ఈ పూడిక లోతెంత?
- SATYAM DAILY
- May 17
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌లో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందనడానికి మచ్చుకు ఇది ఒకటి. తుమ్మావీధి కాలువల పరిస్థితి గమనిస్తే.. పారిశుధ్య కార్మికులు కాలువల్లో పైపైన చెత్తను తొలగించడం మినహా కనీసం మురుగు తీసే పరిస్థితి చాలా నెలలుగా లేకపోవడంతో ఇలా మురుగు పేరుకుపోయింది. దీంతో దోమల బెడద ఎక్కువైంది. ఇటీవల వాతావరణ మార్పుల కారణంగా జలుబు, జ్వరాలు. అసలే కార్తెల కాలం. రాత్రి, పగలు తేడా లేకుండా ఉక్కపోత.. దీనికి తోడు ఏసీల వాడకం ఎక్కువ కావడంతో అప్పుడప్పుడు విద్యుత్ సమస్య. దీంతో రాత్రి వేళల్లో ఇంట్లో ఉక్కకు ఉండలేక, బయట దోమలతో పడలేక ప్రజలు నిద్దరకు వాచిపోతున్న పరిస్థితి ఉంది. నిత్యం స్పెషల్ డ్రైవ్ పెట్టి సిల్ట్ తీస్తున్నా, మురుగుకు మాత్రం ముగింపు దొరకడంలేదు. ఇందుకు కారణం కాలువలు సరిగా లేకపోవడం, ఉన్నా వాటికి నీరు ప్రవహించే వాటం ఇవ్వకపోవడమే. వర్షాకాలం రాకముందే ప్రధాన కాలువల్లో పూడికలు తీసే కార్యక్రమం కార్పొరేషన్ మళ్లీ చేపట్టింది. ఉదయం పూడికలు తీస్తే, సాయంత్రం కురుస్తున్న వర్షానికి మళ్లీ అదే సిల్ట్ కాలువల్లోకి వెళ్లిపోతుంది. సాధారణంగా వీధుల్లో ఉన్న చిన్న కాలువల కనెక్టివిటీ మెయిన్ రోడ్డులో ఉన్న పెద్దకాలువకు ఇవ్వాలి. మన కార్పొరేషన్‌లో విచిత్రంగా పెద్ద కాలువల్లో నీరు నిండిపోతే వీధుల్లో కాలువకు పూడిక చేరిపోతుంది. కారణం వీధులకంటే.. మెయిన్ రోడ్లు ఎత్తుగా ఉండటమే. రోడ్లు విస్తరణ పేరుతో కొత్తవి నిర్మించిన ప్రతీసారి కల్వర్టులు, రోడ్డు ఎత్తును పెంచడం వల్ల వీధులు లోతట్టుగా మారిపోతున్నాయి. ముందు దీన్ని సవరిస్తే గానీ పరిష్కారం దొరకదు.
Comments