విడుదలైన కొత్త ఇసుక పాలసీ
ర్యాంపు వద్దే టన్ను రూ.400
వైకాపా హయాంలో రేటే ఇప్పుడు కూడా
సామాన్యుడికి అందుబాటులో ఉండటంపై అనుమానాలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

తాము అధికారంలోకి వస్తే ఇసుకను ఉచితంగా అందిస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇసుక కొత్త పాలసీకి సంబంధించిన జీవోను తాజాగా విడుదల చేసింది. ఈ లెక్క ప్రకారం ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే విధానం అందులో భూతద్దం పెట్టి వెతికినా కనపడలేదు. వైకాపా హయాంలో టన్ను ఇసుకను ఏ ధరకు అమ్మారో, ఇప్పుడు కూడా అదే ధరను నిర్ణయించారు. కాకపోతే ఇక్కడ కూటమి నాయకులు స్థానిక అవసరాలను పక్కన పెట్టి విశాఖపట్నంతో పాటు వేరే ప్రాంతాలకు ఇసుకను తరలించుకుపోయే వ్యాపారం చేయకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచడంపైనే ప్రభుత్వ ప్రతిష్ఠ నిలబడేందుకు, లేదా కూలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఇసుక పాలసీ ప్రకారం జిల్లాలో 11 రీచ్‌లకు అనుమతులు ఇచ్చారు. ఇందులో 5 రీచ్‌లు భైరి, దుంపాక, ఉప్పాడపేడతో పాటు మరో రెండు ర్యాంపుల్లో 5 హెక్టార్లకు మించి ఇసుకను తవ్వేందుకు అవకాశం ఉండటంతో ఇక్కడ స్థానిక ప్రజల అభిప్రాయాన్ని సేకరించేందుకు పబ్లిక్ హియరింగ్‌ను నిర్వహించనున్నారు. మిగిలిన 6 ర్యాంపుల్లో బుధవారం అధికారికంగా ఇసుక విక్రయాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే నది ఒడ్డున ఇప్పటి వరకు ఉన్న ఇసుకను ఎక్కడికక్కడ స్థానిక కూటమి నాయకులు తరలించుకుపోవడంతో బుధవారం ముహూర్తపు షాట్‌కు ఏ ర్యాంప్ బయట ఇసుక నిల్వలు లేవు. దీన్ని వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు టన్ను ఇసుకను 30 కిలోమీటర్ల మేరకు తరలించాలంటే రూ.9 వసూలు చేయాలని కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లాస్థాయి ఇసుక కమిటీ సోమవారం నిర్ణయించింది. అయితే దీనికి ట్రాన్స్‌పోర్ట్ యాజమాన్యాలు అంగీకరించలేదు. 30 కిలోమీటర్ల లోపు రూ.9 చెల్లిస్తే తమకు గిట్టుబాటవ్వదని తేల్చి చెప్పేశారు. అయితే ప్రభుత్వం ఆ మేరకే ఇమ్మందని, తామేమీ చేయలేమని, భవిష్యత్తులో పక్క జిల్లాల నుంచి ట్రాన్స్‌పోర్టర్లు వచ్చి ఇసుకను అదే రేటుకు తరలించుకుపోతే జిల్లాలో ఉన్న తమకు అన్యాయం జరిగిందని బాధపడితే తానేమీ చేయలేనని కలెక్టర్ చెప్పడంతో ఈ సమావేశం అర్ధంతరంగా ముగిసింది. కొత్త జీవో ప్రకారం 11 ర్యాంపుల్లో ఆరు రీచ్‌లలో మేన్‌పవర్‌తోనే ఇసుకను నదిలో తవ్వి ఒడ్డుకు తెస్తారు. అక్కడి నుంచి లారీ లేదా ట్రాక్టర్లకు మిషినరీ ద్వారా లోడ్ చేస్తారు. ఇక పబ్లిక్ హియరింగ్ వెళ్లిన ఐదు ర్యాంపుల్లో మిషిన్‌తోనే నదుల్లో తవ్వుతారు. లోడిరగ్ కూడా నది ఒడ్డున మిషినరీతోనే జరుపుతారు. కొత్త జీవో ప్రకారం టన్ను ఇసుకను రూ.349గా నిర్ణయించారు. మేన్ పవర్ పని చేసినచోట మరో రూ.50 దీనికి అదనంగా చేరుతుంది. దీంతో టన్ను ఇసుక రూ.400 అవుతుంది. వైకాపా ప్రభుత్వంలో కూడా ఇసుక ధరను ఈ విధంగానే నిర్ణయించారు. ఇక ట్రాన్స్‌పోర్టేషన్ విషయానికొస్తే ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ యాప్ ఒకటి ఉంటుంది. ఉబర్, వోలా కార్లు బుక్ చేసుకున్నట్టే ఆన్‌లైన్‌లో వెతికితే మనకు కావాల్సిన ర్యాంప్‌నకు దగ్గరలో ఉన్న ఖాళీ లారీ వివరాలు తెలుస్తాయి. వారికి జీపీఆర్‌ఎస్ ద్వారా లింక్ పంపితే ర్యాంప్‌నకు వచ్చి ఇసుకను లోడ్ చేసుకొని వెళ్లడానికి అవకాశం కల్పించారు. ఇసుక సీనరేజ్, ట్రాన్స్‌పోర్ట్, పేపర్ ఖర్చు వంటివి కలిపితే గత వైకాపా ప్రభుత్వంలో కుదిరిన రేటే ఇప్పుడూ వస్తోంది. అయితే గతసారి ఇసుకను పూర్తిగా బ్లాక్ చేయడం వల్ల ఆ రేటుకు సామాన్యుడికి అందుబాటులోకి రాలేదు. ఈసారి ఇసుక కోసం ఆన్‌లైన్‌లో సొమ్ములు చెల్లించాల్సి ఉంది. వాస్తవానికి బుధవారం ఇసుక విధానాన్ని అధికారికంగా ప్రారంభించాలి. కానీ ప్రస్తుతం ఏ ర్యాంపు ఒడ్డున కూడా ఇసుక అందుబాటులో లేదు. గత ప్రభుత్వంలో అక్రమంగా తవ్విన ఇసుకను, ఈ వందరోజుల్లో ఒడ్డుకు చేర్చిన ఇసుకను పెద్ద మొత్తంలో కూటమి నాయకులు తరలించుకుపోయారు. ఇప్పుడు ఆరు ర్యాంపుల్లో మాన్యువల్ ద్వారా తవ్వి, బయటకు తెచ్చి ఆన్‌లైన్‌లో సొమ్ములు తీసుకొని ఇసుకను పంపడం బహుశా బుధవారానికి కుదరకపోవచ్చు. మరోవైపు ట్రాన్స్‌పోర్టర్లు రూ.9 బేరానికి ఏమేరకు ఒప్పుకుంటారో కూడా తెలియడానికి మరికొంత సమయం పడుతుంది.
