ఇది వంశీ కళాఖండం!!
- Guest Writer
- Jun 10
- 2 min read

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా, మిలమిల మెరిసిన తార మిన్నులు వీడిన సితార.‘ల’లను నర్తింపచేసారు వేటూరి . కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి. వెన్నెల పైట వేయటం!! అలా పైట వేయించటం వేటూరికే సాధ్యం. సాగరసంగమం కోసం వ్రాసుకున్నారట. ఈ సితార సినిమాలో తళుక్కమంది.
శంకరాభరణం, సాగరసంగమం వంటి కళాఖండాలు తీసిన ఏడిద నాగేశ్వరరావు గారి పూర్ణోదయా బేనరుపై వచ్చిన ఈ సితార సినిమా మరో క్లాసిక్‌గా నిలిచిపోయింది. సంగీత సాహిత్య నాట్య సమ్మిళితం ఈ సితార. వేటూరి పాటలు, ఇళయరాజా సంగీతం, యం వి రఘు ఫొటోగ్రఫీ, శేషు నృత్య దర్శకత్వం, వంశీ సృజనాత్మక దర్శకత్వం, భానుప్రియ కళ్ళు, నవ్వు, నాట్య ప్రావీణ్యత సినిమాను ఓ మ్యూజికల్ విజువల్ స్ప్లెండర్‌గా తీర్చిదిద్దాయి.
చతుర నిర్వహించిన నవలల పోటీలలో బహుమతి పొందిన వంశీ రచించిన మహల్లో కోకిల నవల ఆధారంగా ఈ సినిమాను తీసారు. వంశీకి ఇది రెండో సినిమా. అద్భుతంగా చిత్రీకరించారు. బాపుGవిశ్వనాధ్ R వంశీ. బాపు లాగా ప్రకృతే కేన్వాసుగా, విశ్వనాథ్ లాగా సంగీత సాహిత్య నాట్యాలను మిళితం చేసి, ఓ గొప్ప సినర్జీని వండారు.
స్వయంగా శాస్త్రీయ నృత్యకారిణి అయిన భానుప్రియ చేత నృత్య దర్శకుడు శేషు అద్భుతమైన నృత్యాలను చేయించాడు. మొదటి సినిమా అయినా భానుప్రియ పరిపక్వతతో నటించింది. దక్షిణ భారత చిత్ర రంగానికి లభించిన అందాల భరిణ.
ప్రధానంగా చెప్పుకోవలసింది పాటలు, నృత్యాలు. పగటి వేషగాళ్ళ బృందంలో సభ్యుడిగా రాజా గారి అంతఃపురం ముందు సుమన్ నృత్యాలు సూపర్బ్. సువర్ణతో కలిసి సుమన్ నృత్యించిన నృత్యాలు ఫ్రేంలో ఉన్నది సుమనా కమల్ హాసనా అని అనిపిస్తుంది. సాగరసంగమంలో కమల్ హాసనే గుర్తుకొస్తాడు. అర్జున మంత్రం అపురూపం అంటూ సాగే ఆ పాటను వేటూరి ఎంత గొప్పగా వ్రాసారో!
వెన్నెల్లో గోదారి అందం అది కన్నుల్లొ కన్నీటి రూపం పాట మరో గొప్ప శ్రావ్యమైన పాట. ఈ పాటకే జానకమ్మకు జాతీయ స్థాయిలో అవార్డు కూడా వచ్చింది. కుకుకూ కోకిల రావే డ్యూయెట్ సుమన్, భానుప్రియల మీద చాలా బాగుంటుంది. నీ గానం మృదుమధురం పావనం మరో శ్రావ్యమైన పాట.
ఈ సినిమా ఘనవిజయానికి ప్రధాన కారణాలు పాటలు, నృత్యాలు, లోకేషన్లు. సినిమా కధకు ఎలాంటి కోట కావాలో కరెక్టుగా అలాంటి పాతబడ్డ కోట దొరకటం కూడా కలిసొచ్చింది. వెంకటగిరి దగ్గర పాతబడ్డ కోట అట. కోటకు సంబంధించిన సీన్లన్నీ అక్కడ తీసి మిగిలిన సినిమా అంతా గోదావరి ప్రాంతంలో షూటింగ్ చేసారు.
భానుప్రియ, సుమన్ల తర్వాత అభినందించవలసింది శరత్ బాబునే. చాలా గొప్ప పాత్ర లభించింది. చినిగిపోయిన చొక్కాను, దారిద్య్రాన్ని కప్పిపుచ్చుకునేందుకే కోటు వేసుకునే బతికి చెడ్డ రాజా వారిగా, ఫ్రస్ట్రేషన్లో చిలకల్ని హింసించే సేడిస్టుగా, మంచితనాన్ని పూర్తిగా పోగొట్టుకోలేని మనిషిగా ఆత్మహత్యే కరెక్ట్ అనుకునే పాత్రలో శరత్ బాబు ప్రేక్షకులు మరచిపోలేని నటనను ప్రదర్శించాడు.
మరో ముఖ్య పాత్ర శుభలేఖ సుధాకరిది. కధానాయికకు స్నేహితుడిగా, సంరక్షకుడిగా బాగా నటించాడు. మరో ముఖ్య పాత్ర సువర్ణది. సుమన్ తో సమానంగా నర్తించింది. ఇతర పాత్రల్లో సాక్షి రంగారావు, రాళ్ళపల్లి, ప్రభాకరరెడ్డి, మల్లిఖార్జునరావు, జెవి సోమయాజులు, ప్రభృతులు నటించారు.
సినిమా విడుదలయిన మొదటి వారం పది రోజుల్లో శంకరాభరణం లాగానే నిరుత్సాహ పరిచిన ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ ప్రచారంలో ఘనవిజయం సాధించింది. 12 కేంద్రాలలో వంద రోజులు ఆడిరది. రష్యాలో కూడా రిలీజయింది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు పొందింది.
విశ్వనాథ్ కళాఖండాలయిన శంకరాభరణం, సాగరసంగమం, స్వర్ణ కమలం, సిరివెన్నెల సినిమాల సరసన పీట లభించింది ఈ సితారకు. బహుశా మాతరంలో చూడనివారు ఎవరూ ఉండరు. ఈతరంలో ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి ఈ శ్రవణ దృశ్య కావ్యాన్ని. యూట్యూబులో ఉంది.
- సుబ్రమణ్యం దోగిపర్తి
Коментари