్ల
Comments