`ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 1967 ఎన్నికలు ఓ రికార్డు
`విశాఖ స్టీల్‌ప్లాంట్ డిమాండ్‌తో ఎమ్మెల్యేలుగా స్వతంత్రులు
`నాటి అసెంబ్లీలో కాంగ్రెస్ తర్వాత వారిదే రెండోస్థానం
`1972 ఎన్నికల్లోనూ 57 మంది విజయం
`ఆ తర్వాత తగ్గుతూ వచ్చిన ఇండిపెండెంట్ల ప్రభావం
`ప్రస్తుత అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం సున్నా

(ఎన్నికల రచ్చబండ ` డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
మనది బహుళ పార్టీ వ్యవస్థ. ప్రజాప్రభుత్వాలను ఎన్నుకునేందుకు ఐదేళ్లకోసారి చట్టసభ(పార్లమెంటు, అసెంబ్లీ)లకు జరిగే ఎన్నికల్లో పార్టీలతోపాటు పార్టీలతో సంబంధంలేని వ్యక్తులు కూడా పోటీ చేసే హక్కు, అవకాశాలను భారత రాజ్యాంగం కల్పించింది. దాంతో పార్టీల అభ్యర్థులతోపాటు పార్టీలకు అతీతంగా ప్రముఖులు, సామాన్యులు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగి ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. గత మూడు నాలుగు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య భారీగా తగ్గిపోయినా.. మన రాష్ట్రంలో తొలి ఎన్నికల నాటి నుంచి స్వతంత్రుల హవా కొనసాగేది. పదుల సంఖ్యలోనే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన చరిత్ర ఉంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించి, ఆ అవకాశం దక్కని పలువురు కూడా ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగి సత్తా చాటిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. 1952 నుంచి ఇప్పటివరకు 15సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 16వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 15వ అసెంబ్లీ ఎన్నికల్లోనే అంటే 2019లో మాత్రమే ఇండిపెండెంట్లుగా పోటీ చేసినవారిలో ఒక్కరు కూడా గెలవలేకపోయారు. ఫలితంగా 15వ అసెంబ్లీలోనే వీరి ప్రాతినిధ్యం సున్నాగా మిగిలింది. ఇది ఒక విశేషమైతే.. 1967 ఎన్నికల్లో మరో రికార్డు నమోదైంది. ఆ ఎన్నికల్లో దానికి ముందు, ఆ తర్వాత కూడా సంభవం కాని విధంగా ఏకంగా 68 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికై ప్రజాప్రతినిధులుగా వ్యవహరించారు. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా పెద్దసంఖ్యలోనే 57 మంది ఇండిపెండెంట్లు ఎన్నికైనా.. అనంతరం మాత్రం స్వతంత్రుల హవా క్రమంగా తగ్గుతూ వచ్చి, 2019 నాటికి సున్నా స్థాయికి పడిపోయింది. 1967 ఎన్నికల్లోనే అంత పెద్దసంఖ్యలో ఇండిపెండెంట్లు పోటీ చేయడానికి, గెలవడానికి కారణాలు కూడా ఆసక్తికరమే. దాని వెనుక ప్రత్యేక ఆశయం కూడా ఉంది. ఆ రికార్డు ఏమిటో? దాని వెనుక ఉన్న ఆశయాలు ఏమిటో? చూద్దాం.
