top of page

ఇసుక అక్రమాల్లో లోకల్‌ టాలెంట్‌!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • `ఎమ్మెల్యేలను, సర్కారును ఖాతరు చేయని స్థానిక నేతలు

  • `అవకాశమున్న ప్రతిచోటా వారి ఆధ్వర్యంలోనే దందాలు

  • `అధికార, ప్రతిపక్షాలు, నిఘా సిబ్బంది కలిసి మరీ వ్యాపారం

  • `ఉచితమని చెబుతున్నా.. అధిక ధరలకు కొనాల్సిన దుర్గతి

‘సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు.. చంటిగాడు లోకల్‌.. ఇక్కడే ఉంటాడు’ అంటూ ఈడియట్‌ సినిమాలో పూరీ జగన్నాథ్‌ పేల్చిన డైలాగ్‌ మాదిరిగా ఎమ్మెల్యేలు వస్తుంటారు, పోతుంటారు.. కానీ మేము లోకల్‌ అనే రీతిలోనే వ్యవహరిస్తున్నారు ఇసుకాసురులు. నియోజకవర్గంలో తనకు తెలియకుండా తట్టెడు ఇసుకెత్తినా ఊరుకునేది లేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఎన్నిసార్లు గొంతు చించుకున్నా ఇక్కడ వినేవాడు కనిపించడంలేదు. నీ పని నీది.. నా పని నాదన్న రీతిలోనే వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు దొంగతనంగా జరిపిన ఈ తతంగాన్ని ఇప్పుడు పబ్లిక్‌గానే చేసి సవాల్‌ విసురుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు స్థానికంగా ఒక్కటైపోవడం.. అధికార పార్టీ ముసుగులో ఇసుకను తోడేయడం. చివరకు అక్రమ రవాణాను నిరోధించే వ్యవస్థ కూడా ఇసుక వ్యాపారంలోకి దిగిపోవడంతో ఎమ్మెల్యే కాదు, ఆయన జేజమ్మ చెప్పినా వినే పరిస్థితి స్థానికంగా కనిపించడంలేదు. మరికొన్ని చోట్ల స్వయంగా ఎమ్మెల్యేల మనుషులే ఇసుకను తోడేస్తున్నారు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం తర్వాత ఇసుక పాలసీ పేరుతో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రతిసారీ తలనొప్పులు తెస్తున్నాయి. 2014లో చంద్రబాబునాయుడు ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టి 2019లో అధికారం కోల్పోయారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాల కాంట్రాక్టును ఒకే సంస్థకు అప్పగించి 2024లో అధికారం కోల్పోయింది. కారణం.. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ నాయకులకు ఇసుకే ప్రధాన ఆదాయ వనరుగా మారడం. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా నదుల ఇసుకకు భారీ డిమాండ్‌ ఉండటంతో రాజకీయ నాయకులకు ఇది ప్రధాన వ్యాపారంగా మారింది. కొందరు ఎమ్మెల్యేలు తమ చేతికి ఇసుక అంటకుండా చూసుకోవాలనుకున్నా స్థానికంగా ఉన్న పార్టీ సానుభూతిపరులు వారిని లెక్కచేయడంలేదు. వీరిని కట్టడి చేయండి మహాప్రభో అని నిఘావర్గాలను వేడుకుంటే.. ఏకంగా వారు కూడా ఈ వ్యాపారంలోకి దిగిపోయారని భోగట్టా. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకోవడం వల్ల చేసేదిలేక చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇసుకపై ప్రభుత్వం ఒక నిర్ధిష్టమైన పాలసీ తయారుచేయడానికి ఇప్పటికీ జంకుతుందంటే దీని వెనుక ఎన్ని చిక్కుముడులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రుతుపవనాల సీజన్‌ కావడం వల్ల ఇసుక తవ్వకాలు జరపకూడదన్న గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ఆదేశాల మేరకు ఇసుక పాలసీని ప్రకటించలేదని, తాత్కాలిక పద్ధతిలో ఇసుక సరఫరా విధానం ప్రకటించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ స్థానికంగా ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరికే దీనిపై గుత్తాధిపత్యం లేకుండా, ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చే విధానాన్ని రూపొందించడం అంత సులువు కాదు. ఈ విషయం అక్రమార్కులకు బాగా తెలుసు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు. జిల్లాలో గత ప్రభుత్వం నదుల్లో తవ్వి స్టాక్‌పాయింట్లలో ఉంచిన 37వేల మెట్రిక్‌ టన్నుల ఇసుకను రెండు రోజుల్లో ఊదేశారు. ఆ తర్వాత నారాయణపురం కాలువల్లో పేరుకుపోయిన ఇసుకను తొలగించడానికి ఇరిగేషన్‌ శాఖ నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేసి మైన్స్‌ శాఖ అనుమతులకు పంపేలోపే కాలువలు ఖాళీ అయిపోయాయి. ప్రస్తుతం నదుల్లో నీరు నిండుగా ప్రవహిస్తున్నా తవ్వకాలు మాత్రం ఎక్కడా ఆగడంలేదు. దీనికి కారణం.. ఇసుకకు భారీగా డిమాండ్‌ పెరగడమే. దీన్ని ఆసరాగా చేసుకొని ధరలూ పెరిగాయి.

