ఈసురోమని రోడ్డులుంటే.. పల్లెలేగతి బాగుపడునోయ్?!
- BAGADI NARAYANARAO
- May 21
- 3 min read
పల్లెపండుగలోనూ ప్రారంభంకాని రహదారులు
పీఆర్ పరిధిలోనే ఎక్కువ పెండిరగ్‌లు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పల్లె పండగతో గ్రామీణ రోడ్లకు మహర్దశ అంటూ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వాగ్దానం ప్రకటనలకే పరిమితమైంది. ఉపాధి హమీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ ద్వారా సీసీ, బీటీ రోడ్డులు నిర్మాణానికి పల్లెపండగ కార్యక్రమంలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రాధాన్యత క్రమంలో పనులు గుర్తించి కొన్నింటిని పూర్తిచేశారు. మరికొన్నింటిని మధ్యలోనే నిలిపేశారు. ఇంకొన్నింటి జోలికే వెళ్లలేదు. స్థానిక కూటమి పార్టీల ఎమ్మెల్యే సిఫార్సు మేరకు పల్లెపండగ పనులను పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారుల ఆధ్వర్యంలో ఉపాధి హామీ సిబ్బంది దగ్గరుండి చేయించారు. పల్లె పండగలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నింటిని బీటీ, సీసీ రోడ్లుగా మార్చుతారని సంబరపడిన గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆశలు నెరవేరలేదు. పంచాయతీరాజ్ పరిధిలో 5,644 సీసీ, బీటీ రోడ్డులు, ఆర్ అండ్ బి పరిధిలో 41 బీటీ రోడ్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అందులో పంచాయతీరాజ్ పరిధిలో 3,551 సీసీ, బీటీ రోడ్లు ప్రారంభించగా, 2,219 సీసీ, బీటీ రోడ్లు పూర్తి చేశారు. ఆర్ అండ్ బి పరిధిలో 41 బీటీ రోడ్లకు గాను 37 ప్రారంభించి కొంతమేర పూర్తిచేశారు. అయితే కొన్ని గ్రామీణ ప్రాంత రోడ్లను స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. ఆ రోడ్లు శిథిలావస్థకు చేరి అధ్వాన్నంగా తయారైనా కూటమి నాయకులు వాటిపై దృష్టి పెట్టలేదు. జిల్లాలో ఇలాంటి రోడ్లు పదుల సంఖ్యలో ఉన్నా, వాటిని ప్రాధాన్యత గుర్తించలేదు. దీంతో ఆ ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో గ్రామీణ ప్రాంతాల రోడ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు. తట్టెడు మట్టి వేయలేదు. కూటమి ప్రభుత్వం హయాంలోనైనా రోడ్లు మరమ్మతులకు నోచుకుంటాయని ఎదురు చూసినా ఆ ప్రయత్నాలు ఫలించడం లేదని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే వివక్ష చూపుతున్నారని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు
తట్టెడు మట్టి వేయలేదు
శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల పరిధిలో దూసి రోడ్డు నుంచి వంజంగి వరకు పంచాయతీరాజ్ పరిధిలో బీటీ రోడ్డును 2005లో మాజీ మంత్రి ధర్మాన హయాంలో నిర్మించారు. 2004 ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు ధర్మాన ఎన్నికైన ఏడాదిలోగా దూసి రోడ్డు నుంచి రాగోలుపేట మీదుగా ఏడు గ్రామాలను కలుపుతూ వంజింగి (ఆమదాలవలస రోడ్డు) వరకు సుమారు 3 కిలోమీటర్లు బీటీ రోడ్డు వేశారు. 20 ఏళ్ల క్రితం వేసిన బీటీ రోడ్డుపై ఇప్పటి వరకు తట్టెడు మట్టి వేయలేదు. మరమ్మతులు చేపట్టలేదు. ఆయా గ్రామాల పరిధిలో శ్రమదానం చేసి రోడ్డుపై గంతలు కప్పే ప్రయత్నం ఆయా గ్రామాలకు చెందిన యువత చేశారు. ఈ రోడ్డు ఆమదాలవలస నియోజకవర్గం పరిధిలో వంజంగి, సువ్వారిపేట, గుట్టముడిపేట ఉన్నాయి. శ్రీకాకుళం పరిధిలో రాగోలు పంచాయతీకి చెందిన రాగోలుపేట, బావాజీపేట, సెగిడిపేట, ఎస్సీ కాలనీ ఉన్నాయి. సుమారు 5వేలు జనాభా కలిగిన ఈ ఏడు గ్రామాలు నుంచి నిత్యం ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల రాకపోకలు సాగిస్తుంటారు. వ్యవసాయ పనుల, నిర్మాణ తదితర అవసరాలకు ట్రాక్టర్లు రాకపోకలు సాగిస్తాయి. అయినా ఆ రోడ్డు మరమ్మతులకు నోచుకోవడంలేదు. 2014లో ఆమదాలవలస ఎమ్మెల్యేగా కూన రవికుమార్ ఆయన నియోజకవర్గం పరిధిలో వంజంగి నుంచి గట్టుముడిపేట వరకు సుమారు 1.5 కిలోమీటర్లు బీటీ రోడ్డు మరమ్మతు పనులు చేశారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలో మిగతా 1.5 కిలోమీటర్ల పనులకు నిధులు మంజూరు చేయించాలని కోరినా సాధ్యం కాలేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో 3 కిలోమీటర్ల రోడ్డులో 1.5 కిలోమీటర్లు రోడ్డు మాత్రమే మరమ్మతులు చేసి శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలో విడిచి పెట్టేశారు. మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి 2018లో ప్రతిపక్ష నేతగా చేసిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్రను ఈ రోడ్డు మీదుగానే చేశారు. ఆ సమయంలో ఈ రోడ్డుపై గుంతల్లో మట్టి వేసి చదును చేశారు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదు.
మురుగు కాలువాను తలపిస్తున్నాయి
కూటమి పార్టీలు సార్వత్రిక ఎన్నికల సమయంలో గ్రామీణ రోడ్ల దుస్థితిని హైలెట్ చేసి ఓట్లు దండుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ రోడ్లు బాగుపడతాయిని ప్రజలు అంచనా వేసినా, ఆ స్థాయిలో ప్రాధాన్యత క్రమంలో రోడ్డు పనులు చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. ఆర్ అండ్ బి పరిధిలో రూ.6.22 కోట్లు అంచనా వ్యయంతో 41 బీటీ రోడ్డు పనులు ప్రారంభించినా బిల్లుల చెల్లింపులు జరగలేదు. గత ఏడాది నవంబర్‌లో కేవలం రూ.1.04 కోట్లు మాత్రమే బిల్లులు జమ చేసి ఆరు నెలలుగా ఒక్క పైసా జమ చేయలేదు. దీంతో బీటీ రోడ్డు పనులు సగంలోనే నిలిచిపోయాయి. ఆ కోవలోనే దూసి రోడ్డు నుంచి వంజంగి వరకు సుమారు 3 కిలోమీటర్లు బీటీ రోడ్డు మంజూరుకే నోచుకోలేదు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ రోడ్డు దుస్థితిని స్వయంగా పరిశీలించి స్థానిక ప్రజల అవస్థలను గుర్తించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువును తలపిస్తున్నాయి. వర్షాకాలంలో రోడ్డు మధ్యలో గుంతల్లో నీరు చేరి మురుగు కాలువల్లా మారిపోతున్నాయి. దీంతో బావాజీపేటలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని బావాజీపేట, రాగోలుపేట, సెగిడిపేట, ఎస్సీ కాలనీ ప్రజలు కోరుతున్నారు.
Comments