top of page

ఈసారైనా ‘రింగు’ తిరుగుతుందా?!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • మరోసారి తెరపైకి శ్రీకాకుళం ఔటర్‌ రింగ్‌రోడ్డు

  • 11 ఏళ్ల నుంచి నలుగుతున్న ప్రతిపాదనలు

  • ఉడా నుంచి నగరాన్ని తప్పించడంతో నిధుల సమస్య

  • ఈ ప్రాజెక్టును పూర్తిగా విస్మరించిన గత సర్కారు

  • ఇప్పుడైనా ప్రభుత్వం సహకరిస్తేనే ఓఆర్‌ఆర్‌ సాకారం

ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లో దిగి గూడెం మీదుగా పాత్రునివలస స్టేడియం పక్క నుంచి సానివాడ రోడ్డు మీదుగా కలెక్టరేట్‌కు వంద అడుగుల రోడ్డులో రయ్‌మని దూసుకుపోతే ఎలా ఉంటుంది?
నగరం మధ్యలో ఉన్న పెద్ద పెద్ద గొడౌన్లు, హోల్‌సేల్‌ వ్యాపారాలు నగరానికి ఆనుకొని మూడు నియోజకవర్గాలకు విస్తరించి ఉండే రోడ్డులోకి మారిపోతే ఎలా ఉంటుంది?
నగరమంటే జీటీ రోడ్డు, కళింగ రోడ్డు, పాలకొండ రోడ్లే కాకుండా 540 ఎకరాల్లో విస్తరించి ఉన్న వంద అడుగుల రోడ్డుకు అటు ఇటు మల్టీలెవెల్‌ కాంప్లెక్స్‌లు వస్తే ఎలా ఉంటుంది?
.. ఇవన్నీ ఊహించుకోడానికి బాగుంటాయి కానీ వాస్తవరూపం దాల్చేదెప్పుడు అనే ప్రశ్న సగటు జీవిలో తలెత్తితే.. ఆ తప్పు మనది కాదు, కచ్చితంగా పాలకులదే. పంపకాలు తప్ప ప్రగతి మీద దృష్టి సారించని గత పాలకుల పుణ్యమాని ఇలాంటి ప్రాజెక్టులు పట్టాలెక్కడంలేదు. కానీ సంకల్పం ఉంటే చేయొచ్చని, పైన చెప్పుకున్నవన్నీ జరగొచ్చని నిరూపించింది విజయనగరం. ఒకప్పుడు శ్రీకాకుళం కంటే విజయనగరం పేద జిల్లా. మరీ ముఖ్యంగా కమర్షియల్‌ వాల్యూ లేని జిల్లా. అటువంటిది రింగ్‌రోడ్డు వచ్చిన తర్వాత విజయనగరం హెడ్‌క్వార్టర్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నంలో ఉన్న ప్రతి వసతి ఇప్పుడు విజయనగరంలో కనిపిస్తోంది. ఇందుకు కారణం.. ఒకేఒక్కటి. అది ఔటర్‌ రింగ్‌రోడ్డు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళంలోనూ మళ్లీ ఔటర్‌ రింగ్‌రోడ్డు ఆశలు మొలకెత్తాయి.
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లా కేంద్రం శ్రీకాకుళం చుట్టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలన్న ప్రతిపాదన చాన్నాళ్ల నుంచే ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలోనూ ఓసారి దీనిపై చర్చించారు. మాస్టర్‌ ప్లాన్‌లో పేర్కొన్న రింగ్‌రోడ్డుకు అవసరమైనన్ని నిధులు కేటాయించలేం కాబట్టి దాని పరిధిని కుదిస్తే నిధులు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ మేరకు శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌(సుడా) అధికారులు ఓ ప్రతిపాదన సిద్ధం చేసినా దానిపై ప్రభుత్వం స్పందించలేదు. పైసా విదల్చలేదు. వాస్తవానికి 20 ఏళ్లకోసారి నగరానికి కొత్త మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలి. ఆ మేరకు శ్రీకాకుళం నగరానికి కొత్త మాస్టర్‌ప్లాన్‌ రూపొందించినప్పుడే ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించారు. దీనిపైనే ఇటీవల రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు. నిజంగా ప్రభుత్వం దీనిపై ముందుకు వస్తే, స్థానిక నాయకులు నప్పించో, ఒప్పించో రైతుల నుంచి భూములు సేకరించగలిగితే శ్రీకాకుళం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే మాస్టర్‌ ప్లాన్‌లో కనిపిస్తున్నంత కలర్‌ఫుల్‌గా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కదు. ఎందుకంటే.. 540 ఎకరాలు సేకరించి 100 అడుగుల రోడ్డు వేయడమంటే చిన్న విషయం కాదు. రోడ్డు మాత్రమే వేయడానికి ఏదో ఒక శాఖ ద్వారా కాంట్రాక్ట్‌ ఇచ్చేస్తే సరిపోతుంది.. కానీ దానికి ముందు 540 ఎకరాలు సేకరించడంలోనే స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల సత్తా బయటపడుతుంది. ఎందుకంటే నగరానికి ఆనుకొని ఉన్న పంట భూములకు విపరీతమైన ధర ఉంది. దీనికి తోడు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రిజిస్టర్డ్‌ వాల్యూ కంటే రెండున్నర రెట్లు అధికంగా పరిహారం చెల్లించాలి. ప్రభుత్వం దీని కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించాలి. కానీ అది కుదిరే పనికాదు. అందువల్ల అడుగుల రోడ్డు వస్తే భూముల ధరలు అమాంతం పెరుగుతాయని, వ్యవసాయ భూమిగా ఉన్నది కమర్షియల్‌ భూమిగా మారుతుందని ఒప్పించగలగడంలోనే నేతల చాతుర్యం బయటపడుతుంది. వాస్తవానికి రాజశేఖరరెడ్డి హయాం తర్వాత భూసేకరణ అంశంలో ప్రభుత్వాలు క్రియాశీలంగా వ్యవహరించడంలేదు. ఎందుకంటే.. వారి మొదటి ప్రాధాన్యత సంక్షేమం అయిపోయింది. అందుకే కొత్తగా టీడీఆర్‌ బాండ్ల సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 100 గజాల భూమి రైతు నుంచి తీసుకుంటే 400 గజాలకు టీడీఆర్‌లు ఇస్తుంది. 100 గజాల భూమికి ప్రభుత్వం ఇచ్చే రేటుకంటే 400 గజాలకు ఇచ్చే టీడీఆర్‌ల విలువ కాస్త ఎక్కువే అయినా ఆ మేరకు రైతులను ఒప్పించగలిగేవారు కావాలి. ప్రస్తుతం కొత్తగా అమలుచేయాల్సిన మాస్టర్‌ ప్లాన్‌పై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. ఈ నెలతో ఆ గడువు కూడా ముగుస్తుంది. మాస్టర్‌ప్లాన్‌ మేరకు నగరంలో నిర్మాణాల పరిస్థితి పక్కన పెడితే, ఔటర్‌ రింగ్‌రోడ్డు వస్తే నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తీరిపోతాయి. మొన్నటి వరకు జీటీ రోడ్డులో మాత్రమే సెంటర్‌ పార్కింగ్‌తో ఇబ్బందులుండేవి. ఇప్పుడు కళింగ రోడ్డు కూడా అదే పరిస్థితికి దిగజారిపోయింది. రింగ్‌రోడ్డు నిర్మాణం పూర్తయితే గానీ శ్రీకాకుళంలో నడిచే పరిస్థితి కనిపించడంలేదు.

