
పాఠశాలంటే ఎత్తైన భవనాలు, చుట్టూ ప్రహరీ గోడలు, ఖరీదైన స్కూల్ యూనిఫామ్‌లు కాదు. మానవ జీవితాలను తీర్చిదిద్ది, జాతి భవితను రూపొందించే జీవన నిలయాలు, చైతన్య కేంద్రాలు. మానవీయ విలువల్ని పాదుకొలిపే ఆధునిక దేవాలయాలు. మంచి వాతావరణం, సారవంతమైన నేలలో నాణ్యమైన విత్తనాలు విత్తితేనే, చక్కటి ఫలాలనిచ్చే వృక్షాలుగా ఎదుగుతాయి. తల్లిని నేల/ నీరుగా.. తండ్రిని విత్తనంగా భావిస్తే.. ఉపాధ్యాయుడు సూర్యరశ్మి లాంటివాడు. వీరు ముగ్గురు మాత్రమే చిన్నారులను మంచి పౌరులుగా మలచగలుగుతారు. బడిని బాగు చేయడాన్ని రేపటి పెట్టుబడిగా గుర్తించాలి. బాలకార్మికులు కనిపిస్తే విడిపించి యాజమాన్యాలపై కేసులు పెట్టాలి. పిల్లలు పనిలో కాదు. బడిలో ఉండాలి. బడికి రాని పిల్లలందరూ బాలకార్మికులే. బాల్యం ఒక హక్కు. పిల్లల చదువు ల ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించి, కేరళ సమాజాన్ని ఒప్పించి ‘బాల్యం బడిలోనే’ ఉండాలని తీర్మానించింది అక్కడి ప్రభుత్వం. పాఠశాల మాత్రమే పిల్లలను పట్టించుకునే ఏకైక సంస్థగా గుర్తించింది. పిల్లల సర్వతోముఖ వికాసానికి తగినట్టుగా పాఠశాలలను అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. చదువుతో పాటు ఆటపాటలు, ఆట స్థలాలు లేని స్కూళ్లకు అనుమతులుండవు. ప్రతి పాఠశాలలో పీఈటీ, డ్రామా, స్క్రిప్ట్, డాన్స్ టీచర్ తప్పకుండా ఉండాలి. ఆధునిక విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. వీటికి సంబంధించిన శిక్షణ తరగతులు, ప్రణాళిక ప్రతి బిడ్డకు ఉపయోగపడేలా చూస్తారు. సమాజం భాగ స్వామ్యం కాకుండా కేవలం ప్రభుత్వ కృషి ఫలితాలివ్వదు. అందుకే అన్ని రంగాల్లో ప్రజల భాగ స్వామ్యంతోనే ప్రణాళికలు అమలుజరుగుతాయి. విద్యార్థులు ఫెయిల్ అయితే ఉపాధ్యాయులే ఫెయిల్.. విద్యా విధానం ఫెయిల్ అయినట్టుగా చూస్తారు. పిల్లల మనోధైర్యానికి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. ప్రాచీన నృత్యాలలో శిక్షణ ఇస్తారు. అర్థం కాని పాఠ్యాంశాలను కళారూపాల ద్వారా మనసులో నాటు కునేలా చెప్తారు. దాంతో ఆటపాటలు చిన్నారుల నిత్య జీవితంలో భాగమైనాయి. ‘సమగ్ర’ అనే పోర్టల్ ద్వారా కేరళ విద్యాశాఖ వెయ్యికి పైగా ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ పాఠశాలలుగా మార్చి 45 వేల స్మార్ట్ రూములను నిర్మించింది. లిటిల్ కైట్స్, ఐటీ క్లబ్బులను ఏర్పాటుచేసి యూనిమేషన్, షార్ట్ ఫిలిమ్స్, సైబర్ భద్రత వంటి అంశాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజ నంలో గుడ్డు, వారానికి ఒకరోజు చికెన్ పెడతారు. 3వేల మంది పిల్లలు ఒకేసారి కలిసి భోజనం చేసే డైనింగ్ హాల్, పేరెంట్స్ విజిటింగ్ హాల్, పెద్ద కిచెన్ వుంటాయి. పరిశుభ్రత విషయంలో పక్కాగా వుంటారు. స్కూల్ ఆవరణలో ఒక ఆకు పడ్డా విద్యార్థులే ఏరి చెత్త బుట్టలో వేస్తారు. ప్రతి స్కూల్లో ఇండోర్ స్టేడియం వుంటుంది. విద్య ఒకటే కాదు. ఏ విద్యార్థికి ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించగలిగేలా శిక్షణనిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే? ఒక నిరుపేద విద్యార్థికి అంతర్జాతీయ స్థాయి విద్య ఉచితంగా అందుతుంది. భవితకు బలం బాలల సంఘాలే పిల్లల సాంస్కృతిక ఉత్సవాలు ‘వేనలుంబికల్’ (వీధి నాటకాలు) ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలలో జరుగుతాయి. 4వేల మంది బాల కళాకారులు 210 బృందాలుగా బాలల సామాజిక సమస్యలపై లక్షలాది మందితో ప్రదర్శనలిచ్చి పెద్దలలో సైతం చైతన్యం కల్పిస్తారు. ఆటపాటల్లో సత్తా చాటుతున్న వారిని చిన్న వయస్సులోనే చేరదీసి ప్రోత్సహిస్తున్నారు. శిక్షణలిచ్చి విశ్వక్రీడల్లో విజేతలు గా నిలబెడుతున్నారు. వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపులను శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు. మలయాళంలో బాల సాహిత్య అకాడమీ ఏర్పరిచారు. బాలల రచనలు, ముద్రణలు అక్కడి నుంచి వెలువడతాయి. ప్రతి ఇంట్లో లైబ్రరీ క్యాంపెయిన్ నిర్వహించి పఠనాసక్తిని పెంచుతారు. బాలల కార్యక్రమంలో కుటుంబాలు, పెద్దలు పాల్గొంటారు. రాజ్యాంగ పీఠికను చదివిం చడం బాలల అసెంబ్లీ, పార్లమెంటు కార్యక్రమాలు, లౌకిక, మానవత్వ, సమతా మమతల పండుగ లు, వనభోజనాలు నిర్వహిస్తారు. సూర్యచంద్ర గ్రహణాలు, మూఢనమ్మకాలను సవాల్ చేస్తూ 10వేల మంది పిల్లలు రోడ్ల మీదకొచ్చి గ్రహణాన్ని వీక్షించారు. సైన్స్ వండర్ షోలు, ఒక్క మాటలో చెప్పా లంటే? ఈ ప్రపంచం పిల్లలదే. ఎదగడానికి ఎల్లలు లేవు అన్నట్లుగా విజ్ఞాన ఆధారిత సమాజ నిర్మా ణంలో కేరళ ప్రణాళిక బద్ధంగా ముందడుగు వేస్తున్నది.
Comments