top of page

ఇంకొక్క ఛాన్స్‌!

Writer: ADMINADMIN
  • `శ్రీకాకుళం, పాతపట్నంలలో అసమ్మతి సమావేశాలు

  • `ఇండిపెండెంట్లుగా పోటీ చేయాలని ఇన్‌ఛార్జీలపై ఒత్తిడి

  • `నిర్ణయం మార్చుకోవాలంటూ అధిష్టానానికి డెడ్‌లైన్లు

  • `ఎచ్చెర్లను బీజేపీ ఖాతాలో వేయడంతో టీడీపీలో నిరాశ




జిల్లాలో టీడీపీ టిక్కెట్లు దక్కని సీనియర్లు ఒకవైపు అసంతృప్తితో రగిలిపోతున్నా మరోవైపు అధిష్టానం మనసు మార్చుకోకపోతుందా.. అన్న ఆశతో ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, పాతపట్నం, ఎచ్చెర్లల్లో టికెట్‌ దక్కని సీనియర్లు తమ అనుచరులతో సమావేశమై ఇండిపెండెంట్‌గా బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూనే మరోవైపు టీడీపీ అధిష్టానం పునరాలోచిస్తుందనే ఆశతో ఉన్నారు. తమకు మరొక ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతూనే అధిష్టానం మనసు మార్చుకోడానికి వీరొక ఛాన్స్‌ ఇస్తున్నారు. ఆదివారం పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తన అనుచరులతో సమావేశమై టీడీపీ తనను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. అధిష్టానం నిర్ణయం మార్చుకోపోతే ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తానని ప్రకటించారు. అధిష్టానం నిర్ణయం కోసం పదిరోజులు వేచిచూస్తానని కూడా పేర్కొన్నారు. మరోవైపు ఎచ్చెర్ల సీటును బీజేపీకి కేటాయించారని తేలడంతో కళా వెంకట్రావు గ్రూపు రాజకీయాలనైతే ప్రోత్సహించడంలేదు గానీ టీడీపీ సులభంగా గెలిచే సీటును బీజేపీకి ఇచ్చి వైకాపాను అధికారంలోకి తేవద్దంటూ చంద్రబాబు ముందు సహచరులతో కలిసి ఆదివారం తన ఆవేదన వినిపించారు. గత ఐదేళ్లుగా ఎచ్చెర్లలో గ్రౌండ్‌ బలోపేతం చేశామని, ఇప్పుడు బీజేపీకి ఆ సీటు ఇచ్చేయడం వల్ల వైకాపా లబ్ధి పొందుతుందని తెలిపారు. ఆయన వెనుక వెళ్లిన క్యాడర్‌ సోమవారం నాటికి తిరిగి వచ్చేసినా కళా వెంకట్రావు మాత్రం చంద్రబాబు మనసు మారుతుందనే భావనతో విజయవాడలోనే ఉన్నారు. ఇక శ్రీకాకుళం నియోజకవర్గంలో టికెట్‌ దక్కని గుండ కుటుంబం మూడు రోజులుగా తమ అనుచరవర్గంతో మంతనాలు జరుపుతోంది. ఎంపీ సీటుకు అప్పలసూర్యనారాయణ, ఎమ్మెల్యే బరిలో లక్ష్మీదేవి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగాలని కార్యకర్తలు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. తమ నిర్ణయాన్ని ఈ నెల 26న వెల్లడిస్తామని గుండ దంపతులు పేర్కొన్నారు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లా తెలుగుదేశంలో టికెట్ల పోరు రోజుకోరూపం సంతరించుకుంటోంది. ఎచ్చెర్ల సీట్లు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం దాదాపు ఖాయం కాగా శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జీలుగా ఉన్న గుండ లక్ష్మీదేవి, కలమణ రమణలను పక్కనపెట్టి గొండు శంకర్‌, మామిడి గోవిందరావులకు టికెట్లు ఇవ్వడంతో ఆ నియోజకవర్గాల్లో అసంతృప్తి రాజకీయాలు ఊపందుకున్నాయి. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్లుగా బరిలో దిగే దిశగా శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో అసమ్మతి రాజకీయాలు జరుగుతుంటే.. కచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఉన్న ఎచ్చెర్లను పొత్తు పేరుతో బీజేపీకి కేటాయిస్తున్నారన్న వార్తలు అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి కళా వెంకట్రావు వర్గంలో గుబులు రేకెత్తిస్తున్నాయి. ఎచ్చెర్లలో టీడీపీ అభ్యర్థినే బరిలో దింపాలన్న యోచన చంద్రబాబుకు ఉన్నప్పటికీ పొత్తుల్లో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒక సీటు బీజేపీకి ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ఎచ్చెర్లకు విడిచిపెట్టేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ బీజేపీ తరఫున టికెట్‌ ఆశిస్తున్న నడికుదిటి ఈశ్వరరావుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు ఆ పార్టీలో అనేకమంది కీలక నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. వీరంతా కూడా ఎచ్చెర్ల బీజేపీకి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కళా వెంకట్రావు టిక్కెట్‌ ఖరారు చేసుకొని వచ్చినా, లేకపోయినా ఆయన విశాఖ ఎయిర్‌పోర్టులో దిగే సమయానికి 200 కార్లతో స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకురావడానికి అనుచరగణం సిద్ధం అవుతోంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కళా వెంకట్రావుకు ఉన్న బలాన్ని చాటి చెప్పడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. వాస్తవానికి కళా వెంకట్రావుకు విజయనగరం ఎంపీగా పోటీ చేయమని టీడీపీ సూచించింది. కానీ ఆయన నిరాకరించడంతో ఎమ్మెల్యే సీటు విషయంలో పార్టీ ఎటూ తేల్చుకోలేకపోయింది. ఒకానొక సందర్భంలో గజపతినగరంలో పోటీ చేయాలని పార్టీ కోరినా వేరే కాపు నాయకుడి స్థానాన్ని తాను తీసుకోలేనని కళా వెంకట్రావు చెప్పడంతోపాటు ఎచ్చెర్ల కోసమే పట్టుబట్టారు. తీరా ఇప్పుడు ఆయన టిక్కెట్‌ను బీజేపీ ఎగరేసుకుపోతుందా అన్న చర్చ జరుగుతోంది.

