top of page

ఈ రాష్ట్రానికి ఏమైంది?

Writer: ADMINADMIN
  • ఒకవైపు తాళలేని వేడి, మరోవైపు పాము కాట్లు..

  • ఉత్తరప్రదేశ్‌లో పెట్రేగిపోతున్న అసహజ మరణాలు

  • బాధితులు ఎక్కువమంది బీదవారే!

(డి.వి.మణిజ)

నైరుతి రుతుపవనాలు మోసుకొచ్చిన వర్షపు జల్లుతో దేశమంతా కొంత ఉపశమనం పొందింది. ఈసారి ఎండ వేడి దాదాపు అన్ని రాష్ట్రాలనూ బాధించింది. ఉక్కపోతతో దేశ ప్రజలందరూ ఉక్కిరిబిక్కిరయ్యారు. నైరుతి రాకతో ఒక్కసారి కొత్త ఊపిరి వచ్చినట్టయింది. కొన్ని రాష్ట్రాల్లో ఎండలు తగ్గుముఖం పట్టినా ఉక్కబోత మాత్రం తగ్గడం లేదు. పగలూ రాత్రీ తేడా లేకుండా చెమటలు పడుతూనే ఉన్నాయి. వానలు కురుస్తున్నా ఉక్కపోత బాధిస్తూనే ఉంది. అయితే ఇది ఉత్తరప్రదేశ్‌లో మరింత ఘోరంగా ఉంది. ఈ రాష్ట్రంలో గత నాలుగు వారాల్లో 51మంది హీట్‌ స్ట్రోక్‌ (వేడి దెబ్బ)తో మరణించినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. మే 31వ తేదీ ఒక్కరోజే వేడి గాలి పాతిక మందిని పొట్టన పెట్టుకున్నట్టు ఉత్తరప్రదేశ్‌ విపత్తుల శాఖ తెలిపింది. ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు చేసే బుందేల్‌ఖండ్‌, వింధ్య ప్రాంతాలకు చెందిన సోన్‌భధ్ర (15), మీర్జాపూర్‌ (14), మహోబా (13)లు ప్రజలను బలి తీసుకున్నాయి.

అదేమి దురదృష్టమో తెలియదు గాని, రాష్ట్రంలో వేడి ఒక్కటే జనాల ఉసురు తీయలేదు. ఒక పక్క పాముకాట్లు, మరోపక్క ఎద్దులు పొడవడం వంటివి జరిగి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి ఉత్పాతాల్లో కొన్ని మనిషి తప్పిదం వల్ల, కొన్ని ప్రకృతి ప్రకోపం వల్ల జరుగుతున్నాయి. వీటన్నింటికీ పేదవారే బలి కావడం విషాదం. పెరిగిన ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తేమతో కూడిన రుతుపవనాలుగా మారడం వల్ల ఈ రాష్ట్రం రెండు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మొదటిది వరదలు కాగా రెండో ప్రమాదం భయంకర విషసర్పాల ద్వారా.

దేశంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన ఉత్తరప్రదేశ్‌లో చిన్నా పెద్దా కలిసి ముప్పైకి పైగా నదులు ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ ఏడాది పెచ్చరిల్లిన అసహజ మరణాలకు కారణాలుగా వీటిని చెప్పవచ్చు.. పాముకాట్లు, నదులలో మునిగిపోవడం, అకాల లేదా అధిక వర్షపాతం, మెరుపులు. ఏడాదంతా పాము కరిచి మనుషులు చనిపోవడం సహజమే అయినప్పటికీ, రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు పడి, వాటి కలుగుల్లోంచి బయటకి రావడం, పొలం పనులకు వెళ్లినపుడు వాటి బారిన పడి మనుషులు మరణించడం చాలా ఎక్కువగా జరుగుతోంది. ఆదిత్యనాధ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రమాద నిధుల నుంచి పాముకాటు వల్ల మరణించిన కుటుంబాలు లక్ష రూపాయల పరిహారం పొందవచ్చు. ఆ పరిహారం క్రమంగా పెరుగుతూ ఇప్పుడు నాలుగు లక్షల రూపాయల వరకూ ఇస్తున్నారు.

విషసర్పాలు ` ఓటి ఆవులు

అప్పటి నుంచి 2023 వరకూ కేవలం పాముకాటు వల్ల 3415 మంది ప్రాణాలు పోగొట్టుకున్నట్టు ఆ రాష్ట్ర విపత్తుల శాఖ ప్రకటించింది. అంటే ఏడాదికి 670 మందిని పాములు పొట్టన పెట్టుకుంటున్నాయి. ఎక్కువగా సోన్‌భద్ర, ఫతేపూర్‌, బారాబంకి, ఉన్నావ్‌, హర్దోయి, సీతాపూర్‌, ఘజియాపూర్‌, లలితాపూర్‌, మీర్జాపూర్‌ జిల్లాల్లో ఎక్కువ పాముకాట్లు సంభవిస్తున్నట్టు గమనించి, ఈ జాబితాలో మొదటి ఐదు జిల్లాలను ‘పాముకాటు హాట్‌స్పాట్లు’గా ప్రభుత్వమే ప్రకటించింది. ఈ పదిహేను రోజుల్లోనే ఈ ప్రాంతంలో 46 మంది మరణించారు. రైతులు, కూలీలు, వేటగాళ్లు, పాములు పట్టేవాళ్లు, పశువుల మేపర్లు, గిరిజనులు ఎక్కువగా బాధితులవుతున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన ఆదిత్యనాధ్‌ ప్రభుత్వం పాముకాటు చావులను స్టేట్‌ డిజాస్టర్‌గా ప్రకటించింది. కాని, బాధితుల పరిహారం కోసం ఎన్నోసార్లు కోర్టు గడపలు ఎక్కవలసి వస్తోంది. 2022లో అలహాబాద్‌ హైకోర్టు పాముకాటుతో మరణించిన వారు పరిహారం పొందడానికి శరీరం లోపలి భాగాలు పరిశీలించిన వైద్యుల నివేదిక తేనవసరం లేదని, కేవలం పోస్టుమార్టం నివేదిక సరిపోతుందని స్పష్టం చేసింది.

