ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి
దక్కించుకున్నవారి చరిత్రే కారణం
శాండ్ కమిటీలో అధికారిపై కలెక్టర్ ఆగ్రహం
నోటిఫికేషన్ నుంచి నివగాం మినహాయింపు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఉచిత ఇసుక పాలసీలో అసలు ఏం జరుగుతుందనేది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే అర్థం కావడంలేదు. మద్యం, ఇసుక దందాల్లో తలదూరుస్తున్న నేతలనుద్దేశించి ఆయన క్లాస్ పీకారని పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ఇసుక పాలసీ మీద గందరగోళం ఉందని స్వయంగా చంద్రబాబే వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. నది నుంచి ఇసుకను ఒడ్డుకు తరలించడానికి ప్రభుత్వం పిలిచిన టెండర్లలో నిబంధనలు కఠినతరంగా ఉండటంతో కేవలం బయటి వ్యక్తులు మాత్రమే దీనికి అర్హత సాధించారు. అలా అని వీరి గత చరిత్ర చూస్తే పూర్తిగా ఇసుకను కొల్లగట్టేసినట్లు తెలుస్తుంది. గతంలో అనేకచోట్ల టెండర్లు వేసి ర్యాంపులు దక్కించుకున్న సంస్థలకే ఈసారి కూడా అవకాశం దక్కడంతో స్థానిక తెలుగుదేశం నేతలు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టెండరు ప్రక్రియ ప్రకారమైతే వారికే ఇవ్వాలి. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒక మెట్రిక్ టన్ను ఇసుకను నదిలో తవ్వి, ట్రాక్టర్‌లో లోడ్ చేసి, బయట వేయడానికి రూ.19 ఒక సంస్థ కోట్ చేసిందంటే.. రేపు రీచ్ చేతికొచ్చిన తర్వాత ఏం చేయబోతుందో వేరేగా చెప్పనక్కర్లేదు. మరో సంస్థ రూ.110 వరకు ధర వేసుకోవచ్చని ప్రభుత్వం చెబితే రూ.61 కోట్ చేసిందంటే ఎంత మొత్తం ఇసుకను సొంతానికి వాడేస్తారో తెలుస్తుంది. అయితే ప్రభుత్వం పెట్టిన నిబంధనలు అలా ఉండటం వల్ల ఆ అర్హతలు ఉన్న సంస్థలే ఇప్పుడు టెండరులో పాల్గొన్నాయి. వాస్తవానికి మూడో కంటికి తెలియకుండా తెలుగుదేశం నేతలే ఈ టెండరులో పాల్గొని ర్యాంపులను దక్కించుకోడానికి ఎక్కడా ప్రచారం లేకుండా నోటిఫికేషన్ విడుదల చేశారు. అసలు మొదటి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు ముగిసిపోయిందో కూడా దసరా సెలవుల్లో తెలియలేదు. బుధవారం వేసిన రెండో నోటిఫికేషన్‌లో కూడా ముందస్తు తేదీ అంటే 15.10.2024 వేసి 18వ తేదీ సాయంత్రంతో టెండర్లు ముగుస్తున్నట్టు ప్రకటించారు. దీనర్థం తెలుగుదేశం నేతలు దక్కించుకుంటారని. కానీ ఇసుక పాలసీలో విధించిన నిబంధనల ప్రకారం తెలుగుదేశం నేతలెవరూ ఆ పారామీటర్లలో సరిపోవడంలేదు. దీంతో బయటి వ్యక్తులే ఇసుక సీనరీలను సొంతం చేసుకునే పరిస్థితి వచ్చింది. అలా అని వీరు సమర్పించిన పత్రాలేమైనా శతశాతం సరైనవా? అంటే.. అదీ కాదు. కేవలం గతంలో చేసిన అనుభవం వల్ల ఇటువంటి పత్రాలు సృష్టించడంలో కొందరు ఆరితేరిపోయారు. ఇప్పుడు ఆ పత్రాలతోనే టెండర్లు దక్కించుకున్నారు. ఈ వ్యవహారం బయటపడటంతో మొత్తం టెండర్ల ప్రక్రియనే కలెక్టర్ తాత్కాలికంగా రద్దుచేసి పారేశారు.
జిల్లాలో మొదట నోటిఫికేషన్‌లో బిడ్‌లు ఆహ్వానించగా వచ్చిన 38లో చివరికి మూడు ఏజెన్సీలకు ఓకే చెప్పారు. వీటిలో బుల్‌టెక్ సంస్థ పేరుతో గతంలో ఇసుక వ్యాపారం చేసిన అంధవరపు జగన్‌ను ముందు పెట్టి కొందరు వైకాపా నాయకులు బూరవల్లి, అంబళ్లపేట, గోపాలపెంట ర్యాంపులు దక్కించుకున్నారు. వీరి గతచరిత్ర ఘనం కావడంతో రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు వరకు ఈ వ్యవహారం వెళ్లింది. దీంతో గోపాల‘పెంట’ చేసేశారని రెండు రోజుల క్రితం ‘సత్యం’ కథనం కూడా ప్రచురించింది. హయాతినగరం, బట్టేరును చెరో ఏజెన్సీ దక్కించుకున్నాయి. వీటి చరిత్రనూ తవ్వితీయాల్సిన అవసరం ఉంది.
