గత పాలకులకు భిన్నంగా జోరువానలో పర్యటన
అన్నా కేంటీన్‌లో భోజనం
డ్రైనేజీ వ్యవస్థపై సమగ్ర ప్రణాళికకు ఆదేశం
` ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి? గెలిచాక వైరల్ ఫీవర్ వచ్చి గదిలోకి వెళ్లిపోవాలి. నిన్ను కలవడానికి వచ్చినవారిని ‘సార్ ఎవర్నీ కలవరు’ అని కర్కశంగా గన్‌మెన్‌లతో చెప్పించాలి. నువ్వేంటి సామీ గెలిచిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు ఇంటికెళ్లినట్టే కనిపించలేదు.
` ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి? వర్షాలు, వరదలు వస్తే దాని కోసం ఒక డిపార్ట్‌మెంట్ ఉందని, వారే చూసుకుంటారని మీడియాకు చెప్పాలి. కావాలంటే 2006లో శ్రీకాకుళం వర్షం నీటిలో మునిగిపోయినప్పుడు అప్పటి నాయకులు ఏం చెప్పారో మాటీవీలో వార్తలు వచ్చిన కాలంలో చూసుకో.
` ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి? వర్షాలు వస్తే కాలువల్లో పూడిక తీయడం దగ్గర్నుంచి, మోటార్లతో మురుగునీరు తోడిరచడం వరకు అన్ని పనులు తమ్ముడు చెప్పినవారికే ఇవ్వాలి.
` ఎమ్మెల్యే అయ్యాక ఎలా ఉండాలి? డబ్బున్నవారందర్నీ పిలిచి నీ ఆఫీసులో పార్టీ ఇవ్వాలి. పేదోడి నీడ కూడా ఆ గోడ మీద పడకుండా జాగ్రత్తపడాలి.
` అన్నం మిగిలిపోతే మున్సిపాలిటీ డస్ట్‌బిన్‌లో పడేయాలి. లేదంటే రోజూ నీ దగ్గరకొచ్చి అన్నం పెట్టమంటారు. అలాంటిది నువ్వేంటి శంకరా.. 434 రోజుల నుంచి ఇక్కడ అభాగ్యులకు అన్నం వండి వారుస్తున్నావు. పోనీ చేశావు సరే.. గెలిచాకైనా ఆపేయాలి కదా! నువ్వేంటి సామీ ఇంకా కొనసాగిస్తున్నావు. ఎన్నికలైపోయాక ఆపేయాలి. కావాలంటే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని అడుగు.
` నీలాంటోళ్లు భోజనానికి వస్తారని కొసరి కొసరి వడ్డించడానికి వెండి కంచాలు చేయించుకున్న వ్యాపారులున్నారిక్కడ. అలా నువ్వు అన్న కేంటీన్‌లో భోంచేస్తే వారి గతేంకాను! ఇలా అయితే కష్టం శంకరా.
` పతంజలి అన్నట్లు ఎన్నికలైపోయిన తర్వాత నగరం ఎలా ఉండాలి? దగాపడిన ఒక ఆడకూతురిలా ఉండాలి. దొంగనవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలెక్కిపోయిన పల్లెటూరి పిచ్చిపిల్లలా ఉండాలి. చినిగిపోయిన ప్రచారపత్రాల గుట్టలా ఉండాలి. ఇలా కాకుండా వర్షం పడగానే నువ్వే నేరుగా అధికారులను తీసుకొని నగరమంతా పర్యటిస్తే ఎలా సామీ?! అసలే మా కార్పొరేషన్ అధికారులకు పద్నాలుగేళ్లుగా అడిగే నాధుడే లేడు. గత ఐదేళ్లూ తమ్ముడు రాజ్యాంగమే నడిచింది. ఇప్పుడు నువ్వు సడెన్‌గా వచ్చి రోడ్డెక్కండి అంటే వారి కష్టం కూడా చూడాలి కదా! కుర్చీలకు అతుక్కుపోయిన నడుములు అంత వేగంగా విదిలించుకొని రావడం సులువు కాదు సామీ! ఇలా నువ్వు పరుగులు పెట్టిస్తే కష్టం కదా!

