పేకాట గ్రూపులన్నీ ఒక్కటయ్యాయి
రౌడీషీటర్ల డైలీ వాటా
పైసా పెట్టుబడికి 10 శాతం లాభం
ఒడిశా బొమ్మ చూపించి వదిలేస్తున్న పోలీసులు
పేకాట నష్టంతో ఐపీ పెట్టేస్తున్న ప్లేయర్స్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాజ్యం కోసం దాయాదులు కొట్టుకుంటే నష్టపోవడం ఖాయమని స్వయంగా కృష్ణభగవానుడే రాయబారిగా కౌరవుల వద్దకు వెళ్లాడని భారతం ద్వారా తెలుసుకున్నాం.
మంది ఎక్కువైతే మజ్జిగ పలుచబడిపోతుందంటారు పెద్దలు. మనలో మనం కొట్టుకుంటే పక్కోడికి లోకువైపోతామన్నది కూడా భార్యాభర్తల గొడవలో పెద్దోళ్లు చెబుతుంటారు.
కలిసివుంటే కలదు సుఖం అనే సూత్రాన్ని ప్రస్తుతం సమాజంలో ఎంతమంది పాటిస్తున్నారో తెలియదు గానీ అందరూ కలిసి సిండికేటయి టెండర్లు వేయడం ద్వారా వైన్‌షాపులు నష్టపోకుండా దక్కించుకున్నట్టే ఇప్పుడు జిల్లాలో పేకాట శిబిరాలు నిర్వహించేవారందరూ ఒక్క తాటిమీదకు రావడం వల్ల వచ్చే లాభాలేమిటో అటు పోలీసులు, ఇటు రౌడీషీటర్లు ప్రాక్టికల్‌గా చూపిస్తున్నారు. జిల్లాలో చేయడానికి వ్యాపారాలు లేవని, ఎందులో పెట్టుబడులు పెట్టినా గ్యారెంటీ లేదని భావించేవారికి జిల్లాలో పేకాటాడిస్తున్నవారు మోడల్‌గా నిలుస్తున్నారు. పైసా పెట్టుబడి లేకుండా కార్పొరేట్ స్థాయిలో జరుగుతున్న ఈ వ్యాపారానికి రౌడీషీటర్లు, వారిని పీచమణచాల్సిన పోలీసులు ఒక్కటై చేయిస్తున్న వ్యాపారమిది. ఇలా వదిలేస్తే మరికొద్ది రోజుల్లో ఈ వ్యాపారంలో షేర్ల పేరిట ఐపీవోకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

నగరానికి చెందిన గోపీ, నరసన్నపేటకు చెందిన గన్నీ గారబందలో పేకాట ఆడిస్తూ పాతపట్నం, మెళియాపుట్టి పోలీసులకు మామూళ్లు ఇస్తూ మేనేజ్ చేస్తుండేవారు. దీనిపై ‘సత్యం’ వరుస కథనాలు ప్రచురించడంతో అప్పటి జిల్లా పోలీసు ఉన్నతాధికారి జోక్యం చేసుకోవడంతో నగరానికి చెందిన గోపిని పాతపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని హెచ్చరించి విడిచిపెట్టేశారు. ఆ తర్వాత ఈ గారబందలో పేకాట శిబిరాన్ని ఎత్తేసి గోవా, నేపాల్‌కు మకాం మార్చేశాడు. గోపి రాష్ట్రం వెలుపల పేకాట ఆడిస్తుండగా, తామెందుకు తగ్గాలని నరసన్నపేటకు చెందిన గన్నీతో తోటాడకు చెందిన బెండి తులసి చేతులు కలిపి ఒడిశాలోని పూరి, కొరాపుట్ జిల్లాల్లో రాష్ట్ర సరిహద్దులకు సమీపంలో పేకాట శిబిరాలను నిర్వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వాటాల పంపకాల్లో తేడాలు, పోలీసులు, విలేకరుల పేర్లతో డబ్బులు వసూళ్లలో తేడాలొచ్చి వేర్వేరుగా శిబిరాలను నిర్వహించి శ్రీకాకుళం, నరసన్నపేటకు చెందిన వారిని తీసుకొని వెళుతుండేవారు. నిర్వాహకులు ఎంతమంది ఉన్నా పేకాడేవారు స్థిరంగా కొందరే ఉండటం వల్ల రెండు శిబిరాలుగా విడిపోతే లాభాలు తగ్గిపోతున్నాయని, ఖర్చులు కలిసిరావడంలేదని ఈ రెండు గ్రూపులు భావిస్తూవచ్చాయి.
