ఇంకా వందరోజులు కాలేదా.. గోవిందా!
- SATYAM DAILY
- May 27
- 1 min read
హామీని విస్మరించిన పాతపట్నం ఎమ్మెల్యే
నరకకూపంగా మారిన సిరసువాడ-కుంటిభద్ర రోడ్డు

(సత్యంన్యూస్, కొత్తూరు)
ఈ ఫొటోలు చూశారా.. ఒకటి పొలంబాట కంటే అధ్వానంగా ఉంటే.. ఇంకొకటి చెరువును తలపిస్తోంది. మరొకటి బురదగంటను మరిపిస్తోంది. వీటిని చూస్తే.. ‘ఏ రోడ్డును చూసినా ఏమున్నది గర్వకారణం.. గతకుల కష్టాలు తప్ప’ అన్నట్లు కునారిల్లుతున్నాయి. కొత్తూరు మండలంలో సిరుసువాడ, కుంటిభద్ర గ్రామాలకు వెళ్లే రోడ్డు దీనికి మినహాయింపు కాదు.

రోడ్డు నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు హామీలు ఇవ్వడం.. శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేయడం తప్ప రోడ్డు రూపురేఖలు మాత్రం మారడం లేదు. ప్రజలకు కష్టాల ప్రయాణాలు తప్పడం లేదు. 2014`19 మధ్య అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కలమట రమణ ఒకసారి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. కాగా తనను గెలిపిస్తే వంద రోజుల్లోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని టీడీపీ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఆయన గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణానికి మరోసారి గోవిందరావు శంకుస్థాపన రాయి వేశారు. కానీ వంద రోజులు కాదు.. ఏడాది గడిచినా ఈ రోడ్డు మాత్రం నిర్మాణానికి నోచుకోలేదు. గత వైకాపా ప్రభుత్వం ప్రజల కనీస సౌకర్యమైన రోడ్లను కూడా మరమ్మతులు చేయలేకపోయిందన్న విమర్శలు రేగాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వ భాగస్వాములైన తెలుగుదేశం, జనసేనలు రోడ్ల దుస్థితినే హైలైట్ చేస్తూ ఆందోళనలు చేశాయి. అవే వైకాపా ఓటమికి కారణమయ్యాయి. తీరా అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే గానీ కూటమి ప్రభుత్వం గానీ రోడ్ల బాగోగులను పట్టించుకోవడంలేదు. కొత్తూరుతో పాటు నివగాం, మదనాపురం, శిరుసువాడ తదితర గ్రామాల్లోనూ రోడ్ల దుస్థితి ఇలాగే ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్ల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Comments