ఈ నెల 16 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 108 ఇసుక రీచ్‌ల టెండర్లు పూర్తిచేసి ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. ఈ నెల 11న ఆన్‌లైన్‌లో టెండర్లు ఆహ్వానించి 16 నాటికి కేటాయింపు ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించినా ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. రాష్ట్రంలో కేవలం గుంటూరు, విజయనగరంతో పాటు మరో జిల్లాలో మాత్రమే రీచ్‌ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశారు. ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ అంటూ హడావుడి చేసినా మార్గదర్శకాలు రూపొందించడంలో విఫలమైందనే విమర్శలను ఎదుర్కొంటుంది. జిల్లాలో కొత్తూరు మండలం నివగాం, శ్రీకాకుళం పరిధిలోని హయాతినగరం, బట్టేరు, నరసన్నపేట పరిధిలోని గోపాలపెంట, గార మండలంలోని బూరవల్లి, అంబళ్లపేటకు టెండర్లు పిలిచారు. వీటికి మొత్తం 38 మంది ఆన్‌లైన్‌లో టెండర్లు దాఖలు చేశారు.
ఎమ్మెల్యే వర్సెస్ పార్టీ అధ్యక్షుడు
పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం నివగాం రీచ్‌ను టెండర్లు ప్రక్రియ నుంచి చివరి నిమిషంలో మినహాయించారు. నోటిఫికేషన్‌లో దీనికి టెండర్లు ఆహ్వానించి ఆ తర్వాత రద్దు చేయడంపై టెండరుదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడి మధ్య సయోధ్య కుదరకపోవడంతో ర్యాంపు వ్యవహారం రోడ్డుకెక్కింది. నాయకులు పరస్పరం ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఏకంగా దీన్ని టెండరు ప్రక్రియ నుంచి తప్పించినట్లు తెలుస్తుంది.
సోమవారం తెరిచిన మొత్తం 38 టెండర్లలో ఆరు రీచ్‌లకు 18 మాత్రమే అర్హత సాధించాయని మంగళవారం నాటికి తేల్చారు. బుధవారం ఆరు రీచ్‌లను ఐదు రీచ్‌లుగా చూపించి 9 సంస్థలకు కుదించారు. ప్రస్తుతం 5 రీచ్‌లకు మూడు ఏజెన్సీలు మాత్రమే అర్హులను తేల్చారు. గురువారం నాటికి ఈ మూడు ఏజెన్సీలకు కూడా అర్హత లేదని పక్కన పెట్టేశారు. వార్షిక, నెలవారీ టర్నోవర్, అనుభవం వంటి కొత్త మార్గదర్శకాలతో తప్పించేశారు.
కలెక్టర్ ఆగ్రహం
గురువారం జిల్లాస్థాయి ఇసుక కమిటీతో కలెక్టర్ వర్చువల్‌గా టెండర్ల వ్యవహారంపై కలెక్టరేట్ నుంచే మాట్లాడినట్టు తెలిసింది. టెండర్ల ప్రక్రియలో టెక్కలి ఆర్డీవో, మైన్స్ డీడీ వ్యవహారంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. టెక్కలి ఆర్డీవో సొంత నిర్ణయాలు తీసుకోవడంపై కలెక్టర్ అక్షింతలు వేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఖరారైన ప్రతీ సంస్థపైనా ఏదో ఒక ఫిర్యాదు రావడంతో టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా పక్కన పెట్టాలని ఆదేశించినట్టు తెలిసింది.
కొత్తగా మరో ఆరు
కొత్త నోటిఫికేషన్‌లో ఆమదాలవలస పరిధిలో ముద్దాడపేట, పురుషోత్తపురం`1,2, ఎచ్చెర్ల పరిధిలో ముద్దాడపేట, శ్రీకాకుళం పరిధిలో కిల్లిపాలెం, నరసన్నపేట పరిధిలో పర్లాంలో ఇసుకను మాన్యువల్‌గా ట్రాక్టర్లలో లోడ్ చేసి స్టాక్‌పాయింట్‌కు తరలించి ఇసుకను వినియోగదారులకు లోడ్ చేసి ఇవ్వాలి. ఒక మెట్రిక్ టన్ను ఇసుకను గరిష్టంగా రూ.110, కనిష్టంగా రూ.90కి తగ్గకుండా బిడ్ దాఖలు చేయాలి. మొదటిసారి ఇచ్చిన నోటిఫికేషన్‌లో గరిష్టంగా రూ.110కి మించకుండా బిడ్ దాఖలు చేయాలని సూచించి రెండోసారి ఇచ్చిన నోటిఫికేషన్‌లో కనిష్ట ధరను పేర్కొన్నారు. మొదటి సారి ఇచ్చిన ఆరు రీచ్‌లకు టెండర్లు ఆహ్వానించినప్పుడు వచ్చిన బిడ్‌లో రూ.19, రూ.61, రూ.83 కోట్ చేసినవారు ఉన్నారు. వాస్తవంగా ఈ ధర గిట్టుబాటు కాదు. అయినా తక్కువకు కోట్ చేశారు. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే ఇసుక పాలసీ ఎప్పటికీ ఒక కొలిక్కి రాదు. నిబంధనల మేరకే కాంట్రాక్ట్ అప్పగించాలంటే తెలుగుదేశం నేతలకు రాదు. లేదూ తెలుగుదేశం నేతలకు కాంట్రాక్ట్ కావాలంటే నిబంధనలు సడలించాలి. లేదంటే గత ప్రభుత్వం అనుసరించిన విధానంలాగే ఉంటుంది. కాకపోతే చంద్రబాబు ఉచిత ఇసుకని హామీ ఇచ్చారు కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి.
👍