top of page

ఈ రాజకీయాలకు.. ఇక సెలవు!

Writer: ADMINADMIN
  • చంద్రబాబు భేటీ తర్వాత గుండ దంపతుల ప్రకటన

  • అభ్యర్థిత్వం మార్పునకు అంగీకరించని అధినేత

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయలేం.. అలాగే క్రియాశీల రాజకీయాల్లోనూ కొనసాగలేమని గుండ దంపతులు ప్రకటించారు. ప్రస్తుత ఎన్నికల్లో శ్రీకాకుళం టికెట్‌ను తమకు కాకుండా వేరే వారికి ఇచ్చినప్పటికీ.. అధినేత మనసు మార్చేందుకు, పార్టీ టికెట్‌ తెచ్చుకునేందుకూ తుదికంటా తీవ్రంగా ప్రయత్నించిన వారు, చివరికి అది సాధ్యం కాదని తేలడంతో రాజకీయాల నుంచే వైదొలగేందుకు నిర్ణయించుకున్నారు. పలాసలో పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండేళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను, ఎన్టీఆర్‌ హయాం నుంచి పార్టీకి తాము చేసిన సేవలను ఆ ప్రకటనలో వివరించారు. నాడు ఎన్టీఆర్‌ పిలుపునందుకుని తెలుగుదేశంలో చేరిన తమ కుటుంబం నాలుగు దశాబ్దాలపాటు శ్రీకాకుళం పార్టీ అభివృద్ధికి కృషి చేశామన్నారు. అవినీతిరహితంగా, ప్రజలకు చేరువగా ఉంటూ పనిచేశామని గుర్తు చేశారు. క్రమశిక్షణతో, కార్యకర్తల సహకారంతో పార్టీ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించినా, స్పష్టమైన కారణాలు లేకుండానే శ్రీకాకుళంలో తమకు కాకుండా ప్రత్యామ్నాయ అభ్యర్థిని నిర్ణయించడం తమను బాధించిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఇండిపెండెంటుగా పోటీ చేయాలని నిరంతరం తమ వెన్నంటి నడుస్తున్న పార్టీ క్యాడర్‌ ఒత్తిడి చేస్తోందని అంటూ తమకు నష్టం జరిగినా ఫర్వాలేదు గానీ తమ వెంట ఉన్నవారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి ముందుకు రాలేకపోతున్నామని గుండ దంపతులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం కార్యకర్తలకు బాధ కలిగించేదే అయినప్పటికీ భవిష్యత్తులో వారికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్య విలువలు ప్రశ్నార్థకం అవుతున్నాయని, ముఖ్యంగా నేర ప్రవృత్తి కలిగిన వారికి, అవినీతిపరులకు పెద్దపీట వేస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో తమలాంటివారు ఇమడలేరన్న ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. పలాసలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు కూడా తమ మనసులోని భావాలను స్పష్టంగా తెలియజేశామన్నారు. ఎన్టీరామారావుతోపాటు వాజ్‌పేయి, అద్వానీ వంటి నాయకులను కూడా చూశామని అంటూ బీజేపీలో జరిగిన పరిణామాలతో అద్వానీ రాజకీయాల నుంచి అస్త్ర సన్యాసం తీసుకున్న రీతిలోనే తాము కూడా రాజకీయాల నుంచి సెలవు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ తమ వెంట నిలిచిన వారంతా ఈ నిర్ణయాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పటివరకు తమ కుటుంబం పట్ల ప్రేమాభిమానాలు చూపించిన వారందరిపై సదా కృతజ్ఞులమై ఉంటామని గుండ దంపతులు పేర్కొన్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page