top of page

ఇప్పుడు చేపలు కూడా డేంజరే బాసూ..!

  • Writer: ADMIN
    ADMIN
  • Mar 4
  • 3 min read
  • కోళ్ల పేగులే వీటికి ఆహారం

  • ఇంజక్షన్లతో భారీ సైజులో చెరువు చేపలు

  • బర్డ్‌ఫ్లూ భయంతో చేపల వైపు మొగ్గు

  • ధర పెంచేసిన చేపలగంపలు

  • కుళ్లిన చేపలు, సగం అరిగిన తూనికరాళ్లతో మోసం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

సహజంగా ఆదివారం వచ్చిందంటే మాంసప్రియులు అందుబాటు ధరలో ఉండే చికెన్‌ కోసం షాపుల ముందు క్యూ కడతారు. కాస్త ఆలస్యమైనా వేచిచూస్తుంటారు. అయితే బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్‌ వదిలేసిన జనం మటన్‌, చేపల వైపు మొగ్గుచూపారు. ఆయా దుకాణాల ఎదుట పెద్ద ఎత్తున బారులుతీరారు. ఇదే అదనుగా వ్యాపారులు రేట్లు పెంచేశారు. గత రెండు వారాలుగా బర్డ్‌ఫ్లూ భయంతో ప్రజలు చికెన్‌ వైపు చూడటం మానేశారు. మటన్‌ ధర ఫిక్సిడ్‌గా ఉన్నప్పటికీ, బజారులో దొరికే చేపల ధర నియంత్రణ లేకుండాపోతోంది.

బర్డ్‌ఫ్లూ భయంతో కోడిమాంసం వైపు చూడని మాంసప్రియులు మటన్‌, చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే బర్డ్‌ఫ్లూ కంటే చెరువు చేపలే డేంజరని వైద్యులు చెబుతున్నారు. చికెన్‌ షాపుల్లో వేస్టేజ్‌, పేగులు, రోడ్లపై యాక్సిడెంటల్‌గా చచ్చిపోయే జంతువులే ఆహారంగా చెరువు చేపలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన మార్కెట్‌లో దొరికే చెరువు చందువాలైతే క్యాట్‌ఫిష్‌ జాతికి చెందినవి. క్యాట్‌ఫిష్‌ అంటే.. మనిషిని నీటిలో వేస్తే అమాంతంగా తినేసే జాతి. గతంలో మార్పులు అని చేపలు అమ్మేవారు. ఇవి మన గ్రామాల్లో గెడ్డల్లోను, చెరువుల్లోను చిన్నసైజులో దొరికినంత వరకు బాగానే ఉండేవి. ఎప్పుడైతే ఈ మార్పులను కూడా పెంచడం మొదలుపెట్టారో అప్పట్నుంచి రోగాలు చేపలకు కూడా వస్తాయని జనానికి అర్థమైంది. సహజంగానే మార్పు తింటే మానిపోయిన జబ్బు తిరగబెడుతుందని మన పెద్దలనేవారు. గెడ్డల్లో చిన్న చేపపిల్లలు, నాచును తిని పెరిగిన చిన్న మార్పులకే ఈ మాట వర్తిస్తే, ఇప్పుడు జంతు కళేబరాలు తిని పెరిగే చేపల పరిస్థితి ఏమిటి?! చేప రూపాన్నయితే మార్చుకుంది కానీ, ఇప్పుడు చెరువు చందువా అంటూ దొరుకుతున్న చేప కూడా ఇటువంటివే తిని పెరుగుతుంది. వీటిని తినడం యమడేంజర్‌. సాధారణంగా రోడ్డు పక్క ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు వీటిని ఎక్కువగా వాడుతున్నాయి. మద్యం దుకాణాల పక్కన వీటిని విరివిగా అమ్ముతారు. వెనుక చందువా అని పేరు ఉండటం వల్ల సముద్రం నుంచి వచ్చే నల్లచందువా, అటుకుల చందువాను పోలివుండటం వల్ల దీన్ని కూడా కొందరు తెలియకుండా కొనుగోలు చేసేస్తున్నారు. వీటికి సంప్రదాయ ఫీడ్‌తో మేపడం రైతుతరం కాదు. అందుకే అన్ని రకాల వ్యర్థాలు వేసి, బరువు వచ్చేటట్టు పెంచుతున్నారు.

