ఇప్పటికింతే సంగతులు.. చిత్తగించవలెను!
- Prasad Satyam
- Apr 18
- 2 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కేంద్రంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కోసం చేపట్టాల్సిన రాజ్యాంగ సవరణ ఓటింగ్‌లో వీగిపోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది నాయకులకు ఆశాభంగం ఎదురైంది. 2027లో జనగణన పూర్తయి లెక్కలు తేలేవరకు నియోజకవర్గాల పునర్విభజన ఊసెత్తక్కర్లేదు. అంతవరకు ఆశావహులు ఎదురుచూడాల్సిందే. ఎన్డీయే ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం బిల్లు తేవడానికి చట్టసవరణ చేయాలని భావించినప్ప్పుడు మన రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. అందుకు కారణం.. ఒకటి బీజేపీ అంటే భయం ఉండటం, ఎన్నో ఒకన్ని నియోజకవర్గాలు పెరిగితే తమ పార్టీ నాయకులకు అకామిడేషన్ దొరుకుతుందనేది రెండోది. ఓటింగ్‌లో నెగ్గివుండే 175 స్థానాలు కాస్త 263 అయ్యుండేవి. అంటే.. 98 అసెంబ్లీ స్థానాలు పెరిగివుండేవి. 98 మంది ఒక్కొక్క పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉండేవారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికార కూటమికి నామినేటెడ్ పదవుల పంపకం కత్తిమీద సాములా మారింది. బీజేపీ నేతలకు వెనుకవరుసలో కూర్చోబెట్టినా, టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నవారికి 15 ఏళ్లపాటు కలిసివుంటామని తరచుగా ప్రకటిస్తున్న జనసేనకు పదవులు పంచడం కష్టమైపోతుంది. ఇందులో కొందరు ఎమ్మెల్యేకు తక్కువ, కార్పొరేషన్ పదవులకు ఎక్కువ అన్నట్టున్నారు. ఇటువంటి వారిని ఏమీ చేయలేక విడిచిపెట్టేస్తున్నారు. అటువంటివారందరికీ ఈసారి ఈ డీలిమిటేషన్ పుణ్యమాని టిక్కెట్లిచ్చి ముచ్చట తీరుద్దామని పార్టీలు భావించాయి. కానీ అది ఇప్పటికీ కుదరడంలేదు. రాబోయే శీతాకాల సమావేశాల్లో మళ్లీ ఈ బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అప్పటికి కూడా డీలిమిటేషన్ మీద ప్రతిపక్షాలు ఒప్ప్పుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే, అదీ ఎక్కువ స్థాయిలో ఎంపీ సీట్లు వస్తే.. శీతాకాల సమావేశాల్లో సానుకూలమైన ప్రకటన వెలువడవచ్చు. ప్రస్తుతానికైతే ఇంతే సంగతులు. డీలిమిటేషన్ బిల్లు మీద మొదటిసారిగా కేంద్రం ప్రకటించినప్ప్పుడు చాలామంది దీని మీద ఆశలు పెట్టుకున్నారు. 2029లో జరిగే ఎన్నికలకు ఇప్ప్పుడు డీలిమిటేషన్ పూర్తయితే ఏ నియోజకవర్గానికి తాము ఫిట్ అవుతామో తెలుసుకొని, ఆ మేరకు పార్టీ అధిష్టాన్ నుంచి ఓకే చేయించుకొని ఇప్పటి నుంచే నియోజక వర్గంలో ప్రచారం పరోక్షంగా ప్రారంభించాలని భావించారు. కానీ 2027లో జనాభా లెక్కలు పూర్తయితే, ఆ మేరకు నియోజకవర్గాలు రిజర్వేషన్లు కూడా నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి 2028 వచ్చేస్తుంది. ఆ తర్వాత నుంచి పూర్తిగా ఎన్నికల వాతావరణమే. నియోజకవర్గాల పునర్విభజనంటూ జరిగితే ఎక్కడి నుంచి మొదలుపెడతారు? కొత్తగా టిక్కెట్ ఆశించేవారు ఏయే ప్రాంతాలు ఒక నియోజకవర్గం కిందకు వస్తాయన్న అంచనాలకు ఎప్ప్పుడో వచ్చేశారు. ఇప్ప్పుడు వారంతా మళ్లీ గమ్మున కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో గతసారి జనసేనకు 21 సీట్లు ఇచ్చినా, అందులో మూడొంతుల పైన తెలుగుదేశం అభ్యర్థులే గ్లాస్ గుర్తు మీద పోటీ చేశారు. ఈసారి ఆ పరిస్థితి ఉండదు. గతసారి బీజేపీ తరఫున పోటీ చేసిన టీడీపీ నేతల స్థానంలో వచ్చే ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులే టిక్కెట్ అడుగుతున్నారు. కానీ పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ, జనసేన ఉన్నచోట టీడీపీ ఇప్పటికీ ఇన్‌ఛార్జిలను నియమించడం గాని, బలమైన సమన్వయకర్తను ఎంకరేజ్ చేయడం లేదు. జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ ఇంతవరకు టీడీపీ ఇన్‌ఛార్జిని నియమించలేదు. పాలకొండలో జనసేన ఎమ్మెల్యే పని చేస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉండే పరిస్థితి కనిపించకపోవడంతో అక్కడ పడాల భూదేవిని టీడీపీ ఇన్‌ఛార్జిగా నియమించింది. ఇక వైకాపాలో జగన్మోహన్‌రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర్నుంచి ఆయన వెంట నడిచిన అనేకమందికి ఇప్పటికీ రాజకీయ లబ్ధి చేకూరలేదు. 2019`24 మధ్య అధికారంలో ఉన్నా కొందరు ఎటువంటి పదవులూ పొందలేకపోయారు. అటువంటి కుటుంబాలకు ఈసారి జగన్మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారని మాటిచ్చారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, తనను నమ్ముకున్న దాదాపు వందమందికి ఎమ్మెల్యేగా టిక్కెట్లిచ్చి గెలిపించాలన్న జాబితా కూడా ఆ మధ్య పార్టీ కార్యాలయంలో సిద్ధమైంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వద్ధతరం అన్ని జిల్లాల్లోనూ వైకాపాలో చక్రం తిప్ప్పుతోంది. జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాతో పాటు మరో రెండు జిల్లాలు మినహా మిగిలినచోట్ల కాంగ్రెస్ నుంచి వచ్చినవారే పదవులు పొందారు. ఈసారి జగన్మోహన్‌రెడ్డి సీనియర్లను గౌరవిస్తునే తన టీమ్‌ను తయారుచేసుకోవాలని భావించారు. అందుకు డీ లిమిటేషన్ ఉపయోగపడుతుందనుకున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే చంద్రబాబునాయుడు టీమ్‌ను మెల్లగా పక్కకు జరిపి, లోకేష్ తన ముద్రను పార్టీ మీద సంపాదించారు. తాజాగా తెలుగుదేశం సంస్థాగత పదవులు దీనికి నిదర్శనం. వైకాపా కూడా అదే మాదిరిగా వెళ్లాలని భావించింది. కానీ చాలాచోట్ల సీనియర్లకు ఆల్టర్నేటివ్ వైకాపాకు దొరకడంలేదు. ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న నాయకుడు కేస్ట్ ఈక్వేషన్‌లో ఫిక్స్ అవడంలేదు. పక్క నియోజకవర్గానికి పంపాలంటే.. అప్పటికే అక్కడ ఒకసారి తాజా, ఒకసారి మాజీ అయిపోయినవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరిని కాదంటే ఏ కొంప మునుగుతుందోనన్న భయం అందరిలోనూ ఉంది. ఎందుకంటే.. 2029 ఎన్నికలు ఈ రెండు పార్టీలకు అత్యంత కీలకం. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఒక్కో పార్టీ నుంచి పదికి తక్కువ కాకుండా ఆశావహులు ఉన్నారు. వీరందర్నీ అకామిడేట్ చేయాలంటే పునర్విభజన జరగాల్సిందే. కాకపోతే అది ఎప్ప్పుడు? ఎలా? అనేది తెలియడంలేదు.






Comments