top of page

ఈ తప్పులకు బాధ్యలెవరూ లేరు!

Writer: ADMINADMIN
  • ఢల్లీి విమానాశ్రయంలో కూలిపోయిన సింహద్వారం

  • బీహార్‌లో కూలిపోతున్న 13 బ్రిడ్జీలు

  • ఇతర విమానాశ్రాయాల్లోనూ ఇదే తంతు


నరేంద్ర మోదీ అభిమానులేమో వాటికి బాధ్యత ప్రధాని ఎలా తీసుకుంటాడని నిలదీస్తారు. కట్టిన విమానాశ్రాయాలు, నిర్మించిన వంతెనలు, ఎంతో ప్రచార ఆర్భాటాలతో ఏర్పాటుచేసిన రహదారులు, ఇతర భవనాలు పట్టుమని పదేళ్లు పూర్తికాక మునుపే మన కళ్లెదుట వరుసగా కుప్పకూలిపోతుంటే దానికి ప్రధాని బాధ్యత వహించాల్సిన పని లేదని వాదన చేస్తున్నారు. కాని స్వయంగా ప్రధాని మోదీ అరవై ఏళ్ల కిందట దేశ తొలి ప్రధాని తీసుకున్న నిర్ణయాలను సైతం తప్పు పడుతున్నారు. నాటి ప్రధానులు నిర్మించిన భవనాల రూపురేఖలు మారుస్తున్నారు. అప్పటి ఏలికలు పెట్టిన రహదారుల పేర్లు చెరిపేస్తున్నారు. దేశవ్యాప్తంగా మంచికి కారణమని పూనుకున్న కీలకమైన ప్రాజెక్టుల నిర్ణయాలను ఎడాపెడా విమర్శిస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు జరుగుతున్న తప్పుల తిప్పలకు కారణమెవరు? వీటికి ఎవరూ బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? పబ్లిక్‌ డొమైన్‌లో జరుగుతున్న ఘోర వైఫల్యాలకు ఎవరూ బాధ్యులు కానవసరం లేదా?

జూన్‌ 28వ తేదీ వేకుమజామున ఢల్లీిలో భోరున వర్షం కురుస్తోంది. ఇంతలో ఒక మెరుపు మెరిసింది. అంతే విమానాశ్రయం ప్రధాన ద్వారం దగ్గర హోర్డింగ్‌ కుప్పకూలి నేలకొరిగింది. దానికింద పార్కింగ్‌ చేసిన అనేక కార్లు, మోటార్‌ సైకిళ్లు పచ్చడైపోయాయి. చాలామందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఎవరి కోసమో కారులో కూర్చుని ఎదురుచూస్తోన్న రమేష్‌కుమార్‌ (45) అక్కడే ప్రాణాలు వదిలేసాడు. ఇంత జరుగుతున్నా మన దేశ రాజధాని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటికే వర్షానికి తడిసి సగానికి పైగా ఆ పట్టణం మునిగిపోయి, ఎవరి బాధల్లో వారున్నారు. ఢల్లీి విమానాశ్రయంలో జరిగిన ప్రమాదం ఉదయం కాకుండా రద్దీగా ఉన్నప్పుడు జరిగితే పోయే ప్రాణాల లెక్కకు అంతుండేది కాదు. ఆ కానపీ సీలింగ్‌ ఊడిపడిరదని ముందు భావించారు. కాని, తర్వాత తెలిసింది, దానిని నిలబెట్టిన స్టీల్‌ కాలమ్‌తో సహా అది ఒరిగిపోయిందని. కచ్చితంగా ఇది నిర్మాణాత్మక వైఫల్యమే. ఢల్లీిలో జరిగిన దుర్ఘటనను కొన్ని టీవీ చానెళ్లయినా చూపించాయి. సరిగ్గా అదే సమయంలో బీహార్‌లో సుమారు 13 వంతెనలు కుప్పకూలిపోయాయి. దీనిని ఎవరూ పట్టించుకోలేదు. అవినీతికి, అక్రమాలకు, నిర్లక్ష్యానికి కేరాఫ్‌ అడ్రసుగా మారిన బీహార్‌ గురించి ఈ దేశం పెద్దగా పట్టించుకోవడం మానేసిందేమో! సాధారణంగా దీనికి కారణం నాణ్యతలేని నాసిరకమైన మెటీరియల్స్‌ వాడడమే. పెద్దఎత్తున ప్రజాధనం దుర్వినియోగం కావడమే కాకుండా, ప్రజల ప్రాణాలే బలి తీసుకుంటున్న ఇలాంటి ప్రమాదాలకు మూలకారణం దారుణమైన అధికారుల అలసత్వమే.

