top of page

ఇప్పట్లో కార్పొరేషన్‌ ఎన్నికలు లేనట్లే!

Writer: ADMINADMIN
  • రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం

  • అప్పుడే.. మిగతావాటితోపాటే నిర్వహణకు సర్కారు మొగ్గు

  • కోర్టు కేసులు, చట్ట సవరణ వంటి అడ్డంకులే దీనికి కారణం

  • మరికొన్ని చోట్ల ఇటువంటి వివాదాలు ఉండటం మరో అడ్డంకి

  • వీటన్నింటినీ పరిష్కరించిన తర్వాతే ఒకేసారి ఎన్నికలకు

అమ్మ వర్గం, అన్న వర్గం అనే కొట్లాట అక్కర్లేదు. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వచ్చి ప్రాధాన్యత కోల్పోయామని బాధపడక్కర్లేదు. ఎందుకంటే.. ఇప్పటికిప్పుడు కార్పొరేషన్‌ పాలకవర్గ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. పద్నాలుగేళ్లుగా పాలకవర్గం లేకుండా నడుస్తున్న శ్రీకాకుళం కార్పొరేషన్‌కు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలు నిర్వహిస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. అయితే వారు హామీ ఇచ్చినట్లు ఇప్పటికిప్పు ప్రత్యేకంగా శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తారన్న వాతావరణం కనిపించడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌, ఇతర స్థానిక సంస్థల ప్రస్తుత పాలకవర్గాల గడువు మరో రెండేళ్లే ఉంది. అప్పుడు వాటితోపాటే శ్రీకాకుళం కార్పొరేషన్‌కు కూడా ఎన్నికలు నిర్వహించాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు అమరావతి వర్గాల భోగట్టా.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

రాష్ట్రంలో 99 శాతం స్థానిక సంస్థలు ప్రస్తుతం వైకాపా చేతిలో ఉన్నాయి. ముందుగా వీటిలో వీలైనన్ని చోట్ల పట్టు సాధించి అవిశ్వాస తీర్మానాలు పెట్టి సిటింగ్‌ ఎంపీపీలు, జిల్లాపరిషత్‌ చైర్మన్లను ఇంటికి పంపే పనిలో టీడీపీ ఉంది. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ఛైర్మన్‌, మేయర్‌ కుర్చీల్లో టీడీపీ వారిని కూర్చోబెట్టేందుకు వ్యూహాలు పన్నుతోంది. తాజాగా గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌లో జరిగిన స్థాయీ సంఘాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించడం ఇందుకు తాజా నిదర్శనం. వాస్తవానికి జీవీఎంసీ అధికార పీఠం వైకాపా చేతిలో ఉంది. కానీ పది స్టాండిరగ్‌ కమిటీలకు ఎన్నికలు జరిగితే అన్నింటిలోనూ టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఇటీవలే కొందరు కార్పొరేటర్లు వైకాపాను వీడి కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనల్లో చేరగా, మిగిలిన వారు పలువురు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడటం వల్ల స్థాయీసంఘాలన్నీ కూటమి పరమయ్యాయి. ఇప్పుడు విశాఖలోనే స్థానిక సంస్థల కోటా నుంచి ఈ నెలాఖరులో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇందులో కూడా విజయం సాధించేందుకు టీడీపీ ఇటువంటి వ్యూహాలే రచిస్తోంది. రాష్ట్రంలోని ఇతర స్థానిక సంస్థల విషయంలోనూ దీనికే కూటమి ప్రాధాన్యమిస్తున్నందున ఎన్నికలు జరగని శ్రీకాకుళం వంటి వాటిపై ఇప్పట్లో ఫోకస్‌ పెట్టే అవకాశం లేదు.

