top of page

ఈ దేశంలో గాంధీలే ఎందుకు పాపులర్‌?

Writer: DUPPALA RAVIKUMARDUPPALA RAVIKUMAR
  • ప్రజల కోసం పనిచేసేవారిని గాంధీలుగా పిలవడం ఆనవాయితీ

  • మణిపూర్‌ గాంధీ, ఒడిషా గాంధీ, కశ్మీర్‌ గాంధీ, తమిళనాడు గాంధీ

  • అంతమంది దేశనేతలలో గాంధీ ఒక్కడే చాలా పాపులర్‌

(దుప్పల రవికుమార్‌)

మన దేశంలో ఎందరో గాంధీలు.. అందరికీ వందనాలు! తమ పని ద్వారా ప్రజలచేత గాంధీలాంటోళ్లు అనిపించుకున్నవారు జమ్ము కశ్మీర్లో సురాన్‌కోట్‌ నుంచి నాగాలాండ్‌, మయన్మార్‌ సరిహద్దుల వరకూ.. తమిళనాడులోని మదురై నుంచి ఒడిషాలోని పత్కూరా వరకూ.. ఎందరో గాంధీలు. తమ కార్యాచరణ ద్వారా తాము అసలు గాంధీకి సిసలు వారసులుగా నిలిచారు. రాజకీయాల్లోను, సమాజ సేవలోనూ వారు చేస్తున్న అనితరసాధ్యమైన కృషిని గాంధీ జయంతి సందర్భంగా ఒక్కసారి తలచుకుందాం.

మధురైలోని ఎన్‌.ఎం.ఆర్‌ సుబ్బరామన్‌ గాంధీని స్ఫూర్తిగా తీసుకుని గాంధీ తరహాలోనే రాజకీయ పోరాటానికి ముందుకు దుమికిన స్వాతంత్య్ర పోరాట యోధుడు. ఇతడిని ‘మదురై గాంధీ’ అని పిలుచుకుంటారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడమే కాదు, అనేక పికెటింగ్‌లు చేసారు, జైలు పాలయ్యారు. భూదాన ఉద్యమంలో పాల్గొని, తన ఆస్తులను సమర్పించుకున్నారు. తమిళనాడులోని అస్పృశ్యుల కోసం అనేక ప్రాంతాలలో హాస్టళ్లు నిర్మించి ఆశ్రయం కల్పించారు ఈ మదురై గాంధీ. ఈయన మాదిరిగానే ‘నాగాలాండ్‌ గాంధీ’ అని ఆప్యాయంగా పిలుచుకునే నట్వర్‌ ఠాక్కర్‌ 1955 ప్రాంతంలో నాగా పర్వత శ్రేణిలో హింసాత్మక పోరాటం జరుగుతున్నప్పుడు, అక్కడ స్థిర నివాసమేర్పరుచుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆ ప్రాంతాన్ని పూర్తిగా భారత సైన్యం వశపరుచుకున్నాక, ఇటు భారత ప్రభుత్వానికి, అటు స్థానిక తెగలకు ఒక అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఎన్నో సమస్యలకు పరిష్కారాలు ఈ నాగాలాండ్‌ గాంధీ కనుగొన్నారు. ఒడిషాలోని రాజ్‌ కిశోర్‌ నాయక్‌ను ‘పత్కూరా గాంధీ’ అని అక్కడ ప్రజలు కీర్తిస్తారు. ఇరవయ్యో శతాబ్దపు ప్రథమ భాగంలో కటక్‌ జిల్లాలో వరదల వంటి ప్రకృతి ఉపద్రవాలు సంభవించినప్పుడు బాధితులకు అండగా నిలిచారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. ఎంతోమందిని కదిలించి ఈ సహాయక చర్యల్లో పాల్గొనేటట్టు చేశారు. తర్వాత ఆయన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎందరో మానవీయ మూర్తులను తీర్చిదిద్దారు. అన్ని వృత్తులకంటే ఉపాధ్యాయ వృత్తి ద్వారానే ఈ సమాజానికి మేలు చేయగలుగుతామని బలంగా కృషి చేశారు.

గాంధీలు మాత్రమే ఎందుకయ్యారు?

