top of page

ఇసుక ఉచితం.. షరతులు వర్తిస్తాయి!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • నదీ తీరమంతా ఇసుకాసురులే

  • బిల్లులు లేకుండానే హెవీ లోడిరగ్‌

  • కొన్నిచోట్ల ఎమ్మెల్యే కుటుంబానికి లింక్‌

  • మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలకే ఓవర్‌టేక్‌

  • కిల్లిపాలెంలో ర్యాంపు వద్దంటూ వినతి

  • 900కు చేరిన నీటి టీడీఎస్‌

ఎక్కడి నుంచి కొలిచారో తెలియదు కానీ, మన పురాణాల్లో ఏడు అథోలోకాలు ఉన్నాయని చెబుతారు. ఇందులో అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలున్నాయని యమదొంగ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ డైలాగ్‌ విన్నవారికి అర్థమవుతుంది. ఇందులో మిగిలిన లోకాలు ఎక్కడున్నాయని అడిగితే చెప్పలేం కానీ పాతాళం ఎక్కడుందో తెలుసుకోవాలంటే కిల్లిపాలెం ఇసుక ర్యాంపు వద్దకు వెళ్తే కనిపిస్తుంది. గత ప్రభుత్వం ఇసుకను తవ్వి, మట్టిని తీసి, రాయిని కూడా దొలిచేసి వెళ్లిపోతే, ఈ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం వల్ల పాతాళంలోకి తవ్వుకుపోతున్నారు.

...

జిల్లాలో రక్తపు నిల్వలు తక్కువగా ఉన్నాయని భావించి ఓ స్వచ్ఛంద సంస్థ పిలుపు మేరకు కిల్లిపాలెంలో రక్తదాన శిబిరం నిర్వహించడానికి అందరూ సిద్ధపడ్డారు. ఇందులో 150 మంది యువకులు రక్తమివ్వడానికి ముందుకొచ్చారు. శిబిరంలో పరీక్షలు ముందుగా పూర్తి చేసిన తర్వాత కేవలం ఆరుగురు మాత్రమే రక్తమివ్వడానికి అర్హులని వైద్యులు తేల్చేశారు. కారణం తెలియని కాళ్లవాపులు ఉండటంతో బహుశా కిడ్నీ వ్యాధి బారిన పడ్డారేమోనని వైద్యులు అనుమానించారు.

సీన్‌ కట్‌ చేస్తే.. అక్కడికి రెండు రోజుల తర్వాత కిల్లిపాలెంలో బోరు నుంచి వచ్చిన నీటిని పరీక్షిస్తే పీహెచ్‌ లెవెల్స్‌ 6.93 చూపించింది. అలాగే నీటి టీడీఎస్‌ వాల్యూ ఒకచోట 900, మరోచోట 700 పైగా చూపించింది. వాస్తవానికి టీడీఎస్‌ 100 నుంచి 300 లోపు ఉండాలి. అది సముద్రం ఒడ్డునైనా సరే. కానీ 900 ఉందంటే.. నీరు ఏమేరకు కలుషితమైందో అర్థం చేసుకోవచ్చు. ఇక పీహెచ్‌ లెవెల్స్‌ కోసం ఈ కాలంలో ఎవరికీ చెప్పనవసరంలేదు. ఎందుకంటే సురక్షిత మంచినీరంటూ పీహెచ్‌ వాల్యూ సరిగ్గా ఉన్న వాటర్‌ క్యాన్‌ వేయించుకుంటున్నారు. లేదా వాటర్‌ ప్యూరిఫైర్‌ పెట్టుకుంటున్నారు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

శ్రీకాకుళం రూరల్‌ మండలం కిల్లిపాలెంలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తున్నారని తెలుసుకున్న స్థానికులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. గడిచిన ఐదేళ్లు తమ ఆరోగ్యాలతో ప్రభుత్వాలు ఆడుకున్నాయని, చివరకు వ్యవసాయం చేసుకోడానికి కూడా నది నుంచి నీరందలేదని, బోర్లు కూడా బావురుమనేటట్టు తవ్వేయడంతో పంటలు లేక, పనులు లేక నష్టపోయామని గుర్తుచేసుకుంటున్నారు. గతం చేసిన గాయం ఇంకా మానకముందే మళ్లీ కిల్లిపాలెంలో తువ్వకాలు మొదలయ్యాయి. వాస్తవానికి ఇంకా ఈ ర్యాంపునకు అనుమతులు రాలేదు. కానీ ప్రభుత్వం ఉచిత ఇసుక అనడంతో ఇక్కడకు వచ్చి చాలామంది ఇసుకను తోడుకుపోతున్నారు. ఇక అధికారికంగా ర్యాంపు ఇస్తే 16 టైర్లు కలిగివున్న లారీలకు కూడా అడ్డూ అదుపు ఉండదని స్థానికులు భయపడుతున్నారు. దీంతో వీరు మొన్న జరిగిన గ్రీవెన్స్‌కు వెళ్లి కిల్లిపాలెం ర్యాంపునకు అనుమతులివ్వొద్దంటూ మొరపెట్టుకున్నారు.

