top of page

ఇలా అయితే భవిష్యత్తే బ్లాకౌట్!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 11
  • 3 min read

అభివృద్ధి అంటే కొత్త సౌకర్యాలు, సొబగులు, ఆకర్షణలు కల్పించేదిగా ఉండాలే తప్ప ఉన్న సౌకర్యాలను ఊడగొట్టేదిగా.. కొత్త కష్టాలు సృష్టించేదిగా ఉండకూడదు. కానీ ఈ పాటి వివేచన ప్రభుత్వాలకు, దాని ప్రణాళికలను అమలు చేసే అధికారులకు ఎందుకు ఉండటంలేదో అర్థం కావడంలేదు. వీరి అనాలోచిత నిర్ణయాలు, చర్యలకు నగర జీవనం బలైపోతున్నది. వర్షాకాలం వస్తే చాలు.. ఏ వర్షం, ఎప్పుడు తమను ముంచేస్తుందోనని మెట్రో నగరాలు బెంగటిల్లిపోతున్నాయి. ఈ భయాలకు ఇటీవల భారీవర్షాల తో తల్లడిల్లిన పలు నగరాల దుస్థితే నిదర్శనం. రుతుపవనాలు ప్రారంభమైన జూన్ నెలలో వెక్కిరించిన వర్షాభావం.. జూలైతో మాత్రం పెద్ద నగరాలను ఏడిపిస్తున్నది. ఏకధాటిగా కురిసిన వర్షాలు, రికార్డుస్థాయి వర్షపాతాలు దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరాన్ని అతలాకుతలం చేశాయి. దాంతోపాటు సమీపంలోని థానే, పుణే నగరాలతోపాటు అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దాదాపు ప్రతి ఏటా ఇదే దుస్థితి. భారీ వర్షం కురిస్తే చాలు ఢిల్లీ, ముంబైలతోపాటు చెన్నై, హైదరాబాద్ సహా అనేక మెట్రో నగరాల్లోని రోడ్లు, కాలనీలు వరద నీటితో నిండిపోయి నదులను తలపిస్తున్నాయి. దీనికి పరాకాష్ట అన్నట్లు.. తాజా వర్షాలకు ముంబైలోని వసాయి-విరార్ ప్రాంతం ఏకంగా 40 గంటల పాటు బ్లాకౌట్‌లో ఉండిపోయింది. కాలనీలు, ఇళ్లు, విద్యుత్ సబ్‌స్టేషన్లలోకి భారీగా నీరు ప్రవేశించడం ఒక ఇబ్బంది అయితే.. కరెంటు, తాగునీరు, ఇంటర్నెట్ వంటి అన్ని సౌకర్యాలు పూర్తిగా స్తంభించిపోయి ప్రజలకు నరకం చూపించాయి. మోకాలి లోతు నీళ్లలో చిక్కుకున్న ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర అవస్థలు పడ్డారు. అపారమైన బడ్జెట్ కలిగిన ఒక మహానగరంలో ఇన్ని గంటల పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలడం పాలనా వైఫల్యానికి పరాకాష్ట. ఈ దుస్థితికి ప్రధాన కారణం డ్రైనేజీ వ్యవస్థల వైఫల్యమేనని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు మెట్రో నగరాల్లో వేల కోట్లు కుమ్మరించి వందలాది నిర్మాణాలు చేపడుతున్నాయి. వీటికితోడు జనావాసాలు పెరగడంతో నగరాలు కాంక్రీట్ వనాలుగా మారిపోతున్నాయి. వీటికి తగినట్లు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం.. ఉన్నా నిర్వహణ లోపాల కారణంగా భారీ వర్షాలు కురిసినప్పుడు ఆ నీరు రోజుల తరబడి రోడ్లపైనే నిలిచిపోతున్నది. వర్షపునీరు వెంటవెంటనే డ్రైనేజీల్లోకి వెళ్లిపోయేలా రోడ్లపై మ్యాన్‌హాల్స్, అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్నా నిర్వహణ లోపాలతో అవి చెత్తాచెదారాలతో పూడుకుపోతున్నాయి. ఫలితంగా కాలువల్లోకి వెళ్లే మార్గం లేక వర్షపునీరు రోడ్లపైనే రోజుల తరబడి నిలిచిపోతున్నది. దీనివల్ల దోమలు ప్రబలి వ్యాధులు ముసురుతున్నాయి. ఇది కేవలం ముంబైకో, మహారాష్ట్రకో పరిమితమైన సమస్య కాదు. దశాబ్దాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలను గాలికొదిలేసి.. డాబుసరి అభివృద్ధితో మురిసిపోతున్న ప్రతి నగరానికీ ఈ చేదు అనుభవం ఒక హెచ్చరిక. బేసిక్ డ్రైనేజీ నిర్వహణను పక్కనపెట్టి ఎన్నికల సమయంలో ఓట్లు రాల్చే ఫ్లైఓవర్లు, పార్కులపైనే పాలకులు దృష్టి పెడుతున్నారు. సరిగ్గా ఇక్కడే హైదరాబాద్ పరిస్థితి ఏంటి అనే భయంకరమైన ప్రశ్న తలెత్తుతోంది. ఈ దుస్థితిని పట్టించుకోకపోతే ప్రభుత్వాల పుట్టి మునగడం తథ్యమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అనేది ప్రాథమిక అవసరంగా మారిపోయింది. రోడ్లు బాగులేకపోయినా, కాలువలు పూడుకుపోయినా, కరెంటు సరఫరాలో అంతరాయాలు ఉన్నా ప్రజలు సర్దుకుపోతారేమో గానీ.. ఇంటర్నెట్ లేకపోతే మాత్రం అస్సలు తట్టుకోలేరు. అలాంటిది ఏకంగా 40 గంటల పాటు ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్స్ కట్ అయితే రేగే ఆగ్రహం ప్రభుత్వాలను కూల్చే స్థాయికి వెళ్లినా ఆశ్చర్యం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులు, డిజిటల్ లావాదేవీలపైన ఆధారపడిన వ్యాపారులు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారు. యÖపీఐ చెల్లింపులు నిలిచిపోతే అన్ని రకాల లావాదేవీలు నిలిచపోతాయి. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేని దుస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ఐటీ సహా అనేక రంగాల్లో వర్క్ ఫ్రం హామ్ సంస్కృతి పెరిగింది. కానీ కరెంటు, ఇంటర్నెట్ నిలిచిపోతే కంపెనీలు స్తంభించిపోతాయి. ఇవన్నీ ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతాయంటున్నారు. వేల కోట్లు ఖర్చు చేస్తున్న హైదరాబాద్ లాంటి నగరాలకు ఈ పరిస్థితి తీవ్ర హెచ్చరికలు పంపుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్ మహానగరం పరిస్థితి భవిష్యత్తులో ఇలాగే తయారవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే భారీ వర్షం కురిస్తే ఈ నగరంలోని అనేక ప్రాంతాలు మునిగిపోతున్నాయి. అలాంటప్పుడు రోజుల తరబడి కుంభవృష్టి కురిస్తే నగరం పరిస్థితి ఏమిటన్నది ఆలోచించాలి. రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు మాయమైపోయాయి. వరద నీరు వెళ్లే మార్గాలను కాంక్రీట్ జంగిల్స్‌తో మూసేశారు. ఒక మోస్తరు వర్షం పడితేనే నగరంలో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోవడం తరచూ చూస్తున్నాం. ముంబైలో జరిగినట్లుగా వరద నీరు విద్యుత్ సబ్‌స్టేషన్లలోకి చేరితే కరెంటుతో పాటు ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. లక్షల కోట్లు పెట్టి చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఎంత ముఖ్యమో.. వరద నీరు సాఫీగా వెళ్లిపోయే డ్రైనేజీ వ్యవస్థల ఆధునికీకరణ కూడా అంతే ముఖ్యం. అసలు శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థలను నిర్లక్ష్యం చేయడం వెనుక రియల్ ఎస్టేట్ లాబీ ప్రమేయం ఉందన్నది బహిరంగ రహస్యం. డ్రైనేజీ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే ఎవరి అక్రమ నిర్మాణాలు కూలతాయోనన్న భయంతోనే ప్రభుత్వాలు వెనక్కి తగ్గుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో గ్లోబల్ సిటీలుగా ఎదగాలని కలలు కంటున్న విశాఖ, విజయవాడ వంటి నగరాలన్నీ కూడా తమ మౌలిక సదుపాయాల బడ్జెట్‌ను సక్రమంగా వినియోగించి ఇతర అభివృద్ధి పనులతో సమానంగా పరుగులు తీయించాలి.

