ఇప్పిలిలో వృద్దుడు హత్య..!
- BAGADI NARAYANARAO
- May 7
- 1 min read

పోలీసులు అదుపులో నిందితుడు
(సత్యంన్యూస్, శ్రీకాకుళంరూరల్)
మండలంలోని ఇప్పిలిలో బుధవారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన కరణం నర్సింగరావు (63) హత్యకు గురయ్యాడు. డాబాపై నిద్రిస్తున్న నర్సింగరావును ఉదయం రక్తపు మడుగులో చూసి కుటుంబసభ్యులు రూరల్ పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికులు చెబుతున్న వివరాలు ప్రకారం మంగళవారం రాత్రి ఇంటి ఎదురుగా ఉంటున్న ఇప్పిలి రమణతో నర్సింగరావుకు స్వల్ప ఘర్షణ జరిగింది. నర్సింగరావు తన ద్విచక్ర వాహనాన్ని రమణ ఇంటికి ఎదురుగా పెట్టడంతో ఘర్షణ చోటు చేసుకుంది. నర్సింగరావుతోమద్యం మత్తులో ఉన్న రమణ గొడవకు దిగినట్టు తెలిపారు. స్థానికులు సర్దిచెప్పడంతో తాత్కాలికంగా గొడవ సద్దుమణిగింది. అయితే రమణ మాత్రం దీన్ని మనసులో పెట్టుకుని డాబామీద నిద్రిస్తున్న నర్సింగరావుపై బుధవారం వేకువజామున ఇనుపకత్తువాతో తలపై దాడి చేసినట్టు గ్రామంలో ప్రచారం సాగు తుంది. రమణ మద్యం మత్తులో తరుచూ గ్రామస్తులతో ఘర్షణ పడుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఘటన తర్వాత గ్రామం నుంచి అదృశ్యం కావడంతో రమణే హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు నిర్ధారణకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ కె.రాము తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి భార్య యశోద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు ఇప్పిలి రమణను ఎచ్చెర్ల మండలం జీరుపాలెం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సంఘటన స్థలానికి సీఐ పైడపునాయుడు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్‌టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Comments