రౌడీషీటర్ల ద్వారా రాజీ

బెండి తులసి, గోపీ రెండు గ్రూపులుగా విడిపోయి పేకాట శిబిరాలను నిర్వహించడం, ఒకరిపై మరొకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో పేకాట శిబిరాల నిర్వహణకు ఆటంకం ఏర్పడిరది. దీనికి పుల్‌స్టాప్ పెట్టి రెండు గ్రూపులను ఒక్కటి చేసేందుకు కొందరు రౌడీషీటర్లు పెద్దమనుషులుగా వ్యవహరించినట్టు తెలిసింది. ఇటీవల నగరానికి చెందిన కొందరు రౌడీషీటర్లు వీరి మధ్య సిట్టింగ్ పెట్టి సయోధ్య కుదర్చడంతో గారబందలో పేకాట శిబిరానికి బీజం పడిరది. ఇంతకు ముందు జిల్లా పోలీసు అధికారికి తెలిసే జరిగేవి. అందుకు అనుగుణంగా మంత్లీలు ముట్టజెప్పేవారు. ఇప్పుడు కేవలం ఆయా సర్కిల్ పరిధిలో ఉన్న అధికారులను మేనేజ్ చేస్తూ జిల్లా సరిహద్దుల్లో పేకాట ఆడిస్తున్నారు. నిఘా అధికారులకు సమాచారం ఉన్నా స్థానిక పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో బెండి తులసి, గన్నీ, గోపి లాంటి పేకాట శిబిరాల నిర్వాహకులు ఆటలు సాగుతున్నాయి.
రోజుకు రూ.60 లక్షలు

పోలీసుల నిఘా ఉందని సమాచారం ఉన్నా నిర్వాహకులు లెక్కచేయరు. వీరికి ఒడిశా, నేపాల్, గోవా తదితర ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నిర్వహించే అనుభవం ఉంది. వీరిలో నగరానికి చెందిన గోపికి శ్రీకాకుళం, నరసన్నపేట, విశాఖ నుంచి గోవాకు జూదరులను తీసుకువెళ్లి పేకాటతో పాటు, క్యాసినో ఆడిరచే, ఆడే అనుభవం ఉంది. మొన్నటి వరకు తులసి, గన్నీ ఒక గ్రూప్‌గా ఏర్పడి పేకాట శిబిరాలు నిర్వహిస్తే, గోపి ఒక్కడే పేకాట శిబిరాలను నిర్వహిస్తూ వచ్చారు. ఈమధ్యకాలంలో పోలీసులు పేకాట శిబిరాలపై దాడులు చేస్తుండటంతో వీరంతా ఒడిశాకు మకాం మార్చేశారు. మన్యం జిల్లాకు సరిహద్దులో ఉన్న కొరాపుట్ జిల్లా గోచక్కలో పేకాట శిబిరాలను నిర్వహిస్తునూ గంజాయిని దిగుమతి చేస్తున్నట్టు ‘సత్యం’లో కథనం రావడంతో అక్కడ పేకాట శిబిరాన్ని ఎత్తేశారు. వ్యవహారమంతా పోలీసులతో మాట్లాడి చక్కబెట్టామని చెప్పి గజపతి జిల్లా గారబందకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మామిడితోటను వేదికగా చేసుకొని పేకాట శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ శిబిరంలో రోజు సుమారు రూ.60 లక్షలకు పైగా పేకాట లావాదేవీలు జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం.