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గత పాలకులు, ప్రజాప్రతినిధులకు భిన్నంగా జోరువానలోనూ స్థానిక ఎమ్మెల్యే నగరంలో గురువారం పర్యటించారు. కురిసిన భారీ వర్షానికి జలాశయాల మాదిరిగా మారిపోయిన రోడ్లను, కాలువలను, ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాలు, బొందిలీపురం వంటి ఏరియాల్లో నీరు నిలబడిపోవడాన్ని స్వయంగా ఎమ్మెల్యే పరిశీలించారు. ఒకవైపు వర్షంలో తడుస్తూనే మరోవైపు ఇలిసిపురం వంటి ప్రాంతాలు మోకాలి లోతులో నీరు నిలిచిపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. వర్షం ఎప్పుడు కురిసినా నగరంలో పరిస్థితి ఇదేనని స్థానికులు చెప్పడంతో శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఇందుకు ఏమేరకు నిధులు అవసరమో చెబితే మంత్రులతో మాట్లాడి నిధులు సమకూరుస్తానన్నారు. పాలకులు ఎంతమంది మారినా రామిగెడ్డ పనులు పూర్తికాకపోవడం వల్ల నగరంలో మురుగునీరు ప్రవాహానికి దారి లేకుండాపోయిందని తెలుసుకున్న శంకర్ రామిగెడ్డను పరిశీలించారు. ఇన్‌ఛార్జి కమిషనర్ గంగాధర్‌తో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ కోసం మాట్లాడారు. ఇందులో భాగంగానే స్థానిక ఏడురోడ్ల జంక్షన్ వద్ద తాను ఏర్పాటుచేసిన అన్నా కేంటీన్‌లో నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌తో కలిసి భోంచేశారు. అనంతరం పాతబస్టాండు వద్ద ఏర్పాటుచేసిన అన్నా కేంటీన్ వద్ద ఆయనే స్వయంగా వడ్డించారు.
మనలో ఒకడు.. మనకోసం వచ్చాడు!
ప్రజాప్రతినిధి అంటే ఎక్కడి నుంచో ఊడిపడేవాడు కాదు. మనలో ఒకడే.. మనం గెలిచిపించిన మన ప్రతినిధే.. మన కష్టాలు, సమస్యలను ప్రత్యక్షంగా చూసి పరిష్కారాలు సాధించాల్సింది అతడే. కానీ దురదృష్టవశాత్తు మనం ఎన్నుకున్న ప్రతినిధులు తాము అన్నింటికీ అతీతమని.. ఆకాశంలోంచి ఊడిపడిన దేవదూతలమన్నట్లు భావిస్తుంటారు. మనకు అవసరమైనప్పుడు కాకుండా.. వారికి నచ్చినప్పుడు, తీరుబడి దొరికినప్పుడే వచ్చి అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ కాలక్షేపం కబుర్లు చెప్పి వెళ్లిపోతుంటారు. కానీ అటువంటి నేతలకు తాను భిన్నమని నిరూపిస్తున్నారు కొత్తగా ఎన్నికైన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. కిందిస్థాయి నుంచి వచ్చిన ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అంతే డౌన్ టు ఎర్త్ మనస్తత్వాన్ని చాటుకుంటున్నారు. కిందిస్థాయి నుంచి, ప్రజల్లోంచి వచ్చిన వారికే ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సిసలు సమస్యలేమిటో తెలుస్తాయన్నది ఆయన సిద్ధాంతం. అందుకే ఆయన ప్రజాక్షేత్రాన్ని నమ్ముకున్నారు. దానికి ఉదాహరణే హోరు వానను సైతం లక్ష్యపెట్టకుండా నగరబాట పట్టారు. ఒకవైపు భారీ వర్షం పడుతుంటే.. మరోవైపు ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షం వల్ల ఎక్కడెక్కడ, ఎటువంటి సమస్యలు ఎదురువుతున్నాయి.. ఏ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.. ఎక్కడ మురుగు కాలువలు పొంగి రోడ్లే కాలువల్లా ప్రవహిస్తున్నాయో తెలుసుకున్నారు. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా కాలినడన పలు వీధులు, ప్రధాన మార్గాల్లో పర్యటించిన ఆయన సమస్యలను నోట్ చేసుకున్నారు. ఇది కదా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు చేయాల్సిన పని. ఇదే కదా.. ప్రజలు కోరుకునేది. ఇటువంటి వారినే కదా వారు అక్కున చేర్చుకునేది.. మనలో ఒకడిగా ఓన్ చేసుకునేది.
Comments