ఉచిత ఇసుక విధానంలో ఇసుక ధరలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ ఇందులో ఎటువంటి మార్పూ కనిపించలేదు. వాస్తవానికి జిల్లా అవసరాల కోసమైతే ఏ పార్టీ నాయకుడూ కక్కుర్తిపడనక్కర్లేదు. ఎందుకంటే.. ఇక్కడ ప్రభుత్వపరంగా గానీ, ప్రైవేటు వెంచర్లు గానీ పెద్దగా లేవు. కానీ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ప్రైవేటు నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటి కోసం భారీమొత్తంలో ఇసుకను ఇక్కడి నుంచి తరలించుకుపోతున్నారు. ఇసుకను అక్రమంగా తరలించడం కోసం అనేక మార్గాలు వెతుకుతున్నారు. మొన్నటికి మొన్న శ్రీకాకుళం నియోజకవర్గంలో రైల్వే నిర్మాణాల కోసమని పెద్ద ఎత్తున స్టాక్‌పాయింట్ నుంచి ఇసుకను విశాఖపట్నం తరలించేశారు. జిల్లాలో ఇసుక అవసరాలంటూ ఉంటే ట్రాక్టర్లు లేదా యడ్లబళ్లు ద్వారా మాత్రమే ఇసుక సరిపోతుంది. కానీ రూ.70వేలు పలికే లారీలను తరలించుకుపోతున్నారంటే అది కచ్చితంగా పక్కజిల్లాకు బ్లాక్‌లో తరలిపోతున్నట్టే లెక్క.
స్టాక్‌పాయింట్ల వద్ద ఉన్న ఇసుకకు గత నెల 31 నుంచి అమ్మకాలు ప్రారంభించారు. వాహనం రకం బట్టి ఇసుకను అందజేసేలా పరిమితులు విధించారు. ట్రాక్టర్‌కు 5 టన్నులు, ఆరు చక్రాల లారీకి 10 టన్నులు, పది టైర్ల లారీకి 30 టన్నులు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక ఆధార్‌కార్డుపై రోజుకు ఒకసారి మాత్రమే 20 టన్నులకు మించి ఇవ్వకూడదనే నిబంధన ఉంది. ఇసుకను స్టాక్ పాయింట్ నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే తరలించాలని పేర్కొన్నారు. అయితే ఈ తరలింపంతా రాత్రిపూటే జరుగుతుంది. ఆధార్ కార్డుపై లెక్కకు మించి ఇసుక అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమీప గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఒకే డీడీతో పదుల సార్లు ఇసుకను తరలించుకు పోతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలోనే ఇసుక పాయింట్ నుంచి ఉచిత ఇసుక పంపిణీ జరుగుతున్నా, అక్రమాలు చోటు చేసుకోవడానికి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక స్టాక్ పాయింట్ల సిబ్బందికి ఫోన్ చేసి లోడ్ చేయించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలు, తరలింపుపై కలెక్టర్ ఆదేశాలిచ్చినా స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించలేని పరిస్థితి ఉందని అధికారులే చెబుతున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను పట్టుకుంటున్న రెవెన్యూ అధికారులకు ప్రజాప్రతినిధుల చీవాట్లు తప్పడం లేదని విశ్వసనీయ సమాచారం.
కొత్తూరు మండలం ఆకులతంపరలో అనధికారిక రీచ్‌ను తెరిచి స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి పేరుతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంగూరు ఇసుక స్టాక్ యార్డ్ నుంచి ఇసుక నిల్వలు నిండుకోవడంతో పక్కనే ఉన్న ఆకులతంపరలో అక్రమంగా ఇసుక తవ్వకాలకు తెరలేపారని కూటమికి చెందిన నాయకులే ఆరోపిస్తున్నారు. లారీ ఇసుకను రీచ్ వద్ద రూ.28 వేలకు లోడ్ చేస్తున్నట్టు తెలిసింది. రోజుకు సుమారు 60 నుంచి 70 లారీల వరకు విశాఖకు తరలించుకుపోతున్నారని టీడీపీ నాయకులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పాతపట్నం టీడీపీలో నెలకొన్న గ్రూపుల పోరు నేపథ్యంలో ఆకులతంపరలో ఇసుక అక్రమ తవ్వకాలు, అంగూరు స్టాక్‌యార్డ్ నుంచి విశాఖకు లారీల్లో తరలించే ఇసుకను లోడిరగ్ చేయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
תגובות