top of page

ఇట్టా అయితే ఎట్టా సచ్చేది ‘బాబు’!

Writer: NVS PRASADNVS PRASAD
  • 20 శాతం కమీషన్‌ ఇవ్వాలని తీర్మానాలు

  • కడపలో సమావేశమైన కార్యవర్గం

  • 14లోగా తేల్చకపోతే స్టాక్‌ లిఫ్ట్‌ చేయలేమంటున్న వ్యాపారులు

  • తెలంగాణతో పోలిక పెడుతున్న ప్రభుత్వం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రైవేటీకరించిన తర్వాత 20 శాతం కమీషన్‌ వస్తుందని భావించి ఒక్కొక్కరు 25కు తక్కువ లేకుండా దరఖాస్తులు వేసి రూ.50 లక్షలు కేవలం లక్కీడ్రాలో పాల్గోడానికే ఖర్చు చేసి, ఆ తర్వాత రూ.65 లక్షలు లైసెన్స్‌ ఫీజు చెల్లించి వ్యాపారాల్లోకి దిగినవారు ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు గింగిరాలు తిరిగిపోతున్నారు. ఇలా అయితే మరి వ్యాపారాలు చేయలేమంటూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఈమేరకు రెండు రోజుల క్రితం కడపలో వైన్‌షాపులు, బార్ల యజమానులు మద్యం అమ్మకాల కమీషన్‌పై చర్చించారు. మద్యం షాపుల టెండర్లకు ముందు ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం కమీషన్‌ ఇస్తే తప్ప షాపులు నడపలేమంటూ స్పష్టం చేశారు. రెండు నెలలకు కట్టాల్సిన ఫీజులు ముందుగానే వసూలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. టెండరు సమయంలో ప్రభుత్వం ఇస్తామన్న కమీషన్‌ ఇవ్వాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 9.5 శాతం కమీషన్‌ను మార్చాలని నిర్ణయించారు. ఈ నెల 14 లోపు కమీషన్‌ పెంపుపై నిర్ణయం తీసుకోపోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా జనవరిలో కట్టాల్సిన లైసెన్స్‌ ఫీజులు కూడా కట్టలేమని తీర్మానించారు. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయడం వల్ల బాగా నష్టపోయామని భావించిన అనేకమంది వ్యాపారులు ఈసారి పోటీపడి మరీ రూ.2 లక్షలు అప్లికేషన్‌ కొని వేల సంఖ్యలో వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 85 వేల అప్లికేషన్లు వచ్చాయి. ప్రభుత్వం మంజూరుచేసిన షాపుల నిష్పత్తితో పోలిస్తే ఒక్కో షాపునకు 55 దరఖాస్తులు పడినట్టు అర్థమవుతుంది. రూ.1.10 కోట్లు ఒక్క షాపునకే అప్లికేషన్‌ ఫీజు కింద వేసినట్టు భావించాలి. గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు 20 శాతం కమీషన్‌ అని ప్రకటించిన ప్రభుత్వం అనేక పన్నుల పేరుతో కోత విధించి సగటున 9.5 శాతం కిట్టేటట్టు చేస్తుంది. ఇదేమని ప్రశ్నిస్తే తెలంగాణలో లైసెన్స్‌ ఫీజు రూ.1.10 కోట్లు ఉందని, అక్కడ 15 శాతం కమీషన్‌ ఇస్తున్నారని, ఆంధ్రాలో మాత్రం మున్సిపాలిటీల్లో రూ.65 లక్షలు లైసెన్స్‌ ఫీజు పెట్టి 20 శాతం కమీషన్‌ ఎలా ఇస్తామని దబాయిస్తున్నట్లు భోగట్టా. రాష్ట్రవ్యాప్తంగా వైన్‌షాపులకు 1 శాతం కమీషన్‌ పెంచితే ప్రభుత్వానికి ఏడాదికి రూ.300 కోట్లు నష్టం వస్తుందని లెక్క. అటువంటిది 20 శాతం పెంచాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఒప్పుకోదని తెలుస్తుంది. తెలంగాణతో ఆంధ్రాకు పోలిక లేదని, హైదరాబాద్‌ సిటీలో ఒక షాపు అమ్మిన మద్యాన్ని శ్రీకాకుళం టౌన్‌లో ఉన్న షాపులన్నీ కలిపి కూడా అమ్మలేవని వ్యాపారస్తులు చెబుతున్నారు. అలాగే అక్కడ పర్మిట్‌ రూమ్‌లు ఉన్నాయని, ఇక్కడ మాత్రం షాపు పక్కన తాగుతున్నా పోలీసులు తీసుకెళ్లి జైలుశిక్ష వేయిస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. తెలంగాణలో లైసెన్స్‌ ఫీజు మీద 10 రెట్లు