top of page

ఇటు వెంచర్లు.. అటు తవ్వకాలు!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Feb 11
  • 3 min read
  • పలాసలో రెచ్చిపోతున్న అక్రమార్కులు

  • కొందరు కొండల తవ్వకాల్లో బిజీ

  • ఇంకొందరు చెరువులు, కాలువల కబ్జాలు

  • జిల్లా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న స్థానిక సిబ్బంది

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

పలాసలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, చెరువుల ఆక్రమణలపై అందిన ఫిర్యాదులపై పరిశీలనకు వెళ్తే స్థానిక అధికారులు నల్లబొడ్డూరు కొండ వద్దకు తీసుకువెళ్లి చూపిస్తారు. అక్రమ తవ్వకాలకు, ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ స్వయంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కలెక్టర్, జేసీలకు ఫిర్యాదు చేయడంతోపాటు అక్రమాలు జరుగుతున్న ప్రాంతాల్లో తనిఖీలకు ఏర్పాట్లు చేసినప్పుడు కూడా స్థానిక అధికారులు నల్లబొడ్డూరు కొండకే తీసుకువెళ్తారు.

.. ఆక్రమణలపై ఫిర్యాదు అనగానే.. నల్లబొడ్డూరు కొండ తప్ప మరో ప్రాంతాన్ని చూపించడానికి పలాస`కాశీబుగ్గ అధికారులు ఎందుకు వణికిపోతున్నారు? స్థానిక ఎమ్మెల్యేను, జిల్లా కలెక్టర్, జేసీలను ఎందుకు తప్ప్పుదోవ పట్టిస్తున్నారు? ఇందులో ఉన్న మతలబులపై ‘సత్యం’ అందిస్తున్న సమగ్ర కథనం.

నల్లబొడ్డూరే దిష్టిబొమ్మ!

పలాసలో ప్రభుత్వ భూములు, సహజ వనరులు దోపిడీ చేసి కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటున్నారు. దీనిపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. కాకపోతే అక్రమాలకు పాల్పడుతున్నది వారని వీరు.. వీరని వారు ప్రచారం చేస్తుంటారంతే.! ఈ దోపిడీ ఎంత నిజమో తెలియజెప్పే ఉదాహరణే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, సీఎంవోకు జనసేన నాయకులు చేసిన ఫిర్యాదు. సీఎంవో ఆదేశాలతో కలెక్టర్, జేసీ, తదితర అధికారులు స్థానిక ఎమ్మెల్యే శిరీషను వెంటబెట్టుకొని ఆ ప్రాంతంలో పర్యటించారు. కానీ ఆక్రమణలకు గురైన జగన్నాధ సాగరం చెరువు గర్భంలో ఉన్న నిర్మాణాల తొలగింపు కార్యక్రమానికి ముహూర్తపు షాట్ మాత్రమే కొట్టి వెళ్లిపోయారు. కలెక్టర్, జేసీ వంటి జిల్లా అధికారులు పర్యటనకు వచ్చినా ఇరిగేషన్ అధికారులు గైర్హాజరు కావడం దీనికి ప్రధాన కారణం. నియోజకవర్గ పరిధిలో గ్రావెల్ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కొండలను తవ్వి తరలించుకుపోతున్నారు. దీన్ని పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్, జేసీలను నల్లబొడ్డూరు కొండ వద్దకు తీసుకువెళ్లారు. దాన్ని పరిశీలించి వారు వెళ్లిపోయారు. గ్రావెల్ అక్రమాలపై ఫిర్యాదులు వచ్చిన ప్రతిసారీ అధికారులను నల్లబొడ్డూరు కొండకు తీసుకువెళ్లి చూపించడం మైనింగ్, రెవెన్యూ అధికారులతో పాటు అధికార పార్టీ నాయకులకు పరిపాటిగా మారింది. అంతకుమించి దోపిడీకి గురవుతున్న బెండి, రాజగోపాలపురం, కేదారి తదితర కొండలను చూపించడానికి వారు సాహసించడం లేదు. నీటిపారుదల శాఖకు చెందిన కాలువలు, చెరువులు కబ్జాకు గురువుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నా ఇరిగేషన్ అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలాస మండలం ఉదయపురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 221/13లో ఉన్న వ్యవసాయ భూమిలో రియల్ వెంచర్ వేశారు. దానికి సమీపంలోని సీతమ్మగుడి వద్ద ఇరిగేషన్ కాలువ గట్టును ఒక వార్డు కౌన్సిలర్ లేఅవుట్ రోడ్డుగా మార్చి వెంచర్ వేశారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేసినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదు.