అయితే ఇలా సమాజం కోసం తపన పడేవారిని ఎందుకు మనం గాంధీ అని పిలుస్తాం. మణిపూర్‌ నెహ్రూ అనో, నాగాలాండ్‌ అంబేడ్కర్‌ అనో, ఒడిషా వల్లబ్‌ భాయ్‌ అనో పిలవమెందుకని? మన జాతీయ ఉద్యమంలో ముందువరుసలో నిల్చున్న జవహర్‌లాల్‌ నెహ్రూ అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చారు. రచనలు చేసారు. ఆగష్టు 15 ఉదయాన ఆయన చేసిన ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’ ప్రసంగం ప్రపంచంలోనే అత్యద్భుతమైనదిగా ఇప్పటికీ పరిగణిస్తున్నారు. ఆయన తన కుమార్తెకు రాసిన ఉత్తరాలతో ప్రచురించిన పుస్తకాలు ‘ది డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’, ‘గ్లింప్సెస్‌ ఆఫ్‌ వరల్డ్‌ హిస్టరీ’ ఇప్పటికీ పెద్దఎత్తున అమ్ముడుబోతున్న పుస్తకాలు. నవ భారత నిర్మాణానికి దారులు వేసిన మనిషిగా నెహ్రూ చరిత్రలో పేరు సంపాదించారు. ఇక వల్లబ్‌భాయి పటేల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పెద్దగా కమ్యూనికేషన్‌ లేని రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీని ఒకేతాటి మీద నడిపించిన ఘనత ఈయనదే. అన్ని గ్రూపులను కలుపుకొంటూ, వచ్చే చిన్నా పెద్దా విభేదాలను సామరస్యంతో పరిష్కరిస్తూ ఉక్కుమనిషి అని పేరు గడిరచిన వ్యక్తి. ఇక అంబేడ్కర్‌ సంగతి సరే సరి. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన రెండు విశ్వవిద్యాలయాలైన కొలంబియా యూనివర్శిటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకానమిక్స్‌ల నుంచి డాక్టరేట్‌ పట్టాలు పొందారు. ప్రాచీన భారత వాణిజ్యం గురించి, రూపాయి గురించి, మార్క్సిజం గురించి, బుద్ధిజం గురించి సమూల, సమగ్ర అవగాహన కలిగిన వ్యక్తిగా అప్పట్లోనే గొప్ప పేరు. ఇక భారత దేశ తాత్వికత గురించి విదేశీయుల అభిప్రాయాలను మార్చిన వ్యక్తిగా సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప పేరు గడిరచారు.

ఇరవయ్యో శతాబ్దంలో భారతదేశ గమ్యాన్ని, గమనాన్ని ఎందరో మహానుభావులు తమ తెలివితేటలతో, కృషితో మార్చగలిగారు. అయితే వారెవ్వరూ అనుసరణీయులు కాకుండా పోయారు. అంటే వారిని మనం కాపీ కొట్టలేం. నెహ్రూనో, పటేల్‌నో, అంబేడ్కర్‌నో కాపీ కొట్టడం ఎవరివల్లా కాదు. కానీ, గాంధీ విషయం వేరు. ఆయన దీనికి భిన్నం. గొప్ప రూపమూ లేదు. గొప్ప గొంతూ లేదు. తెలివైన విద్యార్థీ కాదు. మహా రచయితా కాదు. అద్భుత వక్తా కాదు. జనాలను ఆకర్షించే సమ్మోహన శీలీ కాదు. అద్భుత నైపుణ్యాలు ఉన్న వ్యక్తీ కాదు. ఆయన ప్రత్యర్థి సుభాష్‌ చంద్రబోస్‌ దేశం నుంచి మరో దేశానికి మారు వేషంపై వెళ్లిపోవడమే కాదు కార్లలో, స్టీమరులో, సబ్‌మెరైన్‌లో, విమానాలలో ఎగురుకుంటూ ప్రయాణించి తన ప్రయాణపు లక్ష్యాన్ని, దేశ ప్రజల స్వాతంత్య్ర కాంక్షను అనేక దేశాలకు మోసుకుపోయాడు. దానికి పూర్తి భిన్నంగా గాంధీ గ్రామాల్లో నడక సాగిస్తూ ప్రయాణించాడు. జనంతో కిక్కిరిసిపోయిన రైలు బళ్లలో ప్రయాణించాడు. కాని వీరందరి కంటే పూర్తి భిన్నంగా జనాల హృదయాలలో ఎలా ముద్ర వేయగలిగాడు?

