బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతికి హస్తసాముద్రికం, జ్యోతిషంలోనూ ప్రవేశముంది. అందుకే ఎంతోమంది నటీనటులు భానుమతిని శుభముహూర్తాల గురించి అడిగేవారట. అలా ఎమ్జీఆర్, ఎన్టీఆర్ కూడా సూపర్ స్టార్స్ గా రాణిస్తారని భానుమతి వారితో నటించేటప్పుడే జోస్యం చెప్పారట. అలాగే బాలయ్య తొలి సినిమాలోనే ఆయనకు ఆమె భవిష్యవాణి వినిపించారు. ఆమె వాక్కు వృథా పోలేదు. బాలయ్య తండ్రి పేరు నిలిపే కొడుకుగానే నిలిచాడు.
‘తాతమ్మ కల’ సినిమా కోసం ఆరోజు బాలకృష్ణ తొలిసారిగా కెమేరా ముందుకు వచ్చారు. ఓ వైపు బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి, మరోవైపు నటనలో మేరునగధీరుడైన తండ్రి ఎన్టీఆర్ , కాంచన వంటివారు ఉన్న సన్నివేశంలో బాలకృష్ణ తొలిసారి నటించాల్సి వచ్చింది. డైరెక్టర్ గా ఎన్టీఆర్ , బాలకృష్ణకు అంతకు ముందే సన్నివేశాన్ని వివరించి ఎలా నటించాలో తెలిపారు. ఎన్టీఆర్ చెప్పినది తలకెక్కించుకున్న బాలయ్య, మనసులో మాత్రం తండ్రి ‘నిండుమనసులు’ చిత్రంలో నటించిన తీరును మననం చేసుకుంటూ సీన్ లో నడుస్తూ వచ్చాడు. వెంటనే ఎన్టీఆర్ ఆగ్రహంతో ‘రేయ్... నీకు నేను చెప్పిందేంటి? నువ్వు చేసేందేంటి? ఏమిటా నడక... రౌడీలా’ అని హూంకరించారు. అంతే బెంబేలెత్తి పోయాడు చిన్నారి బాలయ్య. అయినా తమాయించుకొని భానుమతి, రామారావు కలసి ఉన్నా అదురు బెదురు లేకుండా తరువాత నటించి సీన్ ఓకే చేశారు. ఆనాడే భానుమతి, ‘రామారావుగారూ... మీరు అనవసరంగా పిల్లాణ్ణి భయపెట్టకండి. అబ్బాయి చక్కగా నటించాడు. చూడండి మీ పేరు నిలబెడతాడు’ అని దీవించారు.

Commenti