ఒకరిపై మరొకరు నింద మోపడమే

సహజంగానే నిందను ఒకరిపై మరొకరు మోపుకుంటారు. బాధ్యత ఎవరూ తీసుకోరు. పార్లమెంటులో ప్రతిపక్షం ఈ అంశాన్ని ప్రభుత్వంపై దాడి చేయడానికి ఎంచుకుంది. కూలిపోయిన విమానాశ్రాయ నిర్మాణాలు, ఊడ్చిపెట్టుకుపోయిన రహదారులు, కుప్పకూలుతున్న వంతెనలు చాలావరకు ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించినవి కావడమే విశేషమని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. కాని, ప్రభుత్వం విజయవంతంగా ఎదురుదాడి చేసి, ప్రతిపక్షం నోరు మూయించింది. అంతకు ముందుండిన పౌరవిమానయాన శాఖ మంత్రి దీనిపై ఘాటుగా స్పందించారు. ఈ భవనం గత ప్రభుత్వ హయాంలో కట్టబడిరదని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేసారు. అంతేకాక, భవనాల నిర్మాణంలో 75 ఏళ్ల మన్నిక లక్ష్యంగా సాగాలని, దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ సర్టిఫికేట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. విమానాశ్రయాన్ని నిర్మించిన ఎల్‌ అండ్‌ టి సంస్థ కూలిపోయిన ప్రాజెక్టు ముక్కను మాత్రం తాము చేపట్టలేదని చేతులు దులుపుకొంది. మీడియాలో వచ్చిన నివేదికలు ఆ విమానాశ్రయ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌ అని, భవన సముదాయాన్ని నిర్మించింది బిఎల్‌ కాశ్యప్‌ అండ్‌ సన్స్‌ అని తెలియజెప్తున్నాయి. ఆ ప్రాజెక్టు మేనేజర్లు టాటా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ కాగా, కూలిపోయిన కానపీ టాటా బ్లూస్కోప్‌ సంస్థది. ఇప్పుడు చెప్పండి, తప్పెవరిదో ఎలా తేలుతుంది? కాబట్టి, తప్పు ఎవరన్నది ఎంచడం కంటే, వ్యవస్థలో బాగోగులను చర్చించడమే మేలు. ఈ తప్పులు పునరావృతం కాకుండా చూడడం తక్షణ అవసరం.

ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి కన్సల్టెంట్‌ ఎంపిక అన్నిటికంటే కీలకమైనది. పేరుకే టెండర్ల ద్వారా ఎంపిక చేస్తున్నామని మోదీ సర్కారు చెప్తున్నప్పటికీ ఈ దేశంలో కేవలం రెండు మూడు గుజరాతీ సంస్థలకు మాత్రమే ఈ అవకాశాలు అందుతున్నాయన్నది నిష్ఠుర సత్యం. వాటితో పాటు జిఎంఆర్‌ లాంటి మరో రెండు మూడు దేశవ్యాప్త సంస్థలకే కొన్ని అవకాశాలు దక్కుతున్నాయి. ప్రభుత్వం ఎంపిక చేసుకున్న ఈ నిర్మాణ సంస్థ మొత్తం ప్రాజెక్టును అనేక భాగాలుగా విభజించుకుని ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ సంస్థలకు ఔట్‌సోర్సింగ్‌ చేస్తుంది. స్థానిక నిపుణులతో ఈ సంస్థలు ఎవరికి వారు, వారికి కేటాయించిన నిర్మాణ భాగాలు పూర్తి చేస్తారు. మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. గ్లోబల్‌ ఏజెన్సీలకు ఇచ్చిన భారత నిర్మాణాల్లోనూ అంతులేని అలక్ష్యం కనిపించింది. ఉదాహరణకు బీజింగ్‌లో జరిగిన 2008 ఒలింపిక్‌ గేమ్స్‌లో నిర్మాణాలు చేపట్టిన పిటిడబ్ల్యు ఆర్కిటెక్ట్స్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకుంది. అదే సంస్థకు మన దేశంలో 2010లో ఢల్లీిలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ వివిధ స్టేడియంల నిర్మాణాల బాధ్యత చేపట్టింది. కాని, చిన్న వర్షానికి స్టేడియాలు పాడవ్వడం విషాదం. ప్రపంచంలో ఎన్నో గొప్ప ప్రాజెక్టులు పూర్తి చేసిన లండన్‌ సంస్థ చాప్‌మాన్‌ టేలర్‌కు ఢల్లీిలోని ఈస్ట్‌ కిద్వాయ్‌ నగర్‌ పునర్నిర్మాణానికి అప్పజెప్పినపుడు చాలా వివాదాస్పదమైంది. దీనికి కారణం మనకు ఊహించగలిగిందే. రాజకీయ నాయకుల నుంచి అధికారుల వరకూ కాసులకు కక్కుర్తిపడడమే ఇందుకు కారణం.

