ఆ ముగ్గురి గతం.. ఓ భూమి బాగోతం
అదే ఒకప్పుడు వారిని వ్యాపార బంధంతో కలిపింది
తర్వాత వివాదమై విడగొట్టి శత్రువులుగా మార్చింది
ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా నిలబెట్టింది
ఆ ముగ్గురే ఇప్పుడు మూడు పార్టీల నుంచి తెరపైకి
ఎచ్చెర్లలో నేరుగా తలపడుతున్న గొర్లె కిరణ్, ఎన్‌ఈఆర్
కిరణ్.. ఎన్‌ఈఆర్.. ఎంజీఆర్.. ఓ భూమి కథా చిత్రం. ఇది కొత్తగా వస్తున్న సినిమా టైటిల్ కాదు. రణస్థలం మండలం పతివాడపాలెం వద్ద స్థిరాస్తి వ్యాపారం చేసి ఆ తర్వాత వ్యాపార శత్రువులుగా.. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారిన ముగ్గురి వ్యక్తుల కథ.
గొర్లె కిరణ్‌కుమార్.. ఎచ్చెర్ల సిటింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత వైకాపా అభ్యర్థి
నడికుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్).. ఎచ్చెర్ల ఎన్డీయే కూటమి అభ్యర్థి
మామిడి గోవిందరావు (ఎంజీఆర్).. పాతపట్నం ఎన్డీయే కూటమి అభ్యర్థి
ఈ ముగ్గురివీ మూడు పార్టీలు. కానీ వీరి గతం ఒకే భూమి కథతో ముడిపడి ఉంది. ఒకప్పుడు వ్యాపార భాగస్వాములుగా మెలిగిన ఈ మూడు పార్టీల నేతలు ప్రస్తుత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులయ్యారు. రాజకీయాలకు పార్టీలుండాలి గానీ.. వ్యాపారానికి డబ్బులుంటే చాలన్న సిద్ధాంతం ఈ ముగ్గురిది. అయితే ఈ భూమి కథలోనే లాభాలు, అందులోనే వైరాలు ఉండటం వల్ల ఇప్పుడు దీన్ని ప్రస్తావించుకోవాల్సిన సందర్భం వచ్చింది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి గొర్లె కిరణ్‌కుమార్ వైకాపా ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడే ఎన్‌ఈఆర్ అనే నడికుదిటి ఈశ్వరరావు బీజేపీ నుంచి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో గొర్లె కిరణ్‌కుమార్‌కు ఆయనే ప్రత్యర్థి అవుతారని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. తెలుగుదేశం అధికారంలో ఉన్న 2014`19 మధ్యకాలంలో వైకాపా నేతలను వేధించారని ఆరోపణలు ఎదుర్కొన్న ఎన్‌ఈఆర్‌కు ఆ తర్వాత కాలంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా గొర్లె కిరణ్‌కుమార్ అండదండలు అందించారన్న ఫిర్యాదు వెనుక ఈ భూమి కథే ఉంది. ఆ భూమి రణస్థలం మండలం పతివాడపాలెం పరిధిలోది కాబట్టి.. అది ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోనిది కాబట్టి గొర్లె కిరణ్‌కుమార్‌కు, ఎన్‌ఈఆర్‌కు మధ్య కథ నడిచిందంటే అర్థముంది. ఇందులో పాతపట్నం నియోజకవర్గానికి చెందిన ఎంజీఆర్ ఎక్కడ కలిశారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
రోడ్డు పేరుతో భూ లావాదేవీలు

అది ఫెయిర్ ల్యాండా, ఎల్‌సీ ల్యాండా, వివాదాస్పదమైన భూమా? అన్న విషయాలు కాసేపు పక్కన పెట్టి అసలు ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కోసం కొద్దిసేపు ముచ్చటించుకుందాం. నడికుదిటి ఈశ్వరరావు పతివాడపాలెం వద్ద 75 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీనికి సరైన రోడ్డు మార్గం లేదు. రోడ్డు వేయడానికి రైతుల భూములు అడిగితే ఇవ్వలేదు. ఇక మిగిలింది డి`పట్టాలు, ల్యాండ్ సీలింగ్ భూములే. వీటి మీద నుంచి రోడ్డు నిర్మించి జాతీయ రహదారికి కనెక్టివిటీ ఇవ్వాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అండ అవసరమని ఎన్‌ఈఆర్ భావించారు. ఆ మేరకు మంతనాలు జరిగాయి. ఎన్‌ఈఆర్ కొనుగోలు చేసిన భూమిలో 52 ఎకరాలు ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం అమల్లో ఉండగనే అందులో 30 ఎకరాలను ే ఎన్‌ఈఆర్ ద్వారా వేరే రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు అమ్మేశారు. ఈ గ్రూపులో ఒక వాటాదారుడే ఇప్పుడు పాతపట్నం ఎన్డీయే కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు. ఈమేరకు రియల్ ఎస్టేట్ సంస్థ ఎన్‌ఈఆర్‌కు డబ్బులు చెల్లించేసింది. ఇప్పుడు ఎమ్మెల్యే వద్ద మిగిలిన 22 ఎకరాలకు సంబంధించి రూ.70 లక్షల వరకు ఎన్‌ఈఆర్‌కు చెక్కులు ఇచ్చారు. ఇందులో రూ.16 లక్షల లావాదేవీల విషయంలో ఎన్‌ఈఆర్, గొర్లె కిరణ్‌కుమార్ మధ్య పొరపొచ్ఛాలు వచ్చాయి. దాంతో ఎన్‌ఈఆర్ నేరుగా గొర్లె కిరణ్‌కుమార్ డిఫాల్టర్‌గా మారారని, ఆయన పేరుతో చేసిన భూముల రిజిస్ట్రేషన్ చెల్లదంటూ లాయర్ ద్వారా పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు.
ఆ ఇద్దరే ఇప్పుడు ప్రత్యర్థులు

వాస్తవానికి మామిడి గోవిందరావు తనకు రూ.16 లక్షలు ఇవ్వాలని, ఆ సొమ్మును ఆయన ఎన్‌ఈఆర్‌కు ఇచ్చేశారని గొర్లె కిరణ్ భావించగా, ఎంజీఆర్ తనకు వేరే భూమి విషయంలో డబ్బులు బాకీ ఉన్నందున దానికి ఆ సొమ్ము జమ చేసుకున్నానని ఎన్‌ఈఆర్ వాదిస్తున్నారు. అందువల్ల తనకు కిరణ్‌కుమార్ డబ్బులు చెల్లించాలంటూ నోటీసులిచ్చారు. ఈ వివాదంతో ఇద్దరి మధ్య కొంతకాలం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నడిచింది. ఆ తర్వాత మధ్యవర్తుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకున్నారు. ఈ భూమి చుట్టూ తిరిగిన కథలో రియల్ ఎస్టేట్ సంస్థలో మిగిలిన భాగస్వాములంతా ఫెయిర్‌గానే డీల్ చేశారు. ఎంజీఆర్, ఎన్‌ఈఆర్, గొర్లె కిరణ్‌కుమార్‌ల మధ్యే భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ ముగ్గురికే ప్రధాన పార్టీల టిక్కెట్లు దక్కడం.. అందులో గొర్లె కిరణ్, ఎన్‌ఈఆర్ ఎచ్చెర్ల నియోజకవర్గ బరిలో నేరుగా నేరుగా తలపడుతుండటం విశేషం.
Kommentarer