11 ఏళ్లు.. ఎన్నో ప్రతిపాదనలు

శ్రీకాకుళం నగరం చుట్టూ ఔటర్‌ రింగ్‌రోడ్‌(ఓఆర్‌ఆర్‌) నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ ఏడాదిలో పనులు ప్రారంభించేలా ప్రాణాళిక రూపొందించాలని ఈ నెల 13న కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. నగరం చుట్టూ 36 కిలోమీటర్ల పొడవునా 100 అడుగుల వెడల్పుతో 18 గ్రామాలను కలుపుతూ రింగ్‌ రోడ్డు నిర్మిస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 80 అడుగుల రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభలోనూ చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఓఆర్‌ఆర్‌ ప్రతిపాదన 11 ఏళ్ల నుంచి నలుగుతోంది. 2019 ఫిబ్రవరిలో ఉడా నుంచి శ్రీకాకుళాన్ని విడగొట్టి సుడాగా మార్చుతూ టీడీపీ ప్రభుత్వం నిర్ణయంతో ఉడా నుంచి నిధులు నిలిచిపోయి ఓఆర్‌ఆర్‌ ప్రతిపాదన అటకెక్కిందన్న విమర్శలు ఉన్నాయి. నగర అవసరాలు, ట్రాఫిక్‌ నియంత్రణకు వీలుగా 2013లోనే ఔటర్‌ రింగ్‌రోడ్డు ప్రతిపాదనను మాజీ మంత్రి ధర్మాన తెరపైకి తెచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 ఫిబ్రవరి 14న సీఎం చంద్రబాబు నరసన్నపేటబహిరంగ సభలో శ్రీకాకుళం రింగ్‌రోడ్డుపై ప్రకటన చేశారు. అదే ఏడాది జూన్‌ 10న రింగ్‌రోడ్డు నిర్మాణ సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఉడా వైస్‌చైర్మన్‌, చీఫ్‌ ఇంజినీర్‌, డీఈ, పట్టణ ప్రణాళిక అధికారులతో కూడిన బృందం నగరంలో పర్యటించింది. నగరానికి 12 కిలోమీటర్ల పరిధిలోని పొన్నాడ బ్రిడ్జి, ఖాజీపేట, అరసవల్లి, పాత్రునివలస, నవభావత్‌ జంక్షన్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించి రోడ్ల పరిస్థితి, భూసేకరణ తదితర అంశాలను రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. అనంతరం మూడు రకాల ప్రతిపాదనలు రూపొందించినా ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

