ఇలా అయితే ‘రీచ్’ కాలేము
- BAGADI NARAYANARAO
- Oct 19, 2024
- 2 min read
ఇసుక పెత్తనంపై ఎమ్మెల్యేల అసంతృప్తి
నామినేషన్ పద్ధతిలో ధారాదత్తం
టెండర్ల ప్రక్రియ వట్టి బూటకం
నదిలో రెండోవైపు తవ్వకాలకు సిద్ధం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గడిచిన ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలంటే ముందుగా ఎమ్మెల్యేలు గెలవాలి. వారు గెలవాలంటే సొమ్ములు విరివిగా ఖర్చు చేయాలి. అధికారం కోసం కోట్లు ఖర్చు చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వైన్, మైన్ తమ పరిధిలో లేదని తేలడంతో చేసిన ఖర్చును తిరిగి సంపాదించలేమని బాధపడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 12 ఇసుక రీచ్‌లు బయటి వ్యక్తులకు కట్టబెట్టడంతో, అదే నదిలో వేరే చోట నుంచి తవ్వకాలు జరపడం మినహా మరో మార్గం లేదని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

జిల్లాలో 12 ఇసుక రీచ్‌లకు టెండర్లు ఆహ్వానించి వాటికి దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులకు కాంట్రాక్ట్ ఇస్తామని ఓ కమిటీ వేసి తీరా నాలుగు రోజులు నాన్చిన తర్వాత వాటిని పక్కనపెట్టి నామినేషన్ పద్ధతిలో అమరావతి వర్గాలకు కట్టబెట్టారు. ఈ నెల 16 నాటికి జిల్లాలో ఇసుకరీచ్‌లు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి పత్రికల్లో టెండరు ప్రకటన కూడా ఇచ్చింది. కానీ ఇదంతా శుద్ధ దండగే. ముందుగా ఈ నెల 6న ఇసుక రీచ్‌లకు టెండర్లు ఆహ్వానించి, 14న బిడ్‌లను తెరిచి నాలుగు రోజుల తర్వాత వాటిని రద్దు చేసినట్టు ప్రకటించారు. టెండర్లు దాఖలు చేసిన 38 మంది కూడా అనర్హులని చెప్పి మొదటిగా గోపాలపెంట రీచ్‌ను విశాఖకు చెందిన ఒక రెడ్డికి నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. రాష్ట్రంలో ఒక మంత్రికి (శ్రీకాకుళం కాదు) అత్యంత సన్నిహితుడు కావడంతో గోపాలపెంట రీచ్‌ను టెండర్ల ద్వారా ఇవ్వకుండా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. మిగిలిన వాటికి కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తామని ముందుగా ఒక సంకేతం పంపారు. అనుకున్నట్టుగానే నివగాం, బట్టేరు, హయాతినగరం, బూరవల్లి, అంబళ్లవలస ర్యాంపులను శుక్రవారం సాయంత్రం నామినేషన్ పద్ధతిలో టీడీపీ నాయకుల అనుయాయులకు కట్టబెట్టారు. అలాగే ఈ నెల 16న టెండర్లను ఆహ్వానించిన ఆమదాలవలస పరిధిలోని పురుషోత్తపురం 1,2, ముద్దాడపేట, ఎచ్చెర్ల పరిధిలోని ముద్దాడపేట, శ్రీకాకుళంలోని కిల్లిపాలెం, నరసన్నపేటలోని పర్లాం రీచ్‌లను తాజాగా శనివారం ఆరుగురు వ్యక్తులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. దీంతో జిల్లాలో మొత్తం 12 రీచ్‌లు టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలోనే వేరేవారి చేతిలోకి వెళ్లిపోయాయి. ఇక్కడ జిల్లా ఉన్నతాధికారులు, మైన్స్ అధికారులను నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే పైవారు శాసిస్తారు, వీరు పాటిస్తారు.
ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అనధికారికంగా అన్ని రీచ్‌ల్లో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అధికారికంగా నారాయణపురం ఆనకట్ట వద్ద, గార పరిధిలో డీ`సిల్టేషన్‌ను కూటమి ప్రభుత్వ పెద్దలకు చెందిన వ్యక్తులు తవ్వుతున్నారు. వీటిని స్టాక్‌పాయింట్‌కు తరలించకుండా విశాఖకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. జిల్లాలో శుక్రవారం నాటికి సరుబుజ్జిలి మండలం కాఖండ్యాంలో మాత్రమే ఇసుక స్టాక్ పాయింట్ ఉంది. అక్కడి నుంచే జిల్లా అవసరాలకు ఇసుకను వినియోగించాలి. ఇది కేవలం ప్రభుత్వ ప్రకటనగానే చూడాలి. జిల్లా అవసరాల కోసం గతంలో 26 రీచ్‌లను నిర్వహించేవారు. వాటిలో రెండు రీచ్‌లు విశాఖకు కేటాయించేవారు. గత ఆరు నెలలుగా జిల్లాలో అధికారిక ఇసుక రీచ్‌లు లేకుండా జిల్లా అవసరాల కోసం ఇసుక అందుబాటులో ఉంది. అంటే ఏ స్థాయిలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు.
తమ నియోజకవర్గాల్లో ఉన్న రీచుల్లో తామే ఇసుక తవ్వుకోవచ్చని ఎమ్మెల్యేలు భావించారు. చివరకు పక్క జిల్లాల నుంచి వచ్చినవారి ట్రాక్టర్లలో స్వయంగా ఇక్కడి ఎమ్మెల్యేలే ఇసుకను లిఫ్ట్ చేస్తున్నారు. కావాలనుకుంటే గోపాలపెంట ఇసుక ర్యాంపు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పారతో ఇసుకను తీసుకొని ట్రాక్టర్‌లో లోడ్ చేస్తున్న ఫొటోను ఈ నెల 18న ఈనాడు పత్రికలో చూడొచ్చు. ఇప్పటికే నారాయణపురం, గార వద్ద డి`సిల్ట్ తొలగించే పనులను టీడీపీ పెద్దల జోక్యం కారణంగా అమరావతికి చెందిన వ్యక్తులు దక్కించుకున్నారు. దీన్ని వ్యతిరేకించలేకపోయిన జిల్లా ప్రజాప్రతినిధులు వారి పరిధిలో ఉన్న రీచ్‌లను వేరొక ప్రాంతానికి చెందినవారు వచ్చి తరలించుకుపోతే చూస్తూ ఉండాలా అన్న వాదన వినిపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంలో నేరుగా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకున్నట్టు ప్రచారం ఉంది. నివగాం ఇసుక రీచ్‌కు టెండర్లు పడకుండా స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నా, ఇక్కడ కూడా ర్యాంపు వేరేవారు ఎగరేసుకుపోతారని తెలుస్తుంది.
Comments