top of page

ఇదే ‘మెయిన్‌’ అనుకోకండి!

Writer: NVS PRASADNVS PRASAD

 సీహెచ్‌ దుర్గాప్రసాద్‌


రేపు మావాడి అసలు పరీక్ష.. తెల్లవారి మార్నింగ్‌ వాక్‌లో ఓ తండ్రి ఆవేదన.

మా అమ్మాయి మ్యాథ్స్‌లో ఫర్వాలేదు కానీ.. ఫిజిక్స్‌తోనే కాస్త ప్రాబ్లెమ్‌. ఏం చేస్తుందో ఏమో..!?

పండగ సెలవుల్లో పుస్తకం పక్కన పడేశాడు. మావాడి ర్యాంక్‌పై నాకు డౌటే.. ఇది మరో తండ్రి నిట్టూర్పు.

పరీక్ష సెంటర్‌ మా ఊర్లో పెట్టాలి అనుకున్నా కానీ.. వాడి కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు.. ఇంకో తండ్రి అర్థం లేని ఆరోపణ.

విశేషం ఏంటంటే.. రేపటి నుంచి ఐఐటి, ఎన్‌ఐటిల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు ఉద్దేశించిన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్స్‌ జరగడమే. ఈ పరీక్షలు పిల్లలకు సంబంధించినవే అయినా వారికన్నా పెద్ద పరీక్ష వారి తల్లిదండ్రులకే. ఇప్పుడు రాయబోతున్న పిల్లల్లో దాదాపు సగానికి పైగా వారి ఐదో తరగతిలోనే ఈ దిక్కుమాలిన ఐఐటి ఫౌండేషన్‌ కోర్సుల్లో చేరి ఉంటారు. ఏళ్ల తరబడి హాస్టళ్లలో మగ్గిపోయిన పిల్లలు ఎందరో. వారికి లక్షల్లో ఫీజులు కట్టిన తండ్రులు ఇంకెందరో. బహుశా ఇంతలా యాతన పడిన తండ్రుల తరం ముందు ఎప్పుడూ ఉండి ఉండదు. కార్పొరేట్‌ కాలేజీల గేట్లు దగ్గర వేలాడుతూ మావాడు ఎలా చదువుతున్నాడో అని కిటికీ సందులోంచి చూసిన తండ్రిని ఏమనుకోవాలి. మీకు ఒకసారి చెబితే వినబడదా, ఇది విజిటింగ్‌ అవర్‌ కాదు అని సెక్యూరిటీ గార్డు భుజం మీద చేయి వేసి తోస్తే ఇది మావాడి కోసమే కదా అని సరిపెట్టుకున్న పెద్దాయన్ని చూసి నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్థితి. మా అమ్మాయి ఫీజు కట్టడానికి మూడు గంటలు లైన్‌లో నిలబడాలని గొప్పలు పోయే తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. మావాడు మంచి ర్యాంకు కొడితే ఈ కష్టాలు, అవమానాలు అన్నీ మర్చిపోవచ్చు అని సర్డుకుపోవడమే చివరకు మిగిలేది.

సరే ఇక విషయానికి వద్దాం. ఇది పిల్లల కోసం రాస్తున్న వ్యాసం కాదు.. కేవలం పిల్లల కోసం పిచ్చెక్కిపోయి, మానసికంగా పిల్లల కోసం విపరీతంగా ఒత్తిడికి గురవుతున్న పేరెంట్స్‌ కోసం. మీకు ఒక వాస్తవం తెలియాలి. కరోనా తర్వాత పిల్లల ఆటిట్యూడ్‌ పూర్తిగా మారిపోయింది. మీరు పడిన ఒత్తిడిలో సగం కూడా వాడు హాస్టల్‌లో పడడం లేదు. వాడికి తెలుసు.. మంచి ర్యాంక్‌ రాకపోతే మరో రూ.25 లక్షలు పోసి వాడ్ని ఏ ప్రైవేటు యూనివర్సిటీలోనో మీరు జాయిన్‌ చేస్తారని. మీ ఆస్తిపాస్తులు మీకన్నా ఎక్కువ వాడికే తెలుసు. ఇక వాడి కాలేజీలో కూడా ప్రైవేటు యూనివర్సిటీల ప్రమోషన్‌ విపరీతంగా జరుగుతుంది. ఇక మీరు చేయాల్సిందల్లా సాధ్యమైన వరకు ప్రైవేటు వర్సిటీల జోలికి వెళ్లకండి. మిమ్మల్ని చాలామంది ప్రోత్సహిస్తారు. బహుశా వారి అమ్మాయో, అబ్బాయో అక్కడ ఉండి ఉంటారు. ఇది షేర్‌ మార్కెట్‌ తరహా బిజినెస్‌. నష్టం ఎవడూ చెప్పడు. మెయిన్స్‌లో ఒక తరహా ర్యాంక్‌ రాదు అనుకున్నప్పుడు ఈ నెల నుంచి అనేక పరీక్షలకు నోటిఫికేషన్స్‌ వస్తాయి. అప్లై చేయమని చెప్పండి. సగానికి పైగా ఎన్‌ఐటిల కన్నా ఇవి అనేక రెట్లు మెరుగైనవి. సెంట్రల్‌ యూనివర్సిటీ, ఇఫ్లు, ఐజర్‌, నైజర్‌, మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాటస్టిక్స్‌, ఇప్మాట్‌, జిప్మాట్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఇలా ఎన్నో.. కనీసం ఒక పది ప్రభుత్వ రంగంలో ఉన్న ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించే ఎంట్రెన్స్‌ పరీక్షలు రాయించండి. మీ వీధిలో ఇంకో ఇంజినీర్ను తయారుచేస్తారో, లేదా భిన్నంగా మరో ప్రొఫషన్‌లో చేర్పించి మార్గదర్శకులు అవుతారో నిర్ణయించుకోండి. దయచేసి గతంలో వారి పిల్లల్ని జాయిన్‌ చేసిన ఇన్‌స్టిట్యూట్‌ గురించి మాత్రం వారిని అడగకండి.. నిజం చెప్తే ఒట్టు!

