భారత శాస్త్రవేత్తలు సంధించిన మరో లేఖాస్త్రం
పెద్దఎత్తున 176 మంది శాస్త్రవేత్తల సంతకాలతో లేఖ
ఇద్దరు శాస్త్రవేత్తలకు అవార్డు ఇవ్వకపోవడం పట్ల కినుక

(దుప్పల రవికుమార్)
మన దేశపు అత్యున్నత సైన్స్ పురస్కారం శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులపై పరుచుకున్న నీలినీడలు ఇంకా వీడలేదు. సరికదా మరింత ముసురుకుంటున్నట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది బహూకరించిన అవార్డులలో అర్హులైన ఇద్దరు శాస్త్రవేత్తలను ఉద్దేశ పూర్వకంగానే భారత ప్రభుత్వం జాబితా నుంచి తప్పించడంపై నిరసన తెలుపుతూ 26 మంది శాస్త్రవేత్తలు ఆగష్టు 30న కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగ ముఖ్య కార్యదర్శి (పిఎస్‌ఏ)కు లేఖ రాసారు. పత్రికలలో వస్తోన్న పలురకాల కథనాలపై స్పష్టమైన వివరాలు కోరుతూ వారు రాసిన లేఖ సంచలనం సృష్టించింది. అవార్డులలో పైరవీలు జరిగినట్టు, శాస్త్రవేత్తలు కానివారికి పురస్కారాల జాబితాలో చేర్చినట్టు, తాము సూచించిన పేర్లను ప్రభుత్వం తొలగించినట్టు, తదితర వదంతులు రేగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈమారు ప్రకటించిన పురస్కారాల నేపథ్యం తెలియజెప్తే అందరి సంశయాలు తీరుతాయని, శాస్త్రవేత్తల మీద మాయని మచ్చలు చెరిగిపోతాయని వారు భావించారు. వారి డిమాండుకు తగినట్టుగానే పిఎస్‌ఏ అజయ్ సూద్ శాస్త్రవేత్తలకు ఒక జవాబు రాశారు.
అవార్డుల రగడ
మన దేశంలో 1958 నుంచీ ప్రదానం చేస్తున్న ఈ అవార్డును ప్రముఖ శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ పేరుమీద నెలకొల్పారు. వివిధ శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, భూ వాతావరణ పరిశోధన, ప్లానెటరీ సైన్స్ తదితర విభాగాలలో మన దేశీయ శాస్త్రవేత్తలు చేసిన గణనీయమైన కృషికి అందించే ఈ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వ సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న సిఎస్‌ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్)కు అప్పజెప్పారు. గత ప్రభుత్వ ఆనవాయితీలను మార్చడం ద్వారా వాటి ఆనవాళ్లను చెరిపేయాలని నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని రంగాలలో కృషి చేస్తోంది. మరో వందేళ్లయినా చెక్కుచెదరని పార్లమెంటును వదిలేసి కొత్త పార్లమెంటు కట్టినట్టుగానే, ఢల్లీిలోని అనేక వీధుల పేర్లు మార్చినట్టుగానే, చాలా ప్రభుత్వ పథకాల్లో నెహ్రూ, ఇందిరల పేర్లు తొలగించి జనసంఫ్‌ు నేతల పేర్లు చేర్చినట్టుగానే భట్నాగర్ అవార్డును ఎత్తేయాలని చూసింది. కాని, శాస్త్రవేత్తలు ఈ ప్రయత్నాన్ని భారత శాస్త్రవేత్తల బృందం ఖరాఖండీగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది. స్వతంత్రంగా ఉన్న ఈ అవార్డును ఒక సమూహంలో చేర్చింది. మొత్తం శాస్త్ర సాంకేతిక పురస్కారాలను రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలనే పెద్ద సమూహంగా ఏర్పాటు చేసింది. దానిని విజ్ఞాన రత్న, విజ్ఞాన శ్రీ, విజ్ఞాన్ యువ శాంతిస్వరూప్ భట్నాగర్, విజ్ఞాన బృందం అని నాలుగు విభాగాలుగా విడదీసింది. ఆందోళనకరంగా, ఈ అవార్డుల ఎంపిక విధానాన్ని మార్చింది. గత ఏడాది వరకు ప్రతి విభాగపు సెలక్షన్ కమిటీలోను గతంలో ఈ భట్నాగర్ అవార్డు పొందిన శాస్త్రవేత్తలు ఉండేవారు. ఆరు దశాబ్దాల తర్వాత ఈ ఎంపిక కమిటీలో శాస్త్రవేత్తలను భారీగా కుదించి, వారి స్థానంలో ప్రభుత్వ అధికారులను చేర్చింది. విజేతల వివరాలు వెల్లడిరచే అధికారం శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రివర్యుల చేతిలో ఉండేట్లు నిబంధనలు సవరించింది.