కిల్లిపాలెంకు ఆనుకొని పడమర వైపున నాగావళి ఉంటే, తూర్పువైపున ఉన్న ఇసుకను సుమారు 25 నుంచి 30 అడుగుల లోతున ఇసుక ఎత్తేయడం వల్ల తమ గ్రామానికి ఉన్న ఆనుకొని ఉన్న నాగావళి నది ప్రవహించకుండా గోతుల్లోకే నీరు వెళ్లిపోతుందని, దీని వల్ల జలకాలుష్యంతో ఇప్పటికి 500 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇసుకలో కూరుకుపోతున్న ప్రభుత్వ ప్రతిష్ట

ప్రభుత్వ విధానం ఉచితమే అయినా ఇసుక తవ్వకాలే అక్రమంగా సాగుతున్నాయి. జిల్లాలో ఉచిత ఇసుక విధానం నదికి సమీపంలో ఉన్న గ్రామాల్లోని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల ఆదాయ వనరుగా మారిపోయింది. ప్రభుత్వ ప్రకటించిన ఉచిత ఇసుక విధానం అమల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 12 అధికార ఇసుక రీచ్‌ల్లో నామినేషన్‌ పద్ధతిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నవారే ఇసుకను లారీల్లో ఎటువంటి పత్రాలు లేకుండా తరలించుకుపోతున్నారు. స్టాక్‌ పాయింట్‌కు నామమాత్రంగా ఇసుకను సరఫరా చేసి రాత్రివేళలో లారీల్లో విశాఖకు అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నరసన్నపేట పరిధిలో నామినేషన్‌ పద్ధతిలో అధికారిక ఇసుక రీచ్‌ను నిర్వహిస్తున్నవారి అక్రమాలకు అడ్డు అదుపు లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వీరికి కొనసాగింపుగా జిల్లా అంతటా ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. ఇసుక తవ్వకాలు, తరలింపు విషయంలో టీడీపీ, వైకాపా నాయకులు ఒక్కటై వ్యాపారం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇసుక వ్యాపారంలో మమేకమై ఉచిత ఇసుకను టీడీపీ నాయకులే అపహాస్యం చేస్తున్నారు.

అధికారుల్లో గందరగోళం

ప్రభుత్వం రోజుకో ఉత్తర్వు విడుదల చేస్తుండంతో అధికారుల్లోనూ గందరగోళం నెలకొంది. ఇసుకను ట్రాక్టర్లు, నాటుబండ్లు ద్వారా నది నుంచి తవ్వి తరలించుకోవచ్చని, వీరిని ఎవరైనా అధికారులు ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించడంతో మరింత గందరగోళానికి తెర తీసింది. చంద్రబాబు ప్రకటన తర్వాత జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరందుకుంది. ట్రాక్టర్లతో ఒడ్డుకు చేర్చి లారీల్లో విశాఖకు తరలిస్తున్నారు. వైకాపా హయాంలో ఇసుక అక్రమ వ్యాపారం చేసిన వారంతా టీడీపీ నాయకులతో చేతులు కలిపి ఇసుకను లారీల్లో తరలించుకుపోతున్నారు.

యథేచ్ఛగా రవాణా

శ్రీకాకుళం పరిధిలో ఇసుక అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల చందంగా సాగుతుంది. ఇసుక అక్రమ వ్యాపారం ఎంతలా సాగుతుందంటే.. దసరా రోజున బైరి, కరజాడకు చెందిన స్థానికులు 25 ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. అప్పటి వరకు ఈ రెండు గ్రామాల్లో సుమారు 130 ట్రాకర్టు ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేసిన వాటితో కలుపుకొని సుమారు 150కి చేరాయి. ట్రాక్టర్లు కలిగిన వారంతా బృందాలుగా ఏర్పడి ఇసుకను తవ్వి ఒడ్డుకు తరలిస్తున్నారు. దీన్ని నక్క గణేష్‌ ద్వారా విశాఖకు లారీల్లో తరలిస్తున్నారు. ఈయన వైకాపా హయాంలో పెద్ద పెద్ద లారీలు విశాఖకు పంపడంలో ఆరితేరిపోవడంతో అక్కడ టీడీపీ నాయకులు కొందరు గణేష్‌తో చెయ్యి కలిపి లారీకి రూ.2వేలు తీసుకొని వదిలేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

నక్క గణేష్‌కు నాలుగు ట్రాక్టర్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ తెలుగుదేశం మాజీ ఎంపీటీసీలకు సోదరులకు మరో రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. వీటిని మాత్రమే నదిలోకి దింపి ఇసుకను లోడ్‌ చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మిగిలిన ట్రాక్టర్‌ డ్రైవర్లు నదిలోకి వెళ్లనీకుండా వీరే ట్రెంచ్‌లు తవ్వుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే శంకర్‌కు ఫిర్యాదు చేయడానికి కొందరు బయల్దేరినా ఆయన జిల్లాలో లేరని తెలిసి వెనక్కు తిరిగి వెళ్లిపోయారు.

వంశధారకు సమీపంలో ఉన్న నైరా నుంచి గార మండలం జోగిపంతులుపేట, అంబళ్లవలస వరకు అనధికారికంగా ఇసుక తవ్వకాలు నిర్వహించి లారీల్లో విశాఖకు రవాణా చేస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో నాటుబండ్లు, ట్రాక్టర్లపై ఇసుక తరలించడానికి కేవలం సొంత ఇల్లు నిర్మాణం కోసమే అన్న నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. సొంత ఇంటి నిర్మాణం కోసం ఉచిత ఇసుక అవసరమైనవారు సచివాలయంలో పేరు నమోదు చేయించి ఇంటి నిర్మాణానికి అవసరమైన మేరకు ఇసుకను ట్రాక్టర్‌, నాటుబండిపై తరలించుకోవాలి. తరలించిన ఇసుకను స్టాక్‌ చేయకూడదన్న నిబంధన నూతన సాండ్‌పాలసీలో పొందుపరిచారు. ఇసుకను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తవ్వకాలు జరిపి తరలించాలి. ఈ నిబంధనలను టీడీపీ నాయకులే తుంగలో తొక్కేశారు. సాయంత్రం ఆరు తర్వాత జేసీబీలను నదిలోకి తీసుకువెళ్లి ట్రాక్టర్లతో ఇసుకను నది ఒడ్డుకు తరలించి జేసీబీలతో అప్పటికప్పుడే లారీల్లో లోడ్‌ చేస్తున్నారు. ఏ రోజు తవ్విన ఇసుక ఆ రోజే లారీల్లో విశాఖకు రవాణా చేస్తున్నారు.

బట్టేరులో గతంలో సెబ్‌కు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించిన పొన్నాంకు చెందిన ప్రసన్న, గురుగు వాసు, లక్ష్మణ, కర్రి ఆదన్న ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. గార మండలం బూరవల్లి వద్ద జగన్‌, ఊరు పెద్దమనిషిగా చెప్పుకునే నాయుడు, ఈశ్వరరావు తవ్వేస్తున్నారు. జోగిపంతులుపేట వద్ద ముద్దపు చిరంజీవి, గోపి బ్రదర్స్‌ వేర్వేరు కుంపట్లు పెట్టుకొని ఇసుక తవ్వుతున్నారు. అంబళ్లవలసలో పోలీసు శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న సంతోష్‌ ఇసుక ఎత్తుతున్నాడు. నాగావళిలో కొత్తరోడ్డు వద్ద పట్టపగలే చిలకపాలెంకు చెందిన సింహాద్రి పాపారావు ట్రాక్టర్లతో తీసుకువచ్చి లారీలకు లోడ్‌ చేస్తున్నారు. పాపారావు గత పదేళ్లుగా ఇసుక అక్రమ రవాణా చేయడంలో ఆరితేరిపోయాడు. ప్రభుత్వం ఏదైనా ఈయన ఆక్రమ ఇసుక వ్యాపారానికి ఢోకా లేదు.

ఇంత పెద్ద కథలో ఎక్కడా సగటు ఇంటి నిర్మాణదారుడికి ఇసుక తక్కువ ధరకు లభించడంలేదు. ఆ మాటకొస్తే ట్రాక్టర్‌ ఇసుక కావాలని సొమ్ములు చెల్లించినా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఎందుకంటే ట్రాక్టర్లన్నీ ఇసుకను ఒడ్డుకు తెచ్చి లారీలకు అందించే పనిలో ఉన్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page