top of page

ఇలా అయితే కొన్నట్టే.. అమ్మినట్టే!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • ఒకే రోడ్డులో 4 రకాల ధరలు

  • ఒక్కోచోట 150 శాతం పెంపు

  • అధిక ఫీజులు వసూలు చేస్తున్న రిజిస్ట్రార్‌ ఆఫీసులు

  • కూటమి పాలనలోనూ కుప్పకూలుతున్న రియల్‌ఎస్టేట్‌



(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లాలోని 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో భూముల ధరలు పెరిగాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ముఖ్యంగా శ్రీకాకుళం నగరంతో పాటు, మండల కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి డోర్‌ నెంబర్ల వారీగా అక్కడి విలువల్ని నిర్థారించారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్నాయనే కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఊహించని విధంగా రేట్లు పెంచారు. అలాగే కొత్తగా ఏర్పడిన వాణిజ్య స్థలాల డోర్‌ నెంబర్లను సేకరించి వాటిపై భారం మోపారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూములతో పాటు కొత్తగా వ్యయసాయేతర భూములుగా మారిన వాటి వివరాలు సేకరించి వాటి రేట్లూ పెంచారు. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులే కాకుండా ఓ మోస్తరు రహదారుల వెంట, వాటి చుట్టుపక్కల ప్రాంతాల భూముల విలువలను పెంచారు. ఇందుకోసం ఎన్నడూ లేనివిధంగా భూముల క్లాసిఫికేషన్లు కూడా మార్చారు. ఒకే ప్రాంతంలో రెండు, మూడు, అవసరమైతే నాలుగు రకాల ధరలు నిర్థారించారు. వ్యవసాయ భూముల్లో మెట్ట, మాగాణి మాత్రమే కాకుండా వాటిలోనూ రెండు, మూడు రకాల రేట్లు పెట్టారు. అర్బన్‌ ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్రాంతాల్లోనూ వీలును బట్టి రెండు, మూడు రకాల ధరలు నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో పెరుగుదల 50 నుంచి 60 శాతానికి పైగా ఉందని అధికారులే చెబుతున్నారు.

శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో ప్రాంతాల వారీగా 6 నుంచి 150 శాతం వరకు భూములు ధరలు పెంచారు. నగరంలో 80 అడుగుల రోడ్డు తదితర కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ ప్రాంతాల్లో భూములు క్లాసిఫికేషన్లు మార్చారు. నగరపాలక సంస్థలో అంతర్భాగంగా ఉన్న చాపురం, గోవిందపురం పరిధిలో వ్యవసాయ భూమి ఒక గజం గతంలో రూ.8వేలు ఉండగా, పెరిగిన ధర ప్రకారం రూ.10వేలకు చేరింది. ఆ ప్రాంతంలోనే లేఅవుట్‌లో గజం (స్క్వేర్‌ యార్డ్‌)కు రూ.10వేల నుంచి రూ.12వేలకు పెంచారు. చాపురం పంచాయతీగా వ్యవహరించబడుతున్నా, శ్రీకాకుళం నగరంలో అంతర్భాగంగానే ఉంది. ఇక్కడ భూములు బహిరంగ మార్కెట్‌లో రూ.కోట్లలో పలుకుతుంది. రికార్డుల్లో వ్యవసాయ భూములుగా చూపిస్తున్నా క్షేత్రంలో మాత్రం అన్నీ నివాసయోగ్యమైన భూములుగా మారిపోయాయి. ఇలాంటి చోట వ్యవసాయ భూమికి రూ.25 శాతం పెంచి లే`అవుట్‌కు 20 శాతానికి పరిమితం చేశారు. నగరంలోని మహాలక్ష్మీనగర్‌, కుమ్మరివీధిలో స్క్వేర్‌యార్డ్‌ ఒక్కంటికి రూ.13,500 ఉండగా, దీన్ని రూ.20వేలకు పెంచారు. సుమారు 50 శాతం మార్కెట్‌ విలువను పెంచారు. వీటికి ఆనుకొని ఉన్న ఉమెన్స్‌ కాలేజీ రోడ్డులో స్క్వేర్‌ యార్డ్‌కు రూ.31వేలు ఉండేది ప్రస్తుతం దాన్ని 6 శాతం మేర పెంచి రూ.33వేలుగా నిర్ణయించారు. ఈ పెంపు జిల్లాలోని అన్ని కమర్షియల్‌ ప్రాంతాలతో పోల్చితే ఇదే తక్కువ. ప్రభుత్వం 10 నుంచి 50 శాతం మేర పెంచుతున్నామని ప్రకటించడానికి భిన్నంగా దీని విలువను నిర్ధారించారు. కమర్షియల్‌ పరిధిలో ఉన్న ఉమెన్స్‌ కాలేజీ రోడ్డుకు ఆనుకొని ఉన్న మహాలక్ష్మీనగర్‌, ఎదురుగా ఉన్న కుమ్మరివీధిని రెసిడెన్షియల్‌ ఏరియాగా చూపించారు. చిన్నబరాటంవీధి, టౌన్‌హాల్‌ సందు, రోడ్డుల్లో మార్కెట్‌ విలువను ఒక్క శాతం పెంచలేదు. పెద్దబరాటం వీధి, స్టేట్‌బ్యాంకు కాలనీ, గైనేటి వీధి, మండలవీధిలో ఆస్తి విలువను రూ.14,500 నుంచి రూ.20వేలకు పెంచారు.