స్థానిక నేతల అడ్డదారులు

శ్రీకాకుళం నియోజకవర్గం, దానికి ఆనుకొని ఉన్న నరసన్నపేట పరిధిలో పొన్నాం, బట్టేరు, భైరి, కరజాడ, బుచ్చిపేట, మడపాం, కళ్లేపల్లి, కిల్లిపాలెం, జోగిపంతులపేట, బూరవల్లి, హయాతినగరం, శాంతినగర్‌ కాలనీ, తోటాడ, గోపీనగరం తదితర ప్రాంతాల్లో టీడీపీ నాయకులు రంగంలోకి దిగి నదిలో బాటలు వేసి యంత్రాల సాయంతో ఇసుక తోడేస్తున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ తోపాటు ప్రతిపక్షానికి చెందిన నాయకులు ఎవరికివారే శుద్ధపూసలమని చెప్పుకుంటూ అవకాశం ఉన్న ప్రతిచోటా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. కొన్నిచోట్ల అధికార, ప్రతిపక్ష నాయకులు చేతులు కలిపి మరీ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో ప్రభుత్వ పెద్దలు హడావుడి చేసినా ఆ తర్వాత మిన్నకుండిపోయారు. దీంతో ఇసుక అక్రమంగా తవ్వి రవాణా చేస్తున్నవారంతా టీడీపీకి చెందిన వారిగానే చెలామణీ అయిపోతున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు వారించినా తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాలకు చెందిన నాయకులు నదీగర్భాల్లో యంత్రాల సాయంతో ఇసుక తవ్వి ట్రాక్టర్లతో తీరంలో డంప్‌ చేసి రాత్రి వేళల్లో జేసీబీలతో లారీల్లో లోడ్‌చేసి తరలించే ప్రక్రియను మళ్లీ ప్రారంభించారు.

అక్రమార్కులతో మిలాఖత్‌

ఉచిత ఇసుక అమలుపై ప్రభుత్వం కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన తర్వాత జిల్లాస్థాయి ఇసుక కమిటీలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు, ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బంది కలిసి బృందాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు చేస్తూ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలని నిర్ణయించారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిని పట్టుకొని వాహనాలను సీజ్‌ చేసి అపరాధ రుసుము వసూలు చేయాలని ఆదేశించారు. రెండు రోజులు ఈ బృందాలు హడావుడి చేసి ఆ తర్వాత చేతులెత్తేశాయి. 15 రోజుల క్రితం వరకు జిల్లాలోని అన్ని రీచుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) నియంత్రణ ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సెబ్‌లో ఉన్న ఎక్సైజ్‌శాఖ అధికారులు, సిబ్బందిని వెనక్కి తీసుకోవడంతో వీరంతా ఇసుక బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత డివిజనల్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని రంగంలోకి దించారు. వీరు అక్రమార్కులకు వంతపాడుతూ దగ్గరుండి ఇసుకను లారీలో లోడ్‌ చేయించి తరలించడానికి సహకరిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు వీరిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. శ్రీకాకుళం రూరల్‌ పరిధిలో కరజాడ, భైరిలో డివిజనల్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పట్టపగలే అక్రమార్కులతో చేతులు కలిపి 14 లారీలకు ఇసుక లోడ్‌ చేయించి ఒక్కో లారీ నుంచి రూ.5వేలు వసూలు చేసినట్టు స్థానికుల ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు అక్రమ రవాణా నియంత్రణను స్థానిక పోలీసులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు.

అక్రమ ఇసుకే గతి

జిల్లావ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై అందిన ఫిర్యాదులతో స్పందించిన కలెక్టర్‌, జేసీ ఇసుక రీచ్‌లు ఉన్న ప్రాంతాల్లో వాహనాలు నదిలోకి వెళ్లకుండా ట్రెంచ్‌లు తవ్వించి, 24 గంటలూ రెవెన్యూ సిబ్బంది అక్కడే ఉండాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో తహసీల్దార్లు తమ పరిధిలోని ఇసుక రీచుల వద్ద ట్రెంచ్‌లు తవ్వి కాపాలా బాధ్యతను వీఆర్వో, వీఆర్‌ఏలకు అప్పగించారు. రెవెన్యూ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు ఉండాలని కలెక్టర్‌ ఆదేశించడంతో మంగళవారం నుంచి పోలీసు సిబ్బంది జత కలిశారు. రీచుల్లోకి వాహనాలు వెళ్లకుండా రెవెన్యూ సిబ్బంది కాపలాపెట్టినా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. అక్రమార్కులు ముందుగా తవ్వి తోటల్లో డంప్‌ చేసిన ఇసుకను రాత్రి వేళల్లో లారీల్లో లోడ్‌ చేసి తరలించుకుపోతున్నారు. 2014లో మాదిరిగా కాకుండా నూతన ఇసుక విధానం పక్కాగా రూపొందిస్తున్నట్టు సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. ఈ విధానం ఎప్పుడు పట్టాలెక్కుతుందో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అప్పటి వరకు అవసరాల రీత్యా అక్రమ మార్గంలో లభిస్తున్న ఇసుకను వినియోగదారులు అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి.

Hozzászólások


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page