ప్రతిరోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పేకాట ఆడుతుంటారు. ఇందులో ఆటగాళ్లంతా శ్రీకాకుళం, నరసన్నపేటకు చెందిన పెద్ద తలకాయలే. వీరందరినీ ఒక చోటకు చేర్చి సురక్షితంగా, సాఫీగా పేకాట ఆడిరచడానికి ఒక టీమ్ ఉంది. ఈ టీమ్‌కు పేకాట ఆడిరచడంలో ఉన్న అనుభవం సుమారు 20 ఏళ్లు పైమాటే. పోలీసులను మేనేజ్ చేస్త్తూ నిత్యం ఏదో ఒకచోట పేకాట ఆడిరచడం వీరి ప్రవృత్తి. వీటి నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నవారు సుమారు రూ.20లక్షలు వెచ్చించి పేకాట శిబిరాన్ని నడుపుతున్నారు. రూ.20 లక్షల మూలధనాన్ని వాటాల రూపంలో సమకూర్చుకొని గారబందలో పేకాట నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు ఒడిశాలోని కొరాపుట్ జిల్లా గోచక్కలో నిర్వహించినవారే గత ఐదు రోజులుగా గజపతి జిల్లా గారబందకు పేకాట శిబిరం మార్చారు. అక్కడ, ఇక్కడా పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నది ఆమదాలవలస మండలం అక్కివరం పంచాయతీ గోపీనగరానికి చెందిన బెండి తులసీ, నరసన్నపేటకు చెందిన సీహెచ్ గణేష్ (గన్నీ), శ్రీకాకుళం నగరం ఇందిరానగర్ కాలనీకి చెందిన గోపీకృష్ణ (గోపి). వీరితో వాటాదారులుగా ఆమదాలవలస మండలం అక్కివరానికి చెందిన సీపాన శ్రీను, మాజీ ఆర్మీ ఉద్యోగి తాండ్ర తేజేశ్వరరావుతో పాటు మరికొందరు శ్రీకాకుళానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. వీరు దర్జాగా ఒడిశాలో పేకాట నిర్వహించడానికి జిల్లాకు చెందిన పోలీసులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. గోచక్కలో పేకాట ఆడిస్తూనే దొడ్డిదారిన విశాఖ నుంచి ఆటకు వచ్చేవారు గంజాయిని తీసుకొని వెళుతుండేవారని ఆరోపణలున్నాయి.
కాయిన్స్‌తో లావాదేవీలు
పేకాట శిబిరాల మీద పోలీస్ రైడ్ జరిగితే క్యాష్ దొరక్కుండా ఉండేందుకు లైసెన్స్‌డ్ క్లబ్బుల్లో ఆడేమాదిరిగానే కాయిన్ విధానాన్ని ప్రవేశపెట్టించింది స్వయంగా పోలీసులేనన్న ఆరోపణలున్నాయి. పొరపాటున పోలీస్ కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు వెళ్తే రైడ్ చేయాల్సి ఉంటుందని, ఆ సమయంలో నగదు దొరకలేదని చెప్పాలంటే కాయిన్లు ఉండాలని సలహా ఇచ్చింది వీరేనట.
రూ.5వేలు, రూ.10వేలు, రూ.20వేలు, రూ.50 వేలు కాయిన్స్‌తో పేకాట శిబిరాన్ని నడుపుతున్నారు. పుసుపురంగులో రూ.5వేలు, లేత ఎరుపు రంగులో రూ.10వేలు, పచ్చరంగులో రూ.20 వేలు, ఎరుపురంగులో రూ.50 వేలు కాయిన్స్‌ను తీసుకున్న తర్వాత పేకాట శిబిరంలో పాల్గొంటున్నారు. కాయిన్స్‌తో మాత్రమే ఆడాల్సి ఉండడంతో పేకాట నిర్వాహకులకు నగదు ఇచ్చి కాయిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లోపల`బయట (అందర్`బాహర్)గా పిలవబడే ఈ ఆటలో నిర్వాహకులు వాటాదారులుగా ఉన్నవారి నుంచి కొంత నగదును పక్కనపెడతారు. పోలీసులు, విలేకర్లు, శిబిరం నిర్వహణకు అయ్యే ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని అట్టేపెట్టుకుంటారు. ప్రస్తుతం గారబందలో పోలీసుల పేరుతో రోజుకు రూ.50వేలు పక్కకు తీస్తున్నారు. దీంతోపాటు పేకాట సాఫీగా సాగించడానికి, సమాచారం బయటకు వచ్చినా దాన్ని సర్దుబాటు చేయడానికి నగరానికి చెందిన కొందరు రౌడీషీటర్లకు మామూళ్లు ఇస్తుంటారు. విలేకర్లు, పోలీసుల పేర్లతో వసూలుచేసే మొత్తాన్ని బెండి తులసి పంపిణీ చేస్తుంటాడు. ప్రస్తుతం పేకాట శిబిరంలో రోజుకు పోలీసులు పేరుతో మినహాయిస్తున్న రూ.50వేలు బెండి తులసి ఏ రాష్ట్ర పోలీసులకు ఇస్తున్నారన్నదానిపై చర్చ సాగుతుంది.
Comments