ఇదీ నేపథ్యం
దేశంలో 1952లో ఎన్నికల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఐదేళ్లకోసారి ఎన్నికలు జరిగేవి. ఆ క్రమంలో ఏపీ నాలుగో అసెంబ్లీ ఎన్నికలు 1967లో జరిగాయి. దానికి ముందు రాష్ట్రంలో అనేక మార్పులు జరిగాయి. ఇప్పటిలా అసెంబ్లీ స్థానాల సంఖ్య స్థిరంగా ఉండేది కాదు. ఇప్పటి నిబంధనల ప్రకారం ప్రతి 20 ఏళ్లకోసారి జరిగే నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య తగ్గడమో, పెరగడమో జరుగుతుంది. కానీ ఎన్నికల వ్యవస్థ ప్రారంభమైన తొలినాళ్లలో ప్రతి ఎన్నికలకు నియోజకవర్గాల సంఖ్య మారిపోయేది. కొన్నేళ్లు ద్విసభ నియోజకవర్గాలు కూడా కొనసాగాయి. ఆ సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో రికార్డు స్థాయిలో స్వతంత్రులు పోటీ చేసి గెలవడానికి ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు అన్న సంకల్పమే ప్రధాన కారణంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ తీరంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలన్న డిమాండ్ 1960 దశకంలోనే ఊపిరి పోసుకుని ఉద్యమంగా మారింది. 1967 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అది మరింత ఉధృతరూపం దాల్చింది. అది చివరికి హింసాత్మకంగా మారి పోలీసు కాల్పులకు దారితీసింది. ఆ కాల్పుల్లో 32 మంది ఆందోళనకారులు మరణించారు. దాంతో ఉద్యమం రాజకీయ రూపం సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చేందుకు వివిధ పార్టీలకు చెందిన 70 మంది శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అంతకుముందెప్పుడూ ఒక డిమాండ్ సాధనకు అంత పెద్దసంఖ్యలో ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన చరిత్ర లేదు. దాంతో ఆ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. రాజీనామా చేసినవారిలో సీపీఐకి చెందిన 30 మంది, సీపీఎంకు చెందిన 21 మంది, స్వతంత్ర పార్టీకి చెందిన ఎనిమిది మంది, నేషనల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఇద్దరితోపాటు కమ్యూనిస్టు సానుభూతిపరులైన నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దాంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించింది.
కాంగ్రెస్ తర్వాత రెండో స్థానం వారిదే
ఈ పరిణామాల నేపథ్యంలో 1967 ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1962 ఎన్నికల నాటికి అసెంబ్లీ సభ్యుల సంఖ్య 300 ఉండగా.. 1967 నాటికి అది 287కు తగ్గిపోయింది. వాటికి ఎన్నికలు నిర్వహించగా స్టీల్‌ప్లాంట్ వెంటనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఆ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఉద్యమవాదులు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేసి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజల మనోభావాలు కూడా స్టీల్‌ప్లాంట్ ఉద్యమంతో ప్రభావితం కావడంతో దాని సాధనే లక్ష్యంగా పోటీ చేసిన అభ్యర్థులను పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు ఓట్లు వేసి ఆదరించారు. ఫలితంగా చరిత్రలో లేని విధంగా ఏకంగా 68 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో మొత్తం 287 స్థానాలకూ పోటీ చేసిన కాంగ్రెస్ 165 స్థానాల్లో గెలిచి అధికారంలోకి రాగా.. దాని తర్వాత 68 స్థానాలతో ఇండిపెండెంట్లే అసెంబ్లీలో రెండోస్థానంలో నిలవడం విశేషం. కాంగ్రెస్ 45.42 శాతంతో 62,92,649 ఓట్లు సాధించింది. దాని తర్వాత అత్యధికంగా ఇండిపెండెంట్లే సుమారు 25 శాతం ఓట్లు సాధించారు. స్వతంత్ర పార్టీ 90 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో గెలిచింది. ఆ పార్టీకి 13,63,382 (9.84 శాతం) ఓట్లు లభించాయి. 104 స్థానాలకు పోటీ చేసిన సీపీఐ 11 స్థానాల్లో గెలిచి 10,77,499 (7.78 శాతం) ఓట్లు సంపాదించింది. సీపీఎం 83 స్థానాలకు పోటీ చేసి తొమ్మిది చోట్ల విజయం సాధించి 10,53,855 (7.61 శాతం) ఓట్లు దక్కించుకుంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంత మంది ఇండిపెండెంట్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం అదే తొలి, చివరిసారి. ఆ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. స్వతంత్ర పార్టీ నుంచి ఎన్నికైన గౌతు లచ్చన్న ప్రతిపక్షనేతగా వ్యవహరించారు.