నగరంలో అత్యంత విలువైన భూములు ఉన్న 80 అడుగుల రోడ్డును నాలుగు క్లాసిఫికేషన్లుగా మార్చారు. ఇప్పటి వరకు వీటిని ఆదిఆంధ్రపేట రోడ్డు, బాదుర్లపేట రోడ్డుగా చూపించి రూ.9 వేలు మార్కెట్‌ ధరతో క్రయవిక్రయాలు నిర్వహిస్తూ వచ్చారు. వీటిని క్లాసిఫికేషన్‌ చేసి కొత్తపేట ఏరియా లే అవుట్‌`80 అడుగుల రోడ్డు, 80 అడుగుల రోడ్డు `పీఎస్‌ఎన్‌ఎం మిల్లు జంక్షన్‌ నుంచి వాంబే కాలనీ 1 నుంచి 3 గా చూపించి మార్కెట్‌ ధరను రూ.25 వేలుగా ఫిక్స్‌ చేశారు. ఈ లెక్కన ఇక్కడ మార్కెట్‌ ధరను 200 శాతానికి మించి పెంచారు. కలెక్టరేట్‌ రోడ్డు, కొత్తపేట ఏరియా గతంలో మార్కెట్‌ విలువ రూ.9వేలు ఉండగా ప్రస్తుతం వీటిని రెసిడెన్షియల్‌ ఏరియాలుగా చూపించి మార్కెట్‌ విలువను 120 శాతం పెంచి రూ.20వేలుగా నిర్ధారించారు. వీటితో పాటు బాదుర్లపేట, కలెక్టర్‌ బంగ్లా రోడ్డు, ఆదిఆంధ్రాపేట పరిధిలో మార్కెట్‌ ధర రూ.9వేలు ఉండగా, దీన్ని 60 శాతానికి పెంచి రూ.15 వేలుగా నిర్ధారించారు. ఇలా నగరంలో అనేక ప్రాంతాల్లో 25 శాతానికి తగ్గకుండా భూముల ధరలు పెంచారు. వీటితో పాటు నిర్మాణాల విలువల్లోను కొన్ని మార్పులు చేశారు. ఇప్పటి వరకు నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల పరిధిలో చదరపు అడుగుకు రూ.1400 ఉండగా, దాన్ని రూ.1490కి పెంచారు. అయితే ఇప్పటి వరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నిర్మాణ విలువను చదరపు అడుగుకు రూ.1400 ఉండగా రూ.1700 వసూలుచేసి ప్రభుత్వానికి జమ చేస్తుండేవారు. ప్రభుత్వం నిర్ణయించిన నెలవారీ టార్గెట్‌ల కోసం ప్రభుత్వం నిర్ధారించిన ధర కంటే ఒక చదరపు అడుగుకు రూ.300 అధికంగా ప్రభుత్వానికి జమ చేయడం శ్రీకాకుళంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో బలవంతంగా కట్టిస్తున్నారు. పెరిగిన నిర్మాణ విలువ ప్రకారం ప్రస్తుతం ఒక చదరపు అడుగుకు రూ.1490గా ప్రభుత్వం నిర్ధారించగా, శ్రీకాకుళం సబ్‌రిజిస్ట్రార్‌ అధికారులు మాత్రం రూ.1800 వసూలుచేయాలని నిర్ణయించారని తెలిసింది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్నా, కొనుగోలుదారుడు తీవ్రంగా నష్టపోతున్నారు. రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు చదరపు అడుగుకు అదనంగా రూ.300 కట్టించడం వల్ల స్టాంప్‌ డ్యూటీ పెరుగుతుంది. స్ట్రెక్చర్‌ వాల్యూ పెరిగి క్రయవిక్రయదారులు ఇద్దరూ ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారులకు ఆదాయ వివరాలను సమర్పించాల్సి వస్తుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి అదనపు వసూలును నిలువరించాలని కోరుతున్నారు.