అధికారులే కాంట్రాక్టర్లు

నియోజకవర్గంలో చేపట్టే ఇరిగేషన్ పనులకు ఆ శాఖ అధికారులే కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నీటి సంఘాల ప్రతినిధులు చేయాల్సిన పనులను ఇరిగేషన్ అధికారులే చేస్తున్నట్లు తెలిసింది. బిల్లులు సకాలంలో రావని, పనులు చేస్తే నష్టపోతారని చెప్పి కాలువల మరమ్మతు పనులు చేయకుండా నీటి సంఘాలను అడ్డుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిసింది. స్థానిక ఇరిగేషన్ అధికారుల్లో చాలామంది వైకాపా హయాం నుంచి కొనసాగుతున్నారు. ఆ ప్రభుత్వ హయాంలో పనులను ఎం బుక్‌లో నమోదు చేయకుండా, సకాలంలో బిల్లులు పాస్ చేయకుండా ఇబ్బంది పెట్టిన ఉదంతాలు ఉన్నాయని నీటి సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికీ అదే ఇరిగేషన్ అధికారుల తీరు మారలేదంటున్నారు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పరిధిలో కొన్ని నిర్మాణ పనులను ఇరిగేషన్ అధికారులే చేపట్టి రూ.50 లక్షలు డ్రా చేశారని ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఇరిగేషన్ కాలువలు ఆక్రమణలకు గురైనా తమకు సంuంధం లేనట్టే వ్యవహరిస్తున్నారు.

బోర్డులు ఓకే.. బాధ్యులేరి?

మూడేళ్ల క్రితం ఇద్దరు టీడీపీ నాయకుల స్వాధీనంలో ఉన్న పద్మనాభపురం రెవెన్యూ సర్వే నెంబర్ 362/5లో ఉన్న ఇరిగేషన్ కాలువకు చెందిన 2.30 సెంట్లలో ఆక్రమణలను జేసీబీలతో టెక్కలి సబ్ కలెక్టర్ దగ్గరుండి తొలగించి హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. కానీ ఆ బోర్డును తర్వాత ఆక్రమణదారులు తొలగించారు. దీంతోపాటు తాళభద్ర, పెంటభద్ర రెవెన్యూ పరిధిలో ఆక్రమణలను కూడా తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. అయినా ఆక్రమణదారులు వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పంథాను ఆక్రమణదారులు కొనసాగిస్తున్నారు. ఇటీవల కలెక్టర్, జేసీలు పురుషోత్తపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 51ని పరిశీలించి ఆక్రమణలపై ఆరా తీశారు. పొంతన లేని సమాధానాలు ఇచ్చిన స్థానిక రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆక్రమణదారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్రమణలను తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయినా అధికారుల్లో మార్పు రాలేదు. భూముల ధరలు కోట్లలో ఉండటంతో ఆక్రమణదారులు సమీపంలోని కాశీబుగ్గ, పద్మనాభపురం పరిధిలోని సర్వే నెంబర్లు 234, 395 వేసి ప్రభుత్వ భూములను జిరాయితీగా చూపించి విక్రయిస్తున్నారు. సర్వే నెంబర్ 51లో 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో 70 శాతం ఆక్రమణలకు గురైంది. ఇటీవల కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి కలెక్టర్ 12 ఎకరాలు కేటాయించారు. దీనికోసం వైకాపా నాయకులు స్వాధీనంలో ఉన్న భూమిలో ఆక్రమణలు, ఇళ్లను పోలీసులు సహాయంతో తొలగించారు. దీనికి సమీపంలో టీడీపీ నాయకుడి ఆక్రమణలో ఉన్న 2.50 ఎకరాల భూమి జోలికి వెళ్లలేదని విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ అధికారుల చర్యలపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్వాధీనంలో ఉన్న భూమిలో 44 పేదల ఇళ్లు తొలగించారని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ వివాదం విచారణలో ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page