ఇది కాకుండా బంగారుపాప, రొయ్యిచేప, శీలావతి అనే పేర్లతో అమ్ముతున్న చేపలు వ్యర్థాలైతే తినవు కాని, వాటి పెరుగుదల కోసం యాంటీబయాటిక్స్‌, గ్రోత్‌ హార్మోన్‌ ఇంజక్షన్లు ఇచ్చి కిలో చేపను ఐదు కిలోల వరకు పెంచుతున్నారు. సాధారణంగా మనం చికెన్‌, మటన్‌ వంటివి మాంసంలో నీరు ఇంకేవరకు వేపి, ఆ తర్వాత 100 డిగ్రీలు దాటిన వేడిలో ఉడకబెడతాం. అయినా బర్డ్‌ఫ్లూ ఉంటుందంటూ భయపడిపోతున్నాం. కానీ చేపలను అంత ఫ్రై చేయలేం. అన్ని డిగ్రీల్లో ఉడకబెట్టలేం. ఎందుకంటే చేపకు సెగ పెరిగేకొద్దీ వీడిపోతుంది. దీనివల్ల ఏ చేపల కూరయినా కాస్త పచ్చిగానే ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు 100 డిగ్రీల్లో ఉడకబెట్టినదానికి బర్డ్‌ఫ్లూ ఉంటే 50 డిగ్రీల లోపు ఉడికిస్తున్న చేప ఏం కావాలి? ఇప్పుడు బర్డ్‌ఫ్లూ పుణ్యమాని మధ్యతరగతి, పేద ప్రజలు చికెన్‌ తినలేక, మటన్‌ కొనలేక, కోణేం వంటి ఖరీదైన చేపలు తెచ్చుకోలేక చెరువు చేపలవైపు మొగ్గుచూపుతున్నారు. అయితే చెరువు చందువా వంటి చేపలు కేవలం పేగులు తిని పెరిగేవి కావడంతో వీటిని ఎక్కువగా తినేవారు కొలెస్ట్రాల్‌, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారు. బజార్లలో తూనికలు కొలతల శాఖ దాడులు ఉంటాయన్న భయంతో వారు ఫిక్సిడ్‌ ధరలు పెట్టుకొని కొంతమేర సరైన తూకంతో ఇస్తున్నప్పటికీ, వీధుల్లో గంపలతో చేపలు తెచ్చేవారు అరిగిపోయిన గుళ్లు, రాళ్లను తూకం వేసేందుకు ఉపయోగించడం విశేషం. కిలో తూయాల్సినచోట అరకిలో నుంచి ముప్పావుకేజీ మాత్రమే తూగుతుండటం కొసమెరుపు. ఇక ఐదారు రోజులు నిల్వ ఉంచిన కుళ్లిన చేపలను అమ్మడం, ముక్క వాసన లేకపోతే ముద్ద దిగనివారు వాటిని కొని తినడంతో కాళ్లపీకులు, తెలియని నీరసంతో పాటు జ్వరాల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

తూనిక‘రాళ్ల’తో మోసం..

మటన్‌ దుకాణాల్లో తూనిక యంత్రాలు తూనికలు, కొలతల శాఖ లెక్క ప్రకారమే ఉన్నప్పటికీ వీధుల్లో తిరిగే చేపల గంపల తూకం సరిగా లేదన్నది బహిరంగ రహస్యం. అందులోనూ చికెన్‌ అంటే ప్రజలు భయపడిపోతుండటం, వెయ్యి రూపాయలు పెట్టి మటన్‌ కొనలేని మధ్యతరగతి ప్రజలు చేపల వైపే మొగ్గు చూపడంతో కుళ్లిన (మాగిపోయిన) చేపల అమ్మకం విపరీతంగా జరుగుతోంది. తూనికలు, కొలతల శాఖ అధికారులు కనీసం చేపల గంపల వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. రెండు వారాల క్రితం వరకు రూ.300 పైచిలుకు ధర పలికిన చికెన్‌ బర్డ్‌ఫ్లూ పుణ్యమాని మొన్నటి వరకు రూ.110 నుంచి రూ.140 మధ్య ఉండి, ఇప్పుడు రూ.200కు పెరిగింది. ఫంక్షన్లలో సైతం బడ్జెట్‌ విషయం పక్కన పెట్టి చికెన్‌ పెడితే బంధువులు భోజనాలు చేస్తారో లేదోనన్న భయంతో మటన్‌, ఫిష్‌ పెడుతున్నారు.

ఉడకబెట్టిన చికెన్‌ ఫర్వాలేదు

చికెన్‌, ఎగ్‌ తినొచ్చని, అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్‌ బతకదని వైద్యులు చెబుతున్నారు. కోడిమాంసం, గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తాం కాబట్టి అందులో ఎలాంటి వైరస్‌ ప్రభావం ఉండదని చెబుతున్నారు. ఈ వైరస్‌ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

చికెన్‌ మేళాలతో అవగాహన

బాగా ఉడికించిన చికెన్‌, ఎగ్‌ తినొచ్చని వైద్యులు చెబుతున్నా చికెన్‌ కొనడానికి ప్రజలు వెనుకాడుతున్నారు. అంతేకాకుండా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, చికెన్‌షాపులు, చీకుల సెంటర్ల వైపు జంధ్యంచూపులు చూస్తున్నారు. దీంతో వారిలో అపోహలు, భయాలు తొలగించేందుకు పౌల్ట్రీ వ్యాపారులు చాలాచోట్ల చికెన్‌, ఎగ్‌మేళాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దుకాణాల్లో చికెన్‌ కొనడానికి భయపడే జనాలు ఫ్రీ చికెన్‌ అనేసరికి పెద్ద సంఖ్యలో హాజరై దుమ్ము కూడా మిగల్చకపోవడం విశేషం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page