భూముల ధరలు ప్రైవేటుగా ఎప్పుడో పెరిగిపోయాయి కదా.. ఇప్పుడు దానికి గవర్నమెంట్‌ వాల్యూ పెంచితే వచ్చిన నష్టమేమిటి? ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది కదా అన్న ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. అసలు చిక్కంతా ఇక్కడే ఉంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రధానమైన శాఖలో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ మొదటిది. ఆ తర్వాతే మద్యం. ఒక నిర్దిష్ట భూమిని ఎంతకు అమ్ముతున్నారన్న లెక్క మేరకు కాకుండా అక్కడ ప్రభుత్వం ఎంత ధర నిర్ణయించిందన్న దాని ప్రకారమే ఇంతవరకు స్టాంప్‌డ్యూటీ వసూలుచేసేవారు. దీనివల్ల ప్రభుత్వం నిర్దేశించిన ధరకు వైట్‌మనీ, మిగిలిన పెంచిన ధరకు బ్లాక్‌ మనీ అమ్మినవారి చేతికి వెళ్లేది. ఇప్పుడు ప్రభుత్వమే అక్కడ మార్కెట్‌ వాల్యూ కంటే ఎక్కువ ధర నిర్ణయించడం వల్ల అంత పెద్ద మొత్తంలో సొమ్ములు చెల్లించి కొనుగోలు చేయడానికి తాహతు ఉన్నవారు కూడా ఆ మేరకు బ్యాంకు బ్యాలెన్సు, ఐటీ రిటర్న్స్‌ ఉంటే గాని స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేరు. గతంలో రూ.10 లక్షలు ఉండే సెంటు స్థలం ధర ఇప్పుడు రూ.25 లక్షలయింది. రూ.10 లక్షల వరకు అంటే ఎటువంటి ఇన్‌కమ్‌ టాక్స్‌ సమస్యలూ ఉండవు. కానీ ఒక సెంటుకు రూ.25 లక్షలంటే నాలుగు సెంట్లకు కోటి రూపాయలు అవుతుంది. కచ్చితంగా ఈ క్రయవిక్రయాలు జరిగిన వెంటనే ఆధార్‌, పాన్‌ నెంబర్ల ఆధారంగా ఐటీ శాఖ దృష్టి సారిస్తుంది. దీనికి భయపడి ఇప్పుడు భూముల కొనుగోలు, అమ్మకాలకు ఎవరూ ముందుకు రారు. దీనివల్ల రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అప్పటి వరకు ఒక సంప్రదాయం ప్రకారం పద్ధతిగా పెరుగుతున్న ప్రభుత్వ ధరలు అప్పుడు ఒక్కసారిగా 50 శాతం పెరిగాయి. ఇదేంటని ప్రశ్నిస్తే సంక్షేమ పథకాలకు డబ్బులు కావాలన్నారు. అప్పట్నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం రాష్ట్రవ్యాప్తంగా కుదేలైపోయింది. చివరకు చిన్న చిన్న రైతులు పిల్లల చదువుల కోసమో, పెళ్లిళ్ల కోసమో భూములు అమ్మాలన్నా కుదరలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిని అవలంభిస్తుంది. దీనివల్ల రిజిస్ట్రేషన్‌ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎంత తగ్గిందనేది త్వరలోనే తేలుతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page