
వైస్ ఛాన్సలర్ల ఎంపిక, నియామకానికి సంబంధించిన నిబంధన 2010ని సవరించడానికి యూజీసీ (యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్) ప్రయత్నించింది. ఇది అర్హత పరిధిని విస్తృతం చేస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ప్రొఫెసర్‌గా కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న విద్యావేత్తల నుంచి మాత్రమే వైస్ ఛాన్సలర్‌ను ఎంపిక చేయవచ్చు. యూజీసీ తెచ్చిన కొత్త సవరణ ద్వారా ఇది మారిపోయింది. పారిశ్రామిక రంగం, ప్రజా పరిపాలన లేదా ప్రజా విధానంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న నిపుణులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని యూజీసీ ప్రకటించింది. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపిక నియామకంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రూపొందించిన ముసాయిదా నియంత్రణ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిరసనలకు దారితీసింది. ముసాయిదా పూర్తిగా యూనివర్సిటీలను కేంద్రీకరించ డానికి, ప్రైవేటీకరణకు మరో ప్రయత్నంగా మాత్రమే కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనలు విద్యలో రాష్ట్రాల హక్కులను, నిర్ణయాధికారాన్ని బలహీనపరుస్తాయి. ఇవి మొత్తంగా ఫెడరల్ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ మూల సూత్రాలను బలహీనపరుస్తున్నాయి. ఈ నియంత్రణకు వ్యతిరేకంగా ప్రధాన అభ్యంతరం ఏమిటంటే ఇది భారత రాజ్యాంగంలో పొందుపరచిన సమాఖ్య సూత్రాలు ఉల్లంఘించడమే. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను స్పష్టంగా ఉల్లంఘించేవి, విశ్వవిద్యాలయాలకు స్వయంప్రతిపత్తి చాలా విస్తృతమైన పరిణామాలను కలిగిస్తాయి. న్యూఢల్లీి, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారాన్ని కేంద్రీకరించడానికి మన దేశ సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీసే ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడటం చాలా ముఖ్యం. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేరళ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. మన దగ్గర కూడా మేధావులు, విద్యా వేత్తలు యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నడుం బిగించాలి. అన్ని రాష్ట్రాలు ఒకే విధమైన వైఖరిని తీసుకోవడం చాలా అవసరం అని బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు గ్రహించాలి. వారి అసెంబ్లీలలో తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాలని స్టాలిన్ అభ్యర్థించారు. ముసాయిదాలోని అనేక నిబంధనలు రాష్ట్ర విద్యా వ్యవస్థ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయి. యూజీ, పీజీ అడ్మిషన్లకు ప్రవేశ పరీక్షల నిర్వహణ, నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ (ఆర్ట్స్/సైన్స్) డిగ్రీ ఉన్న విద్యార్థులు ఎంటెక్, ఎంఈ ప్రోగ్రామ్‌లు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయనడం, నాన్ అకడమిక్ వైస్-ఛాన్సలర్లుగా నియమించడం, రాష్ట్ర ప్రభుత్వాలకు వైస్-ఛాన్సలర్ల సెర్చ్ కమిటీలతో సంబంధం లేకుండా చేయడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముసాయిదా నిబంధనలోని ఇటు వంటి అనేక నిబంధనలు రాష్ట్ర విశ్వవిద్యాలయాల విద్యా సమగ్రత, స్వయంప్రతిపత్తి సమగ్ర అభివృద్ధికి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటాయి. ముసాయిదాలో రిజర్వేషన్లను మరిచారు. ఇది ఉన్నత విద్యలో పూర్తిస్థాయి కార్పొరేట్ సంస్కృతిని చొప్పిస్తుంది. అలాగే ఉపాధ్యాయులకు నిర్దిష్ట బోధన సమయం ప్రస్తావించలేదు. ‘నెట్’ అవసరం లేకుండా ‘మాస్టర్స్ డిగ్రీ’ ఉంటే చాలు అనే విషయమైతే జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంటుంది. 55 శాతం మార్కులతో మాస్టర్స్ సాధించిన వారిని యూజీసీ`నెట్‌లో అర్హత సాధించకపోయినా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నేరుగా నియమించుకోవచ్చని పేర్కొన్నారు. యూజీసీ చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ. ఇది ఉన్నత విద్యా ప్రమాణాలు, సమన్వయం, నిర్ణయం, నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయాలకు డిగ్రీ కళాశాలలో బోధించే అధ్యాపకుల అర్హతలు ఏమి ఉండాలో నిర్ణయిస్తుంది. ఇంత స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన యూజీసీని కేంద్రం తన సొంత ఎజెండా అమలుపరచేందుకు పావులా వాడుకుంటోంది. కరిక్యులమ్, బోధన పరమైన అంశాలలో రాష్ట్రాల నియంత్రణ చాలా ముఖ్యమైనది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల నేపథ్యానికి అనుగుణంగా విద్యావిధానాన్ని రూపొందించుకోవాలి. కానీ ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రం ఒకొక్కటిగా తన అధీనంలోకి తీసుకుంటూ రాష్ట్రాల్లో తన విధానాలను బలవంతంగా రుద్దుతోంది. విద్యారంగంలో పని చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు, పౌర ప్రజా సంఘాలు, మేధావులు ఇతర ఎన్డీయే అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అధికార, ప్రతిపక్ష ప్రభుత్వాలు దీనిపై నోరు మెదపాలి.
Komentar