వరుస ఉత్తరాలతో హడావిడి
ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలకు అజయ్‌సూద్ రాసిన లేఖలో కొత్తగా ఏమీ లేదు. మార్చిన నిబంధనలు ఆయన వల్లెవేసారు తప్ప ప్రభుత్వం ఇద్దరు శాస్త్రవేత్తల పేర్లను జాబితా నుంచి ఎందుకు తొలగించారో ఆ లేఖలో వివరించలేదు. దాంతో మండిపడిన శాస్త్రవేత్తలు 176 మంది మరో లేఖాస్త్రాన్ని సంధించారు. అయితే ఈ బృందంలో శాస్త్రవేత్తలతో పాటు సీనియర్ అకడమీషియన్లు, ఐఐఎస్‌ఇఆర్ వంటి సంస్థల అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు తమ నిరసన స్వరాన్ని మేళవించారు. ఈ అవార్డుల ఎంపికలో శాస్త్రవేత్తల పాత్రను, ప్రమేయాన్ని కుదించి, వారి స్థానంలో రాజకీయ నేతల జోక్యాన్ని పెంచడంపై తీవ్రంగా మండిపడ్డారు. వివిధ జాతీయ విజ్ఞాన సంస్థలలో అహరహం కృషి చేస్తున్న భారతీయ శాస్త్రవేత్తలను గుర్తించి ఇచ్చే ప్రోత్సాహకాల్లాంటి ఈ అవార్డుల ఎంపికలో రాజకీయాలు జోక్యం చేసుకోవడం వల్ల దాని ప్రభావం నేరుగా వారు చేసే ప్రయోగాలపైన పడుతుందని, వాటి నాణ్యతలో రాజీపడే ప్రమాదముందని ఈ లేఖలో దుయ్యబట్టారు. ఇదివరకు ఎన్నడూ ఈ విధమైన ప్రయోగం శాస్త్రవేత్తల విషయంలో జరగలేదని, వారి పనిలో రాజకీయ జోక్యం తీవ్ర నష్టానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉక్కిరిబిక్కిరి
ప్రస్తుతానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గొంతు వినిపించే శాస్త్రవేత్తలను అవార్డుల జాబితా నుంచి తొలగించినట్టే కనిపిస్తుందని, భవిష్యత్తులో ఇది అనేక దారుణమైన రూపాలు తీసుకుంటుందని ఆందోళన చెందుతున్నారు. క్రమంగా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేవారి పేర్లనే అవార్డులకు పరిశీలించే పరిస్థితి ఏర్పడుతుందని భయపడుతున్నారు. దీని వెనుక ఊహించని కోణాలున్నాయని వారు చెప్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి అవార్డులు నిరాకరించడంతో ఆగకుండా గ్రాంటులు, నిధుల సరఫరా ఆపేస్తే ఆ పరిస్థితిని ఊహించలేమన్నారు. ఉద్యోగాల భర్తీలో, సంస్థ నుంచి సంస్థకు జరిపే బదిలీలలో, పదోన్నతులలో తీవ్రమైన ప్రభావం చూపే వీలుందన్నారు. ఇది సైన్స్ ఆచరణకు అగాధం సృష్టిస్తుందన్నారు. దీనివల్ల భారతదేశంలో శాస్త్ర ప్రగతి కుంటుపడే అవకాశముందని వాపోతున్నారు. వెంటనే ప్రభుత్వం అవార్డులకు సంబంధించి ఏర్పరచిన నూతన నిబంధనలను ఉపసంహరించుకుని, జాబితా నుంచి తొలగించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు వెంటనే అవార్డులను ప్రకటించాలని వారు కోరారు. దీనికి ఇంకా పిఎస్‌ఏ నుంచి సమాధానం రాలేదు.
تعليقات