ఎక్కువ స్టాకు తీసుకునే వెసులుబాటు ఉందని, ఇక్కడ అలా లేదని చెబుతున్నారు. ఒకవేశ ఆ సదుపాయం ఇచ్చినా రూ.65 లక్షలు లైసెన్స్‌ ఫీజుకు రూ.6.50 కోట్ల సరుకును లిఫ్ట్‌ చేసేంత వ్యాపారం లేదని చెబుతున్నారు. ఒకవేళ లైసెన్స్‌ ఫీజు మీద 10 రెట్లు ఎక్కువ తీసుకున్నా, ఆమేరకు కమీషన్‌ ఇవ్వరని, ప్రస్తుతం ఉన్నదానికంటే తక్కువ ఇస్తారని, అటువంటప్పుడు అంత సరుకు లిఫ్ట్‌ చేయడానికి అప్పులు తీసుకురావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం వైన్‌షాపులు మూసేస్తే సంబంధిత యాజమాన్యం మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకే షాపులు మూస్తామని చెప్పకుండా సరుకును లిఫ్ట్‌ చేయమని వార్నింగ్‌ ఇస్తున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున నష్టం వస్తుంది. ఎందుకంటే.. రూ.100 ఉన్న ఒక క్వార్టర్‌ బాటిల్‌లో రూ.10 డిస్టలరీస్‌కు, రూ.10 షాపు యజమానికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక మిగిలిన రూ.80 ప్రభుత్వ ఖజానాకే వెళ్తుంది. ఇప్పుడు స్టాకు లిఫ్ట్‌ చేయకపోతే డిస్టలరీకో, షాపునకో వచ్చిన నష్టం చెరో రూ.10 మాత్రమే. కానీ ప్రభుత్వానికి మాత్రం రూ.80 పోతుంది. అసలే వ్యాపారాలు లేవని, తెచ్చిన అప్పునకు వడ్డీలు కూడా రావడంలేదని గగ్గోలు పెడుతున్న వైన్స్‌ షాపుల యజమానుల నెత్తి మీద చంద్రబాబు రెండు రోజులకో పిడుగు వేస్తున్నారు. బెల్టుషాపులు నడిపితే రూ.5 లక్షలు ఫైన్‌ వేస్తామని, రెండోసారి దొరికితే లైసెన్స్‌ రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. షాపుల్లో వ్యాపారం లేక, గ్రామాల్లో బెల్టులకు ఇవ్వకుండా ఉండలేక ఎక్సైజ్‌ శాఖను మద్యం వ్యాపారులు పోషిస్తున్నారు. గతంలో కూడా జగన్మోహన్‌రెడ్డి తన పాలనలో అసలు బెల్టుషాపే లేదని అసెంబ్లీలో ప్రకటించడం కోసం ఒక్క కేసును కూడా బెల్టు పేరుతో నమోదు చేయలేదు. ఒకవైపు పర్మిట్‌ రూమ్‌లు లేకపోవడంతో వేరేచోట తాగుతున్నవారిని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు జైలులో వేసేస్తున్నారు. తెలంగాణ మాదిరిగా కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో కూర్చుని తాగే లైసెన్స్‌, సంస్కృతి ఆంధ్రాలో పెద్దగా ఉండదు. దీనివల్ల షాపులో కొనుగోలు చేసిన బాటిల్‌ను ఏ సందులోనో తాగుతుంటే నెత్తిమీద డ్రోన్‌ ఎగరేసి మరీ పోలీసులు పట్టుకుపోతున్నారు. ఏప్రిల్‌ 14 లోపు తమ 20 శాతం కమీషన్‌ ఇవ్వకపోతే స్టాక్‌ లిఫ్ట్‌ చేయమన్న వైన్‌షాపు యజమానుల సంఘం ఇదే పట్టు మీద ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే.. ఈ సంఘానికి చాలా సంవత్సరాల నుంచి ఎన్నికలే జరగలేదు. ప్రస్తుతం ఉన్న కార్యవర్గం తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనదే అన్న వాదన కూడా ఉంది. అందుకే మధ్యేమార్గంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి 15 శాతం కమీషన్‌కు ప్రభుత్వం అంగీకరించే విధంగా ఒప్పందం కుదురుతున్నట్టు తెలుస్తుంది. బెల్టుషాపులు తెరిస్తే సహించేది లేదని చంద్రబాబు చెబుతున్నా జిల్లాలో ఎక్కడా 182 షాపుల పరిధిలో బెల్టు లేకుండాలేదు. ఇందుకు కారణం.. షాపుల్లో వ్యాపారం లేకపోవడం, గతంలో ఇదే విధానాన్ని అవలంభించడం. చివరకు జగనన్న కాలనీలో నిర్మించిన ఇంటిలో కూడా కొన్నిచోట్ల వైన్‌షాపులు, మరికొన్ని చోట్ల బెల్టుషాపులు నిర్వహిస్తుండటం విశేషం.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page