అందరూ సుందర్‌ పిచాయ్‌లు కాలేరు..

మన దేశంలో ఐఐటీ అనగానే పక్క రాష్ట్ర నుంచి వెళ్లి గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయే మనకు కనిపిస్తాడు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితుల వల్ల ప్రతిష్టాత్మకమైన ముంబయి, కాన్పూర్‌, ఢల్లీి, ఖరగ్‌పూర్‌, చెన్నై వంటి క్యాంపస్‌లలో ఐఐటీ చదివిన మెరిట్‌ స్టూడెంట్లకు సైతం గత కొన్నేళ్లుగా ఉద్యోగాలు రావడంలేదు. కేవలం ఐఐటీల్లో 15 నుంచి 30 శాతం మాత్రమే మంచి ఉద్యోగాలను పొందగలుగుతున్నారు. ఇక కోటి రూపాయల ప్యాకేజీతో ఉద్యోగానికి పట్టుకెళ్లడమనేది కలగా మారిపోయింది. గడిచిన విద్యాసంవత్సరంలో 38 శాతం ఐఐటీ పూర్తిచేసినవారికి ఉద్యోగాలే రాలేదు. ఈ విషయాన్ని ఏ కోచింగ్‌ సెంటరూ, ఏ యూనివర్సిటీలు చెప్పవు. ఒకప్పుడు ప్రీ ప్లేస్‌మెంట్‌ పేరుతో ఐఐటీ చదువుతుండగానే ఇంటర్న్‌షిప్‌ తమ దేశంలో చేసి ఆ తర్వాత ఆకర్షణీయమైన ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తామని ఒప్పందం చేసుకున్న విదేశీ కంపెనీలు ఇప్పుడు అటువైపు చూడటంలేదు సరికదా.. ఐఐటీల్లో క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు వచ్చి సెలక్ట్‌ అయ్యారంటూ కాల్‌లెటర్‌ ఇచ్చి కూడా జాబ్‌లోకి తీసుకోని సంఘటనలు కోకొల్లలు. ఐఐటీ అనగానే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, మెటా ఏఐ, జీఈ వంటి సంస్థల్లో తమ పిల్లలకు ఉద్యోగావకాశాలు వస్తాయని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ వెస్ట్రన్‌ కంట్రీస్‌లో ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉంది. ఉన్న ఉద్యోగుల్నే పీకేస్తున్నారు. ఇండియాలో అంత స్థాయిలో ఆర్థికమాంద్యం లేకపోయినా ఇక్కడ పని చేయడాన్ని ఐఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నతనంగా భావిస్తున్నారు. వందమంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో కేవలం ఒక్క శాతం మాత్రమే ఐఐటీలకు వెళ్తున్నారు. మిగిలిన 99 శాతం మందిని ఇక్కడ తల్లిదండ్రులు నలిపేస్తున్నారు. ఈ ఒక్క శాతంలో 8 నుంచి 9మంది మాత్రమే పెద్ద కంపెనీలకు గత కొన్నేళ్లుగా సెలక్ట్‌ అవుతున్నారు. వీటన్నింటినీ తెలుసోకపోవడం వల్ల జేఈఈ మెయిన్స్‌ మాత్రమే జీవితంలో మెయిన్‌ అనుకొని తల్లిదండ్రులు అనుభవిస్తున్న స్ట్రెస్‌కు ఏ మందేస్తే సరిపోతుందో డాక్టర్లకు కూడా అర్థం కావడంలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page