top of page

ఈ ప్రశ్నకు బదులేది?

Writer: ADMINADMIN

‘మీరు గతంలో కులాల మధ్య చిచ్చుపెట్టేలా వాఖ్యలు చేశారా?’

‘నాకసలు కులమంటే ఏంటో కూడా తెలీదు రాజా’,

‘పవన్‌ కళ్యాణ్‌ గారిని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ మహిళలను కించపరిచేలా వీడియోల్లో వాఖ్యలు చేశారా? లేదా?’

‘తప్పు రాజా నేను మహిళలను కించపరచడం ఏంటి? ఇంట్లో మా ఆవిడను కూడా యావండీ అనే పిలుస్తా’

‘నంది అవార్డ్‌ కమిటీలో ఒక కులం వాళ్లనే నామినేట్‌ చేశారని మీరు అన్నారా? లేదా?’

‘గుర్తు లేదు రాజా’

‘ఇప్పుడు ఇంకో ప్రశ్న...’

‘మీరు వేయబోయే ఆ ఇంకో ప్రశ్నకు జవాబు నాకు తెలీదు రాజా’

‘పోనీ ఈ వీడియోలు మీవో కావో చూసి చెప్తారా రాజా?’

(సడెన్‌గా కొత్త వాయిస్‌) ‘మీరెవరు రాజా? నా ఊతపదం వాడేస్తున్నారు’

‘నన్ను ఎస్పీ అంటారు’

‘ఓహో ఎస్పీ రాజా మీరేనా? ఇప్పుడు నేనేం చెయ్యాలి రాజా?’

‘ఈ పేపర్ల మీద సంతకం పెట్టాలి’

‘ఈ పేపర్లు ఏంటి రాజా?’

‘మీరు చేసిన వెధవ పనులు ఆ కాగితాల్లో ఉన్నాయి’

‘సంతకం పెట్టకపోతే ఏం చేస్తారు రాజా?’

‘దానికి మీచేత ఇంకో డిగ్రీ చదివించాల్సి ఉంటుంది’

‘అర్థమైంది రాజా.. నాకు ఆల్రెడీ రెండు డిగ్రీలు ఉన్నాయి.. థర్డ్‌ డిగ్రీ అవసరంలేదు.. పేపర్లు ఇటివ్వండి.. సంతకాలు పెడ్తా’

..ఇదీ ఇంచుమించుగా ఓ న్యూస్‌ పేపర్లో వచ్చిన కథనం. ఇక్కడ పొలీసులు ఎవరో, నిందితుడు ఎవరో ఈపాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. పొలీసులు మోపిన అభియోగాలు తలకెత్తుకున్నందుకు పోసాని కృష్ణమురళికి గత ప్రభుత్వం నెలకు అక్షరాలా మూడు లక్షల ఎనభైరెండు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చింది. నిజం అధికారికంగా ఫిలిం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి నిమిత్తం అయినప్పటికీ అనధికారికంగా ఆయన నోటిదూలకు ఇచ్చిన గౌరవ వేతనం అది. ఈ విషయం పోలీసులకు ఇచ్చిన నేరాంగీకార పత్రంలో ఆయనే ఒప్పుకున్నట్టు పొలీసులు చెప్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వాఖ్యలు చెయ్యడం పవన్‌ విషయంలో భార్యలను టార్గెట్‌ చేస్తూ కించపరిచేలా వీడియోలు చేసి సోషల్‌ మీడియాలో పెట్టడం వంటి పనులన్నీ గత ప్రభుత్వ సలహాదారుడు సజ్జల స్క్రిప్ట్‌ ప్రకారం జరిగినవే అని అయన ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే కోర్టు విచారణ వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే పోలీసుల ఎదుట ఇచ్చిన నేరాంగీకార పత్రం తన వద్ద నుంచి బలవంతంగా తీసుకున్నారని, అంచేత వాస్తవాలు విచారించాలని, ఇంకో పిటిషన్‌ వేసి దాన్ని వెనక్కి నెట్టేయవచ్చన్నట్టు ఈయన పేరు రెడ్‌బుక్‌లోది కాదు పీకే డైరీలో రాసి ఉందని ఇన్నర్‌ టాక్‌ పోసాని కృష్ణమురళి మీద కేసు పెట్టింది చిత్తూరు జిల్లాకు చెందిన జనసేన లోకల్‌ నాయకుడు. సరే ఇప్పుడు ఈ పొలీసులు, కోర్టులు, విచారణలు తేలేలోపు మనం చిన్న విశ్లేషణ చేసుకుందాం.