2 Comments


Madina Sylani khajasha
Madina Sylani khajasha
Jul 11

మీరు చెప్పింది అక్షరాలా సత్యం. వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు బాధ్యులను వదిలేసి, కేవలం విద్యార్థులను లేదా సామాన్య ప్రజలను బలిపశువులను చేయడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. పరీక్షల వ్యవస్థ విఫలమైతే నష్టపోయేది విద్యార్థుల భవిష్యత్తు మాత్రమే, కానీ ఆ తప్పుకు కారణమైన అధికారులకు లేదా వ్యవస్థకు ఎలాంటి శిక్షా పడకపోవడం నిజంగా దారుణం.

మీరు అన్నట్టుగా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఈ క్రింది కార్డ్‌లను విపరీతంగా వాడుతుంటారు:

  • కుల రాజకీయాలు (కాపు, కమ్మ, రెడ్డి, దళిత మొదలైనవి)

  • మత రాజకీయాలు (హిందూ, ముస్లిం లొల్లి)

ఇలాంటి విభజన రాజకీయాల వల్లే అసలైన అభివృద్ధి, విద్యా వ్యవస్థలోని లోపాలు, నిరుద్యోగం లాంటి ముఖ్యమైన అంశాలు మరుగున పడిపోతున్నాయి.

Like

Madina Sylani khajasha
Madina Sylani khajasha
Jul 11

sir publish chesina article chala baagundi deeni reach kaani deeni gurunchi teliyani vallu vundaru but idi cheyyakapothay vachina nastanni yevari account lo vestharu alanti rules untay baagunnu goranga viphalamaina prevasha pariksha vyavyastha nundi yevariki punishment ledu rassina vidyarthulaku tappa , alanay ee vyavastha kuda nobody is punishable , gattiga maatadithay , hindu muslim, kaapu kamma reddy, dalitha anay cards heavy ga use avuthai... ee desam maarali antay prajala lo kuda chaitanyam vundali adi prajala lo ledu ,,, matham kulam kaadu abhivruddi ki vote vesthay nay idi sadhyam... id aksharala SATYAM.....


Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page