  • స్వతంత్ర పోటీపై తర్జనభర్జనలు

ఇక శ్రీకాకుళం నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడ గొండు శంకర్‌కు టికెట్‌ ప్రకటించిన దగ్గర్నుంచి ప్రతిక్షణం రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. శంకర్‌ పేరు ప్రకటించిన రోజే గుండ వర్గీయులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజు అప్పలసూర్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించి తమ కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు. కార్యకర్తలంతా ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని ఒత్తిడి తెచ్చారు. ఆదివారం అప్పలసూర్యనారాయణ తన ఇంటి సమీపంలో తన వర్గం కార్యకర్తలతో ఓ బహిరంగ సమావేశం నిర్వహించారు. ఇందులో కూడా ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతామన్న సంకేతాలే పంపారు. 1967లో సోంపేట నుంచి ఎమ్మెల్యేగా, శ్రీకాకుళం ఎంపీగా రెండు పదవులకూ పోటీ చేసి గౌతు లచ్చన్న గెలిచారని అప్పలసూర్యనారాయణ ఆ సందర్భంగా ఉటంకించారు. అలాగే నియోజకవర్గంలో గ్రూపులను కట్టడి చేయమని అచ్చెన్నాయుడుకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు. తాజాగా సోమవారం కూడా తమ సొంత కల్యాణ మండపంలో అనుచరులతో సమావేశమై అనేక అంశాలు చర్చించారు. కార్యకర్తలు మాత్రం ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన కొన్ని అభ్యర్థిత్వాలపై పార్టీ పునరాలోచనలో ఉందన్న సమాచారం ఉండటంతో గుండ కుటుంబం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ నెల 26న నిర్ణయం ప్రకటించనున్నట్లు అప్పలసూర్యనారాయణ వెల్లడిరచారు. టీడీపీకి ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా పని చేస్తున్న రాబిన్‌ శర్మ టీమ్‌ సభ్యులు ఆదివారం కలమట వెంకటరమణ నిర్వహించిన సమావేశానికి, సోమవారం గుండ లక్ష్మీదేవి వర్గం చేపట్టిన అసమ్మతి మీటింగ్‌కు కూడా హాజరయ్యారు. కార్యకర్తలు ఏమనుకుంటున్నారన్న విషయంపై అమరావతి పార్టీ కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు రాష్ట్రంలో కొన్ని సీట్లపై ఓ కమిటీని వేసి వారి సూచనల మేరకు మార్పులు, చేర్పులు చేస్తారన్న ఆశతో సీనియర్లు ఉన్నారు.



  • శత్రువుకి శత్రువు మిత్రుడు

పాతపట్నంలో రెడ్డి శాంతి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి పార్టీ నుంచి సస్పెండైన లోతుగెడ్డ తులసీవరప్రసాద్‌ కూడా వైకాపా అధిష్టానం మనసు మార్చుకుంటుందన్న భావనలోనే ఉన్నారు. ఈమేరకు రెడ్డి శాంతి వ్యతిరేకులతో ఆదివారం కొత్తూరులో ఓ రహస్య సమావేశం నిర్వహించారు. రెడ్డి శాంతిని మార్చే అవకాశం ఉంటుందనే భావనతో ఆయన ఉన్నారు. అది కుదరకపోతే పాతపట్నంలో టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావుకు ఆయన వర్గం మద్దతు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక్క ఎచ్చెర్ల మినహా మిగిలిన అన్నిచోట్లా టిక్కెట్‌ ప్రకటించిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. శ్రీకాకుళం నుంచి గొండు శంకర్‌ వ్యక్తిగతంగా అందరికీ ఫోన్లు చేసి పార్టీతో కలిసిరావాలని కోరుతున్నారు. అలాగే పాతపట్నంలో రెడ్డి శాంతి, మామిడి గోవిందరావులు ప్రచారం ప్రారంభించేశారు. రెడ్డి శాంతి తనయుడు ఆమె తరఫున కొన్ని గ్రామాల్లో తిరుగుతుండగా, మామిడి గోవిందరావు తరఫున తెలుగుదేశం సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు రంగంలోకి దిగారు. సోమవారం నగరంలోని శాంతి కన్వెన్షన్‌లో బీజేపీ`జనసేన`తెలుగుదేశం కూటమి సయోధ్య సమావేశం పెద్ద ఎత్తున నిర్వహించగా కొత్తగా టిక్కెట్లు దక్కించుకున్న టీడీపీ అభ్యర్థులంతా పాల్గొన్నారు. ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం మళ్లీ మార్పులంటే అంత సులువుగా జరిగే పనేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

 
 
 

Comments


Commenting has been turned off.

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page