రాజకీయాల్లో పనీపాటలు లేకుండా ఖాళీగా ఉండేవాళ్లకూ, స్వామి భక్తులకు ప్రభుత్వ సొమ్ముతో (అంటే ప్రజల సొమ్ముతో) పనికి ఉపాధి అవకాశం కల్పించడమే నామినేటెడ్‌ పదవుల భర్తీ అసలు ఉదేశం అని చిన్నపిల్లలకు కూడా తెలుసు. అయినవాళ్లకు ఈ నామినేటెడ్‌ పదవుల భర్తీ పాలసీ అనేది కేవలం గత ప్రభుత్వం మాత్రమే మొదలుపెట్టింది కాదు.. కొన్నేళ్ల నుంచి అన్ని పార్టీలు యధాశక్తి పాటిస్తున్నాయి. నామినేటెడ్‌ పదవుల భర్తీకి ప్రభుత్వాలు రూపొందించిన నిబంధనలు, నియమావళి ఏ విధంగా ఉందో తెలీదు కానీ, అనధికారికంగా అన్ని పార్టీలు అనుసరిస్తున్న విధానం ఒక్కటే.. స్వామి భక్తులకు ఉపాధి కల్పించడం. సోషల్‌ స్టేటస్‌, క్యారక్టర్‌ వంటి విషయాలను పక్కనబెట్టి అయినవాళ్లకు నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టి నిర్లజ్జగా ప్రభుత్వ ధనాన్ని వాడేసుకుంటున్నారు.

పోసాని కృష్ణమురళి ప్రభుత్వానికి ఏ రకమైన సేవలు అందించారో తెలీదు కానీ నెలకు రూ.3.82 లక్షలు ప్రభుత్వ జీతం తీసుకున్నందుకు పార్టీకి ఆయన చేసిన సేవలు వీడియోల్లో సృష్టంగా కనిపిస్తున్నాయి. ఈ డబ్బులతో కొంతమంది నిరుద్యోగులకు కొంతకాలం పాటు ఉపాధి కల్పించవచ్చు. అలాగే పార్టీకి సలహాలు ఇచ్చే వ్యక్తికి క్యాబినెట్‌ ర్యాంకుతో లక్షల్లో జీతం.. కారు ఇతరత్రా వసతులు కల్పిస్తూ ప్రభుత్వ సలహాదారు హోదా కట్టబెట్టడం ఎంత వరకు కరక్ట్‌? సినిమాల్లో చిల్లర క్యారెక్టర్లు వేసుకునే వ్యక్తికి ఎస్‌వీబీసీ తిరుమల భక్తి ఛానెల్‌ బోర్డ్‌ చైర్మన్‌ పదవి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్‌? అతగాడి చిల్లర వేషాలు భరించలేక ఆ పార్టీ వాళ్లే అతడ్ని పక్కనబెట్టారంటే ఆ క్యారక్టర్‌ ఎటువంటిదో అర్థం చేసుకోండి. ఆఖరికి పవిత్రమైన టీటీడీ బోర్డులో కూడా నేరగాళ్లను నియమిస్తున్నారు. మొన్నటికి మొన్న ప్రస్తుత ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించబడ్డ వ్యక్తి టీటీడీ ఉద్యోగితో సాక్ష్యాత్తు స్వామివారి మహాద్వారం వద్ద బూతులతో అసభ్యంగా అనరాని మాటలు అనడం అందరూ చూసిందే కదా. ఎవరు వీళ్లు? ఏమిటి వీళ్ల క్యారెక్టర్లు? లక్షల్లో వీళ్లకిచ్చే జీతాలు ఎక్కడ్నుంచి వెళ్తున్నాయి? అనే ప్రశ్నలు వేసుకుంటే ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో సమాధానాలు దొరుకుతాయి.

- పరేష్‌ తుర్లపాటి
- పరేష్‌ తుర్లపాటి

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page