నాడు తప్పులు.. నేడు తిప్పలు

రెండేళ్లు పూర్తయితే ఎలాగూ అన్ని స్థానిక సంస్థలకూ ఎన్నికలు తప్పవు కాబట్టి అన్నింటితో పాటు శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలని, ఈలోగా దీనికి సంబంధించి కోర్టులో ఉన్న కేసులను పరిష్కరించడమో లేదా విత్‌డ్రా చేయించడమో చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 17924/21 నెంబరుతో హైకోర్టులో శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన వ్యాజ్యం నడుస్తోంది. 2011లో శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఏడు పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది. స్పెషలాఫీసర్‌ తీర్మానంతో ఆ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం కావడానికి సమ్మతించినట్లు రాయించి 2019లో ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది. ఒక ఆర్డినెన్స్‌ కాలపరిమితి ఆరు నెలలు మాత్రమే. 2020`21లో కరోనా ఎఫెక్ట్‌ వల్ల అసెంబ్లీ సమావేశం కాకపోయినా, ఈ ఆర్డినెన్స్‌ను చట్టంగా రూపొందించారు. అప్పటికే ఆర్డినెన్స్‌పై కోర్టుకెళ్లిన విలీన పంచాయతీల పెద్దలు ఆ తర్వాత చట్టాన్ని కూడా సవాల్‌ చేశారు. శాసనసభలో చట్టం చేసిన తర్వాత దానిపై కోర్టులు కల్పించుకోలేవని తేల్చేయడంతో విలీన పంచాయతీలతో కూడిన కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతాయని అంతా భావించారు. అయితే చట్టంలో చెయ్యి పెట్టలేమని చెప్పిన కోర్టే మళ్లీ ఫైనల్‌ జడ్జిమెంట్‌ వచ్చేవరకు ఎన్నికలు నిర్వహించకూడదంటూ 2022లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపైనా పలువురు అప్పీల్‌కు వెళ్లగా ప్రస్తుతం అది పెండిరగులో ఉంది. ఈ పరిస్థితికి కారణం.. శ్రీకాకుళం మున్సిపాలిటీని కార్పొరేషన్‌ చేయాలన్న తొందరలో అప్పటి ప్రభుత్వాలు అనేక తప్పులు చేశాయి. 2011లో పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై షోకాజ్‌ నోటీసు పంచాయతీలకు వస్తే దానిపై వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా దాన్ని పట్టించుకోకుండా 2011 ఆగస్టు 18న జీవో జారీ చేసేశారు. 2012 జనవరిలో ఏడు పంచాయతీలను జిల్లాపరిషత్‌ నుంచి తప్పిస్తున్నట్లు ఒక జీవో, అదే సమయంలో కార్పొరేషన్‌లో కలుపుతూ మరో జీవో తీసుకువచ్చారు. వీటిపై ఒక్క పెద్దపాడు మినహా మిగిలిన ఆరు పంచాయతీల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జనాభిప్రాయం సేకరించకుండానే అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌ తీర్మానాలు చేసి పంపించేశారని, పంచాయతీల్లో ఉండాల్సిన రికార్డులను కూడా మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకుపోయారని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

కేసుల విత్‌డ్రా సరే.. ఆ సంగతేంటి?

2009లో పెద్దపాడు పంచాయతీని కార్పొరేషన్‌లో విలీనం చేస్తామని నోటీసు ఇచ్చినప్పుడు అప్పటి సర్పంచ్‌ కలగ సుజాత సమ్మతించడంతో పెద్దపాడు మున్సిపాలిటీలో కలిసిపోయినట్టయింది. అందుకే ఈ పంచాయతీకి అప్పటి నుంచి ఎన్నికలు లేవు. ఇక మిగిలినవాటలో కొన్నింటికి 2006లో, మరికొన్నింటికి 2013లో ఎన్నికలు జరిగినా.. ఆ తర్వాత ఇంతవరకు పాలకవర్గాలు ఏర్పడలేదు. అయితే ఈ పంచాయతీలన్నీ ఇప్పుడు తెలుగుదేశం చేతుల్లోనే ఉన్నాయి. అంతేకాకుండా విలీనానికి వ్యతిరేకంగా కోర్టుకెళ్లిన నేతలంతా ఆ పార్టీవారే. అందువల్ల ఆ కేసులను వారితో విత్‌డ్రా చేయించి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌లు అభయమిచ్చారు. కాకపోతే విలీన పంచాయతీలపై కోర్టులో ఉన్న కేసు విత్‌డ్రా చేసుకునే ముందు అసలు ఏడు పంచాయతీలతో కలిపి ఎన్నికలకు వెళ్తారా? లేక పాత 36 వార్డులతోనే ఎన్నికలు జరుపుతారా? అనేది తేలాల్సి ఉంది. ఆ ఏడు పంచాయతీలను కార్పొరేషన్‌ నుంచి వేరు చేస్తామని చెబితే ప్రస్తుం కార్పొరేషన్‌గా ఉన్న వ్యవస్థ మున్సిపాలిటీగా మళ్లీ మొదటికొస్తుంది. లేదంటే 36 వార్డులనే 50 డివిజన్లుగా మార్చి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఏది ఏమైనా విలీన పంచాయతీలను కార్పొరేషన్‌ చెర నుంచి విడిపిస్తే గానీ ఎన్నికలు జరిగే ప్రసక్తి లేదు. దీనిపై ఇప్పటికే చట్టం ఉన్నందున దాన్ని ఉపసంహరించుకోవాలంటే మళ్లీ కేబినెట్‌ ఆమోదం పొందడం, అసెంబ్లీలో తీర్మానించడం, గవర్నర్‌కు పంపడం వంటి ప్రక్రియలు చేపట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ తేలేసరికి ప్రభుత్వం భావించినట్లే రెండేళ్ల సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ ఆరు నెలల ముందుగా ఈ ప్రక్రియ ముగిసినా అక్కడికి దగ్గరలోనే మిగిలిన స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉన్నందున మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికే చంద్రబాబు మొగ్గు చూపుతారు.