ఏ ఎన్నికల్లో.. ఎంతమంది స్వతంత్రులు
భారత ఎన్నికలతో పాటే ఆంధ్ర ఎన్నికల చరిత్ర కూడా 1952లోనే మొదలైంది. అయితే కాలంతోపాటు అనేక పరిణామాలు చోటు చేసుకుని అనేక మార్పులు సంభవించాయి. ముఖ్యంగా రాష్ట్రం విడిపోవడం, అసెంబ్లీ సీట్ల సంఖ్య తగ్గడంతోపాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది. 1952లో తొలి ఎన్నికలు జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. అప్పటి అసెంబ్లీలో 175 మంది సభ్యులు ఉండేవారు. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో హైదరాబాద్ రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏర్పడిన రాష్ట్ర అసెంబ్లీలో 301 స్థానాలు ఉండేవి. 1957లో ఆ స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించారు. ఆ సంఖ్య 1962 ఎన్నికల నాటికి 300కు, 1967 నాటికి 287కు తగ్గిపోయింది. మళ్లీ 1978 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల సంఖ్య 294కు పెరిగి 2009 ఎన్నికల వరకు అ సంఖ్యే కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో విభజిత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల సంఖ్య 175కు తగ్గింది. గత రెండు ఎన్నికలతోపాటు ప్రస్తుతం ఆ స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా 1952లో 14 మంది, 1957లో 12 మంది, 1962లో 17 మంది, 1967లో 68 మంది, 1972లో 57 మంది, 1978లో 15 మంది, 1983లో 19 మంది, 1985లో తొమ్మిది మంది, 1989లో 15 మంది, 1994లో 12 మంది, 1999లో ఐదుగురు, 2004లో 11 మంది, 2009లో ముగ్గురు, 2014లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఒక్కరు కూడా ఎన్నికవ్వలేకపోయారు.
తగ్గిన స్వతంత్రుల సత్తా
గతంలో పదుల సంఖ్యలోనే ఎన్నికైన ఇండిపెండెంట్ల సత్తా ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయింది. ప్రతి ఎన్నికల్లో వందల సంఖ్యలోనే స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నా గెలవడం మాట అటుంచి గణనీయ సంఖ్యలో ఓట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల వ్యవస్థలో పెరిగిన పార్టీస్వామ్యం, ధనస్వామ్యం వంటివే దీనికి ప్రధాన కారణాలు. గతంలో ప్రత్యేకమైన డిమాండ్లు, సిద్ధాంతాలతో ప్రజల్లో అదరణ కలిగిన ప్రముఖులు పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికల బరిలోకి దిగేవారు. వారిలో పలువురు గెలిచేవారు. కాన్నీ రాను రాను ఎన్నికల ఖర్చులు భరించలేనంతగా పెరిగిపోయాయి. పోటీ చేయడానికి కట్టాల్సిన డిపాజిట్ మొత్తాలు కూడా పెరిగిపోయాయి. ఎన్నికల్లో అనామకుల పోటీని నియంత్రించాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ డిపాజిట్ మొత్తం పెంచడం వంటి కారణాలు కూడా ఇండిపెండెంట్ల సంఖ్య తగ్గడానికి కారణం. అయితే ఇప్పటికీ నామినేషన్లు వేసే ఇండిపెండెంట్ల సంఖ్య అధికంగానే ఉంటున్నప్పటికీ వారిలో చివరి వరకు నిలబడేది అతి తక్కువమంది. వారిలో కూడా కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి డబ్బు గుంజడానికి, అభ్యర్థిగా తమకు లభించే పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ల పాస్‌లను ప్రధాన పార్టీలకు అమ్ముకోవడానికే రంగంలో కొనసాగుతున్నారు. ప్రజల్లో కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్ప ఇతరులకు ఆదరణ లభించడం లేదు.
Comments