లోపాల మీద దృష్టి సారించకనే తీవ్ర ప్రమాదాలు

అమెరికాలోని మియామి నగరంలో పన్నెండు అంతస్తుల భవనం జూన్‌ 24, 2001వ తేదీన పాక్షికంగా ప్రమాదానికి గురయింది. ఇందులో 98 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది నెలల్లో బాధిత కుటుంబాలకు 1.2 బిలియన్‌ డాలర్లు పరిహారంగా అక్కడి కోర్టు ఉత్తర్వుల ద్వారా అందించారు. మన దేశంలో తొమ్మిదేళ్లయినా ప్రమాద బాధితులకు పరిహారాలు అందవు. నిర్మాణ సంస్థలు కోర్టుల చుట్టూ బాధిత కుటుంబాలను తిప్పిస్తాయి. అరకొరగా పరిహారాలు చెల్లిస్తారు. ఇన్సూరెన్స్‌ పరిహారాలు నిర్మాణ సంస్థలు పొందుతాయి. బాధితులకు మాత్రం మొండిచేయి చూపిస్తాయి. దీనికి అన్ని రాజకీయ పార్టీలు వత్తాసు పలుకుతాయి. దీనికి విరుగుడుగా ఆలస్యమైన కాలానికి వడ్డీలతో సహా పరిహారాలు చెల్లించమనే డిమాండ్లు మనకు లేకుండా పోయాయి. ఏటికేడాది పెరుగుతున్న ప్రమాదాలు మనకు నేర్పిస్తున్న పాఠం ఒక్కటే. స్వాతంత్య్రం రాకమునుపు బ్రిటిష్‌ ప్రభుత్వం కట్టిన చాలా నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం, స్వాతంత్య్ర అనంతర కాలంలో భారత ప్రభుత్వం నిర్మించిన కట్టడాలు వాడుక పెరుగుతున్న కొద్దీ మన్నికలో నిలకడగా ఉండడం ముచ్చట గొలుపుతున్నాయి. కాని, ఇటీవలి కాలంలో నిర్మిస్తున్న వంతెన దిగువ రహదారులు చిన్నపాటి వర్షాలతో పోటెత్తుతున్నాయి. నెలల తరబడి నీరు కదలకుండా నిల్వ ఉంటోంది. విమానాశ్రయ ముందరి ఎలివేషన్లు గాలిలో ఎగిరిపోతున్నాయి. జాతీయ రహదారులు తొలకరి జల్లులకే ఖరాబయి, గోతులమయం అవుతున్నాయి. దానికి కారణాలు ప్రభుత్వాలు సునిశితంగా గమనించాలి. సాంకేతికత పెరిగిన కొద్దీ నాణ్యత పెరగాలి కాని, దిగజారకూడదు కదా. అప్పటి కంటే ఇప్పటి ప్రభుత్వాలకు మౌలిక వసతుల పట్ల శ్రద్ధాసక్తులు పెరిగి, ఇబ్బడిముబ్బడిగా బడ్జెట్‌ కేటాయింపులు జరుపుతున్నాయి. ఇప్పుడు మనకు కావలసిందల్లా ప్రభుత్వాలు కాసింత బాధ్యత వహించడమే.

  • దుప్పల రవికుమార్

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page