ఇక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల మీదకు ఆవులను, ఎద్దులను వదలడం కూడా రాజకీయ రంగు పులుముకుంది. పశువులను యధేచ్చగా రోడ్ల మీద, జాతీయ రహదారుల మీద, పొలాల్లోనూ విడిచిపెట్టడం వల్ల రైతులు మాత్రమే కాదు, రహదారి ప్రయాణీకులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పశువులు పొలాల పంటమీద దాడి చేయడమే కాదు, రోడ్ల పక్కన దుకాణాల పైన కూడా ఎగబడుతున్నాయి. అంతటితో ఆగక, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అందులోనూ నీల్‌గాయ్‌ అని పిలిచే నీలి ఆవులు ఇంకా ప్రమాద ఘంటికలుగా అక్కడ ప్రజలు చూస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం పశువుల వల్ల మరణించిన వ్యక్తుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం ప్రకటించాల్సి వచ్చింది. రాయబరేలీలో జరిగిన ఒక దుర్ఘటనను అలహాబాద్‌ హైకోర్టు చాలా సీరియస్‌గా తీసుకుంది.

రాయబరేలీకి చెందిన హరికేశ్‌ తన కూతురిని సమీప బంధువు బైక్‌పై పట్టణానికి వెళ్లి సామాన్లు తెమ్మని పురమాయించాడు. ఆ మోటార్‌సైకిల్‌ను ఒక ఆవు ఢీకొట్టింది. వెనుక కూర్చున్న అమ్మాయి రోడ్డుపై పడిపోయింది. ఆసుపత్రికి తీసుకువెళ్లిన తర్వాత మరణించింది. ఆ అమ్మాయికి పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వ అధికారులు ఒప్పుకోలేదు. ఎందుకంటే నేరుగా ఆవు ఆ అమ్మాయిని ఢీకొట్టలేదని, మోటార్‌సైకిల్‌ను కొట్టిందని, దానిమీద కూర్చోవడం వల్ల ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయిందని వాదించారు. ఆ అతితెవిలి అధికారుల మీద అలహాబాద్‌ హైకోర్టు మండిపడిరది.

అవగాహన పెంచడమే అన్నిటికీ విరుగుడు

నిజానికి ప్రభుత్వం చెప్తోన్న ఈ సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో మరణాలు ఉంటాయని అక్కడి వివిధ సామాజిక సంస్థలు ఆరోపిస్తున్నాయి. పరిహారం ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రభుత్వ అధికారులు రకరకాల సాకులు వెతుకుతుంటారని వారు భావిస్తున్నారు. పాము కాట్లు, ఎద్దు పోట్లు తర్వాత ఉత్తరప్రదేశ్‌లో నీటిలో మునిగి చనిపోతున్న ప్రజల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఏడాదికి సుమారు 900 మంది ప్రజలు నదులు, కాల్వల్లో మునిగి చనిపోతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఈ అసహజ మరణాలను తప్పించడానికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఆసుపత్రులకు బాధితుని చేర్చేలోపు తీసుకోవాల్సిన సత్వర ప్రథమ చికిత్స గురించి అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపట్టింది.

తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో వివిధ ప్రజా సంఘాలను ఈ విషయమై మరింత ఎడ్యుకేట్‌ చేయడం, సత్వరమే వైద్యం అందేవిధంగా చర్యలు తీసుకోవడం, వైద్య సిబ్బందికి ఇందులో ప్రత్యేకంగా తర్ఫీదునివ్వడం పెద్ద ఎత్తున చేయాల్సి ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జ్వరాలు, సీజనల్‌ వ్యాధులు, టీకాలు ఇచ్చే సిబ్బందిని నియమించారు తప్ప, పాముకాటు, ఎద్దు పోటు, నీటి మునక వంటి ఉత్పాతాల్లో చురుగ్గా, మెరుగ్గా ఎలా స్పందించాలో తెలిసిన సిబ్బంది లేకపోవడం మరిన్ని మరణాలకు దారితీస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పిన పీహెచ్సీల్లో పాముకాటుకు విరుగుడు మందు ఇంజక్షన్లు సరిపడా అందించాలి. ఇంకా ఇప్పటికీ గ్రామాల్లో పాము కరిచినపుడు మంత్రవైద్యం చేయించడం ఆనవాయితీగా వస్తోంది. తక్షణమే వారికి వైద్యం అందేలా చేయడంలో గ్రామీణులు తాత్సారం చేస్తున్నారు. గోల్డెన్‌ అవర్స్‌లో మంత్రాలు, పూతలు ఇప్పించి, పరిస్థితి విషమించాక ఆసుపత్రులకు పరిగెడుతున్నారు. దీనివల్ల దగ్గరి పట్టణాల్లో వైద్యులు కూడా ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితిలో పడిపోతున్నారు. దీనికి పరిష్కారంగా గ్రామాలలో చైతన్యం తీసుకురావాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page