top of page

‘ఉపాధి’కి కోతల వాత

Writer: NVS PRASADNVS PRASAD
  • `పెరిగిన ఉపాధి హామీ వేతనదారుల కష్టాలు

  • `వేసవి అదనపు వేతనాలకు గండి

  • `ఆన్‌లైన్‌ హాజరుతో ఎంత పనికి అంతే కూలి

  • `కొన్ని సౌకర్యాలు, అలవెన్సులను కట్‌ చేసిన కేంద్రం

  • `టెంట్లు కూడా లేక మండే ఎండల్లో కూలీల అవస్థలు

ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో కూలీలకు గతంలో నీడ కల్పించేందుకు టార్పాలిన్లు సమకూర్చి టెంట్లు వేసేవారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూలీలు వాటిలో సేదదీరేవారు. ఇప్పుడు పని ప్రదేశాల్లో ఎక్కడా టార్పాలిన్లు కనిపించడం లేదు. కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. అలసటగా ఉంటే పొదలు, చెట్ల చాటున సేద తీర్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. తాటి, కొబ్బరి కమ్మలు, గోనె సంచులు, చెట్టు కొమ్మలతో తాత్కాలిక షెడ్లు వేసి ఉపశమనం పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా వేసవిలో వేతనదారులకు సాధారణ కూలీతో పాటు ప్రత్యేక భృతి ప్రకటిస్తూ వచ్చింది. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు పనులకు వచ్చేవారికి వేతనాలకు అదనంగా 20 నుంచి 30 శాతం అదనపు భత్యం ఇచ్చేది. అయితే 2021 అక్టోబర్‌ నుంచి దీన్ని నిలిపివేశారు. యాప్‌ మార్చడం వల్ల సౌకర్యాలకు కోత పడిరదని వేతనదారులు వాపోతున్నారు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మూడేళ్లగా వేసవి అలెవెన్స్‌లు నిలుపుదల చేయడంతో ఉపాధి వేతనాల్లో కోతల వాత తప్పడం లేదు. వేసవిలో వ్యవసాయ పనులు ఉండవు. దాంతో ఉపాధి హామీ పనులపైనే ఎక్కవ మంది మక్కువ చూపిస్తున్నారు. ఈ పథకం కింద గ్రామాల్లో జలసంరక్షణ, నర్సరీల నిర్వహణ, ప్రభుత్వ స్థలాలు, పొలం గట్లపై మొక్కల పెంపకం, చిన్న నీటి కాల్వల మరమ్మతులు తదితర పనులు మంజూరు చేశారు. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో 4.28 లక్షల జాబ్‌కార్డులు ఉండగా అందులో 3.84 లక్షలు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఉపాధి పనుల్లో ప్రతిరోజు సుమారు 2.41 లక్షల మంది పని చేస్తున్నారు. అయితే కనిష్టంగా రూ.200, గరిష్టంగా రూ.244.1 మించి రోజువారీ వేతనం అందడం లేదు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు జిల్లాలో సరాసరి 25.71 రోజులు పని కల్పించారు. వేసవి అలవెన్స్‌లు నిలిపివేయడంతో ఉదయం ఏడు నుంచి పది గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6.30 వరకు పని చేయిస్తున్నారు. అయితే ఉదయం ఎనిమిది నుంచే ఎండ తీవ్రంగా ఉండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇక ఎండలో పనిచేసే వేతనదారుల అవస్థలు చెప్పనక్కర్లేదు. పని ప్రదేశంలో కనీస అవసరాలు కల్పించాలన్న మార్గదర్శకాలను అధికారులు గాలికొదిలేస్తున్నారు. వేసవి సన్నద్ధత క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు. ప్రారంభంలో దశల వారీగా కూలీలకు గడ్డపారలు, మెడికల్‌ కిట్లు, టెంట్లు (గుడారాలు), తాగునీరు లాంటి వసతులు కల్పించినప్పటికీ రానురాను అవి కల్పించడం మానేశా. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తాత్కాలిక షెడ్లను వేతనదారులే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. దానికి అనుగుణంగా అలవెన్సులు కూడా ఇవ్వడంలేదు. టెంట్లు, తాగునీరు, మజ్జిగ, గడ్డపారలు, తట్టా, వేసవి అలవెన్స్‌తో కలిపి ఒక్కొక్కరికి వేతనానికి అదనంగా ఇవ్వాల్సిన సుమారు రూ.60 మొత్తాన్ని కేంద్రం నిలిపేసిందని అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వమే గుడారాలు, మెడికల్‌ కిట్లు పంపిణీ చేసేది. వాటిని క్షేత్ర సహాయకులు ప్రతిరోజు పని ప్రదేశానికి తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు అలాంటివేవీ లేవు.