మరికొన్ని చోట్లా ఇదే పరిస్థితి

శ్రీకాకుళం తరహాలోనే మరికొన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు కూడా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. కాకినాడ నగరపాలక సంస్థకు కొన్ని కారణాల వల్ల మిగతా మున్సిపల్‌ ఎన్నికలతో కాకుండా 2017లో ఎన్నికలు జరిగాయి. ఆ పాలకవర్గం గడువు 2022 వరకు ఉండటంతో 2021 స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగానూ ఈ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగలేదు. అలాగే 2022లో పదవీకాలం ముగిసినా ఇప్పటివరకు మళ్లీ ఎన్నికలు జరగలేదు. ఇక రాజమండ్రి నగరపాలక సంస్థ, రాజాం, ఆమదాలవలస మున్సిపాలిటీల్లోనూ విలీన వివాదాల వల్ల ఎన్నికలు జరగలేదు. శ్రీకాకుళం మాదిరిగానే ఇవన్నీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వీటిని కాదని ఒక్క శ్రీకాకుళం నగరపాలక సంస్థకే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండదన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత రాష్ట్రవ్యాప్త స్థానిక సంస్థల ఎన్నికలతోపాటే వీటికి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

స్థానిక నేతల ఆరాటం

శ్రీకాకుళం మున్సిపాలిటీకి 2010 తర్వాత ఎన్నికలు జరగక, పాలకవర్గం లేకపోవడం వల్ల రెండు ప్రధాన పార్టీల క్యాడర్‌ ఎన్నికల కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది. ధర్మాన ప్రసాదరావు ఘోరంగా ఓడిపోవడానికి, గొండు శంకర్‌కు రికార్డు మెజార్టీ రావడానికి ఒక కారణం కార్పొరేషన్‌ ఎన్నికలు జరగకపోవడమే. 2010 తర్వాత రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయిన వార్డుస్థాయి నాయకులు ఈసారి వైకాపాకు సహకరించకపోవడం వల్లే ఇంత తేడా కనిపించింది. అలాగే తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఎన్నికలు జరిపిస్తామన్న హామీ ఉండటం వల్ల ఆ పార్టీ క్యాడర్‌ కసిగా పని చేసింది. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ కూడా ప్రస్తుతం నగరాభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేషన్‌ కావడం వల్ల పన్నులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ నిధులతో నగరానికి ఆనుకొని ఉన్న పంచాయతీలకు రోడ్లు, కాలువలు, నీరు వంటి సదుపాయాలు కల్పించారు. ఇప్పుడు కార్పొరేషన్‌లో లేకపోవడం వల్ల శివారు కాలనీల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తకుండా పంచాయతీగా ఉంటే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల ద్వారా రోడ్లు, కాలువలు నిర్మించడానికి అవసరమైన నిధులు మంజూరు చేయించుకోడానికి ఇప్పటికే కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.

 
 
 

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page