సరళత్వమే గాంధీ విజయం

ఆబాలగోపాలం, ఆసేతుహిమాచల పర్యంతం నీతివంతమైన రాజకీయాలకు గాంధీ ఆదర్శమూర్తిగా నిలవగగలడం ఆశ్చర్యం. దానికి జవాబు ఆయన సింప్లిసిటీలో ఉంది. సాధారణ పౌరులు చిన్నచిన్న త్యాగాలు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించగలమని ప్రపంచానికి గాంధీ చాటిచెప్పాడు. బహుశా దేశంలోనే కాదు ప్రపంచంలోనే కొన్ని విషయాలను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పిన వ్యక్తి గాంధీ ఒక్కడేనేమో! చవగ్గా అందే పోషకాహారం గురించి వివేచన కలిగించిందీ, శౌచాలయం శుచిగా ఉండాలని చెప్పిందీ, ఇంటి ఖర్చులు పొదుపుగా ఉండాలని బల్లగుద్ది చెప్పిందీ గాంధీయే. ఈ పని ఈ భూమ్మీద ఏ రాజకీయ నాయకుడూ చేయలేదు. మన ఆహారంలో వేరుశెనగ పలుకులు, పాలు, చెరుకు, బెల్లం, బొప్పాయి వంటి సీజన్‌లో దొరికే పళ్లు ఉండాలని చెప్పింది గాంధీయే. అతని జీవితకాలంలోనే కాదు, ఇప్పటికీ ఎక్కువగా అమ్ముడయ్యే గాంధీ పుస్తకం ‘ఆరోగ్య దిక్సూచి: ఆరోగ్యకరంగా వండడం’ ఇందుకు ఒక ఉదాహరణ. గాంధీ రాజకీయ సమస్యలను వ్యక్తి స్థాయికి, ఇంటి స్థాయికి తీసుకురావడమే కాదు, వాటి పరిష్కారాలు కూడా అంతే సరళంగా ఉండేటట్టు తీర్చిదిద్దాడు. దానికి ఉదాహరణ ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణలు. అవేమిటో తెలియని సాధారణ మహిళలు సైతం ఆ ఉద్యమంలో పాల్గొనడమే ఆయన పరిష్కారాలు దేశవ్యాప్త ఆదరణ పొందాయనడానికి నిదర్శనం.

ఆయన సాధారణ రైతు జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసాడంటే దేశభక్తి అంటే పెద్ద పెద్ద నిర్వచనాలు ఇవ్వకుండా, కేవలం పెందలకడనే నిద్రలేచి, ఇంటితో పాటు వీధినంతా శుభ్రం చేసి, కాలకృత్యాలు తీర్చుకుని, ఒక గంటసేపు రాట్నం వడికితే చాలన్నాడు. ప్రతిఒక్కరూ ఆచరించగల సూత్రాలను అందించడమే గాంధీ విజయం. గాంధేయవాదపు విజయం. గాంధీకి అనుచరుడు లేదా శిష్యుడు కాకుండానే మనం గాంధీని అనుసరించవచ్చు. జమ్ము కశ్మీర్‌లో ‘గుజ్జర్‌ గాంధీ’ అని పిలవబడే చౌదరి గులాం హుస్సేన్‌ లస్సాన్వి అసలు గాంధేయవాది కాదు. కాని అక్కడ పశువులు పెంచే గుజ్జర్లు, బకర్వా జాతుల మీద విధించిన అధిక పన్నుల మీద నిరవధిక పోరాటం చేస్తున్నాడు. అక్కడి లోయ ప్రాంతాలలో పశువుల మేపడానికి వారాల తరబడి గడిపే వారి ఆకలి బాధ తీర్చడానికి అనేక ఫుడ్‌ బ్యాంకులు ఏర్పాటుచేసాడు. ‘సరిహద్దు గాంధీ’గా మనం పిలుచుకునే ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ నిజానికి గాంధీ అనుయాయి కాదు. కాని, గాంధీ చెప్పిన అహింస గురించి సుదీర్ఘంగా చర్చించాడు. అయితే ఖాన్‌ ప్రవచించిన అహింసా సిద్ధాంతం ఖురాన్‌లో చెప్పబడిరదే. ప్రవక్త మహమ్మద్‌ ఓర్పు, అహింసలు కవల పిల్లలని ఉపదేశిస్తారు. దాని గురించి ఖాన్‌ చెప్పారు.

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page