కష్టాలు పెంచిన కొత్త టెక్నాలజీ

ఉపాధి పనుల్లో పారదర్శకత పేరుతో కేంద్రం టీసీఎస్‌ నుంచి ఎన్‌ఐటీ సాఫ్ట్‌వేర్‌కు మారిన తర్వాత వేతనదారుల ఇబ్బందులు పెరిగాయి. 2021 అక్టోబరు 21కి ముందు ప్రతి రాష్ట్రానికి సంబంధించి టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) వెబ్‌సైట్‌ ద్వారా ఉపాధి పనులను పర్యవేక్షించేవారు. దేశవ్యాప్తంగా ఒకటే విధానం ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏపీని ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌) పరిధిలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూలీలకు అందాల్సిన సౌకర్యాలన్నీ ఆగిపోయాయి. వీటిలో వేసవిభత్యం ప్రధానమైనది. ఫిబ్రవరిలో అదనంగా 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం, జూన్‌ 20 శాతం భత్యం కింద అదనంగా చెల్లించేవారు. దాంతో రోజువారీ వేతనంతో పాటే అదనంగా రూ.40 నుంచి రూ.60 వరకు వేతనదారులకు అందేది. టీసీఎస్‌ నుంచి ఎన్‌ఐసీకి మారిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఉపాధి పనులను నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంసీ) యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ యాప్‌ ఉదయం 7 గంటలకు ఓపెన్‌ అవుతుంది. మేట్లు తమకు కేటాయించిన 50 మంది కూలీలను ఐదు బృందాలుగా విభజించి పనులు అప్పగించాలి. పని ప్రాంతం ఉదయం ఏడు గంటలకు, మధ్యాహ్నం 11 గంటలకు వారి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇలా చేస్తేనే కూలీలకు వేతనాలు జమవుతాయి. కూలీలకు వేసవిలో ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. సాధారణ రోజుల్లో 100 శాతం పని చేస్తే ఇచ్చే మొత్తాన్నే వేసవిలో 80 శాతం చేస్తే ఇచ్చేవారు. అంటే 20 శాతం ఎక్కువ వేతనం అందేది. అయితే ఆన్‌లైన్‌లో హాజరు, పని వివరాలు, పని ప్రదేశం నమోదు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం లేకుండా వేతనదారులకు నేరుగా చెల్లింపులు జరుపుతుండటం వల్ల చేసిన పనికే వేతనాలు జమ అవుతున్నాయి. అలాగే ఎన్ని రోజులు పనికి వెళ్తే అన్ని రోజులకే వేతనం చెల్లిస్తున్నారు.

అలవెన్సుల ఉపసంహరణ

ఎన్‌ఐసీ అమల్లోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వం వేసవి అలవెన్సులు చెల్లింపులు, పనికి వెళ్లిన రోజులను మాత్రమే నమోదు చేసేది. కూలీలు సొంతంగా గడ్డపార సమకూర్చుకుంటే రోజుకు రూ.10, తాగునీటికి రూ.5, తట్టకు రూ.5, మజ్జిగకు రూ.5, ఉపాధి కూలీలు రూ.30 వేసవి అలవెన్స్‌, మేట్‌ అలవెన్స్‌ రూ.27 చొప్పున చెల్లించేది. ఎన్‌ఐసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఉపాధి ప్రదేశాల్లో కూలీల సంరక్షణకు ఉద్దేశించిన సదుపాయాలకు తిలోదకాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం గరిష్టంగా ఒక వేతనదారుడికి రోజుకు రూ.300 చెల్లించాలని నిర్ణయించింది. పని ప్రదేశాల్లో వసతుల కల్పనకు ఇవ్వాల్సిన రూ.87 అలవెన్స్‌ను ఉపసంహరించుకుంది. ప్రస్తుతం వేసవి అలవెన్స్‌గా రూ.23 ఇస్తున్నట్లు చెబుతున్నప్పటికీ వేతనదారుడు ఐదు గంటల పాటు పని చేస్తేనే ఆ మొత్తం చెల్లించాలని మెలిక పెట్టింది. ఫలితంగా వేసవి అలవెన్స్‌ పొందే అవకాశం లేకుండా పోయిందనే ఆందోళన వేతనదారుల్లో ఉంది. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) వెబ్‌సైట్‌ అందుబాటులోకి రావడంతో వేతనదారులకు మజ్జిగ, గునపం, పార, మంచినీళ్లు కోసం ఇవ్వాల్సిన అదనపు వేతనం నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page