గత ప్రభుత్వంలో తెరమరుగు

అక్కడికి మూడేళ్ల తర్వాత 2018 ఆగస్టు 15న జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి రూ.150 కోట్లు కేటాయించనున్నట్టు ప్రకటించారు. దీంతో అధికారులు పాత ప్రతిపాదనను పక్కనపెట్టి 2018 సెప్టెంబర్‌ మూడో తేదీన ఓఆర్‌ఆర్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను గుర్తించే ప్రక్రియ మళ్లీ చేపట్టారు. నగరం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో ఐదు మండలాల్లోని 18 గ్రామాలను కవర్‌ చేసేలా ఓఆర్‌ఆర్‌ నిర్మించాలని నిర్ణయించారు. కానీ దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. మూడో ప్రతిపాదన మేరకు నవభారత్‌ జంక్షన్‌ నుంచి తోటపాలెం, పొన్నాడ మీదుగా పొన్నాడ వంతెన, కలెక్టరేట్‌ లోపలి నుంచి కొత్తపేట, ఖాజీపేట, అరసవల్లి ఇంద్ర పుష్కరిణి, అమ్మవారి ఆలయం, పెదపాడు మీదుగా పాత్రునివలస వద్ద జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. జాతీయ రహదారి, నాగావళి తీరం, గెడ్డగట్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో రింగ్‌రోడ్డు నిర్మించేలా డీపీఆర్‌ సిద్ధం చేశారు. రహదారి మధ్యలో డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌, మొక్కలు, రహదారికి ఇరువైపులా కాలువలు, బస్‌ షెల్టర్ల ఏర్పాటుకు రూ.150 కోట్లు, రోడ్ల నిర్మాణం, పరిహారం చెల్లింపునకు రూ.340 కోట్లు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా గ్రామసభలు నిర్వహించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించారు. చివరికి దీన్ని కూడా అటకెక్కించారు. ఉడా నుంచి సుడా పరిధిలోకి శ్రీకాకుళం మారడంతో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రింగ్‌ రోడ్డు ప్రతిపాదన మరుగున పడిపోయింది.

ప్రభుత్వం పూనుకోకుంటే కష్టమే

నగర అవసరాలకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదన ఎంతో అవసరం. జనాభా పరంగా చూస్తే మున్సిపాలిటీకి ఎక్కువ, నగరపాలక సంస్థకు తక్కువ. మూడు లక్షల జనాభా ఉంటేనే నగరపాలక సంస్థ హోదా కల్పించాలి. అయితే 2 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నా శ్రీకాకుళం మున్సిపాలిటీని అప్‌గ్రేడ్‌ చేసి 2009లోనే నగరపాలక సంస్థ చేసేశారు. సుమారు 2 లక్షల జనాభా కలిగిన నగరాల్లో పదేళ్లకోసారి అంతర్గత రోడ్లను విస్తరించాల్సి ఉన్నా రాజకీయ నాయకులు జోక్యంతో ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం నగరంలో రోడ్లు విస్తరణ జరిగితే మౌలిక సదుపాయాలు మెరుగై ఉండేవి. కానీ అలా జరక్కపోవడంతో ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోతోంది. వీటన్నింటికీ ప్రత్యామ్నాయం ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణమే. కానీ ఉడా నుంచి తప్పించి సుడా ఏర్పాటు చేసి నగరాభివృద్ధికి నిధులు అందే అవకాశం లేకుండా చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రింగ్‌రోడ్డు నిర్మాణం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. సుడా వద్ద నిధుల్లేక 2019 నుంచి రోడ్లు, ఇతర నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో రింగ్‌రోడ్డు నిర్మాణానికి అవసరమైన రూ.500 కోట్లకుపైగా నిధులు సమకూర్చుకోవడం సుడా వల్ల కాని పని. మరోవైపు ప్రభుత్వం పూర్తిగా ఆ నిధులు కేటాయించడం లేదంటే వివిధ ఆర్థిక సంస్థల ద్వారా నిధుల సమీకరణకు అవకాశం కల్పిస్తేనే రింగ్‌రోడ్డు ప్రతిపాదన సాకారమవుతుందని అంటున్నారు.

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page